అర్థంలేని పోరాటాలు కాలం చెల్లిన మావోయిస్టుల విధానాలు - Meaningless Fights, Outdated Maoist Policies

Vishwa Bhaarath
0
అర్థంలేని పోరాటాలు కాలం చెల్లిన మావోయిస్టుల విధానాలు - Meaningless Fights Outdated Maoist Policies

అర్థంలేని పోరాటాలు కాలం చెల్లిన విధానాలు

మధ్యయుగాల నుంచి కాలం మారుతూ వస్తోంది. నాటి అరాచకాలకు, అనాగరిక పద్ధతులకు క్రమంగా సమాజం దూరమవుతూ ముందుకు సాగుతోంది. ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తోంది. నాగరికతను సంతరించుకుంటోంది. ఈ పరిణామ క్రమంలో హింస కనుమరుగవుతోంది. స్వేచ్ఛ, సమానత్వం వైపు ప్రయాణిస్తోంది. ఏదో నేరం చేశారనే పేరుతో ఒకరి ప్రాణాన్ని మరొకరు తీసే హక్కు ఎవరికీ లేదు. చట్టబద్ధమైన మార్గాల్లో తప్ప చివరికి రాజ్యానికి కూడా ఈ హక్కు లేదు. న్యాయపరమైన విచారణ, సాక్ష్యాధారాలు, పై కోర్టులో అప్పీళ్లు, రాజ్యాంగాధి నేతల క్షమాభిక్ష వంటి చట్టపరమైన మార్గాలన్నీ మూసుకుపోయిన తరవాతే ఒక వ్యక్తి ప్రాణం తీసేందుకు సర్కారుకు చట్టం అనుమతిస్తుంది. ఆధునిక, నాగరిక సమాజంలో హత్య అన్న మాట వినడానికే అసౌకర్యంగా ఉంటుంది.

ఇందుకు భిన్నంగా పేదల హక్కులు, వారి ప్రయోజనాల కోసం నిరంతరం పని చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అనాగరికం. వివిధ అంశాలకు సంబంధించి తామే విచారణ జరపడం, దోషులను తమదైన రీతిలో దండించడం క్షమించరాని నేరం. నేరాల విచారణకు పోలీసులు, న్యాయస్థానాల వంటి చట్టబద్ధమైన మార్గాలు ఉన్నప్పటికీ అన్నీ తామై వ్యవ హరించడం, ఈ పక్రియలో అమాయక ప్రజల ప్రాణాలను హరించడం అత్యంత హేయనీయం. పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులను శిక్షించడం దారుణం. తాము ఏ పేద ప్రజల కోసమైతే పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారో వారినే లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం, కఠినాతి కఠినంగా శిక్షించడాన్ని సభ్య సమాజం అంగీకరించదన్న సత్యాన్ని వారు గ్రహించడం లేదు.

ఇటీవల బిహార్‌లో కొందరు మావోయిస్టులు పోలీసు ఇన్‌ ‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కిరాతంగా హతమార్చారు. రాష్ట్రంలోని గయ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం జార్ఖండ్‌ ‌సరి హద్దుల్లో ఉంటుంది. ఉమ్మడి బిహార్‌ను విభజించి 2000, నవంబర్‌లో జార్ఖండ్‌ ‌రాష్ట్రం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అడిషనల్‌ ‌డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ‌కథనం మేరకు దుమారియా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఈ నెల రెండో వారంలో (నవంబరు 13) ఈ ఘటన జరిగింది. సరయూ సింగ్‌ ‌భోక్తా అనే గిరిజనుడు పోలీసు ఇన్‌ ‌ఫార్మరుగా పని చేస్తున్నారన్నది మావోయిస్టుల అనుమానం, అభియోగం. దీంతో ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయన ఇద్దరు కుమారులు, వారి భార్యలను కిరాతంగా కాల్చి చంపారు. పశువుల కొట్టానికి వారి మృతదేహాలను వేలాడదీశారు. తమ గురించి పోలీసులకు ఎవరు సమాచారమిచ్చినా వారికి ఇలాంటి శిక్షే అమలు చేస్తామని హెచ్చరిస్తూ అక్కడ ఒక లేఖ వదిలివెళ్లారు. సీఏఏ (సిటిజన్‌షిప్‌ అమెండ్మెంట్‌ ‌యాక్టు- పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజెన్స్ – ‌జాతీయ పౌరపట్టిక)లను వ్యతిరేకిస్తున్నట్లు ఆ లేఖల్లో పేర్కొన్నారు. బిహార్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌జార్ఖండ్‌, ‌తెలంగాణ రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర లోనూ మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగు తున్నాయి. గడ్చిరోలి, గోండియా తదితర జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు బలంగా ఉన్నాయి. పై రెండు జిల్లాలతో పాటు వార్థా, యువత్మల్‌, అమరావతి, నాగపూర్‌ ‌జిల్లాలను కలిపి విదర్భ ప్రాంతంగా వ్యవహరిస్తారు. దీనికి నాగపూర్‌ ‌కేంద్రం. నాగపూర్‌ ‌కేంద్రంగా విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని గత కొంతకాలంగా అక్కడ పోరాటం కూడా కొనసాగుతోంది. ఈ నెలలో గడ్చిరోలి జిల్లాలోని గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతులయ్యారు. ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో ఉంటుంది. కోర్బి తహశీల్‌ ‌ప్రాంతంలోని గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత బాబూరావు తేల్తుండే మరణించాడు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. అతని అనుచరులైన దిలీప్‌ ‌వాల్సే పాటిల్‌, ‌కిషన్‌ ‌జైమాన్‌లపై రూ.8 లక్షలు, రూ. 6 లక్షల రివార్డులు ఉన్నాయి. ఉన్నతాధికారి సౌమ్య ముండే నాయకత్వంలో గాలింపు చేపడుతుండగా ఎదురు కాల్పులు జరిగాయని జిల్లా ఎస్పీ అంకిత్‌ ‌గోయల్‌ ‌వెల్లడించారు. ఇక్కడ పోలీసులు మావోయిస్టులను ఏరివేసేందుకు గాలింపు చేపడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు అమాయక గిరిజనులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. చట్టాలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటూ కిరాతకంగా వ్యవ హరిస్తున్నారు. తద్వారా తాము ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నారో ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నమన్న వాస్తవాన్ని గ్రహించడం లేదు.

బిహార్‌ ‌దాని పొరుగున ఉన్న జార్ఖండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల్లో నేటికీ మావోయిస్టుల కదలికలు బలంగానే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, ‌సుక్మా జిల్లాలు వాటి సరిహద్దులో గల తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో నేటికీ మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు పదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు మహేంద్రవర్మను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్న సంగతి అప్పట్లో సంచలనం కలిగించింది. పోలీసుల లక్ష్యంగా మందు పాతరలు పేల్చడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం మావోయిస్టుల లక్ష్యంగా మారింది. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని చురాచందపూర్‌ ‌జిల్లా సింగ్గట్‌ ‌సబ్‌ ‌డివిజన్లో ఈనెల 13న ఇండియన్‌ ఆర్మీకి చెందిన కల్నల్‌ ‌త్రిపాఠీ ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో ఆయనతోపాటు ప్రయాణిస్తున్న భార్య అనుజా త్రిపాఠీ, వారి ఆరేళ్ల కూమారుడు అబిర్‌ ‌త్రిపాఠీ, అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ ‌షా, మణిపూర్‌ ‌ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. దాడికి తమదే బాధ్యతని పీఎల్‌ఏ (‌పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ) మణిపూర్‌ ‌ప్రకటించింది. తమ లక్ష్యం అధికారే తప్ప ఆయన భార్య, కూతురు కాదని తరవాత పీఎల్‌ఏ ‌ప్రకటించింది. అంతేకాక తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబాలతో ప్రయాణించవద్దని ఓ ఉచిత సలహా పారేసింది. ముందు దాడులు జరిపి ఆనక తీరిగ్గా విచారం వ్యక్తం చేయడం మావోయిస్టులకు కొత్తేమీ కాదు. వారికి పరిపాటైన విద్యే ఇది. ఈశాన్య భారతంలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలకు పొరుగున ఉన్న చైనా దన్ను ఉందన్నది బహిరంగ సత్యం. భారత్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేని బీజింగ్‌ ‌తెరవెనక కుతంత్రాలకు పాల్పడుతూ అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.

 గత కొన్నేళ్లుగా మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెంచాయి. ఇందుకోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా మావో యిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్య మంత్రులతో తరచూ సమావేశ మవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపిస్తున్నారు. ఈ పరిణామాలతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తమ కార్యకలాపాల గురించి పోలీసులకు ముందే తెలిసిపోతుండటంతో వారి ఆటలు సాగడం లేదు. దీనికితోడు తమ పంథా సరైనది కాదని గ్రహించి కొంతమంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. కన్నవారిని, కట్టుకున్న వారిని వదిలి, దశాబ్దాల తరబడి రహస్యంగా అడవుల్లో జీవిస్తూ తాము సాధించింది ఏమీ లేదని అనుభవపూర్వకంగా అర్థం కావడంతో పలువురు మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమవుతు న్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి, అయినవారికి అండగా నిలుస్తూ, కష్టపడి, చట్టబద్ధమైన జీవనం సాగించడంలో ఉన్న సంతోషం మరెక్కడా లేదని వారికి తెలిసివస్తుంది. దీనికి తోడు వారి పునరావా సానికి, జీవనం సాగించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొందరు సామాజిక కార్యకర్తలు లొంగిపోయినా మావోయిస్టుల్లో చైతన్యం కల్పించేందుకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. కొంతమంది మావోయిస్టులు అధికారులను, సర్కారునూ నమ్మకపోయినా వీరిని పూర్తిగా విశ్వసిస్తూ ముందుకు నడుస్తున్నారు. అడవుల్లో ఉంటూ రహస్య జీవితం సాగిస్తున్న వారి వైఖరిలో మార్పు కనపడుతోంది.

యువత వైఖరిలో మార్పు రావడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కొత్తగా మావోయిస్టుల్లో చేరేందుకు యువకులు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. వారు హేతుబద్ధమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. మంచి విద్యతోనే తమ బతుకులు బాగు పడతాయని వారు విశ్వసిస్తున్నారు. అందువల్లే తమ శక్తియుక్తులను పూర్తిగా విద్యపైనే వెచ్చిస్తున్నారు. వారి ప్రయత్నానికి ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయి. గిరిజనుల పిల్లల కోసం ఉద్యోగాల అర్హత వయసు పెంపు, అర్హత మార్కుల తగ్గింపు వంటి వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇలా ప్రభుత్వ వెసులుబాట్ల వల్ల లబ్ధి పొందినవారు సాగిస్తున్న మెరుగైన జీవితం చూసి మరికొందరు వారి బాటలో ప్రయాణిస్తున్నారు. రాజకీయాల పరంగా కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను గిరిజనులకు ప్రత్యేకించడంతో వారు పాలనలో భాగస్వాములు అవుతున్నారు. విధాన నిర్ణయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అంతిమంగా ఈ పరిణామాలు మావోయిస్టులకు ఎదురుదెబ్బగా పరిణమిస్తున్నాయి. హింసతో తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని వారికి అనుభవ పూర్వకంగా ఇప్పుడు అర్థమవుతోంది.

ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకు రావడం ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా, దారితప్పిన యువతలో పరివర్తన తేవడం ద్వారా మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించగలం. రేపటి పౌరులకు మంచి భవిష్యత్తును అందించగలం. అంతేతప్ప అర్థరహితమైన పోరాటాల ద్వారా, కాలం చెల్లిన విధానాలతో ముందుకు వెళ్లడం వల్ల జరిగే మేలు కన్నా కీడే ఎక్కువన్న చేదు నిజాన్ని గుర్తించడం అవసరం. ఈ విషయాన్ని మావోయిస్టులు ఎంత త్వరగా గ్రహిస్తే వారికీ, సమాజానికి అంత మంచిది.

– దోర్బల పూర్ణిమాస్వాతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ - జాగృతి సౌజన్యంతో  - (full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top