నిజాం అరాచకాన్ని నిల‌దీసిన బైరాన్‌ప‌ల్లి - Byron Palli, who stood up to the Nizam's tyranny

Vishwa Bhaarath
0
నిజాం అరాచకాన్ని నిల‌దీసిన బైరాన్‌ప‌ల్లి - Byron Palli, who stood up to the Nizam's tyranny

: నిజాం నిరంకుశ‌త్వాన్ని నిల‌దీసిన బైరాన్‌ప‌ల్లి :

నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని  ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు.

అలాంటి సంఘటనే నాటి నల్గొండ జిల్లాలోని భైరవునిపల్లెలో జరిగింది. ఈనాడు ఈ గ్రామం సిద్ధిపేట జిల్లాలో అంతర్భాగం. భైరవునిపల్లి ప్రజలు గ్రామ నివాసి శ్రీ ఇమ్మడి రాజిరెడ్డి  నాయకత్వంలో రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “రజాకార్లు మజాకర్లుగా తయారై యథేచ్ఛగా గ్రామాలను దోచుకునేవాళ్ళు. తగులబెట్టేవాళ్ళు చందాల పేరుతో డబ్బులు వసూలుచేసేవారు.ఇవ్వని గ్రామాలపై దాడిచేసి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు.

భైరవునిపల్లి గ్రామానికి 12 వందల రూపాయలు చందా ఇమ్మని తాఖీదు పంపారు రజాకార్లు. భైరవునిపల్లి గ్రామం చుట్టూ కోటగోడ ఉండేది. ఈ గోడకి ఎత్తయిన బురుజుండేది. సురక్షితంగా ఎత్తుగా ఉన్న ఈ బురుజు భైరవునిపల్లి గ్రామానికి ఎంతో మేలు చేసింది. ఇదే బురుజుపైన మందుగుండు సామాగ్రి వగైరా సేకరించి ఇరువది నాలుగు గంటలపాటు గ్రామస్తులలో ఇద్దరు తుపాకులు చేతబూని కాపలా కాస్తుండేవాళ్ళు.రజాకార్లు కనపడితే బురుజుపైనున్న నగారా మ్రోగించే వాళ్ళు. గ్రామస్థులు పనులు వదలి గ్రామరక్షణకు సిద్ధమయ్యేవారు.  చుట్టుప్రక్కల ఉన్న ఆరేడు గ్రామాలను కూడా ఇలాగే తయారుచేసి రక్షణ దళాలను ఏర్పరిచారు. యాభైమంది కర్రలతో, గొడ్డళ్ళతో సహా అన్ని గ్రామాల్లో తిరిగి ధైర్యం చెబుతుండే వారు. ఈ గ్రామాలలో వైర్‌లెస్ వార్తాహరుడిగా శ్రీ విశ్వనాథ భట్ జోషి సైకిలుపై తిరుగుతూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. గ్రామాల పరిస్థితిపై రైతులకు సమాచారంగా అందచేసేవాడు.

రేవర్తి గ్రామం నుండి రజాకార్లు బయలుదేరుతున్నారు. తుపాకులతో అన్నీ సిద్ధం చేసుకొని ఈ రజాకార్లు భైరవునిపల్లిపై దాడిచేయ యత్నించారు. వీళ్ళను చూడగానే నగారా మ్రోగించారు. బురుజుపైనుండి కాల్పులు ప్రారంభమైనాయి. రజాకార్లు తట్టుకోలేకపోయారు. పిక్కబలం చూపెట్టుతుండగా గ్రామస్థులు వెంటబడి తరిమారు. దండాల కృష్ణయ్య అనే వ్యక్తి గాయపడి కూడా రజాకార్ల నుండి తుపాకీ లాక్కోగలిగాడు. ఈ తర్వాత రజాకార్లు పోలీసు అమీన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈసారి అమీన్ స్వయంగా వచ్చి భైరవునిపల్లి తనిఖీ చేశాడు. బురుజుపై ఉన్న మందుగుండు సామాగ్రి వగైరా చూసి వారితో ఇలా అన్నాడు.. “మేముండగా మీకెందుకు ఈ ఏర్పాట్ల ఫికర్? కమ్యూనిస్టులను మేము ఎదుర్కొంటున్నాం. మిమ్మల్ని రజాకార్లతో దోస్తీ చేయిస్తాం” అని చెప్పి గ్రామంలో తుపాకులను స్వాధీనం చేసుకున్నాడు. రాజిరెడ్డికి రేవర్తిలోని రజాకార్లకు రాజీ కుదిర్చాడు.

రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు

కొంతకాలం తర్వాత హైద్రాబాద్ రియసత్ ప్రధానమంత్రి అయిన లాయక్ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుపగుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్, ధూళిమిట్ట, తోరసాల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలిపూర్, అంకుశీపూర్ తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీకరించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది.ఇక్బాల్ హాషం ఓటమిఈ డిప్యూటీ కలెక్టర్ శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపేశాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకున్నాడు. బురుజు పైనుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది.

ఉదయం పదిగంటల నుండి సాయంత్రం వరకు రెండువైపుల నుండి కాల్పులు కొనసాగాయి. ఎంత ప్రయత్నించినా హాషిం తన ముఠాతో గ్రామంలో ప్రవేశించలేకపోయాడు. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ పోరాటంలో హాషిం ముఠా నలుగురు నిరాయుధులను మాత్రం చంపగలిగింది.తమ పక్షాన పదిహేను మందికి పైగా చనిపోయాకి, వాళ్ళను బళ్ళపై వేసుకొని తిరుగుముఖం పట్టక తప్పలేదు. తన ప్రయత్నం విఫలం కాగా హాషిం మరింత కసితో ఆ గ్రామాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విజయవంతమైన తమ పోరాటం వల్ల భైరవునిపల్లి గ్రామస్థుల ధైర్యం మరింత పెరిగింది. రజాకార్ల ముఠాలను నిర్భయంగా ఎదుర్కొనగలమనే ధీమా హెచ్చింది. అయితే నిజాం సైన్యం ముందు తాము నిలువగలమా? అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించలేదు. సైన్యం వచ్చి చుట్టుముట్టనున్నదనే వార్త తెలిసినా గ్రామం ఖాళీచేసి అడవుల్లోకి పారిపోవాలనే ఆలోచనే వాళ్ళకు తట్టలేదు. తత్ఫలితంగా భైరవునిపల్లి సర్వనాశనం కాక తప్పలేదు.

హైద్రాబాద్ వరంగల్ మార్గంలో ఉన్న జనగామ తాలూకా కేంద్రంలో నిజాం ప్రభుత్వం తాత్కాలికంగా మిలిటరీ క్యాంపు ఏర్పాటు చేసింది. నిజాం సైన్యంలో ఒక మేజర్, ఇద్దరు కెప్టెన్‌లు తమ దళాలతో సహా వచ్చి విడిది చేశారు. మరోవైపు నుండి సాయుధపోలీసు దళం వచ్చింది. వరంగల్, నల్లగొండ డి.యస్.పి.లు, వరంగల్‌కు చెందిన డి.జి.లు స్వయంగా వచ్చి ఏర్పాట్లు చూశారు. రజాకార్ల ముఠా తమ నాయకులతో సిద్ధంగా ఉంది. వరంగల్, మెదక్ సుబేదారులు (కమీషనర్‌లు) ఇక్బాల్ హాషిం, తమ బలగాలతో వచ్చి కలుసుకున్నారు.ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న సైనిక ఏర్పాట్లను చూసి జనగామ ప్రజలు భీతావహులైపోయారు. రోజు రోజుకూ పెరుగుతున్న రజాకార్ల అత్యాచారాలు, నిజాం ప్రభుత్వ దమనకాండ ప్రజలను నిస్సహాయుల్ని చేశాయి. ఏదో పెద్ద హత్యాకాండకు పన్నాగం పన్నుతున్నారనే విషయం స్పష్టమైంది. ఆ రాత్రి ట్రక్కుపై సామాన్లు వేసుకొని 500 మంది సైనికులు, పోలీసులు, రజాకార్లు జనగామ నుండి సిద్ధిపేటవైపు వెళ్ళే రోడ్డుమీదుగా బయలుదేరారు. వెంట 200 మందికి పైగా హిందూ, ముస్లిం సివిల్ అధికారులు కూడా ఉన్నారు.

అమానుషమైన నరసంహారం

సూర్యాస్తమయం అవుతున్నవేళ, పల్లె ప్రజలు ఇళ్ళకి తిరిగొస్తున్నపుడు చుట్టూరా ప్రశాంత వాతావరణం. వరిచేలు గాలికి రెపరెపలాడుతున్నాయి. గ్రామం ముందు బురుజు కాలం తాకిడికి తట్టుకొని ఆనాటికీ అజేయంగా నిలిచి ఉంది. గ్రామంలో ఆవులని, దూడలని తోలుకుని పశువుల కాపర్లు ఉత్సహంతో వస్తున్నారు.బావుల దగ్గర నీళ్ళు నింపుతూ ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. రేపు ఉదయం జరుగబోయే ప్రళయం ఆ సాయంత్రం ఎవరి ఊహకూ తట్టలేదు. భైరవునిపల్లి గ్రామస్థులలో ఉన్న ఐక్యత పెట్టనికోటగా రూపొందింది. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఆ గ్రామస్థుల సాహసం, పట్టుదల ఆదర్శంగా కనపడింది. అనేక గ్రామాలలో రజాకార్ల దురంతాలు మితిమీరిపోయినా ఈ గ్రామంపైకి మాత్రం రాలేకపోయారు. నవాపేట్, నెలటోల, యశ్వంతపూర్, కోమల్లా, చింటకుంట, నీలిగొండ తదితర గ్రామాల్లో రజాకార్ల వల్ల జరిగిన మానభంగాలు, దోపిళ్ళు, దహనాలు, హత్యలు మామూలు వార్తలైపోయినాయి. అయినా భైరవునిపల్లి ప్రజలు మాత్రం వీటినుండి దూరంగా సురక్షితులమనే భావంతో నిద్రపోతున్నారు.భైరవునిపల్లి ఆక్రమించాలని బయలుదేరిన నిజాం సైనిక బలగం ముస్త్యాల గుండా వల్లపట్ల చేరుకుంది. వల్లపట్ల నుండి సైన్యాన్ని మళ్ళించి మరోవైపు నుండి భైరవునిపల్లిని చుట్టుముట్టమని ఆదేశించారు. గ్రామాన్ని అరమైలు పరిధిలో సైన్యం చుట్టుముట్టింది. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఈ భారీ ఎత్తున ఉన్న బలం భైరవునిపల్లి మీద దాడికి సిద్ధంగా ఉంది. ఈలోగా ఊరి బయటికి కాలకృత్యం తీర్చుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఈ సైన్యాన్ని చూసి అదిరిపోయాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు. ఆ ఊరి బ్రాహ్మణుడు విశ్వనాథ్ భట్ జోషి. ఆయనను షూట్ చేయాలని అధికారులు అన్నారు. అయితే వెంటవచ్చిన హిందూ అధికారి శ్రీ యం. యన్.రెడ్డి జోషిచేత మాట్లాడించి అమాయకుడైన బ్రాహ్మణుడనే విషయం స్పష్టంచేయ ప్రయత్నించాడు. ఈలోగా అక్కడే ఇద్దరు సైనికులు ఆ గ్రామ నివాసి ఉల్యంగల వెంకట నర్సయ్య అనే వ్యక్తిని పట్టుకొన్నారు. అతను విడిపించుకొని గ్రామంలోకి పరుగు లంకించుకున్నాడు. మరుసటి క్షణమే బురుజుపై ఉన్న నగారా మ్రోగింది. చిన్న ఫిరంగి కాల్పులు ప్రారంభమయ్యాయి. అయితే చుట్టుముట్టిన సైనిక బలగం దగ్గర పెద్ద ఫిరంగి ఉంది. ఇటునుండి వరుసగా పదమూడు గుళ్ళను సైనికులు పేల్చారు. ఈ ప్రేలుడు చప్పుడు చుట్టుప్రక్కల గ్రామాలకు వినబడింది. గ్రామంలో అనేక ప్రాంతాలలో నిప్పు అంటుకుంది. కొన్ని ఇళ్ళు కూలిపోయాయి

ముఖ్యమైన రక్షణ సామగ్రి ధ్వంసం

అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజుపైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండగానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది వగైరా అంతా కూలి ముఖ్యమైన రక్షణ సామాగ్రి ధ్వంసమైపోయింది. గ్రామస్థులు ఇది రజాకార్ల దాడి కాదనే విషయాన్ని గ్రహించారు.ప్రతిఘటించి ప్రయోజనం లేదని బురుజు పైనుండి తెల్లజెండా చూపారు. అయినా నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు జరుపుతూనే వచ్చింది. గ్రామంలో చొచ్చుకొని వస్తున్న సైనికులు అడవి జంతువులలాగా ప్రవర్తించారు. కనబడిన ప్రతి అమాయకుణ్ణి కాల్చివేశారు. ఒకమూల నిలబడి సైనికులు పదిమంది యువకులపైకి చేతిబాంబులువేసి చంపివేశారు. అందులో విశ్వనాథ్ భట్ జోషి తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరపరాధులైన గ్రామస్థులు హత్య చేయబడ్డారు. అందులో అప్పుడే ప్రసవించిన తల్లి కూడా ఉంది. తర్వాత శవాలను గుర్తిస్తున్నపుడు సజీవంగా ఉన్న శిశువు లభించింది. గ్రామంలో ప్రతిఘటనా శక్తి సర్వస్వం నాశనమై పోయింది.నిజాం ప్రభుత్వ అధికారులు, సైనికులు విజయోన్మాదంతో పాశవిక చర్యలకు దిగారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏదో పెద్ద తిరుగుబాటును అణచివేశామనే గర్వంతో విర్రవీగుతూ భైరవునిపల్లి నేలమట్టం చేశారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకులను ఏరి పశువుల్లా బంధించి తీసుకువచ్చారు. స్త్రీలను బలాత్కరించారు. ఇళ్ళను దోచుకున్నారు. గడ్డివాములను తగులబెట్టారు. మత పిచ్చి ఎక్కి దుష్కృత్యాలు జరిపిన గూండాలకు ఈ నిజాం ప్రభుత్వం అధికారులకు మధ్య తేడాలేదు అనిపించింది.ఊరు అవతలికి 92 మంది యువకులను పట్టి తెచ్చి నిలబెట్టారు. వాళ్ళలో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు తమ షూటింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమై నిల్చున్నారు. త్రీనాట్ త్రీ రైఫిల్‌తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో అంచనా వేసుకున్నారు. నాలుగు వరుసలలో ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టారు. కట్టివేయబడిన యువకులు బలిపశువుల్లా నిలుచున్నారు. మొదట ఒక సైనికాధికారి కాల్పులు జరిపాడు.ఒకేగుండు వరుసగా నలుగురి శరీరాల గుండా దూసుకుపోయి మరోవైపు వెళ్ళింది. ఫలితంగా ఆ నలుగురు యువకులు నేలకూలిపోయారు. రెండోసారి ఒక పోలీసు అధికారి ఫైరింగ్ చేయగా ముగ్గురు చనిపోయారు. ఇక సివిల్ అధికారులు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ముందుకు వచ్చారు. భువనగిరి డిప్యూటి కలెక్టర్ హాషిం కసితో ఎనిమిదిమందిని కాల్చి చంపాడు. ఇద్దరు ముసలివాళ్ళను వదలి దాదాపు అందరినీ స్టెన్‌గన్‌తో కాల్చి హత్య చేశారు.  ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారియైన ఖాసిం రజ్వీ ముఖ్య అనుచరుడైన మొహజ్జిం హుస్సేన్ (నల్గొండ) అత్యధికమైన భాగాన్ని పంచుకున్నాడు.తర్వాత గ్రామంలో హరిజనులను పిలిచి 90 మంది శవాలను నిరుపయోగంగా ఉన్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు.

ఆనాడు జరిగిన దాడిలో తన తమ్ముడు సోమలింగం ప్రాణాలు కోల్పోయాడని ఒక గ్రామవాసి ఆనాటి బీభత్స దృశ్యాన్ని, తన అంతరంగాన్ని విప్పి చెబుతూ ఇలా అన్నాడు “ఇక్కడ ఈ మైదానంలో రక్తపుటేరు పారింది. అయినా ఈనాటికీ ఆ బలిదానానికి స్మృతిగా ప్రభుత్వం ఒక చిహ్నాన్ని కూడా స్థాపించలేదు. అందరూ మరిచి పోయారు అన్నారు. గ్రామాలపై జరిగిన రాక్షసదాడులను చూసి జనగామ ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని విపరీతంగా అసహ్యించుకున్నారు. కాని నిజాం మాత్రం విదేశాల నుండి పత్రికా విలేఖరులను వేల రూపాలయలు ఖర్చుచేసి రప్పించి భైరవునిపల్లి సంఘటనలను మరో రకంగా వక్రంగా చిత్రించి విదేశాల్లో ప్రచారం చేశాడు. అసలు హిందువులే తిరగబడి దాడికి తలబడితే తాము శాంతి భద్రతలను కాపాడడానికి ఆ చర్య తీసుకున్నామని ప్రచారం చేశాడు. అయినా ప్రజల రక్తపాతం నిజాం అమానుష చర్యల నిజస్వరూపం ప్రపంచానికి బహిర్గతం కాక తప్పలేదు. నిర్దోషులైన వేలాదిమంది ప్రజల రక్త ప్రవాహం నిజాం రాజ్యాన్ని కూలదోసింది. ప్రజల రక్తం నిజాం నిరంకుశాధికారాన్ని శాశ్వతంగా ఎలా సమాధిచేసి వేసిందో  చరిత్రే నిరూపించింది. 

__విశ్వసంవాద కేంద్రము (తెలంగాణ)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top