ప్రచారక్ గా ప్రకటింపబడినంత మాత్రాన స్వయం సేవకులందరూ ఆదరంతో సమ్మానపూర్వకంగా తనతో వ్యవహారిస్తారని అనుకోవలసిన పనిలేదు. గౌరవ సమ్మానాలు తన వ్యక్తిత్వాన్ని బట్టి లభిస్తాయి. పదవికారణంగా లభించే గౌరవసమ్మానాలు, ప్రతిష్ఠలు కొద్దికాలమే ఉంటాయి. శ్రద్ధా, గౌరవమూ కోరితేలభించేవికావు. అడిగి తీసికొనే వస్తువులు కావు. ప్రచారకులు ఏ పరంపరలో తమ బాధ్యతలను, కర్తవ్యాలనూ నిర్వహించుకొంటూ వస్తున్నారో, వారి నడవడి ఎలా ఉందో దానిని బట్టి సమాజంలో వారికి స్థానం లభిస్తుంది.
మూడు నాలుగు రోజులపాటు, లేదా ఒకటి రెండు నెలలపాటు దగ్గరగా ఉండి చూసినవారికి 'ఈ వ్యక్తిలో ఈతని ప్రవర్తనలో ఏదో విశిష్టత ఉంది' అని మనస్సులో తోచాలి. అలా చిన్న వయస్సులో ఉన్న, పెద్ద చదువులు లేని ప్రచారకులుకూడా చాలా చోట్ల ప్రేమాస్పదులు, గౌరవాన్వితులు అవుతూ ఉండటం మనం చూస్తుంటాం. ఇతరులకు ప్రేరణను, అనుసరణీయ వ్యవహారకుశలతను అందించే సామర్థ్యం ఉన్నపుడే ఇది సాధ్యమవుతుంది. అందరినీ కలుపుకొనిపోతూ, సంబాళించుకొంటూ వ్యవహరించటం, మితభాషిగా, మధురభాషగా, సంయమనంతో కూడిన ఆచార్య వ్యవహారాలు కల్గినవానిగా ఉన్నపుడే ఇది సాధ్యమవుతుంది.
ఈ విధంగా ప్రచారక్ పని చాలా కఠినమైన పెద్ద బాధ్యత అవుతున్నది. డాక్టర్జీ సమయంలో కూడా ఈ విషయాలపై చర్చ జరుగుతూ ఉండేది-ప్రచారక్ అవివాహితునిగా ఉంటూ జీవితం గడపాలి, అయితే పుట్టుకతోనే నివృత్తి మార్గంలో నడిచేవారు ఉండరు జీవితానికి, శరీరానికి కొన్ని కోరికలు, అవసరాలు ఉంటాయి-వీటిపట్ల అనాసక్తంగా, నిరాశతో ఉండరు-కుటుంబజీవితంపట్ల ఇచ్ఛాసక్తులు కలిగి ఉండటం సహజం-చిన్న వయస్సులోనే అన్ని రకాల ఆకాంక్షలనుండి ముక్తులైనవారు చాలా కొద్దిమందిగానే ఉంటారు. అలాంటివారికి కూడా ఏవిధమైన సమస్యలూ ఎదురుకావనీ లేదు. అటువంటివారినికూడా సంబాళించుకొంటూ రావాలి.
ఒక మనిషిచుట్టూ రకరకాల మనుష్యులు ఉంటారు. ఒక్కొక్కసారి తాను మోస పోతుంటాడు. నివృత్త జీవనం గడుపుతున్న వ్యక్తి కూడా తనవల్ల ఏ తప్పు జరగకుండా ఎంతో మెలకువతో ఉండాల్సి ఉంటుంది. అలా లేనట్లయితే, తనవల్ల కూడా తప్పులు జరిగే అవకాశముంటుంది. ప్రచారకులుగా వచ్చిన స్వయం సేవకులముందు చాలా వేగంగా సంఘకార్యాన్ని పెంచవలసి ఉందనే ఆలోచనను ఉంచారు. సైన్యంలో చేరేవారు ఎలా మరణానికి సిద్ధపడివస్తారో, సంఘప్రచారకుల నివృత్తి భావన కూడా అలాగే ఉంటుంది. సైనికులు ఏక్షణాన అయినా మరణించడానికి సిద్ధమై ఉంటారు. అలాగని వారిలో జీవించాలనే కోరిక ఉండనే ఉండదని కాదు.