ఒకే ప్రజ ఒకే జాతి ఒకే జాతీయ పతాకం - Pingali Venkaiah, who created the great national flag

The Hindu Portal
0
Pingali Venkaiah, who created the great national flag
 Pingali Venkaiah, who created the great national flag 

" స్వాతంత్య్ర జాతికిది చక్కని వెలుగు
జాతి పేరు జగాన స్థాపించగలుగు "
       (గురజాడ రాఘవశర్మ)
  స్వేచ్చకీ, జాతి గౌరవానికీ, చరిత్రకూ ప్రతీక మన జాతీయ పతాకం. శాంతి సౌభ్రాత్రాలు పరిఢవిల్లడానికీ, ఒక జాతి ఐక్యంగా, బలీయశక్తిగా అవతరించడానికీ ఒకే ప్రజ ఒకే జాతి అన్న భావనతో పాటు ఉండవలసిన మరొక లక్షణం, ఒకే పతాకం. భారత జాతీయ పతాకం కింద రెండున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పోరాటం సాగింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత ప్రస్థానం సాగినది కూడా ఆ పతాకం నీడలోనే. ఇంత మహాత్తర నేపథ్యం ఉన్న మన ఘన జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు మన తెలుగువాడు " పింగళి వెంకయ్య ".
    ప్రతి జాతికి ఒక ప్రత్యేక సంస్కృతి, దానికి అనుగుణంగా ప్రత్యేక జెండా ఉంటాయి. ఆ జెండా రెపరెపల్లో ఆ జాతి పుట్టుపుర్వోత్తరాలు వ్యక్తమవుతాయి. జాతి సమగ్ర స్వరూపానికీ, జాతీయ సమైక్యతకూ జెండా ఒక చిహ్నం. జాతి, వర్ణ, కుల, మతాతీత ధ్యేయానికి ప్రతీక పతాక. అజ్ఞానాంధకారంలో దారి కానక అలమటించేవారి చేతి కరదీపిక. వీర యోధగణానికి నిటారైన వెన్నెముక. స్వేచ్చాకాశంలో కాంతులు విరజిమ్మే సుధా చంద్రిక పతాక. స్వాతంత్య్ర పోరాటానికి ముందు భారతదేశంలో సాంస్కృతిక ఏకత్వానికి దక్కిన ప్రాధాన్యం రాజకీయ ఏకత్వానికి దక్కలేదన్నది ఒక చేదు వాస్తవం. సమీప గతాన్ని చూసినా ఇది అర్ధమవుతుంది. దేశం మీద బ్రిటిష్ జెండా ఎగిరింది. ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క పతాకం ఉండేది. భారతీయులకు జాతీయవాదం పట్ల, స్వదేశీ పట్ల ఒక కొత్త దృక్కోణాన్ని అందించిన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమమే మనదైన ఒక పతాకం గురించి కూడా ఆలోచింప చేసింది. దాని ఫలితమే 'వందేమాతరం' జెండా. మేడం భికాజీ కామా ఈ జెండాను (భారత స్వాతంత్య్ర సమర పతాకం) జర్మనీలోని స్టట్గార్ట్ లో జరిగిన  అంతర్జాతీయ సోషలిస్ట్స దస్సులో ఆగస్ట్ 22, 1907న ప్రదర్శించారు. ఇందులోనూ మూడు రంగులే ఉన్నాయి. అవి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు పైన ఉన్న ఆకుపచ్చ రంగులో ఎనిమిది తెల్లకలువలను చిత్రించారు. సూర్యచంద్రుల బొమ్మలు కూడా చిత్రించారు. వినాయక్ దామోదర్ సావర్కర్, విప్లవ నాయకుడు శ్యాంజీ కృష్ణవర్మ ఈ జెండా రూపకల్పనలో ఉన్నారు. అప్పుడున్న ఎనిమిది ప్రావిన్సులకు అవి ప్రతీకలు. దేవనాగరి లిపిలో మధ్య (పసపు వర్ణం మీద) వందేమాతరం అని రాయించారు. దీని కంటే కాస్త ముందు అంటే 1904లో స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత కూడా ఒక జెండాను రూపొందించారు. ఆగస్ట్ 7, 1906న కలకత్తాలోని పార్సీ బగాన్ కూడలిలో శచీంద్ర ప్రసాద్ బోస్ అనే యోధుడు ఒక జెండా ఎగురవేశాడు. దానికి కలకత్తా పతాకం అని పేరు. 

   ఆ తరువాత పదేళ్లకు పింగళి వెంకయ్య జెండా రూపకల్పనకు నడుం కట్టారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశాలకు హాజరై నాయకులందరితో జాతీయ పతాక రూపకల్పన గురించి ఆయన చర్చించేవారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదులు ఇచ్చిన విరాళాలతో 1916లో జాతీయ పతాకాల నమూనాలతో 'భారతదేశానికి ఒక జాతీయ పతాకం' పేరుతో ఒక పుస్తకమే విడుదల చేశారు. ఆ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.యన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాయడం గర్వకారణం. ఒకటి రెండు కాదు, ముప్పయ్ రకాల పతాకాల నమూనాలను సిద్దం చేశారు. సరిగ్గా అదే సమయంలో హెూంరూల్ లీగ్ ఉద్యమం మొదలయింది. అందుకోసం బాలగంగాధర తిలక్, అనిబిసెంట్ కూడా ఒక పతాకం తయారు చేయించారు. కోయంబత్తూరు కోర్టు న్యాయమూర్తి ఒకరు దీనిని వెంటనే నిషేధించారు. చిత్రంగా దీని మీద ఒక మూల బ్రిటిష్ పతాకానికి కూడా హెూంరూల్ నేతలు చోటిచ్చారు. 1920 నాటి భారతీయులకు ఒక పతాకం ఉండవలసిన అవసరం వచ్చింది. అందుకు కారణం నానాజాతి సమితితో జరిపే చర్చలు.

భారత జాతీయ జండాల చరిత్ర !

బెజవాడలో అంకురార్పణ :
    మార్చి 31, 1921న విజయవాడలో జాతీయ జెండా నిర్మాణానికి సంబంధించి కీలకమైన అడుగు పడింది. విక్టోరియా మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే వెంకయ్యకు జెండా బాధ్యత అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులలో రాట్నం ఉండేవిధంగా రూపొందించమని సలహా కూడా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలోనే తన గురువు ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో వెంకయ్య జెండాను రూపొందించి గాంధీకి అప్పగించారని ఇటీవల ఒక పత్రిక ప్రచురించింది. ఏప్రిల్లో గాంధీ యంగ్ ఇండియాలో జెండా అవసరం గురించి చెప్పారు. జెండా మధ్య అశోక చక్రం ఉండవలసిన అవసరం గురించి పంజాబ్ కు చెందిన లాలా హన్స్ రాజ్ సూచించారు. కానీ గాంధీజీ రాట్నం జెండా మధ్యలో ఉండాలని భావించారు.

జెండా ఉద్యమం :
   జాతీయ జెండా సత్యాగ్ర హెూద్యమాలు  స్వాతంత్య్ర సాధనా సోపానాలయ్యాయి. మే 1 1923న నాగపూర్ లో జెండా సత్యాగ్రహెూద్యమం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది స్త్రీ పురుషులు స్వచ్ఛందంగా సత్యాగ్రహిూద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి తొలిసారిగా సుభద్రాదేవి అనే మహిళ పాల్గొన్నారు. కోటీశ్వరుడు జమ్నాలాల్ బజాజ్ ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి రూ.30,000/- జరిమానా విధించింది. ఆయన కారు వేలం పాట పెడితే కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు కథియవాడ్లో అతి తక్కువ ధరకు అమ్మి జరిమానాకు జమ చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ఉద్యమాన్ని అఖిల భారత ఉద్యమంగా మలిచి విజయవంతం చేశారు.
   ఉద్యమం విజయవంతం కావడంతో జెండాకొక పవిత్రత, సార్వజనీనత, గౌరవ ప్రాముఖ్యాలు ఏర్పడ్డాయి. అవే రంగులతో ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఒక పతాకాన్ని రూపొందించింది. అయితే మధ్యలో పులి గుర్తును ఉపయోగించింది. ఈ జెండాను మొదట మణిపూర్లో ఆవిష్కరించారు. రథోత్సవాల్లో, వాటంటీర్ల కవాతుల్లో, సభల్లో అన్నింటా జెండాలేని సమావేశం కాని, జెండా చేత
పట్టని స్వాతంత్య్ర యోధుడుగాని లేదంటే అతిశయోక్తి కాదు. ఈ జెండా ప్రతిష్టకై ప్రాణాలొడ్డి, లాఠీ బాధలు భరించి జరిమానాలతో నష్టపోయిన వారెందరో ఉన్నారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ పతాకం !
ఆజాద్ హింద్ ఫౌజ్ పతాకం !

రాజ్యాంగ పరిషత్ ఆమోదం :
   భారతదేశానికి ఇంగ్లండ్ స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత జూలై 14, 1947న జాతీయ జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. అప్పుడే రాట్నం స్థానంలో అంతకు ముందు నుంచి ప్రతిపాదనలో ఉన్న అశోక చక్రం వచ్చింది. ధర్మానికి ప్రతీకగా అశోక చక్రం స్వీకరించినట్టు సర్వేపలి-రాధాకృష్ణన్ చెప్పారు. ఈ పతాకాన్నే నెహ్రూ జూలై 1947న రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టి
జాతీయ పతాకంగా ఆమోదింప చేశారు. అశోక చక్రం నీలిమందు రంగులో, 24 రేఖలతో ఉంటుంది అంతిమంగా నెహ్రూ, అబుల్ కలాం అజాద్ భోగరాజు పట్టాభిసీతారామయ్య, తారాసింగ్ద త్తాత్రేయ బాలకృష్ణలతో కూడిన సంఘం సూచనల మేరకు మూడు రంగులతో, రాట్నం ఉండేలా వెంకయ్య రూపొందించారు. పట్టు, ఖాదీలతో చేసిన జెండాలను ప్రవేశపెట్టగా రెండింటిని కూడా రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

తెలుగు నాట త్రివర్ణ పతాకం, కవుల వర్ణన :
  ఏప్రిల్ 6, 1930న బందర్లో కుండ భాగంలో (కోనేటి మధ్యగల స్తంభంపై) జెండా ప్రతిష్టించేందుకు అప్పటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామీ తత్త్వానంద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గీత రచయిత గురజాడ రాఘవశర్మలను నియమించారు. వారు లాఠీ దెబ్బలతో విఫలయత్నులయ్యారు. తరువాత పహిల్వాన్ తోట నరసయ్య ప్రయత్నించారు. శరీరమంతా లారీ దెబ్బలతో రక్తసిక్తమైనా, జెండా ప్రతిష్ట పట్టుదల సడల లేదు. మరునాడు బందవ మున్సిపల్ ఛైర్మన్ శీలం జగన్నాథరావు నాయుడు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి కుండుపై తోట నరసయ్య, అయినంపూడిలో శ్రీనివాసులు అనే స్వాతంత్య్ర సమరయోధుడు జెండాలను ప్రతిష్టించారు. ఆ సందర్భంగా గురజాడ రాఘవశర్మ 'జెండా యెత్తర! జాతికి ముక్తిరా!' గీతం జెండా వీరుల్లో ఉత్తేజాన్ని నింపింది. సుంకర సత్యనారాయణ, " ఎగురవే వినువీధి / ఎగురవే జెండా / శాంతిదూతగా నేడు జాతీయ జెండా / యుగ యుగంబుల జగతి నెగురవే జెండా / సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జెండా / గగనాన ధ్రువతార కరణి నిల్చెదవు ఎగురవే జెండా " అనే గీతంలో జాతీయ జెండాను శాంతిదూతగా, సౌఖ్య ప్రదాతగా వర్ణించడం జెండా పట్ల పవిత్రతనం, గౌరవాన్ని ప్రజల్లో రేకెత్తించింది.
   బసవరాజు అప్పారావు, 'పతాకోత్సవము సేయండి' అనే గీతం స్వాతంత్య్రభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది. వానమాయలై వరదాచార్యులు రచించిన "అదిగోమన జయధ్వజం / అదిగదిగో భద్రగజము / నవయుగ సోదర ప్రజలు పొండి ఎత్తండి' - అనే గీతంతో స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో యువకులు పరవళ్లు తొక్కారు. జాతీయ జెండాను జాతీయ సమైక్యతకు మారురూపంగా, నూరు కోట్ల కరములొకటిగా రూపొందిన వృక్షంగా, పలు మతాల స్వేచ్ఛా భావపటాన్ని ఎగురవేసే పతాకను' 'శ్రీ భారతి జనయిత్రీ శీర్షమకుట మణిస్రజంగా' గొప్పగా కీర్తించాడు.

  స్వాతంత్య్ర ప్రకటన అనంతరం 1947 ఆగస్టు 5వ తేదీన గౌతమీ కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి జాతీయ జెండా ఔనత్యాన్ని ప్రశంసిస్తూ "పవిత్ర భారత సవిత్రి కోహో / స్వతంత్రోత్సవం సాగింది లాల్ ఖిల్లాపై అశోకచక్రపు / త్రివర్ణ కేతనం ఎగిరింది కులమతాలకు అతీతంగా / ప్రజల్ ద్వేష రోషాలను విస్మరించి / స్వతంత్ర భారత జయ పతాకకు మొక్కండి” - అంటూ జాతీయ 'పతాక' పవిత్రతను స్వాతంత్య్ర సాధనకు హేతువన్న భావనతో స్వతంత్ర భారత జయపతాకకు మొక్కమనడం పతాకంపట్ల గౌరవాన్ని సూచిస్తుంది.

రచన: డా|| పి.వి. సుబ్బారావు
9849177594
రిటైర్డ్ ప్రొఫెసర్ & తెలుగు శాఖాధిపతి
సి.ఆర్. కళాశాల, గుంటూరు

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top