దేశ విభజన |
–ప్రశాంత్ పోల్
ఇక ముందు ఏం జరుగుతుంది…?
దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ కన్న అందమైన కలలు అన్నీ కల్లలు అయ్యాయి. `ముస్లిం లీగ్ పాకిస్థాన్ ఏర్పాటును కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది?’అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరణర్ధి శిబిరాల్లో ఈ మాట ఆయన అన్నారు కూడా. హిందువులకు ఎలాంటి హాని తలపెట్టమని ముస్లిం నేతలు తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పాకిస్థాన్ అసెంబ్లీలో జిన్నా కూడా ఇదే భరోసా ఇచ్చాడు. `పాకిస్థాన్ అన్ని మతాలవారి కోసం’అని గొప్పగా ప్రకటించాడు.
కానీ నిజానికి ముస్లిం నాయకులు, జిన్నా అలా ఎప్పుడూ భావించలేదు. అలా జరగలేదు కూడా. అసలైన మత ఘర్షణలు, అల్లర్లు స్వాతంత్ర్యం తరువాతనే మొదలయ్యాయి. ఆగస్ట్ చివరి వారం, సెప్టెంబర్, అక్టోబర్ లలో భీకరమైన అల్లర్లు చెలరేగాయి. ఆగస్ట్ 17న రెడ్ క్లిప్ విభజన రేఖను ప్రకటించాడు. ఆ తరువాత దారుణమైన మారణకాండ జరిగింది. లక్షలాదిమంది తమ ఇళ్ళువాకిళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. తమవారి నుంచి దూరమైపోయారు.
విభజన సమయంలో సాగిన ఈ భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటిన్నర కోట్లమంది శరణార్ధులుగా మిగిలారు.
భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. |
ఇలాంటి స్వాతంత్ర్యం నుంచి మనకు ఏం వచ్చింది…..?
ఢాకాలోని ఢాకేశ్వరీ దేవి ఆలయం మనది కాకుండా పోయింది. బారిసాల్ కాళికాదేవి దర్శనం చేసుకోవడం, దుర్గా సరోవరంలో పుణ్యస్నానం చేయడం ఇక మనకు సాధ్యం కాదు. సిక్కు మతపు సంస్థాపకుడైన గురునానక్ జన్మస్థలమైన నన్ కానా సాహెబ్ ఇక మన దేశంలో భాగం కాదు. పవిత్ర పంజా సాహెబ్ గురుద్వారా మనకు దూరమైపోయింది. హింగలాజ్ దేవి దర్శనం చేసుకోవడం మనకు వీలుకాదు.
ఏం పాపం చేశామని? మన దేశమే మనకు పరాయి అయిపోయింది?
`పంజాబ్ బౌండరీ ఫోర్స్ కేంద్ర కార్యాలయాన్ని స్వాతంత్ర్య దినం నాడే లాహోర్ లో పూర్తిగా తగలబెట్టారు. అక్టోబర్ లో గిల్గిట్ స్కౌట్ లోని ముస్లిం సిపాయిలు తిరుగుబాటు చేసి మొత్తం గిల్గిట్ బాల్టిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. అక్టోబర్ రెండవ వారంలోనే పాకిస్థాన్ సైన్యం కబాయిలీ గిరిజనులను అడ్డంపెట్టుకుని కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించింది. చివరికి అక్టోబర్ 27న మహారాజా హరిసింగ్ విలీన పత్రంపై సంతకం చేశారు. 1948 మార్చ్ లో పాకిస్థాన్ పూర్తిగా కాలాత్ ప్రాంతాన్ని, అంటే బెలూచిస్తాన్ ను ఆక్రమించింది.
➣ 11 సెప్టెంబర్, 1948 జిన్నా మరణించారు. సరిగ్గా వారం రోజుల తరువాత, అంటే 17 సెప్టెంబర్, 1948 హైదరబాద్ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా భారత్ లో విలీనం చేశారు.
➣ 30 జనవరి, 1948 గాంధీజీ హత్య జరిగింది. అంతకుముందు కూడా ఆయనపై ఒకటి, రెండు హత్య ప్రయత్నాలు జరిగాయి. 21, జూన్, 1948 మౌంట్ బాటన్ భారత్ వదిలి లండన్ వెళిపోయాడు.
➣ ఆ 15 రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి….! అవన్నీ ప్రత్యేకమైనవే.
➣ ఆ 15 రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి..
మౌంట్ బాటన్ చెపితే స్వతంత్ర భారతంలో కూడా యూనియన్ జాక్ (బ్రిటిష్ జెండా) ఎగురవేయడానికి సిద్ధపడిన నెహ్రూ ధోరణి మనం చూశాం. `లాహోర్ మరణిస్తే దానితోపాటు మీరు కూడా చచ్చిపోండి’ అని గాంధీజీ లాహోర్ లో హిందువులకు చెప్పిన రోజునే అక్కడకు 800 మైళ్ళ దూరంలోని హైదారాబాద్ (సింధ్)లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ`రాజా దాహిర్ నుంచి ప్రేరణ పొంది, ధైర్యంతో, కలిసి జీవించండి’అంటూ ధైర్యాన్ని నింపడం కూడా చూశాం.
సింధీ మహిళలు బాగా అలంకరించుకుని, అందమైన దుస్తులు ధరిస్తారు కాబట్టే ముస్లింలు వారిని వేధిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడి భార్య సుచేత కృపలానీ హిందూ మహిళలకు `బోధిస్తున్నప్పుడే’, కరాచీలో రాష్ట్ర సేవికా సమితికి చెందిన మౌసీజీ `హిందూ మహిళలు సంస్కారవంతులు, శక్తిశాలులు, సమర్ధులుగా ఉండాలి’ అంటూ చెప్పడం చూశాం. కాంగ్రెస్ లోని హిందూ కార్యకర్తలు ప్రాణభయంతో పాకిస్థాన్ వదిలిపెట్టి భారత్ కు పారిపోతే, ముస్లిం కార్యకర్తలు ముస్లిం లీగ్ తో కలిసిపోయారు. కానీ సంఘ స్వయంసేవకులు ధైర్యంగా నిలబడి ప్రాణాలను సైతం ఒడ్డి హిందువులు, సిక్కులను సురక్షితంగా భారత్ కు చేర్చడం కూడా చూశాం.
భయంకర మారణకాండలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు |
ఆలోచనావిధానంలో, పని చేసే పద్దతిలో ఎంత తేడా…? కానీ, స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తరువాత పరిస్థితి ఏమిటి…?
హిందువులు, సిక్కులను ప్రాణాలకు తెగించి కాపాడిన స్వయంసేవకులు జైళ్ళలో ఉన్నారు..! గాంధీ హంతకులంటూ వారిపై అబద్ధపు ఆరోపణలు…! శక్తి మేరకు దేశ సమైక్యతను, అఖండతను కాపాడేందుకు ప్రయత్నించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై నిషేధం..! స్వయంసేవకులలో ధైర్యాన్ని నింపి, సుదృఢమైన దేశ నిర్మాణానికి వారిని ప్రోత్సహించే సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ జైలులో…! `మన దేశ సైన్యం అప్రతిహతమైన శక్తిని సాధించాలి’అని కోరుకున్న విప్లవ వీరుడు సావర్కర్ కూడా జైలులో…!
మరి అధికారం ఎవరి చేతిలో…? తన మొండి పట్టుదలతో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ను భారత్ లో కలవనీయకుండా చేసిన, ఇంకా బ్రిటిష్ వారి ముందు సాగిలపడుతున్న, ఆంగ్లేయ పద్దతులు, ఆలోచనను పూర్తిగా పుణికి పుచ్చుకున్న నెహ్రూ చేతిలో…! మనం మన దేశాన్ని ఎలాంటి నాయకుల చేతిలో పెడుతున్నామన్నది ఆ 15 రోజుల్లో స్పష్టమైపోయింది..!
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}