సంఘం (ఆర్ఎస్ఎస్) ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థ - RSS: A social and cultural organization

The Hindu Portal
0
సంఘం (ఆర్ఎస్ఎస్) ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థ - RSS:  A social and cultural organization

: సంఘం ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థ :
    అన్నం ఉడుకుతున్నప్పుడు పాత్రలోపలినుండి బయటకు వచ్చే ఆవిరి పాత్రపైనున్న మూతను కదిలిస్తూ ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే చెట్టునుండి తెగిపడిన పండు భూమివైపుగా ప్రయాణిస్తుండడాన్నీ చూస్తున్నారు. అయినా ఆవిరికిగల శక్తిని బండ్లను నడిపించడానికి, యంత్రాలను పనిచేయించడానికి, అలాగే భూమికిగల ఆకర్షణ శక్తినికూడా ఒక శక్తివనరుగా ఉపయోగించడానికి వినియోగించుకోవచ్చుననే ఆలోచన ఎవరికీ రాలేదు. అందరూ చుూసిచూడకుండా వదిలేసే విషయాలను చైతన్యవంతులైన వ్యక్తులు పట్టించుకొని, వాటిగురించి ఆలోచించి కార్యకారణాలను విశ్లేషించుకొని మానవాళికి ఉపయోగపడగల నూతన ఆవిష్కరణలను సాధిస్తారు. అటువంటి చైతన్యం ఉన్న వ్యక్తులు తమదేశ చరిత్రలో కీలకమైన మార్పులకు
కారకులవుతారు. 
సుమారుగా సంవత్సరాల క్రిందట ఒకవ్యక్తిలో స్పురించిన ఇటువంటి ఒక ఆలోచనయే ఈనాడు యావత్ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సేవాసంస్థగా పేర్కొనబడుతున్న " రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ " ప్రారంభానికి దారితీసింది. 
యావత్ ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛందసేవాసంస్థ - సామాజిక సాంస్కృతిక సంస్థ ఆర్.ఎస్.ఎస్. అని తెలిసినా, ప్రత్యక్షంగా లేదా అతి సన్నిహితులైన వ్యక్తుల ద్వారా పరోక్షంగానైనా - సంబంధం ఏర్పడనివారికి సంఘాన్నిగురించి సరైన అవగాహన కల్గటం లేదు. కొందరికైతే - ఎవరెవరో చెప్పినమాటలు విన్న ఫలితంగా కావచ్చు, ఆ సంస్థ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడియుండటమూ కద్దు. దీనికి రెండురకాల కారణాలున్నాయి: 
  1. మొదటిది ఆర్.ఎస్.ఎస్. కార్యవిధానంలో వ్యక్తులమధ్య అత్మీయ సంబంధాలు నెలకొల్పుకొని ఒకరినుండి మరొకరు ప్రేరితులయ్యే పద్ధతికి ప్రాధాన్యం ఉండటం, 
  2. రెండవది సంఘ కార్యకలాపాలు అందరినీ కలుపుకొని సాగేవే అయినా సంఘంలో ఉన్నవారి మధ్యఉన్న సన్నిహితమైన, ఆత్మీయమైన సంబంధాలు వ్యతిరేకులైన వారిని ఎవరినో దెబ్బతీయటం కోసమేనన్న అభిప్రాయానికి దారితీస్తుండటం. 
ఈ రెండు రకాల కారణాలు కలగలసి మనస్సుపై ఏర్పడిన ముద్రలతో అనేకమంది వ్యక్తులు ఇక
విధమైన గందరగోళంలో పడుతున్నారు. ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొని, సంఘకార్యకర్తల సరళిని దగ్గరగా చూసి, ఆర్. ఎస్.ఎస్. చెప్పే విషయాలను, వివిధ అంశాలపై ఆ సంస్థ కనబరిచే వైఖరినీ స్వయంగా గమనించినప్పుడు వారిలో తలెత్తిన సందేహాలు, వారిని ఆవరించిన గందరగోళాలు మంచులా విడిపోతాయి.

    అనేకమందికి సంఘం గురించి ఏమీ తెలియకపోవడం, కొంతమంది సంఘాన్ని గురించి సరిగా తెలుసుకోలేక గందరగోళానికి గురవుతూ ఉండటం - ఈ స్థితిని గమనించి గతంలో మూడు సందర్భాలలో ఊరూరా ఇంటింటికీ వెళ్ళి సంఘాన్ని వివరించి చెప్పే కార్యక్రమాలను సంఘం చేపట్టింది. మొదటి సందర్భం - సంఘం స్థాపించి 60 సంవత్సరాలైన పూర్తయినప్పుడు 1985లో. రెండవది - సంఘస్థాపకులైన డా||కేశవరావ్ బలీరామ్ హెడగెవారు శతజయంత్యుత్సవాల సందర్భం. మూడవది సంఘం స్థాపించి 75సంవత్సరాలు పూర్తయినపుడు. ఈ మూడు సందర్భాలలో సంఘాన్ని ఎందుకు స్థాపించారు, సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పటివరకూ దేశానికి, సమాజానికీ సంఘంవల్ల ఒనగూడిన ప్రయోజనాలు ఎలాంటివి - ఇలాంటి విషయాలు వివరించే కరపత్రాలు, చిన్న పుస్తకాలు తీసికొని ఊరూరా, వాడవాడలా తిరిగి, ప్రజానీకాన్ని కలిసి తెలియచెప్పే ప్రయత్నం జరిగింది. ఫలితంగా చాలామందికి సంఘాన్ని గురించి తెలిసికొనే అవకాశం లభించింది.
   సంఘం నుండి లభించిన ప్రేరణతో.. 
  1. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, 
  2. వనవాసీ కళ్యాణ ఆశ్రమం, 
  3. భారతీయ కిసాన్ సంఘ్, 
  4. భారతీయ మజ్జూర్సంఘ్, 
  5. విద్యాభారతి,సేవాభారతి, 
  6. సంస్కారభారతి, 
  7. సంస్కృతభారతి, 
  8. భారతవికాస్ పరిషత్, 
  9. విశ్వహిందూ పరిషత్, 
  10. వివేకానంద కేంద్ర, 
  11. స్వదేశీ జాగరణ మంచ్, 
  12. భారతీయ శిక్షణ్ మండల్, 
  13. సహకారభారతి,
  14. ఆరోగ్యభారతి, 
  15. భారతీయ జనతాపార్టీ 
...వంటి సంస్థలు కూడా దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి పనిచేస్తున్నందున -  కొంతమందికి ఈ సంస్థలలో భాగమై పనిచేసే అవకాశం లభిస్తున్నది. తద్వారా దేశమాత సేవలో పనిచేసే అనుభవం కల్గుతున్నది. అంతేగాక వఱదలు, కఱవులు, భూకంపాలు, తుఫానులు, రైలుప్రమాదాలు అగ్నిప్రమాదాలు వంటివి సంభవించిన సమయాలలో ఇతర ప్రకృతి సంబంధమైన విపత్తులు సంభవించిన సమయాలలోనూ స్వయంసేవకులు ముందుకువచ్చి రక్షణ, సహాయ పునరావాస కార్యకలాపాలను నిర్వహించటం కూడా ప్రజలదృష్టికి వస్తున్నది. ఈ విధంగా ఒక సంస్థద్వారా లభించిన ప్రేరణతో ఇన్నివేలమంది, లక్షలమంది ఇంత విస్తృతంగా సేవలందిస్తూ ఉండటం గమనించినమీదట - ఇంతమందికి ప్రేరణనిచ్చిన ఆ మహాసంస్థ గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఉత్పుకత సహజంగా కలుగుతుంటాయి. అటువంటి కోరిక తీర్చేదృదష్టితోనే 'రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని' సంక్షిప్తంగా పరిచయం చేసే ఈ వ్యాసాన్ని రూపొందించటం జరుగుతున్నది.

ప్రేరణ:
    సంఘాన్ని స్థాపించిన డా|| హెడ్గేవార్ తన చిన్ననాట నుండి కూడా ఛత్రపతి శివాజీ జీవితంలోని వివిధ ఘట్టాలనుండి, ఆయన సాధించిన ఘనవిజయాల నుండి ఎంతగానో ప్రభావితుడైనాడు. అటువంటి ఘట్టాలలో ఒకటి ఇలా నడిచింది. బీజాపూర్ పాలకుడైన ఆదిల్షాహి నవాబు వద్దకు శివాజీని అతని తండ్రి షాజీ భోంస్లే వెంటబెట్టుకొని తీసికొనివెళ్ళాడు. ఆనాడు తమకందరికీ అలవాటైన విధంగా శిరసువంచి నమస్కారం చేయాలని తండ్రి కుమారునికి సూచించాడు. 'ఒక విదేశీయుని ముందు నేను తలవంచను' అంటూ బాల శివుడు తండ్రి సూచనను అమలుచేయ నిరాకరించాడు. దానినిబట్టి అతి చిన్నవయస్సు నుండే శివాజీలో ఎటువంటి స్వాభిమానపూరితమైన దేశభక్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉండేవో, మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశభక్తి భావనలే శివాజీని ఒక దీపస్తంభంగా తీర్చిదిద్ది ఆ తర్వాత వచ్చిన తరతరాల భారతీయులకు వెలుగుబాట చూపించాయి.
    19వ శతాబ్దపు చివరినాళ్ళలో జన్మించి, పెరిగిపెద్దవాడవుతున్న బాలకేశవుడు కూడా అటువంటి ధార్మిక వాతావరణంలో అడుగులువేస్తూ శివాజీ జీవితంలోని పైన పేర్కొనిన ఘట్టం నుండి, ఇతర ఘట్టాలనుండి ప్రేరణపొందినవాడై, విదేశీయుల పాలనను పెత్తనాన్ని అంగీకరించరాదనే దృఢనిశ్చయానికి వచ్చాడు. అదేసమయంలో ఒక ప్రశ్న ఎప్పుడూ ఆయన బుఱ్ఱ తినివేస్తూ ఉండేది. సాహస పరాక్రమాలకు కాణాచిగా నిలిచిన ఈ విశాలమైన భారతదేశం గుప్పెడుమంది విదేశీ దురాక్రమణకారులకు బానిస ఎందుకైంది? ఇంత అసంగతమైన విషయం ఎలా సంభవించింది? అన్నప్రశ్న నిరంతరం అతడిని వేధిస్తూ ఉండేది. ఆయనకు ఎవరిదగ్గరా, ఈ ప్రశ్నకు తగిన సమాధానం లభించేదికాదు. కాని, ఏదో ఒకనాటికి తన ప్రశ్నకు సమాధానం లభిస్తుందన్న నమ్మకంతో అతడు తన ప్రయత్నాలను కొనసాగిస్తూ వచ్చాడు. అట్టి ప్రయత్నాలలో భాగంగా అందుబాటులో ఉన్న అనేక సంస్థలలో చేరి, మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అన్వేషణ కొనసాగించాడు. హిందూసమాజం సంఘటితమైతే గాని, హిందువులందరి హృదయాలు దేశభక్తి భావనతో ఓతప్రోతమైతేగాని, ఇప్పటి ఈ దాస్యం తొలగించుకొని స్వాతంత్ర్యాన్ని సాధించుకోవటం సాధ్యం కాదని, స్వాతంత్య్రమనే భావన కలగానే మిగిలిపోతుందని చివరికి అతడికి అర్థమైంది. హిందూ సమాజంలోని రకరకాల భేదభావాలను తొలగించుకొని, అందరం ఏకం కావటమనేది జాతిహితం దృష్ట్యా తక్షణ అవసరమని ఆయన గ్రహించాడ.

బానిసతనంలో అన్నీ బాధలే :
    1947లో మనకు అంగ్లేయుల పాలననుండి స్వాతంత్య్యం లభించేవరకు, భారత దేశంలోని వివిధ ప్రాంతాలు, రాజ్యాలు తీవ్రమైన అణచివేతకు గురియౌతూ నలిగిపోతుండేవి. మనపై పెత్తనం చేస్తుండిన విదేశీయులు ఎన్నోవిధాల మనలను దోపిడీ చేస్తుండేవారు. మనలను బికారులుగా మార్చివేశారు. మతమౌధ్యంతో కన్నుమిన్ను గానక ప్రవర్తించుతూ తెరలుతెరలుగా వచ్చిపడిన ఇస్లామీ మూకలతో నిరంతరంగా యుద్ధాలు సాగించి, మనం స్వాతంత్య్యాన్ని తిరిగి సాధించుకోబోతున్న తరుణంలో, బ్రిటిషువారు తెలివిగా ఈ దేశాన్ని తమ చేతులలోకి తీసికొన్నారు. 
   బ్రిటిషువారు మనదేశంపై గట్టిగా పట్టుబిగించి మన ప్రజలను పీల్చి పిప్పిచేశారు. మహమ్మదీయుల పాలనకు బ్రిటిషువారి పాలనకు ఉన్నతేడా ఏమిటంటే... 
  • మహమ్మదీయుల పాలనలో క్రూరత్వము, అమానుష హింసాకాండలు ప్రధానాంశాలు కాగా,
  • బ్రిటిషువారు చట్టబద్ధమైన పాలన చేస్తున్నామంటూ మనదేశ ప్రజలను ఆర్థికంగా దోచుకొనేవారు. ఎటువంటి రాజకీయ హక్కులూ లేని బానిసలుగా మార్చి మనపై పెత్తనం సాగించారు. 
బ్రిటిషు పాలనను నిరసిస్తూ దేశభక్తులైన ప్రజానీకం అనేక ఉద్యమాలు నిర్వహించారు. మనదేశ ప్రజలలో జాతీయ చైతన్యం పొంగులెత్తిన ఆ రోజులను మనదేశ చరిత్రలో ఒక స్వర్ణిమ అధ్యాయంగా పేర్కొనవచ్చు. ముందునుండి ఇటువంటి జాతీయ చైతన్యం ఉండివుంటే, దేశం పరాయిపాలనలోపడి మగ్గిపోయేస్థితి సంభవించేది కాదుగదా అని అందరికీ అనిపించేది. డా హెడ్గేవారు అటువంటి దేశభక్తి పూరితమైన స్వాతంత్య్రోద్యమాల్లో పాల్గొంటూనే మనదేశానికి దాపురించిన పరాయిపాలనకు, మనప్రజల బానిసతనానికి అసలు కారణం ఏమిటనే విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ సమస్యకు పరిష్కారం గురించి కూడా ఎంతో ఆలోచిస్తూ ఉండేవారు. డా || హెడ్గేవారు యొక్క అటువంటి తీవ్రమైన ఆలోచనల మథనంలో నుండి రూపుదిద్దుకొనినదే "రాష్ట్రీయ స్వయంసేవక సంఘం". మన హిందూజాతిలోనూ, సమాజంలోనూ మనమందరమూ ఒకటేనన్న భావన, మనమందరమూ సోదరులమనే భావన లోపించిన కారణంగానే మనం పతనాన్ని చవిచూడవలసి వచ్చిందని డా || హెడ్గేవారు నిర్ధారణకు వచ్చారు.

మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న :
    1. డా || హెడ్గేవారు తాను పాల్గొనిన అన్ని సభలలోనూ, సమావేశాలలోను ఒకప్రశ్న అడుగుతూ ఉండేవారు. ఎన్నెన్నో సద్దుణాలకు కాణాచిగా ఉన్న, ఎంతో గొప్పదైన, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన మనదేశం మళ్ళీ మళ్ళీ పరాయిపాలనలో పడుతూ ఉండడానికి కారణమేమిటి? ఈ ప్రశ్న శ్రోతలను కలవరపరుస్తూ ఉండేది. ప్రశ్నను విపులీకరిస్తూ ఆయన కొన్ని విషయాలను వారిముందుంచేవారు. మనదేశంలో బుద్ధిబలానికి దేహబలానికి గాని, సిరిసంపదలకు గాని, ధర్మానికిగాని, సంస్కృతికి గాని, జ్ఞానవిజ్ఞానాలకు గాని కొఱత లేదుగదా! ఇవన్నీ ఉండికూడా మనం పరాయిపాలనలో పడి నలిగిపోతున్నామంటే అందుకు కారణం మనలో జాతీయభావన లోపించటమే. మనం జాతీయ చైతన్యాన్నికోల్పోయినందుననే, విదేశీయులు మనదేశీయులలోని భుజబలాన్ని, బుద్ధిబలాన్ని ఈ జాతియొక్క అర్థబలాన్ని, అంగబలాన్నీ ఈ జాతిని లొంగదీసుకొనడానికి ఉపయోగించు
కోవటంలో సఫలురైనారు.

     2. ఇది ఇట్లా ఎందుకు జరిగింది? దీనిని అర్థం చేసుకొనడానికి బృహస్పతులు దిగిరావలసిన అవసరం లేదు. మన సమాజంయొక్క విఘటితమైన స్థితి, మనలో మనకు ఏర్పడిఉన్న భేదభావాలు, అంతర్గత కలహాలు, కక్షలు, కార్పణ్యాలూ - ఇవే మన పతనానికి దారితీసాయి. విదేశీయులు మనపైకి దాడిచేసిన సందర్భాలలో - కోట్లాదిగా సాహసులూ పరాక్రమవంతులూ అయిన సైనికులను, యుద్ధవీరులను కల్గిన మన ఈ దేశం సమర్థవంతంగా ఏకోన్ముఖంగా ప్రతిఘటించి నిలువరించలేకపోయింది. మనమంతా ఒకటే, మనమందరం అన్నదమ్ములం అనే స్పృహ మన జాతిలోనూ, సమాజంలోనూ లేకుండినందున సంభవించిన దుష్పరిణామ మిది.
    బయటివారు వచ్చి మనపై దాడిచేసిన సమయాల్లో మనలో మనం ఒకరినొకరు విశ్వసించి వ్యవహరించగల్గిన స్థితి ఉండేదికాదు. అటువంటి సమయాల్లో మనం ఓటమిని చవిచూడటమేకాదు, విదేశీ దురాక్రమణకారుల చేతిలో మన జాతీయ గౌరవ చిహ్నాలైన అపూర్వ శిల్పసంపదకు కేంద్రాలైన దేవాలయాలవంటి శ్రద్దాకేంద్రాలు, అపూర్వ జ్ఞానసంపదకు నిలయాలైన గ్రంథాలయాలు, గురుకుల విద్యాలయాలు నాశనమయ్యేవి. 

    3. నిజానికి మనం ప్రపంచంలో ఎవరికీ తీసిపోయినవాళ్ళం కాదు. అయితే కాలక్రమంలో మన సాంఘిక వ్యవస్థలను పటిష్టంగా, బలిష్ఠంగా ఉంచుకోవటం పట్ల చూపవలసినంత శ్రద్ధ చూపని కారణంగాను, మన సమాజ జీవితంలోకి చొరబడుతున్న కురీతులను, అపసవ్య ధోరణులను ఎప్పటికప్పుడు సరిచేసుకొనే ప్రయత్నాలు చేయని కారణంగాను మనం బలహీనులమైనాం. మన సమాజానికి యశస్సునూ, విజయాన్ని అందించిన విశిష్ట భావసంపదను - సంగచ్చధ్వం, సంవదధ్వమ్ (మనమందరమూ కలిసి పనిచేయుదము, మనమందరమూ కలిసి ఒకే తీరున మాట్లాడెదము) అని మన వేదాలలో ఘోషింపబడిన సమైక్యభావనాస్పూర్తిని విస్మరించి - ఎవరికివారుగా ఒంటెత్తు పోకడలతో నడిచి ఘోరంగా దెబ్బతినిపోయాం. వరుసగా జరిగిన దండయాత్రలలో పరాజితులమై, విదేశీయుల, విధర్మీయుల పదఘట్టనలలో నలిగిపోయాం. ఒకరి తర్వాత ఒకరుగా ఫచ్చిన విదేశీ జాతుల పాలనలలో వారి దాష్టీకానికీ గురియౌతూ నిస్సహాయులపై నానావిధాల యాతనలు అనుభవించవలసివచ్చింది.

    4. కాబట్టి, స్వాతంత్య్రసాధనకై జరిగిన రకరకాల సంఘర్షణల, ఉద్యమాల అనుభవాలనుండి దేశపరిస్థితిగురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏర్పరచుకున్న అవగాహననుండి - దేశానికి స్వాతంత్య్యం తీసికొని రావడానికి ప్రయత్నించడం మాత్రమే సరిపోదని జాతీయ సమాజాన్ని సంఘటితపరచటమూ అనివార్యమని గ్రహించిన డా || హెడ్గేవారు స్వయంగా ఆ బాధ్యతను స్వీకరించారు. అలా చేసినప్పుడే మనదేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్న దశలో, దానిని నిలుపుకోగలిగే క్షమత గల్గినవారమౌతామని, అలా జరగని పక్షంలో స్వాతంత్య్రసాధన కొరకు చేసే ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందమౌతాయని ఆయన దృఢంగా విశ్వసించారు.

సంఘటిత శక్తి :
   ఒక సంఘటనము లేదా సంస్థకు - గుంపు లేక మూకకు మధ్య ఉండే తేడాను డా || హెడ్గేవారు స్పష్టంగా గుర్తించారు. సంఘటనం లేదా సంస్థలో వ్యవస్థీకృతమైన అంతర్గత నిర్మాణము, సమన్వయము ప్రధానాంశాలుగా ఉంటాయి. గుంపు లేదా మూకలో ఇలాంటివేమీ ఉండవు. సంఘటనంలో ఏకాత్మత, అనుశాసనమూ అనివార్యంగా ఉంటాయి. గుంపులో తామంతా ఒకటేనన్న భావం ఉండనే ఉండదు. సంఘటనం  పరస్పర సత్సంబంధాలు కల్గినదై పటిష్టంగా ఉంటుంది. అందులోని వారందరూ ఒకేవిధమైన భావావేశం కల్గినవారై ఉంటారు. పరస్పరం ప్రేమాభిమానాలు కల్గినవారై ఉంటారు. సంఘటనం చెక్కుచెదరని ఒక పెద్దరాయిలాగా ఉంటుంది. అందులోని అణువులు, కణాలూ బాగా దగ్గరగా చేర్చబడి ఉన్నందున అది బరువుగాను, దృఢంగానూ ఉంటుంది. ఆ కణాలమధ్య సంసిక్తత (అంటుకొని ఉండే గుణం) ఎంత బలంగా ఉంటుందంటే, సుత్తితో కొట్టినా, రాతిని పగలగొట్టటం సులభంగా అయ్యేపని కాదు.  కాగా ఇసుక కుప్పలో, పేరుకున్న దుమ్ములో లేనందున వాటిని సులభంగా చెల్లాచెదురు చేయవచ్చు, దులపటం ద్వారా గాలిలో కొట్టుకుపోయేలా చేయవచ్చు. (ఈ విషయం 1935లో డా॥ హెడ్గేవారు పుణేలో చేసిన ప్రసంగం నుండి స్వీకరింపబడింది).

   సంఘటిత శక్తి అవసరం ఏమిటి? అనే ప్రశ్నకు డా॥| హెడ్గేవారు ఇలా జవాబిచ్చారు. "బలహీనుడైన మనిషి బలవంతుడైన మనిషి నుండి తప్పించుకు తిరుగుతుంటాడు అతని కంటపడకుండా ఎక్కడెక్కడో దాగుతూ ఉంటాడు. అతనికి దొరికిపోయినప్పుడు ఆ బలమైన వ్యక్తికి మోకరిల్లి, అతనికి దాసునిగా ఉండడానికి అంగీకరించవలసి వస్తుంది. ఈ విధమైన పరిణామాలకు బలవంతుడిని నిందించి ప్రయోజనం లేదు. బలవంతుడికి దురుసుగా ఉండేదుకు ప్రేరణనిస్తున్నది ఎవరు? బలహీన సమాజమే వారిని ఆ విధంగా పురికొల్పుతున్నది. బలహీనంగా ఉండటమే ఒక పాపం. సమాజం బలహీనంగా ఉండక, దృఢంగా ఉండేటట్లయితే, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచాన్ని భయకంపితం చేస్తుండే యుద్దాలను, దాడులు, రక్తపాతాలవంటి ఉత్పాతాలను తప్పించగల ఒకేఒకమార్గం అన్ని సమాజాలు సంఘటితమై, బలిష్ఠంగా, పటిష్టంగా ఉండడమే”.

    "మనం రూపొందింపగోరుతున్న సంఘటనం ఇతరులపై దాడిచేయడానికో, వారి మనుగడకు భరతవాక్యం పలకడానికో, ఇతరుల సంపదలను కొల్లగొట్టి ధనవంతులం కావడానికో ఉద్దేశించినది కాదు. ఇతరులలోని అన్యాయపూరితమైన స్వభావాలకు ముగింపు పల్కటం కోసం మనం ఈ సంఘటనను రూపొందించుకోగోరుతున్నాం. ఇప్పటివరకు జరుగుతున్నదేమిటి? మనలోని బలహీనతలను గమనించి, మనలను దోచుకొనడానికి ఇతరులు ఆకర్షితులవుతున్నారు. ఎవరూ మన పై కాలుదువ్వడానికి గాని, కన్నెత్తి చూడడానికి గాని వీలులేనివిధంగా - మనం బలమైన సంఘటనను నిర్మించుకో గోరుతున్నాం. ఒక్కసారిగా వచ్చిపడే మహమ్మారి వ్యాధిలాగా మనలను చుట్టుముట్టుతున్న దండయాత్రలను నిలువరించడానికి సంఘటనం ఒక టీకామందులాగా పనిచేస్తుంది. ఇతరులు మనపై దాడి చేయనప్పుడు, మనం సమకూర్చుకొంటున్న శక్తివల్ల వారికి పచ్చే ప్రమాదమేమీ లేదు."

   అలా హిందువులను (భారతదేశాన్ని - హిందూస్థానాన్ని తమ మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించుకునేవారు హిందువులు ) ఒక ప్రభావవంతమైన సంఘటనగా తీర్చిదిద్దడమే సంఘం యొక్క ఉద్దేశ్యం. ఇది మన ధర్మాన్ని, సంస్కృతిని సమాజాన్ని సంరక్షించడానికి ఉద్దేశించినది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకొనడానికి దోహదపడుతుంది. ఈ శక్తిని దర్శించిన పిమ్మట దురాక్రమణకారుల దురుసు స్వభావానికి అడ్డుకట్ట పడుతుంది, మనపై దాడిచేయాలనే ఆలోచలనలను వారు వదులుకోవలసి వస్తుంది.

సంఘటనా కార్యమంటే ఏమిటి ? 
   భారతీయ సాంఘిక వ్యవస్థలో సమాజవ్యవస్థకు ప్రాథమిక అంశాలుగా ఉన్నవి కుటుంబాలు, కుటుంబ భావనకు మూలంగా ఉన్న అంశాలే సామాజిక వ్యవసలకూ మూలంగా ఉన్నవి. కుటుంబ భావన వృద్ధిచెంది విస్తరింపబడటం ద్వారా - సమాజం మరింతగా పటిష్టమవుతుంది. అయితే కుటుంబ భావన బలపడినపుడు మనిషి స్వార్ధపరుడై సంకుచిత మనస్కుడై, సమాజంపట్ల తన కర్తవ్యాలను విస్మరించి, తన శ్రద్ధను తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికే పరిమితం చేయటం జరుగుతుందని భావించేవారు కొందరు లేకపోలేదు.
   వాస్తవమేమిటంటే, వ్య్టి నుండి సమష్టివైపుగా జరిగే ప్రయాణంలో కుటుంబం అనేది తొలిఅడుగు. తన తొలిఅడుగునే తన గమ్యంగా భావించుకొనేటట్లయితే, ఆ వ్యక్తి యొక్క గతి ఆగిపోతుంది. గమ్యం తప్పిపోతుంది. ఈ పొరపాటును సరిదిద్ది, తన కుటుంబం బాగోగుల గురించి ఆలోచించినట్లుగానే సమాజం బాగోగులను, మానవాళి మంచిచెడ్డలను గురించికూడా ఆలోచించాలని, వాటిపట్ల శ్రద్ధ వహించాలని చెప్పి వ్యక్తిని, కుటుంబాలనూ ముందుకు నడిపించటమే సంఘటనా కార్యం.
   ఈ విషయంలో సంఘ స్థాపకులైన డా||కేశవరావ్ బలీరాం హెడ్గేవారు ఇచ్చిన వివరణ గమనార్హంగా ఉంది. తన కుటుంబాన్ని పోషించుకొనడానికి మణుగుల కొద్దీఉండే బరువును నెత్తినపెట్టుకొని మోస్తూపోయే ఒక కూలీ స్వార్ధపరుడు కానేకాడు. అతడు గనుక స్వార్ధపరుడై ఉంటే, తన పొట్ట నిండేవరకే ఆలోచించి, ఆ తర్వాత మిగిలిన సమయమంతా తన సుఖభోగాల కోసమే వినియోగించుకోవచ్చు. కాని అతడు ఆ దిశలో ఆలోచించకుండా కుటుంబంలోని ఇతర సభ్యులు వృద్ధిలోకి రావాలని, వారికోసం అహర్నిశలూ శ్రమిస్తుంటాడు. ఇది వారినుండి మెప్పుపొందటం కోసం అతడు చేయటం లేదు. వారంతా తనవారేనన్న భావనకారణంగా అతడలా శ్రమిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని స్వార్ధపరుడనో, సంకుచిత మనస్కుడనో అన్నట్లయితే అంతకుమించిన తప్పు మరొకటేమి ఉంటుంది? అతడిలో ఇతరులకొరకు త్యాగం చేసేగుణం ఉంది. మనం చేయవలసిన పని ఒక్కటే. అతనిలోని ఈ త్యాగగుణాన్ని మరింత విస్తృతం చేయటమే తన కుటుంబసభ్యులపట్ల ఉన్న మమైకభావాన్ని అక్కడికే పరిమితం చేయక సమాజంలోని సోదరులందరిపట్ల వర్తించేటట్లుగా విస్తరింపచేయాలి. 
    ఈ విధంగా అందరిలో సహజంగా ఉండే ఆరోగ్యవంతమైన సోదరభావమనే గుణాన్ని మరింతగా ప్రవర్ధమానం చేసి మన జాతీయ సమాజాన్ని బలోపేతం చేయటమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా  జరిపించాలని డా|| హెడ్గేవారు తలపెట్టారు. మనదేశంపట్ల మాతృమూర్తి పట్ల ఉండే భక్తిశ్రద్ధలను, మనతోటి ప్రజానీకంపట్ల సోదరభావాన్నీ పెంపొందింపచేసి, మనం ఎదుర్కోవలసి వచ్చే సవాళ్ళను బలంగా ఎదుర్కొనటమే సమాజ సంఘటనంలోని ప్రధానాంశం, సంఘం చేస్తున్న పని ఇదే (ఈ విషయం డా॥| హెడ్గేవారు వాషింలో చేసిన ఉపన్యాసం నుండి స్వీకరింపబడింది).

భరతమాత !
సమైక్య ప్రయత్నాలే విజయ సోపానాలు :
    డా|| హెడ్గేవారు ఇలా చెప్పారు - "ఇదేదో ఒకరికో, ఐదు-పదిమందికో, యాభై మందికో పరిమితమైన పనికాదు. ఒక వ్యక్తి తన పనిపట్ల ఎంత శ్రద్ద కల్గినవాడైనా ఎంతగా శ్రమించే వాడైనా, ఎంతటి బలశాలి అయినా, అతనికి, అతని సామర్థ్యానికి పరిమితులు ఉంటాయి. యావత్తు దేశానికి సంబంధించిన బాధ్యతలను ఒకేవ్యక్తి తన నెత్తికెత్తుకోలేడు. బరువును కొండపైకి ఎక్కించటం వంటి కష్టసంభరితమైన ఈ పనిని నెరవేర్చడానికి దేశంలో ఉన్నవారందరూ కష్టపడి పనిచేయాలి. బలహీనులైనవాళ్ళు ధర్మాన్ని రక్షించజాలరు. అందుకని సంఘం సమాజాన్ని సంఘటితపరచి, దానిని బలోపేతం చేసే కార్యాన్ని స్వీకరించింది. అందుచేత ఇది ధర్మకార్యం. దీనికి తోడుగా ఇతర లక్ష్యాలు ఏవన్నా ఉన్నా - అవి దీని తర్వాతవి మాత్రమే. (పుణే ప్రసంగం నుండి).

మళ్ళీ ఇంకో క్రొత్త సంస్థ ఎందుకు?
   సంఘాన్ని స్థాపించకముందు డా॥| హెడ్గేవారు మహారాష్ట్ర, బెంగాలులకు చెందిన విప్లవోద్యమ సంస్థలలోనూ, వైద్యవిద్య పూర్తిచేసికొని వచ్చిన తర్వాత భారత జాతీయ కాంగ్రెసు ద్వారా నడుపబడుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెసుకు ప్రాంతీయ కమిటి సహకార్యదర్శిగా బాధ్యత వహించి క్రియాశీల కార్యకర్తగా పనిచేసారు. అయన అందులోనే కొనసాగి ఉన్నట్లయితే ఆయన హోదా పదవులు ప్రభావము ఎంతగానో పెరిగియుండేవన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అటువంటి అవకాశాలన్నింటిని కాదనుకుని మరొక క్రొత్త సంస్థను ఏర్పరిచినట్లు? 

డా|| హెడ్గేవారులో ఉన్న మౌలికమైన చింతన అనే గుణమే దానికి కారణం ఆ రోజుల్లో నాయకులందరూ విదేశీదాస్యమే మన సమస్యలన్నింటికి మూలమని భావించేవారు. మనం గనుక స్వాతంత్య్రం సంపాదించినట్లయితే మన సమస్యలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయని విశ్వసించేవారు. కాగా డా॥ హెడ్గేవారు ఆలోచన వాటికి బిన్నంగా సాగింది. స్వాతంత్య్రం పొంది తీరాలన్న కాంక్ష ఆయనలో ఏ విపలవోద్యమ నాయకునితో పోల్చిచూసినా, ఏ కాంగ్రెసు నాయకునితో పోల్చిచూసినా చాలా తీవ్రంగా ఉంది. అయితే మన సమస్యలన్నింటికి పరాయిపాలనయే కారణమనటం సరైనది కాదని, మన సాంఘిక జీవనంలో చోటుచేసుకున్న బలహీనతల కారణంగా మనం పరాయి పాలనలో పడి బానిసలమైనామని, ఆ విధంగా మన సమస్యలకు మూలకారణం మన సామాజిక జీవనంలోని బలహీనతలేనని వారు వివిధ సందర్భాలలో స్పష్టం చేస్తుండేవారు.
    మనలోని బలహీనతలను తొలగించుకోకుండా, లోపాలను సరిదిద్దుకోకుండా స్వాతంత్ర్యాన్ని పొందినా, దానిని ఎంతకాలం నిలుపుకోగలమన్న ప్రశ్న ఉండనే ఉంటుందన్నారు. కాబట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని పొందడానికి ప్రయత్నంచటంతోపాటు, లభించిన స్వాతంత్ర్యాన్ని నిలుపుకోగల క్షమతను కలిగించుకొనే ప్రయత్నాలూ చేయవలసి ఉంటుందని డా|| హెడ్గేవారు దృఢంగా నమ్మారు. మన సంస్కృతిపట్ల, మన ఆదర్శాలపట్ల, జీవన మూల్యముల పట్ల ప్రజలలో అభిమానాన్ని, గర్వాన్ని రేకెత్తించి, యావత్తు దేశాన్ని ఒక సుసంఘటిత వ్యవస్థతో కట్టి ఉంచినప్పుడు మాత్రమే మనం అట్టి క్షమతను సంపాదించుకోగల్గుతామని ఆయన గ్రహించారు.

    స్వార్ధపూరితమైన ఆలోచనలు కల్గిన కొందరు వ్యక్తులు, సంస్థలూ సంఘం ముస్లింలకు వ్యతిరేకంగా ఆరంభించబడినదని చెప్తూ ఉండటం మనం వినివుండవచ్చు వారు ప్రచారం చేసే అనుమానాలకు జవాబుగా - సంఘం రెండవ సర్సంఘచాలక్ అయిన శ్రీ గురూజీ ఇలా చెప్పారు. “మహమ్మదు ప్రవక్త, ఇస్లాం ఈ భూమిపై పాదం మోపియుండకపోయినా అసంఘటితంగా ఉన్న సమాజాన్ని సంఘటితపరచటం అవసరమైనందున (సుసంఘటితమైన సమాజం ఒక అనివార్యత, ఆ దిశలో ప్రయత్నించటం కూడా ఒక అనివార్య విషయం) సంఘం నెలకొల్పబడి ఉండేది, పనిచేస్తూ ఉండది. సమాజాన్ని సంఘటితం చేయాలని సంఘం కోరుతున్నది ముస్లింలపట్ల వ్యతిరేకతతో కాదు, మన చరిత్రకు సంబంధించిన వాస్తవమేమిటంటే, శకులు, హూణులు, యవనులు, మహామ్మదీయులు, బ్రిటిషువారు సాధించిన విజయాలకు కారణం మన సమాజం తన ప్రాచీన వైభవాన్ని, ప్రాచీనకాలంలో అభ్యసించిన సంఘటితశక్తి విధానాలనూ
విస్మరించడమే.
    ఆ రోజులలో బ్రిటిషువారు విభజించి పాలించు అనే నీతిని అనుసరిస్తూ, కొన్ని ఆకర్షణలను చూపి ముస్లింలను చేరదీస్తుండేవారు. వారి ఉచ్చులో పడిన కాంగ్రెసువారు ముస్లింలకు అంతకుమించిన ఆకర్షణలను చూపుతూ వారిని తమవైపుకు లాగేందుకు ప్రయత్నించేవారు. ఇలా ముస్లింలకు ఆకర్షణ చూపటం - ఒక ముగింపులేని పోటీగా మారిపోయింది. కాంగ్రెసు ఈ ఉచ్చులోపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా, ఎటువంటి లాభాన్ని పొందలేకపోయింది. చివరికి మన మాతృభూమిని విభజించి, ముస్లింలకొరకు పాకిస్తాన్ అనే ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పరచాలనే కోరికను అంగీకరించటం వరకు పోయింది. 
    ఈ ధోరణులను ముందునుండీ పసిగట్టిన డా| హెడ్గేవారు ఈ భూమిపైకి దండెత్తి వచ్చి వశపరచుకున్నామని భావించేవారిని కాక, తమను ఈ భూమి సంతానంగా భావించుకొనే వారిని సంఘటితపరిచే మార్గాన్ని ఎంచుకున్నారు. జాతీయసమాజం సంఘటితంగా శక్తిమంతంగా ఉన్నప్పుడు ఇతర జనసముదాయాలుకూడా ఆ జాతీయ సమాజంతో కలిసి నడవడానికి ఇష్టపడతాయి. సంఘాన్ని స్థాపించడం వెనుక ఉన్న భావాత్మకమైన (Positive) దృష్టి ఇది.

ఛత్రపతి శివాజీ ఉదాహరణ :
   ఛత్రపతి శివాజీ జీవితం నుండి స్ఫూర్తి పొందాలని డాక్టర్ హెడ్గేవారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. శివాజీ ఒక పెద్ద జాగీర్దారు యొక్క కుమారుడు. తానుకూడా ముస్లిం పాలకుల కొలువులో చేరి ఉన్నట్లయితే, ఒక ఉన్నతోద్యోగాన్ని సాధించుకొని, విలాస వంతమైన జీవితం గడపగలిగేవాడు. అయితే శివాజీ ఏనాడూ అటువంటి సులభమైన విలాసమయమైన మార్గాన్ని ఎంచుకోలేదు. స్వరాజ్య సాధన కోసం కష్టాలమయమైన జీవనమార్గాన్నే ఎంచుకున్నాడు. జాతీయ స్వాభిమానమనే జ్వాల ఆయన హృదయంలో ఎల్లప్పుడూ మండుతూనే ఉండేది. ఆ కారణంగానే అతడు తనతో సంబంధంలోకి వచ్చిన వారినందరినీ తన లక్ష్యసాధనలో తనతో కలిసి పనిచేసేవారుగా మార్చుకొంటూ ఉండేవాడు. ఒక వెలుగుతున్న దీపం వేలాది దీపాలను వెలిగించగలదనే సూక్తికి నిదర్శనంగా నిలిచాడతడు.

ఒకదీపంతో మరొక దీపం వెలిగించాలి- సంస్థాగత సూత్రం :
   డా|| హెడ్గేవారు ఎటువంటి ఆర్భాటమూ లేకుండా ఒక్కొక్క వ్యక్తిని కలిసి నచ్చజెప్పే పద్దతిని అనుసరించారు. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించాలనే పద్దతిని అమలు చేశారు. ఈ పద్ధతిలోనే స్వయంసేవకుల సంఖ్య ఒకటినుండి పదికి, పదినుండి వందకు. వంద నుండి వేయికి ఇలా విస్తరించుకొంటూ ప్రగతిగాంచింది. స్వయంసేవకుల సంఖ్యలో పెరుగుదల సహజంగా శాఖల వృద్ధికి, అది మరల స్వయంసేవకుల సంఖ్యలో వృద్ధికి దారితీసింది. ఈ విధంగా సంఘం అధికాధికంగా విస్తరించుతూ వచ్చింది. సంఘ గంగ దూరతీరాలకు ప్రవహిస్తూ వచ్చింది.

విలక్షణ శైలి
   సంఘంలో వ్యక్తులను చేర్చుకొనడానికి డా|| హెడ్గేవారు అనుసరించిన పద్ధతి చాలా సులభమైనది, విలక్షణమైనది, ఒకవిధంగా ఆశ్చర్యజనకమైనది కూడా. తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పెద్దపెద్ద సభలు, సమావేశాలు ఏర్పరచి, ఉపన్యాసాలు దంచే పద్దతిని ఆయన ఎంచుకోలేదు. తన పరిచయంలోకి వచ్చినవారినందరినీ మంచి మిత్రులుగా, సన్నిహితమిత్రులుగా మార్చుకోవటమే ఆయన అనుసరించిన పద్దతి నల్గురైదుగురో, పది పదిహేనుమందో స్థిమితంగా కూర్చొనిన చిన్నచిన్న సమావేశాలలో నవ్వుతూ, చలోక్తులతో నవ్విస్తూ, ఎటువంటి భేషజమూ లేకుండా మాట్లాడుతూండేవారు. ఆ మాటలతోనే ఆయన తన అభిప్రాయాన్ని అవతలివారు అర్థంచేసుకొనేటట్లుగా వ్యవహరించేవారు. సంస్థను ఒకసారి అర్థం చేసుకున్నవారెవరూ, గతంలో వలె నిప్క్రియంగా ఉండలేకపోయేవారు. ఆ వ్యక్తి సంఘటనకు సంబంధించిన కార్యకలాపాలలో మునిగి తేలుతూ పనిచేస్తుండేవిధంగా డాక్టర్జీ వారికి పనులు అప్పగిస్తుండేవారు. అనతికాలంలోనే వారి జీవనశైలి మారిపోయేది. సంస్థను విస్తరింపజేయటమే ప్రధానాంశంగా వారికి ప్రేరణ లభించేది. డాక్టర్జీ గతించిన తర్వాతకూడా ఇదే పద్దతి సంఘకార్యపద్ధతిగా కొనసాగుతూ ఉంది. సంఘపరిధిలోకి వచ్చి తమను సంఘ అనుయాయులుగా భావించుకొనేవారందరికీ సంఘకార్యాన్ని వృద్ధిచేయటమే జీవితంలో ప్రధానాంశంగా గోచరిస్తున్నది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top