దివికేగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ క్షేత్ర సీనియర్ కార్యకర్తలు - Rashtriya Swayamsevak Sangh Kshetra senior activists died in 2020

Vishwa Bhaarath
మధ్య కాలంలో కొంత మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు అలాగే వివిధ క్షేత్ర సీనియర్ కార్యకర్తలు కొందరు స్వర్గస్తులయ్యారు. వారందరూ ఆజన్మాంతమూ భరతమాత సేవకు అంకితమైనవారే. సంఘ కార్యం పట్ల వారి అంకిత భావం, వారి స్నేహ శీలత, కార్య శైలి, ఆదర్శ జీవనం సంఘ కార్యంలో నిమగ్నులైన కార్యకర్తలందరికీ ప్రేరణదాయకం. ఈ మధ్య కాలంలో శివైక్యం చెందిన అలాంటి మహానుభావులను కొందరిని స్మరించుకుందాం.

శ్రీ మాదన గురుబ్రహ్మయ్య గారు (89 సం||) :
నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త శ్రీ మాదన గురుబ్రహ్మయ్య 18/8/2020 మంగళవారం నాడు స్వర్గస్తులయ్యారు. శ్రీ గురుబ్రహ్మయ్య 1950 వ దశకంలో శ్రీ E.C రామ్మూర్తి గారి ద్వారా సంఘ సంపర్కంలోకి వచ్చారు. వీరు నెల్లూరు విభాగ్ లోని స్వయంసేవకులందరికీ సుపరిచితులు. 12/1/1931 న జన్మించిన శ్రీ గురుబ్రహ్మయ్య  ఆజన్మాంతం సంఘ ఆదర్శాన్ని పాటించారు. సంఘంలో వివిధ బాధ్యతలలో పని చేసిన శ్రీ గురుబ్రహ్మయ్య అనంతరం భారతీయ జనసంఘ్ లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ కోట మండల అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. గూడలి గ్రామ సర్పంచ్ గా సుదీర్ఘ కాలం సేవలందించారు. ఏ బాధ్యతనైనా త్రికరణ శుద్ధిగా స్వీకరించి యదాశక్తి పని చేసేవారు. 1960వ సంవత్సరం నుంచి జాగృతి పత్రిక పాఠకులు వీరు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా జాగృతి చందా చెల్లిస్తూ జాగృతి పత్రిక చదువుతున్నారు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సంతానం. తమ బాల్యంలో తమచేత క్రమం తప్పకుండా బాల జాగృతి శీర్షిక చదివించేవారని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సామాన్య గృహస్తుగా ఉంటూనే తన జీవితంలోని ప్రతి అడుగులో సంఘ ఆదర్శాన్ని ప్రతిఫలింపజేసిన శ్రీ గురుబ్రహ్మయ్య గారు చిరస్మరణీయులు.


శ్రీ బొమ్మిశెట్టి వీర రాఘవులు గారు (80 సం||) :
నెల్లూరు-ఆర్ఎస్ఎస్ అనగానే గుర్తుకువచ్చే నలుగురైదుగురిలో బొమ్మిశెట్టి వీర రాఘవులుగారొకరు. శ్రీ రాఘవులు గారు 25/8/2020 మంగళవారం నాడు అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. తన వ్యాపారము, కుటుంబం సంఘంద్వారా సమాజసేవ చేయడానికే ఉన్నవని నమ్మినవాడాయన. వారు నెల్లూరు నగర సంఘచాలక్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. కేశవ స్మారక సమితి సభ్యులుగా కూడా వారు బాధ్యతలు నిర్వర్తించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కొద్దికాలం క్రితం వారి పెద్ద కోడలు స్వర్గస్తులయ్యారు. కుటుంబంలో తనకంటే చిన్నవాళ్ళు ముందే వెళ్ళిపోవటం ఆయనను క్రుంగదీసినా, సంఘంపై శ్రద్ధగాని, నిష్ఠగానీ ఏమాత్రం బలహీన పడలేదు. ఎనిమిది దశాబ్దాల నెల్లూరు సంఘచరిత్రలోని ఎన్నో అనుభవాలకు సాక్షి శ్రీ రాఘవులు గారు.

శ్రీ S.R.K.K.V.K.N రాజా బహద్దూర్ గారు (87సం||) :
విశాఖపట్నానికి చెందిన శ్రీ S.R.K.K.V.K.N రాజా బహద్దూర్ గారు 25/8/2020 న స్వర్గస్తులయ్యారు. వీరు నాగపూర్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో వీరికి సంఘ పరిచయమైంది. అనంతరం వీరు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు. ఆ సమయంలో కూడా వారు సంఘ కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉండేవారు. పదవీ విరమణ అనంతరం శ్రీ బహద్దూర్ విశాఖలో నివాసం ఉండేవారు. విశాఖ మహానగర్ లోని సీతమ్మ ధార నగర సంఘచాలక్ గా వారు బాధ్యత నిర్వర్తించారు. సహచర కార్యకర్తలతో ఎంతో ఆప్యాయంగా మసలేవారు. స్వర్గీయ సోమయ్య గారు, స్వర్గీయ చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, స్వర్గీయ దెందుకూరి శివప్రసాద్ గారు వంటి మహామహులెందరితోనో కలసి పని చేశారు. ప్రస్తుత సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారితో కూడా వారికి సన్నిహిత సంబంధాలున్నాయి. వీరు 1995 వ సంవత్సరంలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. సంఘ కార్యం పట్ల శ్రీ రాజా బహద్దూర్ గారికున్న నిబద్ధత, నిష్ఠ మనకందరికీ సదా ఆదర్శనీయం, ఆచరణీయం.

శ్రీ సూరపనేని బాపయ్య గారు (78 సం||) :
విజయవాడలో గతంలో రామలింగేశ్వర నగర్ సంఘచాలక్ గా, అనేక మంది కార్యకర్తలకు ఆప్తులుగా, అనేక మంది ప్రచారకులకు శ్రేయోభిలాషిగా ఉన్న మన శ్రీ సూరపనేని బాపయ్య గారు ఆగస్టు 26 ఉదయం 10గం. లకు  స్వర్గస్థులైనారు. శ్రీ బాపయ్య గారు గత 3నెలలుగా బ్రెయిన్ కాన్సర్ కారణంగా ఇబ్బంది పడ్డారు.

శ్రీ బాపయ్య గారికి సంఘ పరిచయం ఆశ్చర్యకరం. 1965 లో విజయవాడ జనసంఘ్ సభలు జరిగాయి. రాజకీయ స్పృహ వారికి ఎక్కువ. సభలకు ఒక పౌరునిగా హాజరయ్యారు. అక్కడే జాగృతి వార పత్రిక చూశారు. అప్పటి నుండీ జాగృతి పత్రికను కొని నియమితంగా చదివేవారు. BJP ఏర్పడిన తరువాత మిత్రుల ద్వారా బి.జే.పి.లో చేరారు. 90 వ దశకంలో విజయవాడ కమిటీల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 3, 4 దఫాలు పనిచేశారు. వీరికి రాజకీయ స్పృహ ఉన్నా రాజకీయ కార్యకర్తలకు ఉండే అధికార వ్యామోహం, ప్రచారం పట్ల మోజు వారికి ఉండేవి కావు. ఈ ప్రత్యేకత చూసి వీరి సేవలు సంఘ్ విస్తరణకు మరింత ఉపయోగం అని భావించి వీరికి సంఘంలో బాధ్యత ఇవ్వడం జరిగింది. కార్యకర్తల పట్ల,ప్రచారకులు పట్ల ఆత్మీయతతో వ్యవహరించడం వీరి ప్రత్యేకత. వీరిది రైతు నేపథ్యం.

ప్రపంచ చరిత్ర మీద మంచి పట్టు వున్న జ్యేష్ఠ స్వయం సేవక్ వారు. ప్రచారక్ కావచ్చు, విద్యార్థి కావచ్చు, గృహస్థు కావచ్చు, ప్రతీ కార్యకర్తకీ, అనేక మంది కార్యకర్త కుటుంబాలకు మార్గదర్శి అయి అనేకరకాల విషయాలు, అనుభవాలు పంచుకొని ఆత్మీయంగా ఉండే శ్రీ బాపయ్య గారు మన మధ్య నుండి వీడిపోవడం చాలా బాధాకరమైన విషయం.

__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top