“మన ప్రియమైన మాతృభూమి, గొప్ప వారసత్వం ఈ దేశంలో ఐక్యతకు ఆధారం. భారత్ లోని హిందువులు, ముస్లిములకు పూర్వీకులు ఒక్కరే. “హిందూ“ అనే పదం మన మాతృభూమి, పూర్వీకులు, మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప వారసత్వానికి పర్యాయపదం. ఆ విధంగా మతమేదైనా, భాష ఏదైనా, జాతి ఏదైనప్పటికీ ప్రతి భారతీయుడు హిందువే. హిందూ అనేది ఏదైనా ఒక జాతిని, మతాన్ని లేదా భాషాతత్వాన్ని సూచించే పదం కాదు. సమస్త చరాచర జీవులన్నింటి ఉద్ధరణ కోసం పాటుపడే గొప్ప వారసత్వానికి పెట్టిన పేరు హిందుత్వం” అని ఆర్.ఎస్. ఎస్ పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ అన్నారు.
అందువలన, మనకు, ప్రతి భారతీయుడూ హిందువే. అనేకమైన విభిన్న అభిప్రాయాలను అంగీకరించే మన సంస్కృతికి అనుగుణంగా, ఇతర విశ్వాసాల పట్ల అగౌరవముండదని మనం భరోసా ఇస్తాము. అయితే, దాని కొరకు మనం ఇస్లాం మతం వలె ఒక విశ్వాసాన్ని గురించి కాకుండా భారత్ యొక్క ఆధిపత్యం గురించి ఆలోచిస్తామని నిర్ధారించుకోవాలి. సుసంపన్నమైన భారత దేశం కోసం, మన మాతృభూమి అభివృద్ధి కోసం కలిసి రావడం మరియు కలిసి ఉండడం అనివార్యమని ఆయన అన్నారు.
ముంబాయిలో ‘గ్లోబల్ స్ట్రాటజిక్ పాలసీ ఫౌండేషన్’ నిర్వహించిన “దేశం ప్రథమం, దేశమే సర్వోన్నతం” అనే సెమినార్ లో వారు మాట్లాడారు. ఆ కార్యక్రమంలోని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ , కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉప కులపతి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ కూడా పాల్గొని మాట్లాడారు.
ఇస్లామ్ భారత్ లోనికి దురాక్రమణదారులతో ప్రవేశించిందన్నది చారిత్రక సత్యమని, దానిని దాచిపెట్టలేమని భాగవత్ గారు తమ ప్రసంగంలో నొక్కి వక్కాణించారు. తమ సమాజంలోని కొన్ని మూకలు సాగిస్తున్న పిచ్చి పనులకు వ్యతిరేకంగా ముస్లిం పెద్దలు, మేధావులు తమ స్వరం వినిపించాలని, అటువంటి మతమౌఢ్యాన్ని గట్టిగా వ్యతిరేకించాలని, దీర్ఘకాలిక ప్రయత్నాలతో దీనిని సాధించాలని ఆయన అన్నారు.
`ఇవి మనకు పరీక్షా సమయాలు. ఇది చాలాకాలం వరకు సాగవచ్చు. మనం ఎంత త్వరగా ప్రారంభిస్తే సమాజానికి అంత తక్కువ నష్టం కలుగుతుంది’ అని డా. మోహన్ భాగవత్ జీ అన్నారు.
హిందువులు ఎవరిపట్ల శత్రుత్వం వహించరని, భారతీయులు అందరి సంక్షేమం కొరకు పాటు పడుతూనే ఉన్నారని, అందువలన భారత్ లో ముస్లిములు భయపడవలసిన అవసరమే లేదని చెపుతూ, భారత్ ప్రపంచంలోనే ప్రబలమైన శక్తి(గ్లోబల్ సూపర్ పవర్)గా ఆవిర్భవిస్తుందని, అయితే అది ‘విశ్వగురువు’ రూపంలో ఉంటుందని కూడా డా. భాగవత్ గారన్నారు.
‘తమ మత విశ్వాసానికి సంబంధం లేకుండా, ఈ నిర్వచనాన్ని సమ్మతించే ఎవరైనా హిందువే. ఆ రకంగా మనమంతా ఒకటే’ అని భాగవత్ గారన్నారు. వారు ఇంకా ఇలా కూడా అన్నారు- దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించే వారు మనమంతా ఒకటి కాదని, మనం వేరు వేరని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనం వీళ్ల మాటలకు బలి కాకూడదు. మనమంతా ఒకే జాతి. అలాగే మనమంతా ఐక్యంగా ఉండాలి. ఆర్ ఎస్ ఎస్ ఇలాగే ఆలోచిస్తుంది. ఈ విషయం మీకు తెలియపరచడానికే నేనిక్కడకు వచ్చాను’ అని వారన్నారు.
.....విశ్వసంవాద కేంద్రము (TS)