30కి.మీ. దూరం.. తలరాతల్ని మార్చేస్తుందా? – దేశ విభజన గాయం - Desa vibhajana

30కి.మీ. దూరం.. తలరాతల్ని మార్చేస్తుందా? – దేశ విభజన గాయం - Desa vibhajana
దేశవిభజన గాయం
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా వస్తే వారికి అరవై ఏడు సంవత్సరాలు కాశ్మీర్‌లో లేకున్నా అన్ని హక్కులూ సంక్రమిస్తాయి. ఓటు హక్కు ఉంటుంది. భూమి కొనుక్కునే హక్కు ఉంటుంది. కానీ అరవై ఏడేళ్లుగా నివసిస్తున్న వారికి మాత్రం ఎలాంటి హక్కులూ లేవు. వారు అరవై ఎనిమిదేళ్లుగా ఈ దేశంలోనే ఉంటున్నారు. వారికి ఈ దేశం తప్ప మరేమీ తెలియదు. వారి పిల్లలు, పిల్లల పిల్లలకు నాలుగు తరాలు గడిచిపోయాయి. కానీ వారికి ఈ దేశపు పౌరసత్వం ఇప్పటికీ లేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిని శరణార్థులుగా పరిగణించి.

   అరవై ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు కట్టించింది. వాళ్ల ఇళ్లకు వాళ్లు మరమ్మతులు చేసుకోలేరు. అరవై ఎనిమిదేళ్ల క్రితం కట్టిన ఇళ్లకు ఒక్క ఇటుక కూడా మార్చడానికి వీల్లేదు. అ 68 ఏళ్లలో ఒక్కో కుటుంబం నాలుగైదు కుటుంబాలుగా పెరిగినా, ఆ రెండు గదుల్లో గడపాల్సిందే. కొత్త గది వేసుకునే హక్కులేదు. కొత్త ఇల్లు కట్టుకునే అధికారం లేదు. ఇలా కూడా ఉంటారా? ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యంగా ఉంది కదూ!! ఉన్నారు.
   మన దేశంలోనే అలాంటి వాళ్లు ఉన్నారు. మన దేశపు జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలోనే ఉన్నారు. వారు పాకిస్తాన్‌లోని సియాల్ కోట్ ప్రాంతంనుంచి దేశ విభజన సమయంలో ప్రాణాలరచేత పట్టుకుని జమ్మూ కశ్మీర్‌లోకి వచ్చిన శరణార్థులు. పాకిస్తాన్‌లో బతుకు దుర్భరమైపోయినప్పుడు, మతం ఆధారంగా ఎనలేని వివక్ష ఎదురైనప్పుడు నా దేశం అనుకుంటూ వారంతా భారత్‌లోకి వచ్చేశారు. వారికి దేశమంతటా ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ అరవై ఎనిమిదేళ్లుగా ఉంటున్న జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఉద్యోగం దొరకదు. వారికి దేశమంతటా అన్ని హక్కులూ ఉంటాయి. కానీ 68 ఏళ్లుగా స్థిర నివాస ఉంటున్న  జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి హక్కులూ లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే వారికి లోకసభకు ఓటేసే హక్కుంది. కానీ రాష్ట్ర అసెంబ్లీకి ఓటేసే హక్కు లేదు.
    అలాంటి వారు జమ్మూ ప్రాంతంలో రెండు లక్షల మంది ఉన్నారు. వారిని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీలు  (పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు) అని ముద్దుగా పిలుచుకుంటుంది. వారిని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం స్థానికులుగా పరిగణించదు. జమ్మూ కశ్మీర్‌లో పీఆర్‌సీ అనే పత్రం కిలో బంగారం కన్నా విలువైనది. జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనమైపోయిన రోజునాటికి స్థానికులు అని ఋజువు చేసే పత్రం ఉన్నవారిని స్థానికులుగా పరిగణిస్తారు. ఆ తరువాత వచ్చిన వారికి పీఆర్‌సీ ఉండదు. వారిని స్థానికేతరులుగానే పరిగణిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం వారికి కశ్మీర్‌లో ఆస్తి కొనుగోలు చేసే హక్కు లేదు. ఒక గజం భూమిని సేకరించుకునే అధికారం లేదు. 68 ఏళ్ల క్రితం దయతో కట్టించిన రెండు గదుల ఇళ్లే వారి నివాసం. కానీ దానిపై వారికి ఎలాంటి హక్కు లేదు.

అప్పట్లో పాకిస్తాన్ లోని సియాల్ కోట్ నుంచి పారిపోయి 5,764 కుటుంబాలు జమ్మూకి వచ్చాయి. జమ్మూలో మత ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో వారు పంజాబ్ కు పయనమయ్యారు. పంజాబ్ జమ్మూ సరిహద్దులోని లఖన్‌పూర్ దగ్గర వారిని అప్పటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఆపివేశాడు. మీకు అన్ని వసతులూ కల్పిస్తామని, స్థానికులుగా గుర్తిస్తామని వాగ్దానం చేశాడు. ఆయన మాటలు నమ్మి వారు జమ్మూలో ఉండిపోయారు. ఆ తరువాత షేక్ మాట మార్చాడు. తరువాత సర్కార్లు వారిని జమ్మూ కాశ్మీర్ స్థానికులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకుని వారికి ఎలాంటి హక్కులూ లేకుండా చేశాయి. వారికి గుడిసెల్లాంటి ఇళ్లు కట్టించాయి. కానీ వాటిపై వారికి ఎలాంటి హక్కూ లేదు.
    వారికి ఆ ఇళ్లను మరమ్మతు చేసుకునే అధికారం లేదు. ఇళ్లు కారుతున్నా, గోడలు పడిపోతున్నా వాటిలోనే ఉండాలి. వారికి స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాలుండవు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని బతకాలి. భూమి కొనుక్కునే హక్కులేదు. ఇల్లు కట్టుకునే హక్కు లేదు. నాటి 5,764 కుటుంబాలు ఇప్పుడు 25,460 కుటుంబాలయ్యాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల సంఖ్య దాదాపు రెండు లక్షలైంది. వీరు కఠువా, సాంబా, జమ్మూల్లో ఎక్కువగా నివసిస్తూంటారు. వారు భారత పౌరులు. జమ్మూ కశ్మీర్ నివాసులు. కానీ జమ్మూ కశ్మీర్ పౌరులు కారు. భారత పౌరులుగా వారు లోకసభకి ఓటేస్తారు. కానీ జమ్మూ కశ్మీర్ పౌరులు కారు కాబట్టి వారు అసెంబ్లీకి ఓటేయలేరు.
బహశః ప్రపంచంలో ఇంతటి వింత ఇంకెక్కడా ఉండదేమో? విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా వస్తే వారికి అరవై ఏడు సంవత్సరాలు కాశ్మీర్‌లో లేకున్నా అన్ని హక్కులూ సంక్రమిస్తాయి. ఓటు హక్కు ఉంటుంది. భూమి కొనుక్కునే హక్కు ఉంటుంది. కానీ అరవై ఏడేళ్లుగా నివసిస్తున్న వారికి మాత్రం ఎలాంటి హక్కులూ లేవు. ఎందుకంటే వారి వద్ద పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ లేదు. ఇది ఒకప్పుడు తెలంగాణలో నిజాం హయాంలో ఉండే ముల్కీ వంటిది. ముల్కీని సుప్రీం కోర్టు కొట్టేసింది. కానీ జమ్మూకాశ్మీర్‌లో పీఆర్‌సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా విషాదం ఏమిటంటే జమ్మూ కాశ్మీరులో సర్కారు పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం పంజాబ్ నుంచి వచ్చిన వారికి జమ్మూలో భూములు కొనుక్కునేందుకు అనుమతిస్తోంది. కానీ ఈ హక్కులేవీ పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు వర్తించవు. ఆఖరికి బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులకు పౌరసత్వం లభిస్తోంది.

రోహింగియాలకు కూడా సర్వ హక్కులు సంక్రమిస్తున్నాయి. వారికి కశ్మీర్‌తో ఎలాంటి సంబంధమూ లేకున్నా వారికి పీఆర్‌సీలు ఎలా లభిస్తున్నాయో తెలియడం లేదు. కానీ సియాల్ కోట్ నుంచి వచ్చిన వెస్ట్ పాకిస్తాన్ రిఫ్యూజీలకు మాత్రం ఏమీ దక్కడం లేదు. సియాల్ కోట్ నుంచి చాలా మంది జమ్మూకి షేఖ్ అబ్దుల్లా మాటను నమ్మి వచ్చేశారు. ఒక కుటుంబం మాత్రం నమ్మలేదు. ఆ కుటుంబం పంజాబ్ రాష్ట్రంలోకి వెళ్లింది. వారికి మిగతా పౌరులకు లభించే సర్వ హక్కులు లభించాయి. ఆ కుటుంబంలో ఒక తెలివైన కుర్రాడు ఉండేవాడు. అతడు చదువుల్లో చురుకు. పరీక్షల్లో మెరిక. ఆగకుండా చదువుకుంటూ పోయాడు. ఆర్థిక శాస్త్రంలో అద్భుత ప్రతిభ చూపించాడు. ముందు ముందుకు దూసుకుపోయాడు. ప్రపంచ బ్యాంకుకు సలహాదారుడిగా పనిచేశాడు. రిజర్వు బ్యాంకులో అత్యున్నత స్థాయిలో ఉండేవాడు.
    ఉన్నట్టుండి ఒక రోజు ఆయన దేశానికి ఆర్థిక మంత్రి అయ్యారు. ఆ తరువాత కొంత కాలానికి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన పేరు మన్మోహన్ సింగ్!! మన్మోహన్ సింగ్ పూర్వికులు పంజాబ్‌కి రాకుండా జమ్మూలో ఆగిపోయి ఉంటే ఏమై ఉండేవారు? కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న రెండు గదుల ఇంట్లో ఆరేడు కుటుంబాలతో కలిసి ఆరుబయటే అన్నీ చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, కూలివాడిగా మిగిలి ఉండేవాడు. జీవితంలో ఎమ్మెల్యే పదవికి ఓటు వేసి ఉండేవాడు కాదు. ఇంకా తమాషా ఏమిటంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు మనోడే కదా అని జమ్మూలో దుర్భర శరణార్థి జీవితం గడిపే వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ అడిగారు. తక్షణం వచ్చేసింది. ప్రధాని వారితో తన సియాల్ కోట్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఎవరెవరు ఏయే ఊరి నుంచి వచ్చారో, ఇప్పుడేమేం చేస్తున్నారో సవివరంగా అడిగి తెలుసుకున్నారు. టీలు, బిస్కట్లు ఇచ్చారు. వెస్ట్ పాకిస్తాన్ రిఫ్యూజీలు సంతోష పడిపోయారు. ఆయన ముందు జమ్మూలో తమ కష్టాల కథలను వెళ్ల బోసుకున్నారు. ఆర్టికట్ 370 వల్ల తామెలా నష్టపోతున్నదీ వివరించారు. ఆ తరువాత ఏం జరిగింది? మన్మోహన్ సింగ్ మౌనమోహన్ సింగ్ అయిపోయారు!! తమవాడు అంతటి వాడైనా వారికి వరిగిందేమీ లేదు.. ఆనాడు పంజాబ్ దాకా రాకుండా జమ్మూలోనే ఆగిపోయిన తమ పూర్వీకులను తిట్టుకుంటూ వెస్ట్ పాకిస్తాన్ రిఫ్యూ జీలు తమ కూలుతున్న, కారుతున్న రెండు గదుల ఇళ్లకి నిరాశగా వెళ్లిపోయారు. చూశారా..? 30-40 కి.మీ దూరం నుదుటి రాతల్ని ఎంతగా మార్చేస్తుందో..!!

– కె. రాకా సుధాకరరావు,
సీనియర్ జర్నలిస్టు, జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్వి - విజయక్రాంతి సౌజన్యం తో
__విశ్వ సంవాద కేంద్రము {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top