దేశ విభజన |
–ప్రశాంత్ పోల్
సోధెపూర్ ఆశ్రమం.. కలకత్తా ఉత్తర ప్రాంతంలో ఈ ఆశ్రమం ఊరికి బయటనే ఉంది. దాదాపు ఎనిమిది తొమ్మిది మైళ్ళ దూరంలో. అనేక చెట్లు, మొక్కలు, తీగలతో నిండిన ఆవరణతో ఉండే ఈ ఆశ్రమం అంటే గాంధీజీకి చాలా ఇష్టం. క్రిందటిసారి ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు గాంధీజీ `నాకు ఎంతో ఇష్టమైన సబర్మతి ఆశ్రమానికి సమానంగా ఉంది ఈ ఆశ్రమం’అని అన్నారు.
ఇవాళ ఉదయం నుంచే ఈ ఆశ్రమంలో హడావిడిగా ఉంది. ప్రతి రొజూ ఆశ్రమ వాసులు త్వరగానే నిద్ర లేస్తారు. కానీ గాంధీజీ కొన్ని రోజులు ఇక్కడ ఉంటారని తెలిసినప్పటి నుంచి తగిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆశ్రమాన్ని శుభ్రం చేయడం ప్రతి రొజూ జరుగుతుందికాని ఇవాళ మరింత ప్రత్యేకంగా జరుగుతోంది. ఎందుకంటే బాపూ ఇక్కడికి వస్తున్నారు.
ముఖ్యంగా సతీశ్ బాబు చాలా హడావిడిగా ఉన్నారు. సతీశ్ చంద్ర బాబు పూర్తి పేరు సతీశ్ చంద్ర దాస్ గుప్తా. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే స్థాపించిన దేశంలోనే మొట్టమొదటి రసాయన కంపెనీ`బెంగాల్ కెమికల్ వర్క్స్’లో సతీశ్ బాబు సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఆయన శాస్త్రవేత్త కాబట్టి అనేక ప్రయోగాలు చేశారు. ఒకసారి ఆయన, ఆయన భార్య హేమప్రభ గాంధీజీని కలిశారు. అప్పటి నుంచి వారి జీవితమే మారిపోయింది. 20, 21ఏళ్ల క్రితం అంటే సరిగ్గా చెప్పాలంటే 1921 సంవత్సరంలో సతీశ్ బాబు తన చక్కని ఉద్యోగాన్ని వదిలిపెట్టి కలకత్తా బయట ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. సతీశ్ బాబు, ఆయన భార్య హేమప్రభ ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు.
హేమప్రభా దీదీపై గాంధీజీ ప్రభావం చాలా ఉంది. అందుకనే ఆమె గాంధీజీని కలిసిన మొదటి రోజునే తన దగ్గర ఉన్న బంగారపు ఆభరణాలన్నీ ఆయనకు సమర్పించింది. సతీశ్ బాబు కూడా అందుకు అభ్యంతరం పెట్టలేదు. పైగా తన భార్య అలా చేసినందుకు ఆయన సంతోషించారు…!
సతీశ్ బాబు ఈ ఆశ్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. మౌలికంగా శాస్త్రవేత్త అయిన ఆయన గాంధీజీ `స్వదేశీ’ఉద్యమంవల్ల బాగా ప్రభావితులయ్యారు. తన ఆశ్రమంలో చిన్న నూనె శుద్ధి కేంద్రం ప్రారంభించారు. అలాగే వెదురు పిప్పి నుంచి కాగితం తయారు చేసే కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఈ కాగితం కాస్త ముతకగా ఉన్నప్పటికి వ్రాయడానికి మాత్రం బాగుంటుంది. ఈ కాగితాన్నే ఆశ్రమంలో ఉపయోగిస్తారు. అలాగే కొంత బయట అమ్మడానికి పంపుతారు కూడా.
గాంధీజీకి ఈ ఆశ్రమం అంటే చాలా ఇష్టమని సతీశ్ బాబుకు తెలుసు. ఏడాది, ఏడాదిన్నర క్రితం ఆయన ఇక్కడికి వచ్చి నెలరోజులపాటు ఉన్నారు. ఆయన్ని కలవడానికి అనేకమంది నాయకులు ఇక్కడికి వస్తారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం సతీశ్ బాబు ఇక్కడే సుభాష్ చంద్ర బోస్ ను కలిశారు. అప్పుడు గాంధీజీ, సుభాష్ బాబు, నెహ్రూలు మాత్రమే ఉన్నారు. గాంధీజీకి ఇష్టం లేకపోయినా సుభాష్ చంద్ర బోస్ త్రిపుర(జబల్ పూర్)కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి నెగ్గారు. దానితో కాంగ్రెస్ కు చెందిన ఇతర నాయకులు సుభాష్ బోస్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ విషయమై చర్చించేందుకే ఈ ఆశ్రమంలో సమావేశం ఏర్పాటయింది.
ఈ సమావేశంలో సమస్యకు పరిష్కారం ఏది లభించకపోగా సుభాష్ బోస్ కాంగ్రెస్ ను వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయారు. సతీశ్ బాబుకు గాంధీజీ అంటే చాలా భక్తిప్రపత్తులు ఉన్నప్పటికి ఈ సంఘటన ఆయనను బాధించింది. కానీ ఇప్పుడు గాంధీజీ వచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సతీశ్ బాబు తన ఆలోచనల్లోనుంచి బయటకు వచ్చి ఏర్పాట్లు చూడటంలో నిమగ్నమయ్యారు. కలకత్తాలో సూర్యోదయం కాస్త ముందుగానే అవుతుంది. అందువల్ల ఐదు, ఐదున్నర కాగానే బాగా వెలుతురు వచ్చేసింది. ఇక గంటలో గాంధీజీ ఆశ్రమానికి వచ్చేస్తారు…!
—––—
అక్కడకు దూరంగా ..ఢిల్లీలో మందిర్ మార్గ్ లోని హిందూ మహాసభ భవనంలో హడావిడిగా ఉంది. మహాసభ అధ్యక్షుడు డా. ఎన్.బి. ఖరే నిన్ననే గ్వాలియర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చారు.
డా. ఖరేది విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయన మొదట కాంగ్రెస్ వాది. 1937లో మధ్య భారత ప్రాంతపు మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన లోకమాన్య తిలక్ కు చెందిన `అతివాద కూటమి’కి చెందినవారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టికరణ విధానం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంలో తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు వ్యక్తపరుస్తుండేవారు. ఇది నెహ్రూ, గాంధీలకు ఏమాత్రం నచ్చేది కాదు. అప్పుడే డా. ఖరే ను సేవాగ్రామ్ ఆశ్రమానికి రప్పించిన గాంధీజీ ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు.
గాంధీజీ ఆదేశాన్ని విన్న ఖరే ఏమాత్రం తొణకకుండా “రాజీనామా పత్రపు నమూనా ఏదో మీరే నిర్ణయించండి’అన్నారు. డా. ఖరే రాజీనామా చేయడానికి అంతా సులభంగా అంగీకరించడంతో ఆనందపడిన గాంధీజీ వెంటనే అక్కడే ఉన్న కాగితంపై, తన స్వంత దస్తూరితో ఖరే రాజీనామా లేఖ వ్రాసారు. ఆ లేఖను తీసుకున్న ఖరే దానిపై సంతకం మాత్రం చేయలేదు. అక్కడ నుంచి నాగపూర్ కు ప్రయాణమయ్యారు. ఇది చూసిన గాంధీజీ ఆశ్చర్యపోయారు. `అరె! అతను ఏం చేస్తున్నాడు?..ఎక్కడికి వెళుతున్నాడు..?’అని అడిగారు.
ఖరే ఆ లేఖ తీసుకుని నాగపూర్ వచ్చారు. గాంధీజీ స్వంత దస్తూరితో ఉన్న ఆ రాజీనామా లేఖను నాగపూర్ లోని అన్ని వార్తా పత్రికలకు పంపారు. అంతేకాదు `చూడండి గాంధీజీ ఎలా ఒక ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించాలని ప్రయత్నిస్తున్నారు’ అంటూ ప్రచారం ప్రారంభించారు.
అలాంటి తెలివైన డా. ఖరే తరువాత హిందూ మహాసభ అధ్యక్షులు అయ్యారు. ఆయనకు సహకరించేందుకు పండిత్ మౌళీచంద్ర శర్మా వంటి వారు కూడా ఉన్నారు. పండిత్ శర్మా కూడా మొదట కాంగ్రెస్ లోనే ఉండేవారు. 1930, 1931ల్లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టికరణ విధానం నచ్చక ఆయన కూడా హిందూ మహాసభకు దగ్గరయ్యారు. ఈ రోజు తాత్యారావ్ సావర్కర్ హిందూ మహాసభ భవన్ కు వస్తున్నారు. అందుకనే అక్కడ అందరిలో సంతోషం కనిపిస్తోంది.
ఉదయం అల్పాహారం పూర్తయిన వెంటనే 9గం.లకు హిందూ మహాసభ కేంద్రీయ సమితి సమావేశం ప్రారంభమయింది. హిందూ మహాసభ ప్రకటించిన అంశాలపై చర్చ మొదలయింది. `ఖండిత హిందూస్థాన్ లో పౌరులందరికి ఒకే రకం హక్కులు ఉంటాయంటున్నారు. కానీ పాకిస్థాన్ లో హిందువులకు ఎలాంటి హక్కులు లభిస్తాయో, ఇక్కడి ముస్లింలకు అవే హక్కులు లభించాలి తప్ప ఎక్కువకాదు’అనే విషయాన్ని హిందూ మహాసభ తరఫున ప్రభుత్వానికి స్పష్టం చేయాలని నిర్ణయించారు. హింది మాట్లాడే ప్రాంతాల్లో దేవనాగరి లిపిలోని హిందీలోనే అన్నీ ప్రభుత్వ కార్యకలాపాలు సాగించాలి. ఇతర ప్రాంతాల్లో స్థానిక భాషలో విద్యాబోధన జరిగిన ప్రభుత్వ రాతకోతలు మాత్రం హిందీలోనే జరగాలి. వీటితోపాటు పౌరులందరికి నిర్బంధ సైనిక శిక్షణ ఉండాలన్న అంశం కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది.
కనీసం ఖండిత హిందూస్థాన్ లోనైనా హిందువులు స్వాభిమానంతో, గర్వంతో తలెత్తుకు తిరగాలని, అలాంటి పరిస్థితి సాధించడం కోసం మహాసభకు చెందిన నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ప్రారంభించారు.
—––—
జమ్మూలో..రెండవరోజు ఉదయం…అంటే 9 ఆగస్ట్ ఉదయం.
బారిస్టర్ మహమ్మద్ అలీ జిన్నాకు తన ప్రియమైన పాకిస్థాన్ లో రెండవ రోజు. కరాచీలోని విశాలమైన భవంతి ఆయన తాత్కాలిక నివాసం. ఆయన మనస్సులో అనేక ఆలోచనలు మెదలుతున్నాయి. కొత్త పాకిస్థాన్ రూపురేఖలు ఎలా ఉండాలి? న్యాయవ్యవస్థ ఎలా ఉండాలి? జాతీయ జెండా ఏమిటి? జాతీయ గీతం ఏముంటే బాగుంటుంది?… ఈ చివరి ప్రశ్న దగ్గర జిన్నా ఆలోచనలు ఆగిపోయాయి. మిగిలిన అన్నీ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నా, జాతీయ గీతం `కౌమి తారానా’ గురించి మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. అధికారికంగా పాకిస్థాన్ ఏర్పడటానికి ఇక ఐదు రోజులే మిగిలి ఉంది.
జిన్నా ఢిల్లీలో ఉన్నప్పుడే కొందరు రచయితలు వ్రాసిన గీతాలను ఎంపిక చేసుకుని పెట్టుకున్నాడు. అవి ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ఆ కవులలో ఒకరు `జగన్నాధ ఆజాద్’. ఈయన లాహోర్ కు చెందిన పంజాబీ హిందువు. కానీ ఆయనకు ఉర్దు భాషపై మంచి పట్టు ఉంది. ఆజాద్ కాఫిర్ అయినా దానివల్ల నష్టం ఏముంది? కాబట్టి పాకిస్థాన్ జాతీయ గీతాన్ని రచించడానికి ఆజాద్ ను రప్పించాలని నిర్ణయించాడు. ఆ ప్రకారం నిన్ననే ఆజాద్ కు కబురుపెట్టాడు. కానీ అతను ఇప్పటివరకు రాలేదు.
జిన్నా తన కార్యదర్శిని పిలిచి `లాహోర్ నుంచి జగన్నాధ ఆజాద్ అని ఎవరైనా వచ్చారా?’అని అడిగాడు. కార్యదర్శి వెంటనే `అతను ఎప్పుడో ఉదయమే వచ్చాడు’అని సమాధానమిచ్చాడు. జిన్నా `వెంటనే అతనిని లోపలికి పంపు’అని ఆదేశించాడు.
జగన్నాధ ఆజాద్ కు 30 ఏళ్ళకు మించి ఉండవు. ఉర్దూలో ఇంతబాగా వ్రాస్తున్న అతను ఏ 50 ఏళ్లవాడో అయివుంటాడని జిన్నా అనుకున్నాడు. జగన్నాధ ఆజాద్ ను కూర్చోమన్నాడు. అతనిని కుశల ప్రశ్నలు వేశాడు. ఆ తరువాత పాకిస్థాన్ జాతీయ గీతంగా ఉంచదగిన ఏదైనా గీతం ఉందా అని అడిగాడు. జగన్నాధ్ దగ్గర వెంటనే ఏ పాటా సిద్ధంగా లేకపోయినా అప్పటికప్పుడు ఒక పాట మనసులో అనుకుని జిన్నాకు ఇలా వినిపించాడు…
ఏ సర్జమీ – ఏ –పాక్
జర్రే తెరే హై ఆజ్
సితారోం సే తాబ్ నాక్
రోషన్ హై కహకషాన్ సే
కహి ఆజ్ తేరి ఖాక్
తుందీ – ఏ – హస్దాంపే
గాలిబ్ హై తేరా సవాక్
దామన్ వో సిల్ గయా హై
జో థా ముద్దతోం సే చాక్
ఏ సర్ జమీనే – ఏ – పాక్..!
`బస్ ..బస్..యహీ..యహీ చహియే థా ముఝే’… (చాలు, చాలు, సరిగ్గా ఇదే నాకు కావలసినది) అంటూ జిన్నా ఆపాడు. ఈ తరానా (పాట) అతనికి బాగా నచ్చింది. అలా ఒక కాఫిర్ వ్రాసిన ఒక గీతాన్ని వతన్ – ఏ – పాకిస్థాన్ జాతీయ గీతం (కౌమి తరానా) గా నిర్ణయించారు.
—––—
9 ఆగస్ట్, ఆదివారం…
అమృత్ సర్ లో ఈ రోజు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అమృత్ సర్, అలాగే ఆ జిల్లా అంతటా ముస్లింల సంఖ్య ఎక్కువ. సరిహద్దు గ్రామాల నుంచి అల్లర్లకు సంబంధించిన వార్తల వస్తూనే ఉన్నాయి. వీటి మూలంగా హిందువులు, సిక్ఖులు, ముస్లింలు కూడా కోపంగా ఉన్నారు. స్వర్ణమందిర గురుద్వారాలో ధైర్యవంతులైన నిహంగ్ యువకులను పహారా కోసం పెట్టారు. గురుద్వారలోని పవిత్ర సరస్సు ముస్లిం అల్లరి మూకల వల్ల కలుషితం కావడం సిక్ఖులకు ఇష్టం లేదు.
ఉదయం దాదాపు 11, 12 అవుతోంది. అమృత్ సర్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న టాంగా స్టాండ్ లో సాధారణ దుస్తుల్లో ఉన్న వందలాదిమంది పోలీసులు వచ్చి చేరారు. ముస్లిం లీగ్ కు చెందిన మత మౌఢ్య కార్యకర్త మహమ్మద్ సయ్యిద్ అక్కడికి వస్తున్నాడని వారికి తెలిసింది. ఈ నరహంతకుడు పెద్ద పెద్ద కుట్రలు పన్నడంలో, వాటిని అమలు చేయడంలో సిద్ధహస్తుడు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి ఆయుధాలు, ఉర్దూలో వ్రాసి ఉన్న పత్రాలు, ముతక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అలా అమృత్ సర్ లో పెద్ద మారణకాండను పోలీసులు నివారించగలిగారు.
—––—
ఇక్కడ ఢిల్లీలో రాడ్ క్లిఫ్ బంగాళా ప్రశాంతంగా ఉంది. బంగాళాలోని రెండు మూడు గదుల్లో పడిఉన్న కాగితాలను సర్దుతున్నారు. రాడ్ క్లిఫ్ పని చాలావరకు పూర్తైపోయింది. భారత, పాకిస్థాన్ ల మధ్య విభజన రేఖ గీసేశారు. తన పనిలో న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా అన్నది అతనికి తెలియడం లేదు. ఒక పక్షం న్యాయం జరిగిందని అంటోంది. మరో పక్షం పూర్తిగా అన్యాయం జరిగిందంతోంది. అయితే మొత్తానికి ఈ అభ్యంతరాలన్నింటిని దాటుకుని విభజన రేఖను మాత్రం నిర్ధారించారు.
వైస్రాయ్ దగ్గర ఈ ఉదయమే రాడ్ క్లిఫ్ గురించి చర్చ జరిగింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో విభజన రేఖ గురించి ప్రకటించడం మంటలకు ఆజ్యం పొయ్యడమే. అప్పుడు అల్లర్లు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ కారణంతో విభజనకు సంబంధించిన పూర్తి వివరాలు స్వాతంత్ర్య దినోత్సవం అయిన రెండు, మూడు రోజుల తరువాతనే ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు. అంటే మరో ఎనిమిది, తొమ్మిది రోజులపాటు రాడ్ క్లిఫ్ కు ఆందోళన తప్పదన్నమాట.
—––—
దక్షిణాన ఉన్న హైదారాబాద్ లో నిజాం ఉస్మాన్ ఆలీ తన విశాలమైన భవంతిలో మంత్రితో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నాడు. వెంటనే జిన్నాకు ఒక లేఖ పంపాలనుకుంటున్నాడు. హైదారాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచడానికి అతనికి పాకిస్థాన్ మద్దతు కావాలి. దివాన్ వ్రాసిన లేఖపై నిజాం ఉర్దూలో సంతకం చేశాడు. ప్రత్యేక దూత ఆ లేఖను తీసుకుని కరాచికి బయలుదేరాడు. ఖండితమైనా ఒక వారంలో స్వాతంత్ర్యం పొందే భారత్ మధ్యలో స్వతంత్రంగా, సార్వభౌమాధికారం కలిగిన ముస్లిం రాజ్యంగా అవతరించడానికి ఒక ముస్లిం సంస్థానం ప్రయత్నిస్తోంది.
—––—
ఇక్కడ నుంచి చాలా దూరంగా, తూర్పు దిశలో ఉన్న సింగపూర్ లో ప్రభుత్వ కార్యాలయాలనుంచి ఉద్యోగులు వెలిపోతున్నారు. నిజానికి ఆదివారం రోజు సింగపూర్ లో ఉద్యోగులు పూర్తి రోజు పనిచేయరు. సింగపూర్ `మెరినా బే’ లో ఉన్న ఉద్యోగుల యూనియన్ కార్యాలయంలో చాలామంది సమావేశమయ్యారు. వాళ్ళంతా భారతీయులే.
సింగపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించడం కోసం ఆ ఉద్యోగులు ఒక లేఖ తయారు చేస్తున్నారు. 15 ఆగస్ట్ శుక్రవారం అవుతుంది. ఆ రోజునే తమ ప్రియతమ దేశమైన భారత్ స్వాతంత్ర్యం పొందుతుంది. కాబట్టి ఆ రోజున ఒక ఉత్సవ జరుపుకోవాలని భారతీయ ఉద్యోగులు భావిస్తున్నారు. అందుకని వారందరికి 15 ఆగస్ట్ న సెలవు కావాలి. అలా తమకు సెలవు కావాలని కోరుతూ వాళ్ళు లేఖ తయారు చేస్తున్నారు.
—––—
మహమ్మద్ సయ్యిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త సర్వత్ర వ్యాపించడంతో అమృత్ సర్, ఇతర జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన ముస్లింలు మధ్యాహ్నం నుంచే హిందువులు, సిక్కుల ఇళ్ళు, దుకాణాలపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. సాయంత్రానికల్లా ఈ అల్లర్లు జిల్లా అంతటా పాకాయి. ముస్లిం లీగ్ కు చెందిన నేషన్ గార్డ్స్ అల్లర్లు సృష్టించడంలోను, హింసకు పాల్పడడంలోను ముందున్నారు. అమృత్ సర్ కు దగ్గరలో ఉన్న జబల్ ఫాద్ అనే గ్రామంలో ముస్లిం మూకలు 100 మందికి పైగా హిందువులు, సిక్కులను ఊచకోతకు గురిచేశారు. దాదాపు 70, 80 మంది యువతులను ఎత్తుకుపోయారు. ధపాయి గ్రామంలోనైతే ఒక చోట గుమి కూడిన వెయ్యిమంది ముస్లింలు ఒక్కసారిగా హిందువులపై పడ్డారు. అయితే కొందరు సిక్కులు వారిని ఎదుర్కొన్నారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో 14మంది ముస్లింలు కూడా చనిపోయారు.
అల్లర్లు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మేజర్ జనరల్ టి డబ్ల్యూ రీస్ నేతృత్వంలోని సైనిక దళం, ముస్లిం నేషనల్ గార్డ్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సాయంత్రం గంటన్నరపాటు ఈ పరిస్థితి కొనసాగింది. ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పంజాబ్ రాజధాని లాహోర్ కు ఈ వార్త టేలిగ్రామ్ ద్వారా తెలిసింది. పంజాబ్ గవర్నర్ ఇర్విన్ జెన్ కిన్స్ ఈ టెలిగ్రామ్ జాగ్రత్తగా చదివాడు. వెంటనే తన కార్యదర్శిని పిలిచి పంజాబ్ అంతటా ప్రెస్ సెన్సార్ షిప్ విధించాలని ఆదేశించాడు. అంటే దీని అర్ధం 9 ఆగస్ట్ న అమృత్ సర్, పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘోర, హింసాత్మక ఘర్షణల గురించి మర్నాడు పంజాబ్ పత్రికలు వేటిలోనూ వార్తలు రావన్నమాట.
—––—
అక్కడ కలకత్తాకు దగ్గర ఉన్న సోధెపూర్ ఆశ్రమంలో గాంధీజీ ప్రార్ధనా సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రార్ధనకు ముందు డా. సునిల్ బాబు గాంధీజీకి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేశారు. 1939లో గాంధీజీ ఒక నెలపాటు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు డా. సునీల్ బాబు ఈ పరీక్షలు నిర్వహించేవారు.
ఆరోగ్య పరీక్షల తరువాత గత ఎనిమిది సంవత్సరాలుగా గాంధీజీ ఆరోగ్య స్థితి స్థిరంగా ఉందని డా. సునీల్ బాబు అన్నారు. అందులో పెద్దగా చెప్పుకోదగిన హెచ్చుతగ్గులు లేవని అన్నారు. 1939లో ఆయన ఇక్కడికి వఃచినప్పుడు బరువు 112 నుంచి 114 పౌండ్లు ఉంది. ఇప్పుడు కూడా 113 పౌండ్లు ఉంది. ఆయన గుండె, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయి.
నేటి సాయంత్ర ప్రార్ధన సమావేశంలో కలకత్తా పరిస్థితిని ప్రస్తావించారు. `హిందువులు, ముస్లింలు ఇద్దరు పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారు. ముస్లిం లీగ్ మంత్రిమండలి ఏం చేసింది? ఎందుకు చేసింది అనే విషయంకంటే 15 ఆగస్ట్ తరువాత ఖండిత బెంగాల్ కార్యకలాపాలను పర్యవేక్షించే కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా. ప్రఫుల్ల చంద్ర ఘోష్ ఎలా పనిచేస్తారన్నదే నాకు ముఖ్యం. కాంగ్రెస్ పాలనలో ముస్లింలపై అత్యాచారాలు జరగకూడదన్నదే నేను కోరుకునేది. నేను నోవాఖలి కూడా వెళతాను. కానీ కలకత్తాలో పూర్తి శాంతి నెలకొన్న తరువాతనే…!’అని అన్నారు.
—––—
ఇక్కడ ఢిల్లీలో సాయంత్రం అవుతూనే రాంలీలా మైదానంలో పెద్ద సంఖ్యలో జనం పొగయ్యారు. స్వాతంత్ర్య వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవాళ శనివారం. వచ్చే శుక్రవారానికి మనం స్వతంత్ర దేశంగా అవతరిస్తాం. ఇవాళ జరిగే సభలో నెహ్రూ, పటేల్ వంటి పెద్ద పెద్ద నాయకులు ఉపన్యాసిస్తారు. దీనిని డిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. అందుకనే కార్యక్రమం మొదట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే నెహ్రూ, పటేల్ లు సభాస్థలికి చేరుకున్నారో ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగిపోయింది. పెద్దపెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు.
సర్దార్ పటేల్ మాట్లాడుతున్నప్పుడు రాంలీలా మైదానం అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రేక్షకులు మౌనంగా, శ్రద్ధగా ఉపన్యాసం విన్నారు. దేశ విభజనను ఎందుకు నివారించలేకపోయామో వివరించడానికి పటేల్ ప్రయత్నించారు. కానీ ఆయన చెప్పిన కారణాలు జనానికి ఏమాత్రం మింగుడుపడలేదు. అందుకనే ఉపన్యాసం మధ్యలో కేరింతలు, చప్పట్లు లేవు. నెహ్రూ ఉపన్యాసం కూడా అలాగే సాగింది.
డిల్లీ అప్పటికే శరణార్ధులతో నిండిపోయింది. ఇళ్ళువాకిళ్ళు, ఆస్తిపాస్తులు, వృత్తివ్యాపారాలు వదిలిపెట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన హిందువులు నగరంలో తలదాచుకుంటున్నారు. నెహ్రూ-పటేల్ లు తమ కష్టాల గురించి, వాటి పరిష్కారం గురించి ఏమైనా చెపుతారేమోనని వాళ్ళు ఆశించారు. కానీ అలాంటిది ఏమి జరగలేదు. నెహ్రూ అంతర్జాతీయ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడారు. `ఇక మొత్తం ఆసియా నుంచి విదేశీ శక్తులను తరిమికొడతాం’అంటూ ఆయన గర్జించారు. కానీ సభలో ఉన్న జనానికి ఈ గర్జన పెద్దగా ఉత్సాహపరచలేకపోయింది. స్వాతంత్ర్య వారోత్సవపు మొదటి రోజున ప్రారంభంలో కనిపించిన ఉత్సాహం సభ ముగిసేటప్పటికి చల్లబడిపోయింది.
—––—
దేశం మధ్యలో ఉన్న నాగపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయంలో శనివారం రాత్రి జ్యేష్ట ప్రచారక్ లు, అధికారుల సమావేశం ఉంది. సమావేశంలో అఖండ భారత్ చిత్రపటం పెట్టారు. ఈ విభజన ఫలితాలు ఏమిటి? విభజన రేఖకు అవతల ఉన్న హిందువులు, సిక్కులను సురక్షితంగా తీసుకురావడం ఎలా అన్నది లోతుగా చర్చించారు..
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}