సనాతన దీప్తి జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి - Jagadguru Shankaracharya Jayendra Saraswati

సనాతన దీప్తి జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి - Jagadguru Shankaracharya Jayendra Saraswati
జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి
కంచి కామకోటి పీఠం వరిష్ఠ ధర్మాచార్యుడు 'జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామి' పార్థివ జీవనయాత్ర పరిసమాప్తం కావడం సనాతన సాంస్కృతిక ప్రస్థాన క్రమంలో ప్రస్ఫుటించిన మరో చారిత్రక ఘటన! సనాతనమైన- శాశ్వతమైన- ఈ ధర్మాచార్యుని ఆత్మ పంచభూతాల కలయికతో ఏర్పడిన శరీరాన్ని పరిత్యజించడం అనివార్యమైన పరిణామ క్రమం! ఈ క్రమం సృష్టిగతమైన పునరావృత్తి! సూర్యుని ఉదయం వలె అస్తమయం వలె ఋతుచక్రం వలె యుగచక్రం వలె అనంతకోటి ‘కల్పాల’ చరిత్ర వలె…! అందువల్ల జయేంద్ర సరస్వతి స్వామి పార్థివ రూపం కనుమరుగవుతున్నప్పటికీ, వారి తేజోరూపం నిరంతరం ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది. 
  ఈ సనాతన సాంస్కృతిక తేజం కేవలం ఈ శంకరాచార్యుని ఎనబయి ఏళ్ల పార్థివ జీవన విభూతికి పరిమితం కాలేదు. ఈ తేజం కలియుగం 2620- శుభ సిద్ధార్థ-వ సంవత్సరం- క్రీస్తునకు పూర్వం 482వ సంవత్సరం-లో కంచి దివ్యక్షేత్రంలో వెలసిన ‘కామకోటి పీఠం’తో ముడివడి ఉంది, కలియుగం 2593- శుభనందన- క్రీస్తునకు పూర్వం 509-వ సంవత్సరంలో జన్మించిన ఆదిశంకరాచార్యునిలో ప్రస్ఫుటించింది. 
    ఆదిశంకరాచార్యునికి పూర్వం అనాదిగా కొనసాగుతున్న జగద్గురువుల పరంపరలో నిహితమై ఉంది. ఈ ఆచార్య పరంపర కలియుగంలో ఆదిగురువైన వేదవ్యాసుని నాటిది, సృష్ట్యాదిలో శ్రీమన్నారాయణునితో మొదలైనది, సదాశివునితో ఆరంభమైనది! ఈ సనాతన ధర్మతేజానికి, వేద సంస్కృతికి, హైందవ జాతీయతకు, భారతీయ సంస్కార సమాహారానికి ఎనబయి రెండేళ్లు పార్థివ జీవన రూపం జయేంద్రుడు.. మరో వివేకానందుడు! ఆదిశంకరాచార్యుడు కంచి కామకోటి పీఠం జగద్గురువులలో మొదటివాడు, ‘నడిచే దేవుడి’గా వినుతికెక్కిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అరవై ఎనిమిదవ అధిపతి. ప్రస్తుతం కలియుగంలో ఏబయి రెండవ శతాబ్ది నడుస్తోంది, 5119వ సంవత్సరం నడుస్తోంది.. కలియుగం ఏబయి ఒకటవ శతాబ్దిలో జీవించిన వారందరిలోనూ అగ్రగణ్యుడైన శ్రేష్ఠుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. ఆ మహనీయునికి- ‘రామకృష్ణ పరమహంసకు వివేకానందుని’ వలె - ధార్మిక వారసుడు అరవై తొమ్మిదవ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి! ఇదీ ‘కామకోటి’ జగద్గురువుల పరంపర! అందువల్ల ఆచార్యుల పార్థివ శరీర పరంపరకు ఉదయం, అస్తమయం సహజం… వారు ప్రసాదించిన, ప్రసారం చేయనున్న సంస్కారపర శాశ్వతం… అంటే తుది, మొదలు లేని సనాతనం.. ఈ సనాతన తత్త్వానికి ఈ సంస్కార పరంపరకు ఉదయం లేదు, అస్తమయం లేదు! ప్రలయ కల్పంలో దృశ్యమానం కాని ఈ సంస్కార సమష్టి ఉదయ కల్పంలో ప్రస్ఫుటించడం విశ్వవ్యవస్థలోని నిహితమై ఉన్న పునరావృత్తి! జయేంద్రుని ద్వారా ఈ సంస్కార సమష్టి ప్రసరించింది. ఇదీ సనాతన తత్త్వం, ఇదీ భారతీయ ధర్మం…
   జయేంద్రుని పరివ్రాజక ప్రస్థానం అధ్యాత్మ శిఖరారోహణకు పరిమితం కాలేదు, సమున్నత ఆధ్యాత్మిక శృంగాల నుంచి ధార్మిక స్రవంతిగా మారి జలజల దూకింది, భరతభూమి నలుచెరగులా సాంస్కృతిక మహా ప్రవాహం వలె పరుగులు తీసింది. జన హృదయ సీమలను పండించింది. వివేకానంద స్వామి హిమాలయాలకు వెళ్లి ‘ఏకాంత ఆశ్రమం’లో తపస్సు చేసుకోవాలని భావించాడు, కాని భరతమాత నిరంతరం ఆయన పరివ్రజనం చేయాలని, దేశమంతటా పరిభ్రమించాలని నిర్దేశించింది. వివేకానంద స్వయంగా చెప్పిన వాస్తవమిది. వివేకానందుడు నిరంతరం తిరిగాడు, భరతభూమి నలు చెరగులా నడయాడాడు. ఈ ‘పరిక్రమ’ లక్ష్యం ప్రజలను విశ్వాసవంతులను చేయడం. ఈ విజయ విశ్వాసం జయేంద్ర స్వామి ద్వారా మరోసారి పునరావృత్తమైంది! ‘యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ తత్ ఏవ ఇతరోజనాః’- శ్రేష్ఠుడు ఆచరించిన దానిని ఇతరులు ఆచరిస్తారు- అన్న జగద్గురువు యదుకుల కృష్ణుని బోధనకు మరో సమాచరణం జయేంద్ర స్వామి జీవితం…అందువల్లనే జయేంద్ర స్వామి కంచిపీఠంలో అదృశ్యమై తలకావేరిలో సాక్షాత్కరించాడు. ఆ తర్వాత కావేరి ప్రవాహం వలె దిగివచ్చాడు. దేశమంతటా తిరిగి జనకల్యాణం కోసం వందలాది ప్రకల్పాలను ఆరంభించాడు, అమలు జరిపించాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, జీర్ణ దేవాలయ పునరుద్ధరణ- ఇలా వివిధ జీవన రంగాలలో దారిద్య్ర నిర్మూలనకు, నరుల రూపంలోని నారాయణుని సేవ చేయడానికి దేశమంతటా పరిక్రమించిన పరివ్రాజకుడు జయేంద్రుడు.
     వివేకానంద స్వామి చూపిన బాట ఇది. ఈ బాటలోనే పరమాచార్యుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నిరంతరం భారత భ్రమణ చేశాడు. ఈ భ్రమణం భరతమాత చుట్టూ ప్రదక్షిణం.. ‘న మాతుః పరదైవతమ్’- తల్లిని మించిన దేవత లేదు - అన్న సనాతన సత్యాన్ని వివేకానంద స్వామి, చంద్రశేఖరేంద్ర మహాస్వామి, నిరంతర భ్రమణం ద్వారా నిరూపించారు… జయేంద్ర స్వామి ఆ బాటలో మరింత ముందుకు నడిచాడు, మరింత ముందుకు నడిపాడు! ‘విశ్వహిందూ పరిషత్’ వంటి సాంస్కృతిక సంస్థలకు దిశానిర్దేశం చేశాడు! ‘సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే’- శ్రేష్ఠుడు ప్రమాణంగా స్వీకరించిన దానిని ఇతరులు కూడ ప్రమాణంగా స్వీకరిస్తారు- అన్న ద్వాపరం నాటి జగద్గురువు నిర్ధారణకు ఈనాటి జగద్గురువు జీవితం మరో ఉదాహరణ! పరివ్రాజకుడు- అని అంటే తిరిగేవాడు. అందువల్ల సంన్యస్థ ధర్మాచార్యుడు నిరంతరం ఒకేచోట ఉండడు. ‘తరుతల వాసం కరతల భోజనం’- చెట్టునీడలో నివసించడం, అరచేతిలో భిక్షను స్వీకరించి భుజించడం- ఈ పరివ్రాజక స్వభావం! ఆదిశంకరాచార్యుడు, వివేకానందుడు, జయేంద్రుడు.. పరివ్రాట్ యోగయుక్తశ్చ…

ఆదిశంకరునిపై సైతం దాడులు చేయడానికి దుర్మార్గులు జంకలేదు. ఇది రెండువేల అయిదువందల ఏళ్ల పూర్వం నాటి స్థితి! వివేకానందుడు సైతం మ్లేచ్ఛుల ఆగడాలను అధిగమించవలసి వచ్చింది. ఇది వంద ముప్పయి ఏళ్ల నాటి కథ. జయేంద్ర మహాస్వామి కూడ ధర్మద్రోహులైన ప్రభుత్వ నిర్వాహకులతో పోరాడవలసి వచ్చింది. ఇది పదునాలుగేళ్ల నాటి వ్యథ. తమిళనాడు ప్రభుత్వం జయేంద్ర స్వామిపై అన్యాయంగా హత్యా అభియోగాన్ని బనాయించింది. ఆయనను, అనుయాయులను నిర్బంధించింది! కాని నిజం నిప్పులాగ జ్వలించింది. న్యాయస్థానాలలో నిగ్గు తేలింది. ధర్మాగ్ని పునీతులైన జయేంద్ర స్వామి, డెబ్బయ్యవ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సనాతన తేజంతో వెలగడం చరిత్ర! జయేంద్ర స్ఫూర్తి విజయేంద్ర స్వామికి నిరంతర దీప్తి, సనాతన ధర్మబద్ధులకు సాంస్కృతిక ప్రదీప్తి..

(ఆంధ్రభూమి సౌజన్యం తో) - విశ్వ సంవాద కేంద్రము {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top