ఆర్.ఎస్.ఎస్ సంఘం ప్రస్తావించే విషయాలు - RSS Sangh Mentioned topics

0
ఆర్.ఎస్.ఎస్ సంఘం ప్రస్తావించే విషయాలు - RSS Sangh Mentioned topics

- సంఘం ప్రస్తావించే విషయాలు - 

    మనం మన ఆలోచనాధారను మనతోటివారి ముందుంచే సమయంలో మన ప్రాచీనమైన చరిత్రను, వేల సంవత్సరాల పరంపరను, అతి ప్రాచీనకాలంనుండి ఇక్కడ నెలకొన్న (ఆశ్రమ తదితర) వ్యవస్థలను గుర్తుచేస్తూ మాట్లాడుతుంటాం. మనకు ఇంతటి ఘనమైన వారసత్వమున్నదని అభిమానాన్ని ప్రకటిస్తాం. చరిత్ర అనే గొలుసు యొక్క కొక్కెములతో మనమందరం అనుబంధింపబడియున్నాం. మన చరిత్రను, పరంపరనూ ఇతరులు చూసే దృక్కోణానికి భిన్నమైనదృష్టి సంఘానికి ఉంది. మనదేశంలో మనకు ఎటువంటి పాలనా విధానాలూ లేవని, మనకు గర్వించదగిన చరిత్ర లేదని, మనం చరిత్రగా చెప్పుకొనే దంతా వ్యర్థమైనదని ఇతరులు అనుకొంటుంటారు. మన చరిత్ర అంతా పరాజయాలతోనూ, పరాభవాలతోనూ నిండియున్నదనుకొంటారు. మానవజీవితంగురించిన లోతైన అవగాహన లేకుండా ఇక్కడ పరంపరలు, వ్యవస్థలు ఏర్పడినవని, అందువలన అవి ప్రయోజనకరమైనవి కావని అనుకొంటారు. 

    మహమ్మదీయులు ఈ దేశానికి వచ్చి, తమ పరిపాలన నెలకొల్పిన నాళ్ళనుండే మన చరిత్ర ఆరంభమైందనీ అనుకొంటారు. అంతకుముందుకూడా ఈ దేశానికి చరిత్ర ఉందని వారు గుర్తించరు. కాగా ఈ విధమైన దృష్టికోణాన్ని సంఘం అంగీకరించదు. మనం వారికి భిన్నంగా ఆలోచించడానికి కారణం మనం భావావేశపరవశులమై (సెంటిమెంటల్ గా) ఆలోచించటం కాదు. గత చరిత్రను ఉజ్జ్వలంగా చూపిస్తేగాని, ఉజ్జ్వలమైన భవితవ్యాన్ని నిర్మించలేమనే భయం మనకు లేదు. గతం ఉజ్జ్వలంగా ఉన్నంతమాత్రాన భవితవ్యంకూడా ఉజ్జ్వలంగానే ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. మనం ఏదేశంలో జన్మించామో ఆ దేశం పేరు ప్రపంచంలో ఉజ్జ్వలంగా ఉండాలి, ఆస్థితిని మనం సాధించి తీరాలన్న ప్రేరణ మాత్రం తప్పనిసరిగా అవసరమవుతుందని నేను అనుకొంటాను. ఈ సంకల్పానికి తోడుగా మనకు ఉజ్జ్వలమైన గతంకూడా ఉన్నట్లయితే, అది బంగారానికి తావి అబ్బినట్లుగా మరింత సంతోషందాయకమవుతుంది. ఇటువంటి గర్వకారణమైన గత చరిత్ర మనకు ఉండటం ఒక వాస్తవం. మన చరిత్ర ఎంత ప్రాచీనమైనదో నిర్ధారణగా తేల్చిచెప్పగల చరిత్రకారులు లేరు. గొప్ప చరిత్ర, శ్రేష్ఠమైన వ్యవస్థలు, పరంపరలు మనదేశంలో ఉన్నందున, వీటిపట్ల మనం స్వాభిమానం కల్గినవారై ఉండటం ఒక స్వాభావికమైన విషయం. అందువల్లనే సంఘం చెప్పే విషయాలలో ఇది అడుగడుగునా ప్రతిఫలిస్తూ ఉంటుంది.

    సంఘం మనదేశపు ప్రాచీన చరిత్రను, సంస్కృతిని అభిమానంతో ప్రస్తావించుతూ ఉంటే, వేయి, రెండువేల సంవత్సరాల క్రిందట ఇక్కడ అమలులో ఉండిన ప్రాచీన వ్యవస్థలను వీరు తిరిగి తీసికొనివచ్చి నెలకొల్పాలని అనుకొంటున్నారన్న ఒక తప్పుడు భావన ఇతరులలో ఏర్పడుతూ ఉంది. వివిధరంగాలలో తలఎత్తుతున్న క్రొత్త క్రొత్త సమస్యల గురించి, సంఘం దృష్టి సారించటమే లేదు- అన్న ఆరోపణల సంఘ కార్యకర్తల ముందు లేవనెత్తబడుతూ ఉంటుంది. ఇలా చర్చ జరగటమంటే-జరగరానిదేదో జరుగుతున్నదని అనుకోరాదు. ఒక బాటలో రాళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే, నడుస్తున్న వ్యక్తికి తగిలే ఎదురుదెబ్బలు ఎక్కువగానే ఉంటాయి.
     మనదేశం సుదీర్ఘకాలం పరాయిపాలనతో ఉన్నందున-సమాజంలో ఏవిధంగా కాలానుగుణమైన పరివర్తనలు రావలసిఉండెనో-అవి రాలేదు. ఆకారణాన మన సమాజం అడుగడుగునా ఎదురుదెబ్బలు తింటూ ఉన్నది. ఇటువంటి ఎదురుదెబ్బల తర్వాత కూడా స్వయం సేవకులలో క్రియకు తగిన ప్రతిక్రియ కనబడకపోతే-సంఘంవాళ్లు పాతకాలపు పరంపరలను అభిమానించేవారు, ఈ యుగానికి తగిన చైతన్యంగాని, ఆలోచనలుగాని వారిలో లేవు. ఇప్పటి ఈ ఇరవయ్యవ శతాబ్దంలోనూ, వారు రెండు, మూడు, నాల్గు వేల సంవత్సరాల క్రిందట అమల్లో ఉండిన వ్యవస్థలనే పునరుద్ధరించగోరుతున్నారు. వీరు పునరుద్ధరణవాదులు (Revivalist) అన్న భ్రాంతధారణ (తప్పుడు కల్పన) ప్రజలలో ఏర్పడుతుంది. సంఘంగురించి, సంఘకార్యం గురించి ప్రజలో ఇటువంటి అభిప్రాయం ఉన్నందున ఈ విషయాన్ని మనం సరిగా గ్రహించుకోవటం ఎంతైనా అవసరం.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top