ఏరువాక పౌర్ణ‌మి - Yeruvaaka Paurnami

Vishwa Bhaarath
0
ఏరువాక పౌర్ణ‌మి  - Yeruvaaka Paurnami
: క‌ర్ష‌కుల పండుగ :
రువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తముగా ప్రారంభించడమునకు కూడా ‘ఏరువాక’ అని పేరు (అంటే వ్యవసాయ పనుల ప్రారంభం).

జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని అంటారు. బసవన్నలను నాగలికి పూన్చి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే దినము జ్యేష్ఠపూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠపూర్ణిమ నాడు ప్రథమంగా పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అనే పేరుతో కూడా జరుపుకుంటారు.

పొలంలో పంటపండి చేతికి వస్తేనే కదా మన కడుపు నిండేది! ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు. ఇక్కడి కర్షకులు దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి పుడమితల్లి. అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కిదున్నడం కర్షకునికి బాధాకరమైన విషయమే అయినా , బ‌తకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా! అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, నేలను పూజించి, ఆ నేల తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే ఈ ఏరువాక పున్నమి పండుగ.

తొలిసారిగా నాగలిని భూక్షేత్రంలో గ్రుచ్చడానికి ముందు ధరణిపూజ చేయాలనీ ఋగ్వేదం ఘోషిస్తున్నది. ఆ భూమిపూజ కూడా జ్యేష్టపౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా కర్షకులు జరుపుకుంటారు. నిజానికీ పండుగ కర్షకుల పండుగే అయినా, అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే.

పండుగ సందడి :
ఈదినం, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు. తరువాత పొలం పనులకు ఉపయోగించే కాడి – నాగలిని కడిగి రంగురంగుల పువ్వులతో అలంకరించి ఎడ్లకు నాగలికి , భూమాతకు పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఎడ్లలకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత “కాడి” నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాత కు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సర మంతా పంటలు సమృద్దిగా పండుతాయి.

కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునాఱతో చేసిన తోరణము కడతారు. కర్షకులందరూ అక్కడికి చేరి చెర్నాకోల తో ఆ తోరణమును కొట్టి ఎవరికి దొరికిన నాఱను వారు తీసుకు వెళ్లి ఆ నాఱను నాగళ్లకు, ఎద్దుల మెడలోను కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుంది.

“పొలాలనన్నీ హలాల దున్నీ”
“ఇలాతలంలో “అన్నం” పండించే”
“కర్షక బంధువులందరికీ”

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top