అయోధ్య ధ్వజారోహణ క్రతువుపై పాక్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతరులకు పాఠాలు చెప్పే నైతికత దాయాదికి లేదని చురకలు వేసింది. వారి దేశంలో దారుణంగా ఉన్న మానవ హక్కుల రికార్డ్‌పై దృష్టి సారించాలని హితవు పలికింది. హిందువులకు ఎంతో ముఖ్యమైన భావోద్వేగ, ఆధ్యాత్మిక క్షణాల వేళ పాకిస్థాన్ అవాకులు చెవాకులు పేలింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా ముస్లింల పట్ల భారత్ వివక్ష చూపుతోందని, ముస్లిం సంస్కృతిని, వారసత్వాన్ని నిర్మూలిస్తోందంటూ ఆరోపించింది. పాక్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. దాయాది వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల అనుచితంగా ప్రవర్తించే చరిత్ర కలిగిన పాకిస్థాన్‌కు ఇతరులకు నీతివాఖ్యాలు చెప్పే నైతికత లేదని జైశ్వాల్ తెలిపారు.
అయోధ్యలో రామాలయం పూర్తికి సంకేతంగా ధ్వజారోహణ క్రతువు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. అయోధ్యలోని భవ్య రామమందిర నిర్మాణం పూర్తి కావటంతో శతాబ్దాలనాటి గాయాలు, బాధలు నయమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సూచికగా కాషాయధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని, దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.

