ఆధునిక దధీచి డాక్టర్‌ హెడ్గేవార్‌ జీ - Modern Dadhichi Dr Hedgewar Ji

Vishwa Bhaarath
0
ఆధునిక దధీచి డాక్టర్‌ హెడ్గేవార్‌ జీ - Modern Dadhichi Dr Hedgewar Ji
Dr Hedgewar Ji

( డాక్టర్‌జి జయంతి ప్రత్యేకం )

సమాజ క్షేమం కోసం ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించుకుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మహోన్నతమైనదని, అత్యంత అవసరమైనదని, తన జీవితం ద్వారా చూపించారు డాక్టర్‌ హెడ్గేవార్‌జి. తన జీవన పుష్పపు ప్రతి రేకును తన చేతులతోనే తుంచి రాష్ట్ర దేవతా చరణములపై అర్పించిన ఆధునిక దధీచి వారు.

రాష్ట్రీయ భావన (జాతీయ భావన) జాతి ఐక్యతకు ఆధారమైనది. జాతీయ భావన లోపించిన జాతి కనుమరుగవుతుంది. స్వామి వివేకానంద మన దేశంలో జాతీయ భావాన్ని మేల్కొలిపారు. అయితే జాతీయత ఆధారంగా, జాతి మొత్తాన్ని సంఘటితం (ఒక్కటిగా) చేసే సమయం వారికి లభించలేదు. 1902లో తన 39వ ఏటనే వారు గతించారు.

పరిపాలనా సౌలభ్యం పేరుతో 1905లో ఆంగ్లేయులు బెంగాల్‌ను హిందూ బెంగాలు, ముస్లిం బెంగాలుగా విభజించారు. తర్వాత దేశాన్ని విభజించే దురుద్దేశ్యంతోనే ఆంగ్లేయులు ఇలా చేశారు. అయితే లాల్‌, బాల్‌, పాల్‌ నేతృత్వంలో వందేమాతరం ఉత్సవాలు జాతి యావత్తునూ కదిలించాయి. జాతి మేల్కొంది. ‘త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణీ’ అని మాతను స్తుతించి గర్జించింది. జాతీయశక్తి ముందు అప్పుడున్న విదేశీ ఆంగ్లేయ ప్రభుత్వం ఓడిపోయింది. 1911లో బెంగాల్‌ విభజనను రద్దు చేసింది. 36 సంవత్సరాల తర్వాత 1947లో ఆంగ్లేయ ప్రభుత్వం మనదేశాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాని దేశం విభజనకు గురైంది. భారతీయ సమాజం ఓడిపోయింది.

ఎందుకు ?
1911లో బెంగాలు విభజనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన భారత సమాజం 1947లో దేశ విభజనకు ఎందుకు ఒప్పుకుంది ? 1911లోనే కాదు, అంతకుముందు వందల సంవత్సరాలలో ఏ ఒక్క నిమిషం బానిసత్వాన్ని అంగీకరించని జాతి 1947లో ఎందుకు ఓడిపోయింది ? మొదటిసారి భారత జాతి మాతృదేశ విభజనకు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? ఈ 36 సంవత్సరాలలో అసలు ఏమి జరిగింది? దానికి కారణం జాతిలో జాతీయ భావన లోపించడమే. జాతి హృదయాంతరాలలో అఖండ మాతృభూమి భావన, జాతీయ భావన చెదరిపోయాయి.

ఎలా ?

1920 తర్వాత మన జాతీయ నాయకులు స్వాతంత్య్ర పోరాటంలో సత్యం, అహింసలను ఆదర్శంగా స్వీకరించారు. దాంతో మాతృభూమి భావన, లుప్తమైపోతూ వచ్చింది. సత్యము, అహిసంలు రెండూ జీవన విలువలు. వీటిని ప్రజలందరూ సమాన స్థాయిలో ఆచరించలేరు. ఆచరణలో హెచ్చు తగ్గులుండే అవకాశముంది. కాని మాతృభూమి కోసం జీవించటం, మరణించటం అనే విషయాలు అందరికి సమానమైన ప్రేరణ కలిగిస్తాయి. ఈ సత్యం, అహింస సిద్ధాంతం వలన కాలాంతరంలో అఖండ మాతృభూమి భావన, జాతీయ భావన కనుమరుగయ్యాయి. మన జాతి వారసులు, జాతీయ చరిత్ర, జాతీయ పరంపర చెదరిపోయాయి. రాజకీయ స్వాతంత్య్రంతోనే తృప్తిపొందే పరిస్థితి ఏర్పడింది.

స్వతంత్ర పోరాటపు తారక మంత్రమైన వందేమాతరాన్ని సంతుష్టీకరణ పేరుతో మతంతో ముడిపెట్టి ఖండించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. భాషతో రాజీపడి సంకరమైన భాషను, భావనను ప్రవేశపెట్టారు. రాజారామ్‌ బదులు బాదుషా రామ్‌, రాణి సీతమ్మ బదులు బేగమ్‌ సీతా, మహర్షి వాల్మీకి బదులు మౌల్వి వాల్మీకి.. ఇలా మన విలువలను దిగజార్చారు. చరిత్రలో శివాజీ కొండ ఎలుక అని, రాణాప్రతాప్‌ మతి భ్రమించిన దేశ భక్తుడని వక్రీకరించి, చరిత్రగతిని మార్చేశారు. ఇలా అన్నిటిలోనూ నాటి మన నాయకులు రాజీ పడ్డారు. అలా దాదాపు జాతీయ భావాన్ని యోజనబద్ధంగా నష్టపరచి, మన జాతిని సమూలంగా విధ్వంసం చేసే ప్రయత్నం చేసిన ఆంగ్లేయులకు సహకరించారు.

జాతిని సంఘటితం చేసే కార్యం

ఈ కుట్రను దేశభక్తి గల నాయకులు గమనించలేక పోతున్న తరుణంలో డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌జి ఆత్మ విశ్వాసంతో, దూరదృష్టితో మన జాతి ఆత్మను మేల్కొలిపి, జాతిని సంఘటిత (ఐక్యత) పరిచే శాశ్వత కార్యాన్ని స్వీకరించారు. అందుకోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. జాతి ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు.

నాడు వారు ప్రారంభించిన జాతి సంఘటిత కార్యం నేడు అక్షరాల నిజమైంది. ప్రవాహంతో కలిసిపోవడమో లేదా ప్రవాహానికి ఎదురీదడమో కాకుండా, ప్రవాహం మొత్తాన్ని యోగ్యమైన దిశలో మార్చి, పనిలో విజయాన్ని సాధించిన ధీరోదాత్తుడు డాక్టర్‌ హెడ్గేవార్‌జి.

విజయానికి మూల కారణం

డాక్టర్జి స్వీకరించిన కార్యం విజయం పొందటానికి ముఖ్యమైన మూడు కారణాలున్నాయి. ఒకటి సత్య సిద్ధాంతం, రెండవది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యపద్ధతి, మూడవది డాక్టర్జి సర్వసమర్పిత జీవన శైలి.

నాటి సమాజంలో ఆర్య సమాజం లాంటి సంస్థలు నిస్వార్థ భావనతో, ధార్మిక లోపాలను సరిదిద్ది, ధార్మిక చైతన్యం నింపడం ద్వారా జాతిలో ఐక్యత కోసం పనిచేస్తుంటే, హిందు మహాసభ వారు రాజకీయ చైతన్యం ద్వారానే జాతి ఐక్యత సాధ్యమని భావించేవారు. కాని డాక్టర్జి సమగ్రమైన ఆలోచన చేశారు. వారు హిందూ సంఘటనా కార్యం ప్రారంభించారు. ఈ కార్యానికి ‘వ్యక్తి’ని ఆధారంగా స్వీకరించారు.

అంటే వ్యక్తిలో జాతీయ భావాలను, సంస్కారాలను, సమాజ ఉన్నతి కోసం నిస్వార్ధంగా పనిచేయాలనే ఉన్నత భావాలను నింపాలని డాక్టర్జి భావించారు. అటువంటి ఉన్నత భావాలు నిండిన వ్యక్తి తన ఆచరణ ద్వారా హిందూ సమాజంలో సామాజిక, సాంస్కృతిక, రాజనైతిక చైతన్యం నింపి, సంపూర్ణ సమాజాన్ని సంఘటితం, చైతన్యవంతం చేయగలడని వారు భావించారు. అందుకే సంఘం మిగిలిన సంస్థల లాగే సాధారణంగా కనపడుతున్నప్పటికి విలక్షణ విజయాలు సాధిస్తున్నది. తన పనిలో నిరంతరం ముందుకే పోతున్నది. డాక్టర్జిలోని ప్రత్యేక నిర్మాణాత్మక దృష్టి వల్లనే ఈ విజయం సాధ్యమైంది.

సంఘము – కార్యపద్ధతి

మనం హిందువులం. మనలో హిందూ జాతీయత, హిందూ సంస్కృతి, హిందూ పరంపర, మన మాతృభూమి పట్ల భక్తి, శ్రద్ధ జాగృతం కావాలన్నారు డాక్టర్జి. వ్యక్తిలో నిస్వార్థం, ఆత్మజ్ఞానం, ఆత్మబోధ పెంపొందడానికి; సమాజం ఐక్యం కావడానికీ; హిందువులందరూ ప్రతిరోజు, ప్రతిబస్తీలో, గ్రామంలో ఒక నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన స్థలంలో ఒక గంటసేపు కలిసి మాతృభూమి పట్ల భక్తిభావనతో సాధన చేయాలనే ఒక తంత్రాన్ని (పద్ధతి) డాక్టర్జి జాతికందించారు. దానినే శాఖ అంటున్నాం. అందుకే ప.పూ.డాక్టర్జి సంఘంలో ద్రష్ట, సంఘటితం చేయడంలో స్రష్ట అయ్యారు.

సంఘకార్య విశేషత

అ) వ్యక్తిపూజ కాదు – తత్వపూజ

సాధారణంగా సామాజిక జీవనంలో నిస్వార్థంగా పనిచేసే చోట కూడా వ్యక్తులు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, కొంతమంది నిరంకుశ నేతృత్వం వలన సంస్థలు చీలిపోవడం, శక్తి క్షీణించడం చూస్తూనే ఉన్నాం. అయితే పరమ పూజనీయ డాక్టర్జి సంఘానికి గురువుగా ఏ వ్యక్తిని స్వీకరించలేదు. 1928లో సంఘంలో గురుపూజ ప్రారంభమైంది. మొదటి గురుపూజ ఉత్సవంలోనే డాక్టర్జి ‘సంఘం ఏ వ్యక్తినీ గురువుగా స్వీకరించకుండా పరమ పవిత్ర భగవాధ్వజాన్నే గురువుగా స్వీకరించింది’ అన్నారు. వ్యక్తి ఎంత గొప్ప వాడైనప్పటికీ శాశ్వతం కాదు, పూర్ణత్వం కాదు. దాని బదులు మన చరిత్ర, మన పరంపర, మన జాతీయ భావనను ప్రతిబింబించే భగవాధ్వజమే మనకు శ్రేష్ఠం. భగవాధ్వజమే శాశ్వతమైన ప్రేరణ నివ్వగలుగుతుందని చెప్పారు. సంఘంలో ప్రతి వ్యక్తికి విలువ, గౌరవం ఉంది. కాని వ్యక్తి పూజకు స్థానం లేదు.

ప్రచారం, ఆడంబరాలకు దూరం

వ్యక్తిలో జీవన విలువల నిర్మాణం అనేది ప్రచారం వలన సాధ్యం కాదని డాక్టర్జి గుర్తించారు. అందువలన కీర్తి కాంక్షకు, ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. ప్రచారానికి సంఘ కార్యాన్ని కూడ దూరంగా ఉంచారు. ముఖ్యమైన కార్యక్రమానికి పత్రికలలో కొంత ప్రచారం జరిగినప్పటికీ వ్యక్తులు, స్వయంసేవకులు, కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉండాలనేది వారి అభిప్రాయం. వారూ అలానే జీవించారు.

వారు బ్రతికుండగానే వారి జీవిత చరిత్రను రాసి ప్రచురించడానికి ఒక రచయిత అనుమతి అడిగినప్పుడు ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. అయితే నేను అంతటి మహానుభావుడనని అనుకోవడం లేదు, నా జీవితంలో అంత గొప్ప సంఘటనలేవీ లేవు. జీవిత చరిత్రలు రాసే క్రమంలో నా జీవిత చరిత్ర ఏ రకంగాను ఉపయోగపడదు, క్షమించండి’ అని సున్నితంగా వారించారు.

‘డాక్టర్జి పార్థివ శరీరానికి (చనిపోయిన తర్వాత) మాత్రమే పూలమాల వేయగలిగాం’ అన్నారు సంఘ రెండవ సర్‌సంఘచాలక్‌ శ్రీ గురూజి. అలా డాక్టర్జి తన జీవితాంతం కీర్తికి, ప్రచారానికి దూరంగా ఉన్నారు.

8వ వింత

1925లో సంఘం ప్రారంభించే నాటికి డాక్టర్‌ హెడ్గేవార్‌జి వయస్సు 36 సంవత్సరాలు. కలకత్తా మెడికల్‌ కళాశాల నుండి వారు డాక్టరు కోర్సు పాసయ్యారు. లోకమాన్య తిలక్‌, గాంధీజి, సావర్కర్‌, నేతాజి, రాజగురు లాంటి విప్లవ వీరులతో కలిసి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు.

1925లో 12-16 సంవత్సరాల మధ్య వయసు గల యువకులతో డాక్టర్జి సంఘాన్ని ప్రారంభించారు. 1930, 32 సంవత్సరాల తరువాత ఆ యువకులే సంఘకార్యం కోసం నాగపూర్‌ వదిలి, మొదట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో భిన్న, భిన్న స్థలాలకు చదువు నిమిత్తం వెళ్ళి సంఘ శాఖలను ప్రారంభించారు. ఆ తర్వాత, కాశీ, లక్నో, నేటి చెన్నై, పంజాబు, విజయవాడ, కలకత్తా.. అలా మొత్తం దేశం నలుమూలలకు వెళ్లారు.

భావూరావ్‌ దేవరస్‌జి బి.కామ్‌., న్యాయశాస్త్రం చదవడానికి లక్నో వెళ్ళారు. భయ్యాజీ దాణి బి.ఎ. చదవడానికి కాశీ వెళ్ళారు. యాదవరావ్‌జీ కర్ణాటకకు వచ్చారు. రాజాభావు పాతూర్కర్‌జి, మాధవరావుజి మూలే పంజాబు వెళ్ళారు. వసంతరావ్‌ ఓక్‌ డిల్లీ వెళ్లారు. ఇలా వందలాది మంది ఆత్మ విశ్వాసంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ సంఘశాఖలను ప్రారంభించారు. హిందూ సమాజంలో చైతన్యం నింపారు. ఆనాడు సంఘం దగ్గర అంటే డాక్టర్‌ కేశవ బలీరాం హెడ్గేవార్‌ దగ్గర ఏ రకమైన వనరులు, సాధన సంపత్తి లేదు. సంఘానికి పెద్దల అండా లేదు, సంఘానికి పెద్ద పేరూ లేదు. పైగా విదేశీ ప్రభుత్వం దుష్ట దృష్టి ఉండనే ఉంది. హిందువులు సంఘటితమైతే మార్పు ఇలా ఉంటుందనే ఉదాహరణేదీ సంఘం దగ్గర లేదు. మరి ఆనాడు ఆ యువకులు భాషరాని చోటుకు, ఎవరూ పరిచయం లేని ఊరుకి వెళ్ళారు. ఎక్కడ ఉండాలో తెలియదు, డబ్బు లేదు. అయినా వెళ్ళారు, నిలబడ్డారు, సంఘ కార్యాన్ని నిలబెట్టారు. అదొక వీర, విజయ గాథ. పురుషార్థ ప్రదమైన జాతీయ చరిత్ర. డాక్టర్జి ధ్యేయం, దానిని సాధించడానికి తన జీవితాన్ని సమర్పించడం, ఆ యువకుల పట్ల వారికున్న నిస్వార్ధ ప్రేమ వంటివి ఇందుకు కారణాలు.

డాక్టర్జి దేశంతో తాదాత్మ్యం చెందారు. తాను స్వీకరించిన కార్యంలో పరిపూర్ణ తన్మయత్వం పొందారు. హిందూ సమాజ ఉద్ధరణ కోసం హిందూ సంఘటన మినహా మరో దారి లేదని వారికి పరిపూర్ణ విశ్వాసం ఏర్పడిన తర్వాత సంఘ కార్యానికే తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నారు. నిద్రించినా, మేల్కొన్నా, తింటున్నా, ఏ పరిస్థితులోనైనా సంఘం తప్ప వారికి ఇంకేదీ కనబడేదికాదు. ప్రతి మాటలోను, పనిలోను వారికి సంఘ దృష్టే ఉండేది. సంఘానికి అనుకూలంగా ఉండే ప్రతి విషయాన్ని వారు స్వీకరించేవారు. సంఘ కార్యానికి ప్రతికూలంగా ఉండే ప్రతి విషయాన్ని ఎంతో సంయమనంతో వదిలేసేవారు. అది వారి స్వభావమైపోయింది. సంఘం పని కోసం వారు నిద్రాహారాలు, మానావమానాలన్ని వదిలేశారు. అంతేకాదు, సంఘం పని కోసం విపరీతమైన తన కోప స్వభావాన్ని కూడా మార్చుకున్నారు. అందువల్లనే సాధారణ వ్యక్తులను అసామాన్య కార్యకర్తలుగా మలచ గలిగారు డాక్టర్ జీ.

సంఘ స్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌జి పరమ పదించి ఇప్పటికి 78 సంవత్సరాలు గడిచింది. వారు రెండు రకాల వ్యక్తులను సంఘ పని కోసం అపేక్షించారు. కొంతమంది తన కుటుంబము, వృత్తి చూసుకొంటూనే; తన కుటుంబ కార్యం ఏ బాధ్యతతో నిర్వహిస్తుంటారో అలాంటి బాధ్యతతోనూ, కర్తవ్య భావనతోనూ సంఘకార్యాన్ని జీవితాంతం చేస్తుండాలని, మరి కొంతమంది తమ సంపూర్ణ జీవితాన్ని సమాజము కొరకే పూర్తిగా అర్పించి, ధన్యతను పొందుతూ జీవితాంతం సార్థకంగా జీవించాలని కోరుకున్నారు. 78 సంవత్సరాల తర్వాత నేడు కూడ ఈ రెండు విధాలుగా పని చేసే కార్యకర్తల పరంపర సంఘంలో కొనసాగుతూనే ఉంది.

శ్రేష్ఠ పరంపర

సమాజ వైభవమే, మానవ, విశ్వ కళ్యాణమే లక్ష్యంగా డాక్టర్జి హిందూ సంఘటనా కార్యం ప్రారంభించారు. 1920లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెసు మహాసభల పూర్తి వ్యవస్థను డాక్టర్జి విజయవంతంగా నిర్వహించారు. ఆనాడు వారు మధ్యపరగణాల కాంగ్రెసు కార్యదర్శిగా ఉన్నారు. ఆ సభలలో వారు తీర్మానాల సమితికి ‘అంతర్జాతీయ సామ్రాజ్యవాద, రాజకీయ, ఆర్థిక కబంద హస్తాల నుండి అన్ని జాతులు, దేశాలు, వ్యవస్థలు విముక్తి పొంది శాంతిగా, స్వాభిమానంగా జీవించగలిగే వాతావరణం నిర్మాణం కావాలి’ అనే తీర్మానం పంపారు. అయితే కాంగ్రెసు ఆనాడు దానిని అంగీకరించలేదు. ఆ తీర్మానంలో వారు కోరిన విధంగా సమాజాన్ని ఉద్ధరించాలనేది వారి ప్రగాఢ కోరిక.

అందుకే ఏ రకమైన అభినివేశం, అహంకారానికి తావివ్వలేదు. 1920 సహాయ నిరాకరణ ఉద్యమంలోను, 1930 ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమ సమయంలోనూ ‘సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా స్వతంత్ర సముపార్జనకై జరిగే ఉద్యమంలో ఒకే నేత నేతృత్వంలో అందరూ తమ, తమ సభల పేర్లు మరచి, కలసి పోరాడాలని, అదే నిజమైన దేశభక్తి అని ప్రకటించారు. డాక్టర్జి అలాగే గాంధీజి నేతృత్వంలో కాంగ్రెసు ఆధ్వర్యంలోనే రెండుసార్లు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

ప్రారంభం నుండి డాక్టర్జి ‘హిందూ సమాజం అంతటినీ సంఘటితం చేయాలి కాని హిందూ సమాజంలో సంఘటన కాదు’ అని స్పష్టం చేస్తూ వచ్చారు. ‘మన సమస్యలకు మన సమాజంలో ఉన్న లోపమే ప్రధాన కారణం’ అనేవారు. మనలోని లోపాలను నిర్మూలించి, మన సమాజంలో జీవన విలువలను నింపాలని చెప్పేవారు. సామాజిక స్పృహ, జాతీయ భావన, సంఘటిత దృష్టి, కఠోర పరిశ్రమ, నిస్వార్థం, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండటం; ఈర్ష్య, ద్వేషం లేకుండటం వంటి గుణాల నిర్మాణం వలనే మన దేశం సుఖంగా, వైభవంగా జీవించ గలుగుతుంది అనేది వారి స్పష్టమైన అవగాహన. ‘హిందూ సమాజం ఐక్యమైతే ఏం చేయగలదు ? అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘సమాజం ఐక్యమైతే చేయలేనిది ఏముంటుంది ? ఏదైనా చేయగలదు’ అని ఆత్మ విశ్వాసంతో చెప్తుండేవారు.

సామాజిక దృష్టి

గాంధీజి మద్యపాన నిషేధం కోరుతూ 2000 కి.మీ. యాత్ర నిర్వహించారు. డాక్టర్జి, గణవేష ధారులైన స్వయంసేవకులు కలిసి వెళ్ళి, యాత్రలో రెండుచోట్ల గాంధీజీకి మానవందనం చేశారు. డాక్టర్జీ, స్వయంసేవకులు ఉద్యమంలో పాల్గొన్న కారణాన నాగపూర్‌ చుట్టుపక్కల 50% మద్యపాన విక్రయం తగ్గిపోయిందనేది బ్రిటిషు గజెట్‌ పబ్లికేషన్‌లో ప్రచురితమైంది.

ఒకచోట ‘బాల్య’ వివాహం జరుగుతుంటే డాక్టర్జి వెళ్లి 11 ఏళ్ల అమ్మాయికి, 55 ఏళ్ల వృద్ధుడితో జరిగే వివాహాన్ని ఆపించారు. అమ్మాయి తండ్రి, పెద్దలందరూ డాక్టర్జీని అడ్డు రావద్దని, పెళ్లి జరగనివ్వాలని హెచ్చరించారు. ఆ అమ్మాయి జీవితం బలిచేయవద్దని చెప్పి డాక్టర్జి గట్టిగా నిలబడ్డారు. ఆ అమ్మాయి తండ్రి, పెద్దలు డాక్టర్జీని ‘ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు పెళ్లి చేయించగలరా ?’ అని గద్దించి అడిగారు. ‘ఆ అమ్మాయికి వయస్సు వచ్చిన తర్వాత యోగ్యమైన వరుణ్ని చూసి పెళ్ళి చేసే బాధ్యత నాది’ అని డాక్టర్జి చెప్పగానే అమ్మాయి తండ్రి, పెద్దలు అంగీకరించారు. చెప్పినట్లుగానే ఆ అమ్మాయికి పెళ్లి వయసు రాగానే డాక్టర్జి ఆ అమ్మాయి గ్రామానికి వెళ్లి, పెద్దలకు సహకరించి, యోగ్యమైన వరునితో పెళ్ళి చేయించారు. దానికి చరిత్రే సాక్షి.

ఒక అబ్బాయి 7వ తరగతి చదువుతుండగా తల్లి, తండ్రి ప్రమాదంలో చనిపోతారు. నాసిక్‌లో అతని మేనమామ అబ్బాయిని క్రైస్తవులు నడిపే అనాధాశ్రమంలో చేర్పించాడని తెలిసి డాక్టర్జి ఆ మేనమామ కలిసి అడిగారు. తాను చదివించలేనని ఆ మేనమామ చెప్పగానే, ‘చదివించలేకపోవచ్చు, కాని అబ్బాయిని క్రైస్తవులు నడిపే అనాధాశ్రమంలో చేర్చి అతని క్రైస్తవునిగా మార్చడానికి దోహదం చేసే అధికారం, మీకెవరిచ్చారు’ అని గట్టిగా నిలదీస్తారు. అయితే ‘మరి మీరు చదివించగలరా’ అంటే, ‘ఆ! చదివిస్తాను. హిందూ సమాజం ఉండగా ఏ ఒక్కరు అనాధ కావడానికి వీలులేదు’ అని చెప్పి ఆ అబ్బాయిని వసతి గృహం నుంచి బయటికి తెచ్చి, నాసిక్‌లో ఆ అబ్బాయి కేంద్రంగా డాక్టర్జి ఒక వసతి గృహం ప్రారంభం చేయిస్తారు. వసతి గృహాన్ని చూడటానికి మోతీలాల్‌ నెహ్రూ, విఠల్‌ బాయి పటేల్‌ (సర్దార్‌ పటేల్‌ అన్నగారు), మౌలానా అబ్దుల్‌ కలాం వంటి పెద్దలు వచ్చారు. అలా డాక్టర్జి ఒకపక్క సంఘటనా కార్యం చేస్తూనే, మరోపక్క స్వయం సేవకునిగా సమాజానికి మేలు చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సంఘటనా శీలి

తన సహచర్యంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో పలకరించి, తనవారిగా చేసుకునే అమోఘమైన గుణం డాక్టర్జి వద్ద ఉండేది. వారి దగ్గరికి వచ్చే వారిలో అనేక దోషాలుండేవి. అయితే డాక్టర్జి వారిలోని దోషాలను గమనిస్తూనే, వారిలో ఉండే సుగుణాలను ప్రశంసిస్తూ ఉండేవారు. వారి దోషాల గురించి ఎక్కడా, ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. తనను వ్యతిరేకించే వారి గురించి కూడా డాక్టర్జి ఒక్క మాట కూడ నిందిస్తూ మాట్లాడేవారు కాదు. నేడు వ్యతిరేకించే వారు రేపు తప్పక మనవారవుతారనేది వారి దృఢ విశ్వాసం, అనుభవం కూడ. అనవసర వాదోపవాదాలు చేయకుండా, ఎంతో ఆత్మీయతతో వ్యవహరించేవారు.

సమాజ క్షేమం కోసం క్షణికావేశంలో బలిదానం చేయడం కూడ గొప్పదే అయినప్పటికీ, ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించు కుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మ¬న్నతమైనదని, అత్యంత అవసరమైనదని, తన జీవితం ద్వారా చూపించారు డాక్టర్‌ హెడ్గేవార్‌జి.

డాక్టర్జి ఊపిరి జాతీయ జీవనం కోసమే అర్పితమైంది. తన జీవన పుష్పపు ప్రతి రేకును తన చేతులతోనే తుంచి రాష్ట్ర దేవతా చరణములపై అర్పించిన ఆధునిక దధీచి డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌.

– వి.భాగయ్య, ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భార‌త కార్య‌కారిణి స‌భ్యులు: (జాగృతి సౌజన్యం తో)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top