అగ్నికణం "వీర సావర్కర్‌" : ఈ రోజు ఆయన పుట్టినరోజు. హైందవజాతి గర్వించదగ్గరోజు - Veer Savarkar‌

Vishwa Bhaarath
అగ్నికణం వీర సావర్కర్
అగ్నికణం వీర సావర్కర్
– క్రాంతి దేవ్‌ మిత్ర
ఈ రోజు ఆయన పుట్టినరోజు.  హైందవజాతి గర్వించదగ్గరోజ. సావర్కర్ ను ఒక హిందూ వాదిగా మాత్రమే ముద్రవేశారు.  ఏ సిద్దాంతాలకోసం ఆయన ఆజీవన పర్యంతం పోరాడాడో అవిషయాలు మాత్రం వెల్లడించరు.  సావర్కర్ గారు ఓ గొప్ప మేధావి, గొప్ప ఉపన్యాసకుడు,  పోరాట విధానాలను ఔపోసన పట్టిన వాడు. ఆంగ్లేయుల చెప్పులు నాకి అధికారం సంపాదించుకున్న వారి దేశభక్తికి సావర్కర్ గారి దేశభక్తికి పోలికే లేదు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌.

దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.
   1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ వారు భారత్‌ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.

దేశం కోసమే జీవితం
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. సావర్కర్‌ అన్న గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌, తమ్ముడు నారాయణ రావు సావర్కర్‌. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.
   ఆనాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్‌ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం ‘రాష్ట్ర భక్త సమూహ్‌, మిత్ర మేళా, అభినవ భారత్‌’ అనే సంస్థలను స్థాపించారు.
   పుణే పెర్గ్యుసన్‌ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ‘బార్‌-ఎట్‌-లా’ చదువు కోసం 1906లో లండన్‌ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్‌ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.

సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్‌ సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్‌ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్‌ ఎట్‌ లా పట్టా నిరాకరించారు. సావర్కర్‌ కుడి భుజం మదన్‌లాల్‌ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్‌ విల్లేని హతమార్చాడు. గణేష్‌ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్‌ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్‌ నుంచి లండన్‌ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.
   వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్‌. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్‌. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్‌ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.
   జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్‌ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్‌ ప్రభుత్వం వీర సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.

సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం
సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్‌ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్‌. సావర్కర్‌ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్‌. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.
   1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్‌. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్‌. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

హిందుత్వం, జాతీయ వాదం
హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్‌.
‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’
‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది.
   హిందువనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్‌. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్‌. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు. అంతేకాని ‘ఏ మతం ప్రత్యేక జాతి కాదు’ అని చెప్పారు సావర్కర్‌.
    హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సాంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్‌. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్‌. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందుచూపుతో గ్రహించారు సావర్కర్‌. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్‌. సావర్కర్‌ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పు పట్టిన వారంతా, తర్వాత కాలంలో ఆయన దూరదష్టిని అభినందించారు.
   1938 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

చరిత్రకారుడు, సాహితీవేత్తగా..
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంధాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సష్టి చేశారు సావర్కర్‌.
  సావర్కర్‌ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్‌ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్‌. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంధాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారత్‌ లోని తన అన్న గణేష్‌ సావర్కర్‌కు పంపగా, బ్రిటిష్‌ వారు పసిగట్టారు. ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.
   సావర్కర్‌ అండమాన్‌ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకూ బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్‌, మహాసాగర్‌ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి. 1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంధ రచనకు పూనుకున్నారు సావర్కర్‌. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.
   సావర్కర్‌ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్‌ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో సావర్కర్‌ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా. అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాల్లో కనిపిస్తాయి.

స్వదేశీ ప్రభుత్వ నిర్దయం
సావర్కర్‌ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.

వీర సావర్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు :
 • – 1883 మే 28 – మహరాష్ట్ర నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి 10 గంటలకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జననం
 • – 1892 – తల్లి రాధాబాయి మరణం
 • – 1898 – దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కుల దేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన
 • – 1899 సెప్టెంబర్‌ – తండ్రి దామోదర్‌ పంత్‌ మరణం, ‘రాష్ట్రభక్త సమూహ్‌’ రహస్య సంస్థ ప్రారంభం
 • – 1900 – ‘మిత్రమేళా’ అనే రహస్య సంస్థ ప్రారంభం
 • – 1901 మార్చి – యమునా బాయితో వివాహం’
 • – 1902 – పూణే ఫెర్గ్యూసన్‌ కాలేజీలో చేరిక
 • – 1904 మే – ‘మిత్ర మేళా’ పేరు ‘అభినవ్‌ భారత్‌’ గా మార్పు
 • – 1905 డిసెంబర్‌ – బిఎ ఉత్తీర్ణత
 • – 1906 జూన్‌ 9 – ‘బార్‌ ఎట్‌ లా’ చదువు కోసం ఇంగ్లాడ్‌ చేరిక
 • – 1908 మార్చి – ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రచన
 • – 1909 – సావర్కర్‌ కుమారుడు ప్రభాకర్‌ మరణం, అన్న గణేష్‌ సావర్కర్‌కు అండమాన్‌ జైలు శిక్ష. బ్రిటిష్‌ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్‌కు బార్‌-ఎట్‌-లా డిగ్రీ నిరాకరణ.
 • – 1909 – లండన్‌లో కర్జన్‌ వైలీని హతమార్చిన సావర్కర్‌ అనుచరుడు మదన్‌లాల్‌ ధింగ్రా
 • – 1910 మార్చి 13 – లండన్‌ రైల్వే స్టేషన్‌లో సావర్కర్‌ అరెస్టు
 • – 1910 జూలై 18 – స్టీమర్‌లో భారత్‌ తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం
 • – 1910 డిసెంబర్‌ 24 – సావర్కర్‌కు అండమాన్‌ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జనవరి 31 – సావర్కర్‌కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జూలై 4 – అండమాన్‌ కారాగార శిక్ష ప్రారంభం
 • – 1918 – సావర్కర్‌కు తీవ్ర అనారోగ్యం
 • – 1922 – ‘హిందుత్వ’ గ్రంధ రచన
 • – 1923 డిసెంబర్‌ – ఎరవాడ జైలుకు సావర్కర్‌ బదిలీ
 • – 1924 – రాజకీయాల్లో పాల్గొనరాదు, రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్‌ విడుదల
 • – 1924 – ‘గోమంతక్‌’ గ్రంథ రచన
 • – 1925 – కుమార్తె ప్రభ జననం, అస్పశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం
 • – 1927 – రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం, అండమాన్‌ అనుభవాలపై పుస్తక రచన
 • – 1931 ఫిబ్రవరి – రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం
 • – 1937 – సావర్కర్‌పై ఆంక్షల ఎత్తివేత, పూర్తిస్థాయి విడుదల.. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక
 • – 1938 అక్టోబర్‌ – హైదరాబాద్‌ విముక్తి సత్యాగ్రహం
 • – 1943 – సావర్కర్‌ షష్టిపూర్తి
 • – 1945 మార్చి – సావర్కర్‌ అన్న గణేష్‌ సావర్కర్‌ మరణం
 • – 1946 ఏప్రిల్‌ – సావర్కర్‌ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత
 • – 1948 ఫిబ్రవరి 5 – గాంధీ హత్య కేసులో అరెస్టు
 • – 1949 మే 10 – నిర్దోషిగా విడుదల
 • – 1949 అక్టోబర్‌ – తమ్ముడు నారాయణరావు మరణం
 • – 1958 – సావర్కర్‌కు 75 ఏళ్ల సందర్భంగా అమతోత్సవం
 • – 1959 – పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్‌
 • – 1963 – ‘భారతీయ ఇతిహాస్‌ కే ఛే స్వర్ణిమ పష్ట్‌’ పుస్తక ప్రచురణ
 • – 1963 మే – సావర్కర్‌ భార్య యమునాబాయి మరణం
 • – 1966 ఫిబ్రవరి 26 – వీర సావర్కర్‌ శాశ్వత నిష్క్రమణ

వీరసావర్కర్ గురించి తెలిపే చరిత్ర చిత్రాలు -Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top