నిస్వార్థ సేవకు నిజమైన రూపం: సోదరి నివేదిత - Sister Niveditha - A true form of selfless service

Vishwa Bhaarath

వివేకానందుని స్ఫూర్తితో నివేదిత
స్వామి వివేకానందుని స్ఫూర్తితో మనదేశంలో అడుగుపెట్టి వ్యక్తి, జాతి నిర్మాణానికి జీవితాన్ని నివేదించి భారతీయుల మనసులలో ‘సోదరి’గా చిరస్థానం సంపాదించిన స్ఫూర్తిప్రదాత సిస్టర్ నివేదిత. మహిళలకు విద్య ద్వారానే సాధికారత సాధ్యమవుతుందని నమ్మి, ప్రచారం చేసి, దానిని సాకారం చేసిన మహనీయురాలు ఆమె. 1867 అక్టోబర్ 28న ఐర్లండులో మార్గరెట్ నోబుల్ జన్మించింది. పదిహేడేళ్ల వయసులో ఉపాధ్యాయ వృత్తిలో చేరింది. అనతికాలంలోనే విద్యావేత్తగా ఎదిగి జార్జ్‌బెర్నార్డ్ షా వంటి ప్రముఖులుండే సాహిత్య మండలిలో సభ్యురాలైంది. జర్నలిస్టుగా పేరుప్రఖ్యాతలు సాధించి చర్చి ద్వారా ధార్మిక కార్యక్రమాలలోనూ పాల్గొనేది. అయినా ఆమెకు జీవితంలో ఏదో లోటు ఉన్నట్లు అనిపించేది. ఆ తరువాత స్వామి వివేకానందను కలుసుకున్న తరువాత ఆ వెలితి తొలగిపోయింది.
    స్వామి వివేకానందుని వ్యక్తిత్వంతో ప్రభావితురాలైన ఆమె ఆయనను గురువుగా భావించింది. ఆయన ప్రేరణ వల్లే భారత్‌కు సేవే చేయాలన్న తపన పెరిగిందని ఆమె స్వయంగా రాసుకున్నారు. తన దేశాన్ని, వృత్తిని, బంధువర్గాన్ని మిత్రులను వదులుకుని 1898 జనవరి 28న ఆమె భరతగడ్డపై కాలుమోపారు. కలకత్తా నౌకాశ్రయంలో ఆమె అడుగుపెట్టినపుడు వివేకానందుడు స్వయంగా వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. అంతేకాదు, మరణానికి రెండు రోజుల ముందు ఆమెను తన నివాసానికి ఆహ్వానించి తానే ఆమెకు భోజనం వడ్డించి, భోజనానంతరం చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసి, తుడుచుకోవడానికి తువ్వాలు అందించారు. భారతదేశంలో ఆమె చేయబోయే వ్యక్తి నిర్మాణ కార్యంపై ఆయన విశ్వాసానికి అవి సంకేతాలు. అదే ఏడాది మార్చి 25న ఆమె జీవితాన్ని భగవంతునికి నివేదిస్తున్నట్లు భావించి ఆమె పేరును ‘నివేదిత’గా మార్చారు.
భారత్‌కు మేలు జరిగితే ప్రపంచానికి మేలు జరుగుతుందన్నది వివేకానందుని మాట. ఆ బోధనతోనే నివేదిత భరతమాత సేవకే జీవితాన్ని అంకితం చేసింది. విద్యతోనే మూఢ నమ్మకాలు దూరం అవుతాయని, సాధికారత సాధ్యమవుతుందని ఆమె విశ్వసించింది. అప్పట్లో బాలికలు విద్యాభ్యాసం చేయడం కష్టం. అయినా చైతన్యం తీసుకువచ్చి, ఇంటింటికి వెళ్లి బాలికలను పోగుచేసి పాఠశాలను ప్రారంభించింది. అయితే నిర్వహణ, బోధకులకు జీతభత్యాలు ఇవ్వడం కష్టమైంది. ప్రభుత్వ సహాయాన్ని వద్దనుకున్నారు. జాతీయవిద్య అభివృద్ధికి విదేశీ ప్రభుత్వ సహాయం మంచిదికాదన్నది ఆమె భావన. స్వయంగా వీలునామాలో ఆమె ఆ విషయాన్ని పేర్కొన్నారు కూడా. కష్టనష్టాలను భరించి బాలికలను విద్యావంతులను చేస్తూ క్రమశిక్షణ, సంస్కారం నేర్పుతూ చారిత్రక, పుణ్య క్షేత్రాలకు తీసుకువెళుతుండేవారు. ఇప్పుడు ప్రచారం, నినాదాలు, పథకాలకే మహిళలకు విద్య పరిమితమవుతున్నది. ఆమె దశాబ్దాల క్రితమే స్ర్తివిద్యకు ప్రాధాన్యం ఇచ్చారు.

కలకత్తాలో ప్లేగు వ్యాధి చుట్టిముట్టినప్పుడు రోగులను కాపాడవలసిన వైద్యులు ఊరు వదలిపారిపోయే పరిస్థితుల్లో ఆమె ప్రజలను అంటిపెట్టుకుని ఉండిపోయారు. పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. రోగులను ఒడిలోకి తీసుకుని ఓదార్చారు. ఆమె నిరుపమాన సేవలను చూసిన అప్పటి ప్లేగు నివారణ కమిటీ చైర్మన్ మిస్టర్ బ్రెత్ నివేదిత అకుంఠిత దీక్షను చూసి ఆశ్చర్యపోయారు. రోగులను ఆదుకునేందుకు భోజనం ఖర్చు తగ్గించుకున్న నివేదిత రోజుకు గ్లాసుడు పాలతోనే గడిపారని ప్రత్యక్ష సాక్షి డాక్టర్ రాధా గోవింకర్ పేర్కొన్నారు. 
     1906లో తూర్పు బెంగాల్‌లో కరవు విలయతాండవం చేసినప్పుడు, భారీ వరదలు వచ్చినప్పుడు ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కుంగుబాటుకు గురయ్యారు. విపత్తుల వేళ ఆమె తాటాకుతో చేసిన పడవలపై ఇల్లిల్లు తిరుగుతూ వారిని ఓదార్చారు. వారి సేవలో గడిపారు. స్ర్తివిద్య, సేవా కార్యక్రమాలలో ఆమె తలమునకలై ఉన్నా సగటు భారతీయునిలో ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ప్రజల వెన్నంటి ఉన్నారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త జగదీశ్ చంద్రబోస్ ఆవిష్కరించిన పరిశోధనలను బ్రిటన్‌లో అవమానపరుస్తున్నప్పుడు ఆయనకు మద్దతుగా నివేదిత నిలిచారు. ఆయన పరిశోధనా పత్రాలు, వ్యాసాలు ముద్రించకుండా అడ్డుపడుతున్న వారిని ఢీకొన్నారు. 1902 నుంచి 1907 వరకు ఆయన రాసిన వ్యాసాలను సరిచేస్తూ, కొత్త రచనలకు తోడ్పడుతూ వాటిని ప్రచురించేందుకు ఆర్థిక సహాయం చేస్తూ దేశీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు కలకత్తాలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బోస్‌ను ఉత్సాహపరిచారు. 1917నాటికి ఆ లక్ష్యం నెరవేరినా అప్పటికి ఆమె లేకపోవడం బోస్‌ను కుంగదీసింది. జె.సి.బోస్‌కు ఇంగ్లండ్‌లో అవమానం జరగడం, భారతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జమ్‌షెడ్జీ టాటా, కాశీలో హిందు కళాశాలను ఏర్పాటు చేయాలని అనిబిసెంటు పెట్టుకున్న అర్జీలను బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం ఎంత అవసరమో అప్పుడు ఆమె గుర్తించారు. వివేకానందుడి సోదరుడు, యుగాంతర పత్రిక ఉపసంపాదకుడు భూపేంద్రనాథ్, బారిష్ ఘోష్ వంటి విప్లవ సంస్థల సమావేశాలకు వెళ్లేవారు. దీంతో ఆమెపై బ్రిటిష్ ప్రభుత్వం నిఘాపెట్టింది. ఆమె స్వల్పకాలమే జీవించారు. కానీ భారతజాతికి ఆమె ఇచ్చిన ప్రేరణ అనంతం. ఆమెను దేశ ప్రజలకు మాతృమూర్తి అని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే భారతీయులకు ఆమె నిస్వార్థ సేవ చేసిన మహనీయురాలని గోపాలకృష్ణ గోఖలే కీర్తించారు. ఇక తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఆమెను తన ఆధ్యాత్మిక గురువుగా కొనియాడారు. ఆమె సేవలు ఆమెను ‘సోదరి’గా భారతీయులు భావించారు. 1911 అక్టోబర్ 13న ఆమె పరమపదించారు. అయినా ఇప్పటికీ ప్రజలు ‘సిస్టర్ నివేదిత’ను స్మరిస్తూనే ఉన్నారు.

వినండి: Real and True Social Worker Sister Nivedita సేవ చేయడం అంటే మత మార్పిళ్లు చేయడం కాదని నిరూపించిన… అసలు సిసలు క్రిస్టియన్ సిస్టర్ నివేదిత(అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్) భారత దేశాన్ని మాతృభూమిగా భావించిన విదేశీయురాలు.. దేశానికి, ధర్మానికి ఎంతో సేవ చేసిన సోదరి నివేదిత. భారత్-టుడే సౌజన్యంతో....

-శ్రీరామ్
{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top