వలసపాలకులు |
కుల దురహంకార పాలకులుగా నిందపడ్డ పీష్వాల కంటే బ్రిటిష్ వలస రాజ్యాధిపతులే ఎక్కువగా అగ్రకుల పక్షపాతంతో వ్యవహరించారు. అశాస్త్రీయ ‘సమరోచిత జాతుల’ సిద్ధాంతం ప్రేరణతో 1892లో మహర్‌ల సైనిక సేవలను తృణీకరించారు. ప్రథమ ప్రపంచ సంగ్రామంలో తమ సైనిక అవసరాలకు మహర్‌ల సేవలను ఉపయోగించుకొని యుద్ధం ముగిసిన తక్షణమే వారిని సైన్యం నుంచి తొలగించారు. మహారాష్ట్రలో ఇటీవలి హింసాకాండ ఆ వలస పాలకుల సమసిపోని వారసత్వమే!
రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధమది. అయినా ఇప్పుడు సామాజిక, రాజకీయ ప్రకంపనలకు కారణమయింది! భీమా–కోరేగాం యుద్ధం ద్విశత వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది తొలి రోజున వందలాది దళిత సంఘాల సంయుక్త ప్రదర్శన విషమ పర్యవసానాలకు దారి తీసింది. మహారాష్ట్ర అంతటా అనేక ప్రాంతాల్లో హింసాకాండ భగ్గుమన్నది. సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రోజుల తరబడి పత్రికల పతాక శీర్షికల్లో ఉండిన ఈ సంఘటనల మూలాలు బ్రిటిష్ వలసపాలకుల కుట్రపూరిత పాలనలో ఉన్నాయి. తమ సామ్రాజ్యవాద లక్ష్యాల కోసం భారతీయ సమాజంలోని సామాజిక చీలికలు, మత వైషమ్యాలను ఆ పరాయివాళ్ళు చాలా మోసపూరితంగా ఉపయోగించుకున్నారు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం తరువాత కూడా భారతీయులలో ఒక వర్గం వారు ఆ వేర్పాటువాద మనస్తత్వంతోనే ఉండిపోవడం ఆశ్చర్యమే కాదు, ఆవేదనా కలిగిస్తోంది.
భిన్న మతాల మధ్య లేదా ఒకే మతంలోని వివిధ శాఖల మధ్య హింసాత్మక ఘర్షణలు మధ్యయుగాల ఐరోపాలో ఒక సర్వసాధారణమైన విషయం. ఇస్లామిక్ దేశాల్లో ఇప్పటికీ షియా–సున్నీ ముస్లింల మధ్య సంభవిస్తున్న ఘర్షణలు వేలాది ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి. పాశ్చాత్య దేశాలలో 15–18 శతాబ్దాల మధ్య ప్రొటెస్టెంట్లు, కేథలిక్‌ల మధ్య తరచు జరిగిన యుద్ధాలలో వేలాది అమాయకులు హతమయ్యారు.
భారత్ విషయానికి వస్తే రెండు వాస్తవాలు ప్రముఖంగా కన్పిస్తాయి. ఒకటి– హిందూ అగ్ర వర్ణాలవారు శతాబ్దాలుగా తమ సహ మతస్థులలో ఒక వర్గం వారిని అమానుషంగా అణచివేయడం; రెండు– గురు నానక్‌తో మొదలుకొని ఎంతో మంది వివేకశీలురైన హిందూ ఆధ్యాత్మిక వేత్తలు, రాజకీయ నాయకులు అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలకు సంపూర్ణ న్యాయం చేయడానికి నిరంతరం పట్టువిడువకుండా కృషి చేస్తూ రావడం. ఈ హిందూ సాంఘిక సంస్కర్తల కృషి ఫలితంగానే ఇప్పుడు ఎవరూ, కనీసం మేధో స్థాయిలోనైనా, అస్పృశ్యతను సమర్థించడం లేదు. ఈ నేపథ్యంలోనే దళితులకు రిజర్వేషన్ల సదుపాయం రాజ్యాంగబద్ధంగా సమకూర్చడం సుసాధ్యమయింది.
మన రాజ్యాంగ సభలో అగ్రవర్ణాల హిందువులే అత్యధికంగా ఉండేవారు. దళితులకు చారిత్రకంగా జరుగుతూ వస్తోన్న అన్యాయాన్ని సంపూర్ణంగా రూపుమాపాలని వారందరూ సంకల్పించారు. ఆ మేరకు దళితులకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించారు. పది సంవత్సరాలపాటు మాత్రమే అమలుపరచేందుకు రిజర్వేషన్ల కాలపరిధిని మరో పదేళ్ళపాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు. అలా ఎస్సీ రిజర్వేషన్లు ప్రతి పది సంవత్సరాలకూ మరో పదేళ్ళపాటు పొడిగింపబడుతూ వస్తోన్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో, ఈ రిజర్వేషన్ల కాలపరిధి పొడిగింపునకు ప్రతిసారీ ఏకగ్రీవంగా మద్దతు లభిస్తోంది.
మహారాష్ట్రలో ఇటీవల ప్రజ్వరిల్లిన అల్లర్లు ‘భారత్‌ను ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్న ముఠా’ (బ్రేక్ ఇండియా గ్యాంగ్) పుణ్యకార్యమేనని సరిగానే అభివర్ణించడం జరిగింది. ఈ సువిశాల పుణ్యభూమిని చిన్నచిన్న దేశాలుగా చీల్చివేయడమే ఆ విద్రోహ శక్తుల లక్ష్యం. ఇందుకు తమ కుట్రలలో దళితులను వాడుకొంటున్నాయి. వాస్తవాలను వికృతీకరించి, చరిత్రను వక్రీకరించి దళితులు వెర్సెస్ అగ్రవర్ణ హిందువులు అనే విభజన భావాన్ని ఆ బాధిత వర్గాల మనస్సులలో నెలకొల్పుతున్నాయి. అదే సమయంలో ముస్లింలు, దళితులను ఒక సమైక్యకూటమిగా సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు.
సరే, రెండు వందల సంవత్సరాల క్రితం ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సైన్యాలకు మధ్య జరిగిన కోరేగాం యుద్ధ చరిత్ర ఏమిటి? 1918 జనవరి 1న కోరేగాం వద్ద కంపెనీ సేనలు మరాఠాలతో తలపడ్డాయి. బ్రిటిష్ సైన్యంలో మహర్‌లే గాక అన్ని మతాల, కులాల వారూ ఉన్నారు. అలాగే పీష్వా పదాతిదళాలలో అట్టడుగు కులాలవారితో సహా అన్ని కులాల, మతాలవారూ ఉన్నారు. మరి కోరేగాం యుద్ధం బ్రిటిష్‌వారికీ, భారతీయులకూ మధ్య జరిగిన యుద్ధంగా గాక, పీష్వాలపై మహర్‌ల యుద్ధంగా ఎందుకు ప్రచారం పొందింది? ఇందులోని కుతర్కాన్ని ఇరవయోశతాబ్దిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటనకు వర్తింపచేయండి. 1919లో సంభవించిన జలియన్‌వాలాబాగ్ ఊచకోతలకు ఎవరు బాధ్యులు? అమృత్‌సర్‌లో శాంతియుతంగా సమావేశమవుతున్న ప్రజలపై కాల్పులకు ఆదేశించినది జనరల్ డయ్యర్ కాదా? లేక అతని ఆధ్వర్యంలో ఉన్న యాభైమంది గూర్ఖా సైనికులు తమకుతాముగా కాల్పులు జరిపారా?
బ్రిటిష్ వారు రాక పూర్వం మహర్‌ల స్థాయి ఏమిటి? కష్టించి పనిచేసేవారుగానే గాకుండా సైనిక నైపుణ్యాలకు పేరు పొందిన మహర్‌లను శివాజీ, ఆయన కుమారుడు శంభాజీ తమ వేగులుగా, దుర్గ రక్షకులుగా ఉపయోగించుకున్నారు. ఔరంగజేబు ఆదేశాలపై శంభాజీని ముక్కలు ముక్కలుగా నరికి భీమానదిలో పడవేయడం జరిగింది. గణేష్ మహర్ అనే సాహసిక సైనికుడు శంభాజీ మృత దేహభాగాలను నది నుంచి బయటకు తీసి శాస్త్ర్తోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాడు.
నిజానికి కుల దురహంకార పాలకులుగా నిందపడ్డ పీష్వాల కంటే బ్రిటిష్ వలసపాలకులే ఎక్కువగా అగ్రకులపక్షపాతంతో వ్యవహరించారు. 1892లో అప్రతిష్ఠాకరమైన అశాస్త్రీయ ‘సమరోచిత జాతుల’ సిద్ధాంతం ప్రేరణతో వలస పాలకులు తమ సైన్యంలో వివిధ ‘సామాజిక వర్గాల సైనిక పటాలాల’ (క్లాస్ రెజిమెంట్స్) ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అయితే భారత్ లో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను సుస్థిరం చేసిన 1818 కోరేగాం యుద్ధంలో తమకు నిర్ణయాత్మక విజయాన్ని సాధించిన మహర్‌లను సైన్యంలో చేర్చుకోవడానికి యోగ్యులు కాని వారుగా పరిగణించారు. 1914లో ప్రథమ ప్రపంచయుద్ధం ప్రారంభమయినప్పుడు సైనికుల కొరత మూలంగా మహర్‌లను సైన్యంలో చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిన తక్షణమే వారిని సైన్యం నుంచి తొలగించారు.
మహర్‌లను వలసపాలకులు మళ్ళీ సైన్యంలో చేర్చుకొనేలా చేసేందుకు 1927లో బాబాసాహెబ్ అంబేడ్కర్ పలు ప్రయత్నాలు చేశారు. అంబేడ్కర్ ప్రయత్నాలకు వీర్ సావర్కార్ మద్దతునిచ్చారు. రత్నగిరిలో మహర్‌ల సమావేశానికి సావర్కార్‌ను ఆహ్వానించారు. ఆ సమావేశానికి ఆయనే అధ్యక్షత వహించారు. అశాస్త్రీయ ‘సమరోచిత జాతుల’ సిద్ధాంతానికి వ్యతిరేకంగా హిందూ మహాసభ నాయకుడు డాక్టర్ మూంజే కూడా తీవ్రంగా పోరాడారు. ఈయన కూడా అంబేడ్కర్‌కు సన్నిహితుడే. 1931లో, సైనిక దళాల భారతీయీకరణపై షెట్వోడ్ కమిటీ ముందు డాక్టర్ మూంజే మాట్లాడుతూ ‘సమరోచిత జాతులు, సమరోచితంకాని జాతులు’ అనే వర్గీకరణ పూర్తిగా కట్టుకథలపై ఆధారపడినదని విమర్శించారు.
1949 నవంబర్ 25న రాజ్యాంగసభలో డాక్టర్ అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో ఇలా అన్నారు: ‘‘భారతదేశం గతంలో తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయిందన్న యథార్థం గాక, తన సొంత ప్రజలలోనే కొంత మంది నమ్మక ద్రోహులు, విశ్వాసఘాతకుల వల్లే స్వాతంత్ర్యాన్ని కోల్పోయిందన్న వాస్తవం నన్ను చాలా వ్యాకులపరుస్తుంది. సింధ్‌పై మొహమ్మద్ బిన్ కాశీం దండయాత్రకు వచ్చినప్పుడు సింధ్ రాజ్య సైనికాధికారులు కొందరు కాశీం ఇచ్చిన ముడుపులకు ప్రలోభ పడి తమ రాజు తరఫున యుద్ధం చేయడానికి నిరాకరించారు. హిందువుల విముక్తికై శివాజీ మొక్కవోని దీక్షతో పోరాడుతున్నప్పుడు మరాఠా పెద్దలు, రాజపుత్ర రాజులు మొగల్ చక్రవర్తుల తరఫున పోరాడారు. సిక్కు రాజ్యాన్ని కూల్చివేసేందుకు బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రాజ్య ప్రధాన సైనికాధికారి గులాబ్ సింగ్ మౌన ప్రేక్షకుడుగా ఉండిపోయి, సిక్కు రాజ్య రక్షణకు ఏమాత్రం తోడ్పడలేదు. 1857లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నప్పుడు సిక్కులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. చరిత్ర పునరావృతమవుతుందా? ఈ ఆలోచన నాకు ఆందోళన కల్గిస్తూ ఉన్నది. కులాలు, తెగల రూపంలో ఉన్న మన పాత శత్రువులతో పాటు వివిధమైన పరస్పర విరుద్ధ రాజకీయతత్వాలతో కూడిన అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాము. స్వతంత్ర భారతీయులు తమ తత్వాలకు అతీతంగా దేశానికి ప్రాధాన్యమిస్తారా? లేక దేశానికి అతీతంగా తమ మత విశ్వాసాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తారా? నాకు తెలియదు. అయితే ఒక్కటి మాత్రం నిశ్చితంగా చెప్పగలను. రాజకీయ పార్టీలు దేశానికి కంటే తమ విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తే మన స్వాతంత్ర్యం రెండోసారి ప్రమాదంలో పడుతుంది. బహుశా శాశ్వతంగా స్వాతంత్ర్యాన్ని కోల్పోయే ముప్పు ఉన్నది. ఇటువంటి పరిస్థితి దాపురించకుండా దేశాన్ని మనం కాపాడుకోవాలి. దృఢసంకల్పంతో, మన చివరి రక్తపు బొట్టువరకు స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకోవాలి.’’
అంబేడ్కర్ పేరిట సామాజిక సామరస్యానికి వాటిల్లేలా ఉపద్రవాలను సృష్టిస్తున్నవారు బాబా సాహెబ్ హితోక్తులకు ఎలా స్పందిస్తారు?
-బల్బీర్ పుంజ్ , వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు - ఆంధ్రజ్యోతి సౌజన్యం తో
__విశ్వ సంవాద కేంద్రము