జలియన్‌ వాలాభాగ్‌ కాల్పుల దురంతం జరిగిన రోజు (ఏప్రిల్‌ 13) - The Jallianwala Bagh massacre

Vishwa Bhaarath
0
జలియన్‌ వాలాభాగ్‌ కాల్పుల నరమేధం
జలియన్‌ వాలాభాగ్‌ కాల్పుల నరమేధం
భారతదేశ చరిత్రలో నెత్తుటి పేజీ. బలవంతుని రక్త పిపాస తీరిన ప్రాంతం. భీకర స్వాతంత్య్ర పోరాటంలో 12 వందల మందిని ఒకేసారి బలిగొన్న విషాద ఘట్టం. నరహంతకుడి రుధిర కాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ ఘట్టానికి నూరేళ్లు. జలియన్‌ వాలాభాగ్‌ బ్లడ్‌ స్టోరీకి వందేళ్లు. పంచనదుల పంజాబ్‌లో రక్తపు టేరులు పారి శతాబ్ది అయింది. ప్రశాంతమైన నేలలో భయంకరమైన స్థితికి కారణమేంటి ? సైనిక కవాతు, తుపాకీ గుళ్ల వర్షంతో ఆ ప్రాంతం ఎందుకు మార్మోగింది ?

1919 ఏప్రిల్‌ నెల రెండోవారం. అంతకు ముందే బ్రిటీష్‌ ప్రభుత్వం తెచ్చిన రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మహాత్మాగాంధీ పిలుపుతో జనం ఎక్కడికక్కడ హర్తాళ్లు తీస్తున్నారు. పిల్లా పెద్దా కదం తొక్కుతున్నారు. పంజాబ్‌లో ఉద్యమానికి సర్ఫొద్దీన్‌ బిచ్లు, సత్యపాల్‌ సారథ్యం వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేస్తున్న బ్రిటీష్‌ సైన్యం వారిని జైలుకు పంపింది.
   నాయకుల విడుదలకు డిమాండ్‌ చేస్తూ అమృత్‌సర్‌లో ఉద్యమం మరింత తీవ్రమైంది. అప్పుడే పంజాబీయుల కొత్తసంవత్సరాది. అంతకు రెండు రోజుల క్రితమే ఏప్రిల్‌ 11న జనరల్‌ డయ్యర్‌కు అమృత్‌సర్‌ సైనిక పటాలాల బాధ్యత అప్పగించారు. పంజాబ్‌ అధికారాలు చూస్తున్న మైకేల్‌ ఓ డయ్యర్‌ నుంచి అమృత్‌సర్‌ పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు జనరల్‌ డయ్యర్‌.
   అమృత్‌సర్‌ వచ్చిన మరునాడే ఎలాంటి సభలూ జరపొద్దంటూ పట్టణంలో తిరుగుతూ ప్రకటన చేశాడు. పోలీసులు మాత్రం ఎలాంటి నిషేధాజ్ఞలు జారీ చేయలేదు. సభ విషయం అధికారులకు తెలుసు. అయినా జరుపొద్దని ఏ అధికారీ నిర్వాహకులకు చెప్పలేదు. సాధారణ హెచ్చరికే అనుకున్నారంతా. పైగా కొత్త అధికారి. దీంతో శాంతియుత నిరసనలు ఆపేది లేదని స్థానికులు తీర్మానించారు. పట్టణంలో ఓ పక్కగా ఉండే జలియన్‌ వాలాభాగ్‌ను సమావేశానికి వేదికగా ఎంచుకున్నారు. అది పేరుకే తోట గాని ఓ మైదానంలా ఉంటుంది. మూడు వైపులా ఎత్తైన రెండంతస్థుల భవన సముదాయం.
Jallianwala Bagh massacre
Jallianwala Bagh massacre
మధ్యాహ్నం 3 గంటలకల్లా 20వేలమందికి పైగా అక్కడ సమావేశమయ్యారు. ప్రధాన గేటు పక్కన ఏర్పాటు చేసిన చిన్న వేదికపై వక్తలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. రౌలట్‌ చట్టాన్ని ఉపసంహ రించాలి. సత్యపాల్‌, సైఫుద్దీన్‌ను విడుదలచేయాలి. ఇవే వాళ్ల డిమాండ్లు. నాలుగున్నరకు హంసరాజ్‌ ప్రసంగం మొదలైంది. ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాలతో భాగ్‌ ప్రాంగణం మార్మోగుతోంది. అంతే రాక్షసుడిలా వచ్చాడు జనరల్‌ డయ్యర్‌. వెంటవచ్చిన సైన్యం భాగ్‌ను చుట్టు ముట్టింది. ముందు వరుసలో భారతీయ సైనికులు, వెనక బ్రిటీష్‌ సైన్యం. వచ్చీ రాగానే కాల్పులకు ఆదేశాలు జారీచేశాడు. ఉద్యమకారులు లొంగిపోతామన్నారు. అంతలోనే తుపాకుల మోత. గుళ్ల వర్షం కురిసింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. తుపాకీ గుండ్లు శరీరాల్ని చిధ్రం చేశాయి. రుధిర ధార తోటంతా పారుతోంది. ప్రాణాలరచేతిలో పట్టుకుని పరుగుతీస్తూ తుపాకీ గుండ్లకు కుప్పకూలారు కొందరు. తొక్కిసలాటలో కాళ్లకింద నలిగి పదుల సంఖ్యలో పిల్లలూ, వృద్ధులూ చనిపోయారు. ప్రధాన దారితో పాటు బయట కళ్లేందుకు ఉన్న మరో ఇరుకు సందునూ సైన్యం ఆక్రమించుకుంది. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా అక్కడున్న అందర్నీ మట్టుపెట్టాలన్నది డయ్యర్‌ ప్లాన్‌. కొందరు ఎటూ వెళ్లే దిక్కు లేక అక్కడే ఉన్న బావిలో దూకారు. అలా పదినిమిషాల పాటు ఏకబిగిన 16 వందల రౌండ్ల కాల్పులు జరిపారు. పిట్టల్లా నేలరాలారంతా.

జనరల్ డయ్యర్
తుపాకులతో పాటు, లాఠీలు స్వైరవిహారం చేశాయి. సైన్యంలో బెలూచిస్థాన్‌ సైనికులు, నేపాల్‌ గూర్ఖాలున్నారు. కొందరి చేతిలో కత్తులూ ఉన్నాయి. దాదాపు పది నిమిషాల పాటు మారణ కాండ సాగింది. ఏ ఒక్కర్నీ వదలొద్దని డయ్యర్‌ పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ ఆదేశాలిచ్చాడు. సైనికుల్నీ తిట్టసాగాడు. దీంతో గుంపుల్లోకి చొచ్చుకెళ్లి విచక్షణా రహితంగా కాల్చారు సైనికులు. మరికొందరు కత్తులతో వందలాది మంది తలల్ని తెగనరికారు. తరువాత సైన్యం వెనుదిరిగింది. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గాయపడిన వాళ్లను పట్టించుకునే దిక్కులేదక్కడ.
  ఆ మారణ కాండలో 379 మంది చనిపోయారని అంతకుముందు మూడు రెట్లు అంటే 1137 మంది చనిపోయారని ప్రభుత్వం పేర్కొన్నా మృతుల సంఖ్య 1200, క్షతగాత్రులు 2 వేలని తేలింది. గుక్కెడు నీళ్లు దొరక్క రక్తపు మడుగులోనే విలవిల్లాడుతూ ప్రాణం వదిలారు. వైద్యసాయం అందక తరువాత కూడా చనిపోయిన వాళ్లెందరో. ఈ అమానుష ఘటనను, హేయమైన రాక్షసకాండను చాలా రోజుల పాటు పంజాబ్‌ ప్రభుత్వం తొక్కిపెట్టింది.
  జలియన్‌ వాలా భాగ్‌ దురంతం తెలిసి యావత్‌ జాతి నివ్వెరపోయింది. ఉద్యమనాయకుల ఒత్తిడితో హంటర్‌ కమిషన్‌ వేసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. తలలు తెగి రక్తం ఏరులైన స్థితి, హాహాకారాలతో జనం పరుగు, కళ్లముందే బుల్లెట్ల గుళ్లకు వందలాది మంది బలైన పరిస్థితిని ప్రత్యక్షసాక్షి గిరిధర్‌ లాల్‌ వివరిస్తుంటే కమిషన్‌ సభ్యులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
  ఇంత చేసిన నరహంతకుడు డయ్యర్‌ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు తప్ప ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు. అంతటి భయంకర పని ఎలా చేశావని హంటర్‌ అడిగితే అది భయంకరం కాదు, నేను భయంకర ధర్మాన్ని నిర్వర్తించాల్సివచ్చిందని నిర్లజ్జగా చెప్పాడు. వాళ్లని చెదరగొట్టి వదిలేస్తే నాది తెలివి తక్కువపని అయ్యేది. మళ్లీ అలాగే చేసేవాళ్లు. అందుకే అందర్నీ మట్టుపెట్టాలనుకున్నానని చెప్పాడు. మందుగుండు సామాగ్రి అయిపోయింది కాబట్టి 16 వందల రౌండ్లే కాల్పులు జరపాల్సి వచ్చిందనీ సరిపడా మందుగుండు ఉంటే ఏ ఒక్కరూ మిగిలేవారు కాదని తన కసాయితనం బయట పెట్టుకున్నాడు. అంతేకాదు సాయుధశకటం లోపలికి తీసుకెళ్లే వీలులేదు. లేదంటే మెషిన్‌ గన్లతో ఒక్కర్నీ వదలకుండా చంపేసేవాడి నంటూ రాక్షసత్వాన్ని బయటపెట్టుకున్నాడు.

ఈ రాక్షస కాండకు మూలకారకుడు డయ్యరే అయినా నాటి పంజాబ్‌ గవర్నర్‌ సర్‌ మైకేల్‌–ఓ– డయ్యర్‌ ప్రధాన పాత్ర పోషించాడు. మైఖేల్‌ డయ్యర్‌ పాత్రను నిర్థారిస్తూ 1969లో ఆధారాలతో ఓ పరిశోధనా పత్రం సమర్పించింది పంజాబ్‌ యూనివర్సిటీ. 600 మంది సాక్షులిచ్చిన వివరాలతో కూడిన నివేదిక అది.
   అసంఖ్యాక ఆంగ్లేయులు సైతం డయ్యర్‌ చర్యను ఖండించారు. అయితే ఆ దుర్మార్గుడిని సమర్థించిన వారూ ఉన్నారు. బ్రిటీష్‌ ప్రభువుల సభ అతని చర్యను సమర్థించింది. సామ్రాజ్యవాదులు అతను చేసింది ఘనకార్యమంటూ 20వేల పౌండ్ల నిధి పోగు చేసి ఇచ్చారు. డిఫెండర్‌ ఆఫ్‌ ది బ్రిటీష్‌ అనే బిరుదుతో సత్కరించారు. ఆ తరువాత ఆఫ్ఘాన్‌ యుద్ధంలో డయ్యర్‌కు పదోన్నతి ఇచ్చారు. తరువాత ఇద్దరు డయ్యర్లను ఇంగ్లండ్‌ పంపించేశారు బ్రిటీష్‌ పాలకులు. ఇంతటి ఘాతుకానికి పాల్పడి వందలాది అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న డయ్యర్‌ అనారోగ్యంతో చనిపోయాడు. కాళ్లూ, చేతులూ చచ్చుపడిపోయి, మాట కూడా పడిపోయి నరకం చూశాడు. 1927లో 62 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయాడు. ‘ఆ రోజు నేను చేసింది సరైందా ? కాదా ? అని దేవుడిని అడిగేందుకు నా మరణం కోసం నిరీక్షిస్తున్నానని’ డయ్యర్‌ అన్నట్టు ‘ది బుచర్‌ ఆఫ్‌ అమత్‌సర్‌ – జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌’ అనే తన గ్రంథంలో రాశాడు నిగెల్‌ కొలెట్‌.

పంజాబ్‌ ప్రభుత్వ కుట్రతో డయ్యర్‌ సాగించిన దమనకాండతో భారతజాతి రగిలిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. విశ్వకవి రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ బ్రిటీష్‌ ప్రభుత్వం ఇచ్చిన సర్‌ నైట్‌హుడ్‌ బిరుదును త్యజిస్తూ వైస్రాయ్‌కి లేఖ రాశారు. వందలాది ఉద్యమకారుల ఊపిరి తీసిన జలియన్‌ వాలాభాగ్‌ ఉదంతం స్వాతంత్య్రోద్యమానికి కొత్త ఊపిరినిచ్చింది. ఆ ఘటనే భగత్‌సింగ్‌ లాంటి ఎందరినో యోధుల్ని చేసింది. నాటి దారుణమారణ కాండలో మరో సాక్షి ఉదమ్‌సింగ్‌. భాగ్‌ బ్లడ్‌ స్టోరీకి ప్రధాన పాత్రధారి మైకేల్‌ ఓ డయ్యర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మట్టుపెట్టాడు. ఈ ఘటన తరువాత ప్రభుత్వ హింస కాస్త తగ్గిందనే చెప్పవచ్చు.
  స్వాతంత్య్రానంతరం 1961 ఏప్రిల్‌ 13న జలియన్‌ వాలాభాగ్‌లో ఓ స్మారక స్థూపాన్ని భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పటికీ పార్క్‌ ఆవరణ లోని కట్టడాల గోడలపై ఉన్న బుల్లెట్‌ గుర్తులు నాటి రాక్షస కాండకు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఓ మహాకవి అన్నట్టు నరహంతకులు తామర్లేన్‌, చంఘీస్‌ ఖాన్‌లతో తులతూగగల డయ్యర్‌ రాక్షసత్వం కరాళ నత్యం చేసిన ప్రదేశం జలియన్‌ వాలాభాగ్‌.
   అలాంటి డయ్యర్‌తో భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ను పోల్చాడు డాక్టర్‌ పార్థ చటర్జీ. డయ్యర్‌ ఉన్మాదక్రీడకు బలైపోయిన భారతీయ వీరులతో పాక్‌ ఉగ్రవాదులను పోల్చడం మతిలేనితనమే. అప్పటి మన శత్రువులు బ్రిటీష్‌ వాళ్లైతే. ఇప్పుడు చటర్జీ లాంటి వాళ్లు విద్వేషాన్ని రగిలించడమే పనిగా పెట్టుకోవడం బాధాకరం.

– దేవిక - జాగృతి సౌజన్యం తో {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top