సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్ - RSS Chief Shri Mohan Bhagwat in Godavari Sangam

Vishwa Bhaarath
0
సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్
ప్రతిరోజూ శాఖకు వెళ్లడం ద్వారానే స్వయంసేవకులలో గుణవికాసం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 25/12/2021 ఆదివారం నాడు జరిగిన ‘గోదావరి సంగమం’ ఈ కార్యక్రమంలో శ్రీ భాగవత్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఉభయగోదావరి జిల్లాలనుంచి 11, 860 మంది స్వయంసేవక్ లు పాల్గొన్న ఈ గోదావరి సంగమంలో ఆర్ ఎస్ ఎస్ అధినేత ప్రసంగంలోని ప్రధానాంశాలను ఓసారి పరికిద్దాం….


“సంఘంలో మనం శాఖకు వస్తూ మన జీవితంలో మంచి మార్పు తెచ్చుకుంటాం. ఆ విధంగా పవిత్రంగా ప్రతిజ్ఞ చేయడం, అందుకు అనుగుణంగా చివరి శ్వాస వరకూ సంఘం పని చెయ్యడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధర్మం గురించి చెప్పారు. హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షిస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. హిందూ ధర్మాన్ని సంరక్షించడం అంటే ధర్మంలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవడం. లోటుపాట్లను ఎందుకు సరి చేసుకోవాలంటే మనం అదే ధర్మంలో జన్మించాం కనుక. ఇలా లోటుపాట్లను సరి చేసుకుని ధర్మాన్ని సంరక్షించే వాళ్లను సంఘటితం చెయ్యడమే మన పని.

ధర్మం అంటే అనేక సిద్ధాంతాలు కాదు. మన ప్రాచీన కాలం నుండి ఋషులు, మునులు దర్శించి ఆచరించినదే ధర్మం.

సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్ - RSS Chief Shri Mohan Bhagwat in Godavari Sangam

ఇలా దర్శించిన వాళ్ళు మిగిలిన ధర్మాలలో ఎక్కడా లేరు. మన ధర్మంలో సత్యం ఉంది. శత్రుత్వం లేదు. కాబట్టి ఇతర ధర్మాలను నాశనం చెయ్యాలనే ఆలోచన మన ధర్మంలో లేదు. ఏ మార్గంలో వెళ్లినప్పటికీ కూడా లక్ష్యం ఒకటే అనే ఆలోచన మన ధర్మంలో ఉంది కాబట్టి ఎవరినీ మన మతంలోకి మారమని అడగలేదు.

కానీ ఇతర మతాలవారు మన ధర్మంలో ఉన్నవారిని ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు. మన హిందూ ధర్మం యొక్క సత్య సిద్ధాంతాన్ని మన హిందువులందరికీ తెలియజేసి వారు మతం మారకుండా చూడాలి. ఈ బాధ్యత మనందరిదీ. సమాజాన్ని కలుపుకుంటూ ఈ పనిని వేగవంతం చెయ్యాలి.

మనము సంపూర్ణ హిందూరాష్ట్ర సంఘటన చెయ్యటానికి సంకల్పం చేశాం. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మనమందరం ఒక్కటే అనే భావనతో సంఘటితం చెయ్యాలి.

హిందూ ధర్మంలో ఉండే సత్యము, కరుణ, పవిత్రత, పరిశ్రమ, తపస్సు వీటి ఆధారంగా అందరినీ కలుపుతూ మనం మన ధర్మాన్ని సంరక్షించుకోవాలి. ధర్మం… ఆచరణ ద్వారానే రక్షించబడుతుంది. ధర్మాచరణ ప్రతిబింబమే సంస్కృతి. సమాజంలో విభిన్న భావాలు ఉన్నప్పటికీ కూడా మనందరం ఒక్కటే, మన సంస్కృతి ఒక్కటే.

75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సంగ్రామంలో బలిదానం అయ్యారు. వారు యావత్ భారతదేశానికి ఆదర్శం, ఆరాధనీయుడు. అటువంటి వ్యక్తుల వారసులం మనం. సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటిత పరుస్తూ ఈ దేశాన్ని వైభవ స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. ఈపని స్వయంసేవకుల నేతృత్వంలో ప్రారంభమవుతోంది.

నేను స్వయంసేవక్ గా ఎలా తయారవుతున్నాను? అని మనం ఆలోచించాలి. మన ప్రార్థనలో “అజయ్యాంచ విశ్వస్య దేహీశ శక్తిమ్” అని శక్తిని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వెనువెంటనే “సుశీలం జగద్ యేన నమ్రమ్ భవేత్” అంటున్నాం. అజేయమైన శక్తితోపాటు ప్రపంచం మొత్తం మోకరిల్లే సౌశీల్యాన్ని కూడా మనం కోరుకుంటున్నాం. మన కార్యం సుగమం అవడానికి, ఇందులో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి జ్ఞానాన్ని ఇమ్మని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఇహపర లోకాలలో ఉన్నతిని సాధించడానికి వీరవ్రతాన్ని ఇమ్మని కోరుకుంటున్నాం.

సంఘ శాఖ ద్వారానే గుణ వికాసం – ఆరెస్సెస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్ - RSS Chief Shri Mohan Bhagwat in Godavari Sangam

అలాగే అనేకరకాల ఆకర్షణలు, ఒత్తిడులు, ప్రలోభాలు ఉన్న పరిస్థితులలో సైతం మన లక్ష్యాన్ని చేరుకునే ధ్యేయనిష్ఠను ఇమ్మని కోరుకుంటున్నాం. మనం ఈ ఐదు గుణాలను కోరుకుంటున్నాం. ఈ ఐదు గుణాలు సాధించే కేంద్రము సంఘ శాఖ. దానికోసం మనం రోజూ శాఖకు వెళ్లాలి. శాఖ ద్వారానే మనం సంస్కారాలు పొందుతాం.

కాబట్టి శరీరం, మనస్సు, బుద్ధి వికాసంతో పాటు అందరితో కలిసి పని చేసే అలవాటు, సమాజాన్ని కలిపే అలవాటు మనకు శాఖ ద్వారా లభ్యమవుతోంది. ఈ గుణాలను మనం సాధించిన తర్వాత అన్ని గ్రామాలకీ, అన్ని బస్తీలకీ ఈ పనిని తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యత కలిగిన కార్యకర్తలు అందరూ కూడా సంఘ కార్యం కోసం ఎక్కువ సమయం ఇవ్వాలి. అన్ని గ్రామాల్లో, బస్తీల్లో సాధనా కేంద్రాలను నిర్మాణం చేయాలి. దీంతోపాటు కొంతమంది పూర్తి సమయం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమాజం మనల్ని విశ్వసిస్తుంది. మన వెంట వస్తుంది.


నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత శ్రీ అల్లూరి వెంకట నరసింహ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి, ప్రాంత సహ సంఘచాలక్ శ్రీ సుంకవల్లి రామకృష్ణ, భీమవరం విభాగ్ సంఘచాలక్ శ్రీ మంతెన రామచంద్రరాజు, రాజమహేంద్రవరం విభాగ్ సంఘచాలక్ శ్రీ రిమ్మలపూడి సుబ్బారావులు పాల్గొన్నారు. క్షేత్ర, ప్రాంత అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

.....విశ్వసంవాద కేంద్రము 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top