క్రైస్తవానికి వీడ్కోలు పలుకుతున్న పశ్చిమ దేశాల - Decline of Christianity in the Western world

Telugu Bhaarath
0
క్రైస్తవానికి వీడ్కోలు పలుకుతున్న పశ్చిమ దేశాల - Decline of Christianity in the Western world
-డా. బి. సారంగపాణి

కొన్ని శతాబ్దాల అణచివేత, అదృశ్యం తర్వాత కూడా ప్రకృతి ఆరాధన, స్త్రీ దేవతామూర్తుల ఆరాధన, బహు దేవతారాధన తిరిగి పుంజుకోవటంతో క్యాథలిక్‌ చర్చ్‌ భయపడుతున్నది. ఏకైక దైవమంటూ చెప్పే మతాలు 2000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించాయి. ‘విశ్వాసులు’, ‘అవిశ్వాసులు’గా విడగొట్టాయి. జీహాద్‌, క్రూసేడ్‌ (పవిత్ర యుద్ధాలు) పేరుతో ఎంతో రక్తపాతాన్ని సృష్టించాయి. తమ మతాన్ని అంగీకరించని వారి పట్ల ఆ రెంటి వైఖరి ఒకటే. శతాబ్దాల క్రితం ఐరోపా ఖండంలో బహుదేవతారాధకులను సజీవంగా దహనం చేసిన చరిత్ర క్రైస్తవానిది. ఆయా దేశాల స్థానిక మతాల, ఆరాధన, తాత్త్విక పద్ధతుల సమాధులపైనే క్రైస్తవం ఐరోపా ఖండం అంతా విస్తరించిన వాస్తవాన్ని చరిత్రపుటలు చాటుతాయి.

క్యాథలిక్‌ చర్చ్‌ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ బహుదేవతారాధన, ప్రకృతి ఆరాధనలపై యుద్ధం ప్రకటించాడు. స్థానిక దేవీదేవతలను కొలవటంపై కూడా అసహనం ప్రకటించాడు. అయితే ఇటీవలి కాలంలో ఐరోపావాసులు తమ మూలాలను వెతుక్కుంటున్నారు. ఏకైక దైవమతాలు ధ్వంసం చేసిన తమ సాంస్కృతిక మూలాలను అన్వేషిస్తున్నారు. బహుదేవతారాధన, ప్రకృతి ఆరాధన, ధార్మికస్వేచ్ఛల పట్ల ఆసక్తి చూపుతున్నారు. వాటికన్‌ నగరంలో క్రైస్తవ యాత్రికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ బహుదేవతా రాధన పద్ధతులను క్రైస్తవంలో అనుసరించటం వలన దేవుని బిడ్డలైన క్రైస్తవులు తమ ప్రత్యేకతను కోల్పోనున్నారని పోప్‌ ఆందోళన వ్యక్త పరిచాడు.నీరు, నూనె కలవవని, క్రైస్తవ సమాజం బహుదేవతా రాధకులను అనుసరిస్తే చివరకు దెబ్బ తినక తప్పదని కూడా హెచ్చరించాడు.

క్రైస్తవులు క్రైస్తవేతరులను ద్వేషిస్తారు. ద్వేషం వారి సహజ లక్షణం. కానీ ఇటీవలి కాలంలో బహుదేవతారాధకుల మత విశ్వాసాల పట్ల వారు ఆసక్తిని పెంచుకోవటం చూసి ఆయన బాధను వ్యక్తం చేశాడు. 2014లో వాటికన్‌లో జరిగిన ప్రార్ధనా సమావేశంలో క్రైస్తవ మత విశ్వాసులు బహుదేవతా రాధకుల పద్ధతులను అనుసరించకూడదని, ఎందుకంటే బహుదేవతారాధకులు సిలువకు శత్రువులని పేర్కొన్నాడు.

భయం ఎందుకు?

ఎందుకు పోప్‌ బహుదేవతారాధకులను చూసి అంతగా భయపడుతున్నాడు? క్రైస్తవం, ఇస్లాం, యూదుల మతమైన జుడాయిజం తప్ప మిగిలిన అన్ని మతాలను పాగన్‌ మతాలు అని క్రైస్తవులు పిలుస్తారు. పాగనిజం అంటే బహుదేవతారాధన. క్రైస్తవం ఐరోపా నగరాలను ఆక్రమించిన తర్వాత కూడా కొన్ని సుదూర గ్రామాలలో బహుదేవతా రాధకులు మిగిలారు. వారిని హీదెన్‌ `అన్య జాతీయులు, అవిశ్వాసులు అని పిలిచేవారు.

ఇప్పుడు అవిశ్వాసులు, అన్య మతస్థులు, బహుదేవతారాధకుల సంఖ్య క్రమంగా ఐరోపా అంతా విస్తరిస్తున్నది. క్రైస్తవం పుట్టినప్పటి నుండి ఎన్నో వేలమంది బహుదేవతారాధకులను పట్టుకుని వేధించి, చిత్రహింసల పాలు చేసి చంపేశారు. ఆ తర్వాతే ఐరోపాలో క్రైస్తవం వ్యాపించింది. అయితే తిరిగి  బహుదేవతారాధన మొదలైంది. తమ పాత దేవతలను, మరుగున పడ్డ ఆరాధనా పద్ధతులను, తాత్త్వికచింతనలను ఐరోపావాసులు అన్వేషించి మరీ దగ్గరవుతున్నారు. ప్రస్తుతం వారి సంఖ్య తక్కువగా ఉన్నా, వెల్లువలా అది క్రైస్తవాన్ని ముంచి వేసే ప్రమాదం సమీప భవిష్యత్తులోనే ఉండడంతో క్రైస్తవ మతాధికారులు భయపడుతున్నారు. బలవంతపు మత మార్పిడులు, నరమేధం బూడిద నుండి ఫీనిక్స్‌ పక్షి మాదిరిగా బహుదేవతారాధన పైకి లేస్తున్నది.

ఉదాహరణకు అవతార్‌, థోర్‌, హారీ పీటర్‌ సినిమాల విజయం దేన్ని సూచిస్తున్నది? ప్రజలలోని కొత్త ఆధ్యాత్మిక పిపాసను, ప్రకృతి, బహుదేవతారాధన ఇవ్వగలిగే వైవిధ్యభరిత, తృప్తి కలిగించే జీవనాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలుస్తున్నది. పాగన్‌ మతాలలోని ధీరోదాత్తమైన, తేజోవంతమైన దేవీ దేవతల రూపాలను సిలువ వేసిన దేవుని బిడ్డ రూపంతో పోల్చుకున్నప్పుడు ఆలోచనాపరులు క్రైస్తవాన్ని ఎందుకు విడనాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కనీవినీ ఎరుగని పరిణామాలు

అమెరికన్లలో అనేకమంది తమ ఆత్మల ఓదార్పు కోసం క్రైస్తవంతో సేదదీరడం లేదు. అతీంద్రియ శక్తులు, ప్రకృతి ఆరాధన, తాంత్రిక పద్ధతులు ప్రస్తుతం బహుళ ప్రజాదరణకు నోచుకుంటున్నవి. గడచిన కొన్ని దశాబ్దాలలో చర్చ్‌లలో స్త్రీ దేవతారాధన, జ్యోతిష్యం, ఆధునిక రూపంలో బహుదేవతారాధన పద్ధతులపై వర్క్‌ షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రకృతి ఆరాధకులు, తాంత్రిక విద్యలను నేర్చినవారు ప్రసిద్ధి చెందిన చర్చిలలో మత ప్రబోధకులుగా  పనిచేస్తున్నారు. ఇది క్రైస్తవ మత చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం.

ఒక ప్రముఖ యూదు రచయిత అమెరికాను ఇక ఏమాత్రమూ క్రైస్తవ దేశంగా పేర్కొనకూడదని, ఎందుకంటే క్రమంగా అత్యధికులు బహుదేవతా, ప్రకృతి ఆరాధకులుగా తయారవుతున్నారని రాశారు. అమెరికాలో హైందవం, బౌద్ధం, విక్కా (WICCA), యూదులకు చెందిన కబాలా (KABBALA) సంప్రదాయాల వైపు ఆసక్తి పెరుగుతుండడాన్ని గుర్తు చేశారు.

అమెరికాలో అతిపెద్ద డినామినేషన్‌ అయిన సదరన్‌ బాప్టిస్ట్‌ చర్చి 2006 నుండి రెండు మిలియన్ల మందిని కోల్పోయింది. అరిజోనా క్రిస్టియన్‌ విశ్వవిద్యాలయం జూన్‌ 8, 2021న ప్రచురించిన నివేదిక ప్రకారం 1980లో 90 శాతం మంది తమను తాము క్రైస్తవులుగా గుర్తించుకోగా, 2014 నాటికి 75 శాతం మంది మాత్రమే ఆ విధమైన గుర్తింపునకు ఇష్టపడ్డారు. 2021 నాటికి 33 శాతమే తమను తాము క్రైస్తవులుగా గుర్తించటానికి ఇష్టపడ్డారు.

1991లో 86 శాతం సృష్టికర్తగా దేవుడ్ని నమ్మితే, 2021లో 21 శాతమే అట్టి నమ్మకం కలిగి ఉన్నారు. 1991లో 70 శాతం మంది బైబిల్‌ దైవ గ్రంథమని నమ్మితే, 2021 నాటికి అట్టి వారి శాతం 41కి పడిపోయింది. అంతేకాదు, క్యాథలిక్‌ చర్చిని విడిచిపెట్టినవారు ప్రొటెస్టెంట్లుగా మారటం లేదు. వారు చర్చ్‌ని, క్రైస్తవాన్ని రెంటినీ పూర్తిగా విడిచి పెడుతున్నారు.

ఇది అమెరికాకే పరిమితం కాదు. ఇంగ్లండ్‌ లోనూ చర్చ్‌కి వెళ్లే వాళ్ల సంఖ్య దారుణంగా పడిపోతున్నది. 1988లో 66 శాతం మంది తమను తాము క్రైస్తవులుగా అభివర్ణించుకుంటే, 2008లో 50 శాతం మంది, 2018లో 38 శాతం మంది మాత్రమే తమను తాము క్రైస్తవులుగా అభివర్ణించు కున్నారు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి.

అమెరికానే కాదు ఐరోపా ఖండం కూడా ఇప్పుడు పాడుబడ్డ చర్చ్‌ల సమాధిలాగా తయారవు తున్నదని కొందరు పరిశీలకులు అంటున్నారు. లండన్‌లోని సెయింట్‌ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన తత్త్వశాస్త్ర ఆచార్యుడు స్టీఫెన్‌, క్రైస్తవమతం తన ప్రాబల్యం కోల్పోవడాన్ని గురించి ఇలా చెబుతున్నాడు, ‘అప్రమేయంగా (As a default), వారసత్వంగా వచ్చే పద్ధతి ప్రకారం (As a norm) క్రైస్తవం ఒక మతంగా తన స్థానాన్ని కోల్పోయింది. బహుశా ఇదంతా మంచి కోసమే జరిగి ఉండవచ్చు. వచ్చే వందేళ్ల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు.’

చెక్‌ రిపబ్లిక్‌లో 91 శాతం యువకులకు మతం పట్ల నమ్మకం లేదని చెప్పారు. ఇస్టోనియా, స్వీడన్‌, నెదర్లాండ్స్‌లలోను అదే పరిస్థితి నెలకొంది. క్యాథలిక్‌ దేశమైన ఇటలీలోనూ 70 శాతం పైగా యువత చర్చ్‌కి, మతాలకి దూరంగా ఉన్నారు. ఐరోపా ఖండంలో అనేక దేశాలలో యువత క్రైస్తవాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చర్చ్‌లకు హాజరయ్యే వారి సంఖ్య వేగంగా పడిపోతున్నది.
క్రైస్తవ మతగురువుల కామకేళీ విలాసాలు

క్రైస్తవ మతగురువుల కామకేళీ విలాసాలు

క్రైస్తవ మత గురువులపై వస్తున్న లైంగిక ఆరోపణలు, మత గురువులను చర్చ్‌ అధికారులు కాపాడే ప్రయత్నం చేయడం కూడా చర్చ్‌ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న అంశాలలో ఒకటి. 1950 నుండి ఇప్పటివరకు ఒక్క ఫ్రాన్స్‌లోనే 2,16000 మంది పిల్లలపై మత గురువులు అత్యాచారాలు చేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా 2000 సంవత్సరం వరకూ చర్చ్‌ పెద్దలు పట్టించుకోలేదని ఇటీవలే విడుదలయిన ఒక నివేదిక బయట పెట్టింది. బాలలపై లైంగిక దాడులకు పాల్పడి ఆనందించే మతాధికారులను సుమారుగా 4 వేల మందిని ఫ్రాన్స్‌ విచారణ కమిటీ గుర్తించింది కూడా. అటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడే వారు అంతకంటే ఎక్కువమందే ఉంటారని కూడా ఆ నివేదిక తేటతెల్లం చేసింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు, అన్ని క్రైస్తవ దేశాలలోనూ మతాధికారులు, మత గురువులు విచ్చలవిడిగా అసహజ, అనైతిక శృంగార కార్యకలా పాలలో పాల్గొంటున్నారని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. మత గురువుల అనైతిక, అసహజ కామకేళీ కలాపాలను నియంత్రించలేని బైబిల్‌ దేవుడి అసమర్థతను, పవిత్రాత్మ చేతగానితనాన్ని చూసి క్రైస్తవులు సంశయంలో పడిపోతున్నారు. దాంతో ఐరోపాలో అనేక దేశాలలో యువతరం చర్చ్‌కి దూరం అవుతున్నారు. ఇది బహుశా క్రైస్తవ మతాంతర సమాజం వైపు ఆ దేశాలలో అడుగులు వేగంగా పడుతున్నాయనడానికి సంకేతం.

ప్రకృతి అరాధనకే పెద్దపీట

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో భాగంగా ప్రకృతి ఆరాధనకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది. ప్రకృతి ఆరాధకుల తత్త్వ చింతన అనేకమంది పర్యావరణ వేత్తలకు నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. ప్రకృతిని మాతగా ఆరాధించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. స్త్రీవాదులు దీని ఆధారంగా స్త్రీల ప్రాముఖ్యం తెలియజెప్పటానికి ఉద్యుక్తులైనారు. ప్రకృతిమాత అనే భావనను అటు స్త్రీ వాదులు, ఇటు పర్యావరణ వాదులు బహుళ ప్రచారం చేశారు. మహిళల శక్తిసామర్థ్యాలకు, ఓర్పుకు, నేర్పుకు ప్రతీకగా ప్రకృతిమాతను  కొలవటం మొదలెట్టారు. దానితో ప్రకృతితో మానవుడికి ఉన్న అనుబంధం, అనివార్యంగా ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం ప్రకృతి ఆరాధకుల తత్వచింతన లోని గొప్పతనం ఈనాటి తరానికి తెలిసి వచ్చేలా చేసింది. అదేవిధంగా ఆదిమ తెగలతో తమకున్న సంబంధాన్ని సైతం వారు ఇప్పుడు తెలుసు కుంటున్నారు. అనేక పాత సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రష్యాలో క్రూసేడ్‌ల తర్వాత నామ రూపాలు లేకుండా పోయారనుకున్న స్థానిక తెగలకు చెందిన వారు తమ సంస్కృతి సాంప్రదాయాలతో తిరిగి కనపడుతున్నారు. అనేక దేశాలలో గత కాలపు అస్తిత్వాలను కాపాడుకునే ప్రయత్నాలు మొదల య్యాయి. క్రీస్తుకు పూర్వం ఉన్న సంస్కృతికి తిరిగి పురుడు పోసే ప్రయత్నాలు పుంజుకుంటున్నాయి.

100 కోట్ల మంది హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకోగలిగారు. 1400 సంవత్సరాల విదేశీ దాడుల తర్వాత సైతం సనాతన ధర్మం సడలి పోలేదు. బహుదేవతారాధకుల, ప్రకృతి ఆరాధకుల సంప్రదాయ శక్తి అది. పర్షియా, గ్రీసు, రోమ్‌, ఈజిప్ట్‌, మెసపటోమియాలకు పట్టిన దుర్గతి హిందూదేశానికి పట్టకపోవడానికి కారణం హిందువులు ఏకైక దైవ మతవాదులకు ఎదురొడ్డి పోరాడి నిలవగలగటమే. ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాలలో ఏకైక దైవ మతాలకు ముందున్న మత సంస్కృతులు ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలి పోగా, ఒక్క భారత దేశంలోనే ఆ సంప్రదాయం, సంస్కృతి కొనసాగు తున్నాయి.

క్రైస్తవం, వలస పాలన కారణంగా ధ్వంసం కాగా మిగిలిపోయిన అవశేషాల నుండే నేడు 2000 సంవత్సరాలకు ముందు వెల్లివిరిసిన సంస్కృతీ సాంప్రదాయాలను వెలికితీసి, బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చే సవాలు అనేక దేశాలలో మొదలవటం క్రైస్తవం వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. సంఘటిత, సామూహిక (Congregating) మతాల అసంబద్ధమైన వేదాంతం, నిస్సారమైన ఆధ్యాత్మికత సత్యాన్వేష కులను తృప్తి పరచలేకపోతున్నవి. జ్ఞాన పిపాసుల జ్ఞాన తృష్ణను చల్లార్చలేకపోతున్నాయి. నిజమైన ఆధ్యాత్మికత కోసం తహతహలాడే వారికి ప్రపంచాన్ని గత వెయ్యి సంవత్సరాలుగా ప్రభావితం చేసిన ప్రధాన మతాలు గమ్యంగా లేకపోవడం ఆశ్చర్యకరమైన వాస్తవం.

బలహీనమైన తాత్త్విక పునాదులు

ఆధునిక సమాజపు యాంత్రికతతో విసుగెత్తిన పాశ్చాత్యులు పరాయీకరణకు లోనవుతున్నారు. వారి మతంలో వారికి సమాధానాలు దొరకడం లేదు. దీనికి తోడు మతగురువుల నైతిక పతనం, మేధోపర దివాలా, డబ్బు, అధికారం, పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాట క్రైస్తవం పట్ల వారికున్న భ్రమలు తొలగిపోయేటట్లు చేశాయి.

క్రైస్తవ దేవుడు తనను ద్వేషించే తల్లిదండ్రులను క్షమించడు. అంతేకాదు 3,4 తరాల వరకు వారి పిల్లలను సైతం క్షమించడు. అంటే తల్లిదండ్రుల నమ్మకానికి తర్వాతి తరాల వారు కూడా బలి అయిపోతారన్నమాట. కానీ తనను ప్రేమించి, తన ఆదేశాలను అమలు చేసే వారికి వెయ్యి తరాల వరకు తన ఆశీస్సులు, ప్రేమ ఉంటాయని బైబిల్‌ దేవుడు పేర్కొన్నాడు. అంతేకాదు తనను నమ్మని వారిని నరమేధం చెయ్యమని తనను నమ్మిన వారిని ఆదేశించి, ప్రోత్సహిస్తాడు.

క్రైస్తవం తాత్త్విక పునాదులు బలహీనంగా ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రీకు, రోమన్‌ సమాజాలు దాని తొలినాళ్లలోనే గుర్తించాయి. Phoenician తత్వవేత్త Porphyry (234 -305 CE) ఏమంటున్నాడో చూడండి.

‘ఎన్నో పాపాలు, ఘోరాలు చేసిన వ్యక్తి ఒక్క సారిగా (క్రైస్తవం స్వీకరించ గానే) పునీతుడు అవుతాడు అన్న భావన సమర్ధనీయం కాబోదు. గందరగోళానికి దారి తీసేది. ఒక పాము తన పాత చర్మం వదిలిపెట్టి కొత్త చర్మాన్ని పొందినట్లుగా ఒక జీవిత కాలపు అనైతిక ప్రవర్తన, చేసిన పాపాలు బాప్టిజంతో మటుమాయం అవుతుందని ప్రతిపాదన చెయ్యటం హాస్యాస్పదంగా లేదా? చేసిన దుర్మార్గాలు, పాపాలు క్షమించబడతాయని ముందుగా తెలిసినప్పుడు, వాటిని చేయటానికి ఎవరైనా ఎందుకు వెనకాడతారు? అటువంటి హామీలు పాపాలకు, దుర్మార్గాలకు ఒడిగట్టడానికి ప్రోత్సాహ కాలుగా పని చేస్తాయి కదా?’

పై కారణాల వల్ల పాశ్చాత్యులు నియో పాగనిజం వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. ఇదే చర్చ్‌ను కలవరపెడుతున్నది. వారి దృష్టి మొదటి నుండి సంఖ్యాబలాన్ని పెంచుకోవటం మీదే ఉంది. చర్చ్‌కి హాజరయ్యే వారి సంఖ్య తగ్గటంతోపాటు తాము నిర్మూలించామని అనుకున్న పాత సంస్కృతీ సాంప్రదాయాల పునరుద్ధరణ వారిని నిద్ర పోనివ్వటంలేదు. సనాతన ధర్మం తో పాటుగా ఇతర పాగన్‌ మతాలు సంఖ్యను పెంచుకోవటానికి ఎప్పుడూ వెంపర్లాడలేదు. సత్యాన్వేషణ, బహుదేవతారాధన, ప్రకృతి ఆరాధన ఆ మతాలు మానవాళికి ఇచ్చిన విలువైన కానుకలు.

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం

సహజ సిద్ధ మతాలకు, సామూహిక ప్రార్థన మతాలకు ఎందులోనూ పోలిక లేదు. సహజ సిద్ధ మతాలకు సంఘటితమైన మత వ్యవస్థ ఉండదు. తమ విశ్వాసాలను ఇతరులపై రుద్దాలన్న మూర్ఖత్వం వాటికి లేదు. విశ్వాసులు, అవిశ్వాసులు అని ప్రపంచాన్ని విభజించవు. కనుక మతమార్పిడికి అవి పూనుకోవు. ఏదో రకంగా అంటే ప్రలోభపెట్టో, భయపెట్టో సంఖ్యాబలాన్ని అవి పెంచుకోవు. తాము కొలిచే ఏకైక దేవుడినే ఇతరులు కొలవాలని అవి అనుకోవు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ, పరమత సహనం వాటి ప్రత్యేకత.

పాశ్చాత్య దేశాలలో క్రైస్తవుల సంఖ్య సమీప భవిష్యత్తులో గణనీయంగా పడిపోతుంది. ఈ లోటును భర్తీ చెయ్యడానికి భారతదేశంలో క్రైస్తవాన్ని మరింత వేగవంతంగా వ్యాప్తి చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించారు. పాశ్చాత్య దేశాలలో కనుమరుగవు తున్న క్రైస్తవం మన దేశంలో బలపడకుండా చూడాలి. క్రైస్తవ వ్యాప్తిని అడ్డుకోవాలి. తాత్త్వికం గానూ, నైతికంగానూ బలహీనపడిన శత్రువును ఓడిరచటం తేలిక. క్రైస్తవాన్ని దెబ్బకొట్టటానికి ఇదే సరైన అదను. మరింత పట్టుదలతో పని చేసి క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకుందాం. సనాతన ధర్మ వ్యాప్తికి పూనుకుని దానిని పరిరక్షించుకుందాం.

జాగృతి సౌజన్యంతో...

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top