జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు - Nationalist poet Samrat ' Viswanatha Satyanarayana '

Vishwa Bhaarath
0
జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు - Nationalist poet Samrat Viswanatha Satyanarayana
లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు, విలువలకు పట్టం కట్టిన నిజమైన సాహితీ చక్రవర్తి. జ్ఞానపీఠ్ అవార్డును స్వంతం చేసుకున్న తొట్టతొలి తెలుగు కవి. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు…. ఒక్క వచన కవిత్వం మినహా తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఆయన కలం నుంచి జాలువారిన రచనలు షుమారు లక్ష పేజీలు…. అవును అక్షరాలా లక్ష పేజీలు ఉంటుందంటే…. ఆయన ప్రతిభా పాటవాలను మనం అంచనా వేయవచ్చు.

అట్లని అవేవీ ఆషామాషీ రచనలు కాదు. వారి ప్రతి రచనా పాఠకుల హృదయాలను దోచేస్తుంది. మదిలో మధురభావనలను మొలకెత్తిస్తుంది. పాఠకుల హృదయోద్యానవనాలలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని వికసింపజేస్తుంది. జీవన విలువలను ప్రబోధిస్తుంది. జీవన సంఘర్షణలను, వాటి పరిష్కారాలను వివరిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. యువ హృదయాలకు ప్రేమ మాధుర్యాన్ని పరిచయం చేస్తుంది. రస రమ్య గీతాలతో పరవశింపజేస్తుంది. ఉత్కంఠ రేపి ఉర్రూతలూపుతుంది. మధ్య తరగతి జీవన గమనాన్ని కళ్ళకు కడుతుంది. కన్నీరొలికిస్తుంది. కరుణామృత ధారల్ని కురిపిస్తుంది. ఇంటి పెద్దై మందలిస్తుంది. మార్గదర్శై అదిలిస్తుంది. సోదరుడై సంరక్షిస్తుంది. సహచరుడై సహగమిస్తుంది. అమ్మలా లాలిస్తుంది. అమ్మణ్ణిలా పాలిస్తుంది. అమ్మాయిలా మురిపిస్తుంది. పాపాయిలా ఆడిస్తుంది. ఆయన వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శలో, భాషణంలో, భూషణంలో ఒక విలక్షణత వెల్లివిరుస్తుంది. ఆయన ఒక కవి దిగ్గజం. తెలుగుతల్లి శిరస్సుపై నిలచిన కనక కిరీటం.

జననం – బాల్యం – విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, నందమూరుకు ఆ మహాకవి జన్మస్థలంగా ఖ్యాతి గడించే భాగ్యం దక్కింది. శోభనాద్రి, పార్వతులు తల్లిదండ్రులు. తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు. కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తుండగా ఆ పవిత్ర గంగా ప్రవాహంలోంచి ఆయన చేతులలోకి ఒక శివలింగం వచ్చి చేరింది. ఆయన దానిని తీసుకొచ్చి స్వగ్రామం నందమూరులో ప్రతిష్ఠించి అక్కడ ఒక ఆలయం నిర్మించారు. తనకు దాతృత్వము, దైవభక్తి తన తండ్రి నుంచే అలవడ్డాయని స్వయంగా విశ్వనాథులవారే చెప్పుకున్నారు. విశ్వనాథుని స్వగ్రామం నందమూరులో దేశీయ కవితారీతులతో గానం చేసే భిక్షుక బృందాలు, పురాణ గాథలు, ప్రవచనాల మధ్య గడిపే బంధుజనుల సాంగత్యం వల్ల బాల్యంలోనే విశ్వనాథుని కవిత్వానికి పునాదులు పడ్డాయి.

ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు బందరు పట్టణంలో సాగింది. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు విశ్వనాథుని తెలుగు ఉపాధ్యాయుడు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. బందరులో ఆయన వద్ద విద్యనభ్యసించిన ఎందరో… అనంతర కాలంలో మహా పండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి పొందారు. వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు.

“అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనా డన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్”

గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథవారు తన ప్రతిభ పై అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికే దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో సగర్వంగా ప్రకటించారు విశ్వనాథవారు.

విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలేశారు.

ఉద్యోగ జీవితం
1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలేసిన బి.ఎ. చదువును తిరిగి 1926-27లో పూర్తిచేసి, బందరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1932లో స్వల్పకాలం)లలో పనిచేశారు. విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959),  కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ  ఉపాధ్యక్షులుగానూ, 1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు. 1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికే కేటాయించారు.

విజయవాడలోని విశ్వనాథ వారిల్లు
విజయవాడలోని విశ్వనాథ వారిల్లు

దాంపత్యం
విశ్వనాథ వారి మొదటి భార్య పేరు వరలక్ష్మి. తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమేనని స్వయంగా విశ్వనాథవారే పేర్కొన్నారు. వారికి అచ్యుతదేవరాయలు అనే కుమారుడు కలిగాడు. 1931-32 మధ్య కాలంలో ఆయన మొదటి భార్య వరలక్ష్మి గారు అనారోగ్యంతో మరణించారు. విశ్వనాథ వేయిపడగలులో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణదేననీ, ధర్మారావు భార్య అరుంధతే విశ్వనాథుల వారి అర్థాంగి వరలక్ష్మమ్మ అని పేర్కొంటారు. ఆమె మహోన్నత్యం, సహజ పాండిత్యం, అనారోగ్యం, మరణం వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరేండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. విశ్వనాథుల వారికి కూడా సరిగా అదే వయస్సులో భార్యావియోగ మహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడేమోనని సభక్తి పూర్వకంగా చెప్పుకున్నాడాయన. ఆయన జీవితంపై, సాహిత్యంపై అర్థాంగి వరలక్ష్మితో దాంపత్యమూ, ఆమె అకాల మరణమూ తీవ్రమైన ప్రభావం చూపించాయి.

రచనలు
25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వారు వందల్లో రచనలందించారు. కొన్ని రచనలను ఇతర భాషలలోకి కూడా అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు.

విశ్వనాథ వారి రచనలలో ఆయన పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు.

వేయిపడగలు నవలలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానం విశేషంగా చూపబడ్డాయి. అనంతర కాలంలో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకు, సినిమాలకూ ఇది ఏ మాత్రమూ తీసిపోదు సరికదా మరో పది మెట్లు పైనే ఉంటుందని చెప్పొచ్చు. దాని కథ, కథనం అంతటి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు ఆనాటి యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితర సాధ్యమైన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా
పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే
హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ
ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై
రామాయణ కల్పవృక్షం, సుందరకాండ లోని పరరాత్ర ఖండం లోనిదీ పద్యం.

ఒక క్షుద్రుని చేత దొంగతనంగా ఎత్తుకుని రాబడిన మహావమానాన్ని సహిస్తూ కూర్చుని వున్నఆ పత్యైకశీల సీతామాత యొక్క ఆకృతి, కనుబొమలు, కన్నులు, కేశపాశము, సర్వ దేహము, కూర్చున్న వైఖరి అన్నీ – ఆమె ఏ మహాత్ముని రాకడకై నిరీక్షిస్తున్నాయో – ఆయన లక్షణాలతో ఏకీభూతంగా ఆరోపింపబడటం ఈ పద్యంలోని సొగసు.

సీత స్వయంగా మూర్తీభవించిన ధర్మము. రామచంద్రుడు ధర్మోద్ధారణకు అవతరించినవాడు. ఆయన ధర్మభావం మొత్తం ఆమె సర్వదేహంలోనూ మూర్తీభవిస్తోందని వర్ణించారు విశ్వనాథవారు ఈ పద్యంలో. ఇప్పుడు ఆ ధర్మానికే భంగం కలిగింది రావణుని వలన. రావణ నిగ్రహమూ, ధర్మ రక్షణా – వీటికి రాముని ప్రస్తుత కర్తవ్యం పరాకాష్ఠ అయి, అధర్మ నిర్మూలనం జరిగి సీత ఆకృతిగా వున్న ధర్మం పరిరక్షింపబడాలన్నది అంతిమ లక్ష్యం. ఈ పద్యంలో రాముని ఆకృతిలోనూ, సీతామాత ఆకృతిలోనూ ఉన్న సామ్యాన్ని, సారూప్యతను అభివర్ణించారు.

అలాగే కిన్నెరసాని పాటల నుండి….
నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.
లో ఇంపైన పదాల పొందిక కనిపిస్తుంది. చదువరులను మురిపించే సరళమైన శైలి కనిపిస్తుంది. కవిగారి గడుసుదనమూ కనిపిస్తుంది.

అలాగే…
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
పాతచుట్టరికమునె రాపాడుచుండె

పెళ్లయిన తర్వాత కూడా అంగనామణి పాత చుట్టరికాల్నే పట్టుకు వేళ్ళాడుతూండడం… “స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీషు చదువే చదివినట్లుగా” ఉందని చెప్పడంలో ఆయన స్వరాజ్య, స్వభాషాభిమానాలూ పరాయి పాలనపై, భాషపై ఉన్న విముఖత, జాతీయవాద దృక్పథము, దేశభక్తి వ్యక్తమవుతున్నాయి.

జాతీయవాది – సాంప్రదాయవాది

విశ్వనాథవారు ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడిన వారు. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగినవారు. శ్రీశ్రీ వంటివారు ఛాందసవాదిగా తనను అభివర్ణించినా సాహిత్యంలో జాతీయభావము, ఆరోగ్యవంతమైన ప్రాంతీయ భావము ప్రస్ఫుటించాలని విశ్వనాథవారు గాఢంగా విశ్వసించారు. దానినే ఆయన తన రచనలలోనూ, మాటలలోనూ ప్రకటించారు. శిల్పం కానీ, సాహిత్యం విజాతీయమై ఉండరాదని, ఖచ్చితంగా జాతీయమే అయివుండాలని నొక్కి వక్కాణించారు. “పక్షి సముద్రంపై ఎంత ఎగిరినా రాత్రికి ఏవిధంగా అయితే గూటికి చేరుతుందో…. అలాగే మనం మన జాతీయత, సాంప్రదాయాలను కాపాడుకోవాలి” అనేవారు.

విశ్వనాథ వారిని సాంప్రదాయవాది, ఛాందసుడు అని విమర్శించిన శ్రీశ్రీ సైతం

నాటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
అంటూ స్వయంగా విశ్వనాథ వారి రచనా శైలికి నీరాజనం పట్టాడు.

మహాభినిష్క్రమణం….
1976 అక్టోబరు 18 న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ వారు పరమపదించారు. ఆయన జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది.

వివిధ పురస్కారాలు….
 • 1996 అక్టోబరు 21న ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ విజయవాడలో విశ్వనాథ వారి విగ్రహాన్ని  ఆవిష్కరించారు.
 • విశ్వనాథ సత్యనారాయణ బొమ్మ ఉన్న తపాలా బిళ్ళ ఆవిష్కరింపబడింది.
 • తెలుగుజాతి ఆయనను ‘కవిసామ్రాట్’ బిరుదుతో సత్కరించింది.
 • 1964లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ “కళాప్రపూర్ణ”తో సన్మానించింది.
 • 1942 సంక్రాంతికి గుడివాడలో ఆయనకు “గజారోహణం” జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
 • శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
 • 1962 లో “విశ్వనాథ మధ్యాక్కఱలు” రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
 • 1970 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
 • 1970 లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది.
 • జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో
 • విశ్వనాథ వారి “రామాయణ కల్పవృక్షం” గ్రంథానికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందించినపుడు, ఆ సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది…..
As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare “range” Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene.
ఎన్ని తరాలు తరగినా, ఎన్ని యుగాలు గడచినా…. ఈ భూమి మీద తెలుగు భాష జీవించి ఉన్నంతవరకు, తెలుగు జాతి మనుగడ సాగించినంతవరకు తెలుగువారి గుండెల్లో విశ్వనాథవారు సజీవంగా వెలుగులు చిందుతూనే ఉంటారు.

– శ్రీరాంసాగర్. __విశ్వసంవాద కేంద్రము 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top