హిందూ ఫోబియా: హిందూ ధర్మాన్ని నాశనం చేసేపనిలో దుష్టుల కుట్ర - Definition of Hinduphobia

0
హిందూ ఫోబియా - హిందూ ధర్మాన్ని నాశనం చేసేపనిలో దుష్టుల కుట్ర - Definition of Hinduphobia
హిందువులపై దాడులు!
మా మతం యువకులు ఆయుధాలు పట్టుకుంటే హిందువులకు ఈ దేశంలో తలదాచుకోవడానికి కూడా చోటుండదు’ అంటూ బహిరంగంగా హెచ్చరించాడో ముస్లిం మతోన్మాది- నిన్నగాక మొన్ననే. ఉత్తరప్రదేశ్‌ ‌శాసనసభ ఎన్నికల వేళ ఎలాంటి సంకోచం లేకుండా ఓ మౌల్వీ నోటి నుంచి వచ్చిన బెదిరింపు ఇది. ఈ దేశంలో ముస్లింలకు భద్రత లేదు, ఎన్నికలలో సాధించిన మెజారిటీని సాంస్కృతిక ఆధిక్యంగా చిత్రించే నాయకులు దేశాన్ని ఏలుతున్నారు అంటాడు మాజీ రాష్ట్రపతి మహమ్మద్‌ ‌హమీద్‌ అన్సారీ. భరతమాత ఫొటో పెడితే మనోభావాలు గాయపడతాయి కాబట్టి తొలగించమంటుందో మైనార్టి సమూహం. హిందూయిజం గొప్పది, హిందూత్వ నిర్మూలించవలసినది అంటాడు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌. ‌పదిహేను నిమిషాలు పోలీసులు  తప్పుకుంటే హిందువులను లేపేస్తాం అంటాడు మరొక హైదరాబాద్‌ ఉన్మాది. భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులే. కానీ వారి రక్షణ ఈ నేల మీదనే కొన్ని శతాబ్దాలుగా ప్రశ్నార్థకంగానే ఉంది. అందుకే హిందూ ఫోబియా ఒక వాస్తవం, ఇప్పటికైనా గుర్తించండి అంటూ జనవరి 18న ఐక్యరాజ్యసమితిలో మన శాశ్వత ప్రతినిధి టీఎస్‌ ‌తిరుమూర్తి కోరారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, దాడులను ఇప్పటికైనా గుర్తించాలని తిరుమూర్తి స్పష్టంగా ప్రకటించారు. క్రిస్టియానో ఫోబియా, ఇస్లామో ఫోబియా, యూదు వ్యతిరేకత వంటి అంశాలను గుర్తించాలంటూ ప్రపంచమంతటా ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు హిందూ ఫోబియాను కూడా ప్రపంచ దేశాలు అనివార్యంగా గుర్తించాలి.

శతాబ్దాల చరిత్ర కలిగిన, విశ్వవిఖ్యాత ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం మొదలుకొని నిన్న మొన్న మతం మారనందుకు తంజావూరులో ఒక క్రైస్తవ మిషనరీ పాఠశాల యాజమాన్యం పెట్టిన చిత్రహింసలతో హిందూ బాలిక ఆత్మహత్య చేసుకోవడం వరకు హిందూ ఫోబియా సుస్పష్టం. చరిత్రలో తొలిసారి ఒక భారతీయ విద్యార్థిని ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఆమె మీద సనాతన హిందువు ముద్ర వేసి, రాజీనామా చేయించారు. బొట్టు పెట్టుకున్నందుకు కొన్ని దేశాలలో హిందువులు దాడులకు గురి కావలసి వచ్చింది. ఇక పాకిస్తాన్‌, ‌బంగ్లా, అఫ్ఘానిస్తాన్‌లలో హిందువుల పరిస్థితి చెప్పక్కరలేదు. ఆఖరికి కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కూడా హిందువులు కొన్ని ప్రాంతాలలో ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతుకుతున్నారు.


ప్రపంచంలో, భారతదేశంలో కొన్ని బలమైన శక్తుల, సమూహాల మాటలే ఐక్య రాజ్యసమితికి శిరోధార్యమనిపిస్తుంది. వాస్తవాలను కొంచెం కూడా పట్టించుకోకుండా ఐరాస వ్యవహరిస్తుందని, పాక్షిక సత్యాలనే పట్టించుకుంటుదని చెప్పినా తొందరపాటు కాదు. ఇది అర్ధం లేని ఆరోపణ అయితే, భారత దేశంలో కొన్నిచోట్ల ముస్లిం మతోన్మాదుల ఆగడాలు భరించలేక హిందువులు గ్రామాలను వదిలిపోతున్న సంగతి ఐక్య రాజ్యసమితి దృష్టికి ఎందుకు రాదు? 1971లో బంగ్లాదేశ్‌లో జరిగిన హిందువుల ఊచకోత గురించి పట్టించుకునేది కదా! ఆ నెత్తుటి ఘట్టానికి యాభయ్‌ ‌సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆసియా అంతా గుర్తు చేసుకున్నది కూడా. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి హిందువులను సామదాన భేద దండోపాయాలతో ఖాళీ చేయిస్తున్న వాస్తవాన్ని కూడా గుర్తెరిగేది. గ్లోబల్‌ ‌డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌హిందుత్వ పేరుతో నలభయ్‌ ‌విద్యాలయాలు హిందూధర్మం మీద దండెత్తడాన్ని నిరసించేది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్‌ ‌లోయ నుంచి హిందువులైన పండిట్‌లను తరిమేసిన సంగతి మీద సమితి ఆరా తీయించేది. అక్కడ హిందువుల మీద జరిగిన ఘోరాల గురించి దర్యాప్తు చేయించేది. కేరళలో హిందువులు, క్రైస్తవుల యువతులను ప్రలోభాలతో ఇస్లాంలోకి మార్చి ఐసిస్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థకు తరలిస్తున్న ఆ రాష్ట్ర ముస్లిం మతోన్మాదుల దారుణాలను ప్రశ్నించేది. అందుకే ఇలాంటి అంధత్వం నుంచి అంతర్జాతీయ సంస్థను బయటకు తేవడానికి తిరుమూర్తి ఈ ప్రతిపాదనను పునరుద్ఘాటించవలసి వచ్చింది. మతపరమైన ఫోబియా గురించి చెప్పినప్పుడు హిందూ ఫోబి యాను గుర్తించి తీరాలని రెండేళ్ల నుంచే భారత్‌ ‌పట్టుపడుతున్నది.

హిందూ ఫోబియా అంటే?

భారతీయ సనాతన ధర్మం పట్ల, హిందువుల పట్ల శత్రుభావం కల్పించడం. ఆ మతాన్ని విధ్వంసక దృష్టితో చూడడానికి ప్రేరేపించడం. ఆచార వ్యవహా రాలను అడ్డం పెట్టుకుని వారిని కించపరచడం. వారి పట్ల అర్థం లేని భయాలను, అబద్ధాలను వ్యాప్తి చేయడం. ద్వేషాన్ని రేకెత్తించడం. అంతిమంగా హిందువులను ఒంటరులను చేయడం. హిందూ ధర్మం మీద, భారతీయత మీద దాడి, దుష్ప్రచారం చిరకాలంగా ఉన్నదే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనిని వ్యాప్తి చేసే పనిని కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఉద్యమ స్థాయిలో చేపట్టారు. నిజానికి హిందూధర్మం, భారతీయ సనాతన జీవన సూత్రాలు, వారి గతం అంత ప్రమాదకరమైనవా? ఆధునిక యుగంలో హిందూధర్మం మీద మొదలైన విష ప్రచారానికి మూలం పాశ్చాత్య దేశాల జాత్యహం కారమే. పాశ్చాత్య దేశాలలో నానాటికీ పెరుగుతున్న మత అసహనం, తమ మతమే ప్రపంచాన్ని ఏలాలన్న ఆధిపత్య ధోరణి కూడా ఇందుకు కారణాలు. కానీ హిందూధర్మం మీద విషం చిమ్మే అంధత్వం ఎంత ఉన్నదో, హిందూధర్మంలోని అమృతమయ చింతనకూ, ఆచరణకూ కైమోడ్పులు అర్పించేవాళ్లూ అంతమందే ఉన్నారు. కానీ దుష్ప్రచారానిదే పైచేయి అవుతోంది. హిందూ ధర్మం మీద కనీస అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. ఇక వాస్తవాలకు మీడియా చేస్తున్న ద్రోహం మరొకటి. మీడియాలో వచ్చే వక్రీకరణల మీద ఆధారపడడం, పాఠ్యప్రణాళికలలో, విద్యాలయాలలో ఏర్పడిన అవగాహనా రాహిత్యం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. అసలు ఇంత సంక్షోభానికి వనరు వలసవాద యుగం మిగిల్చిన అవశేషాలు, మనస్తత్వం. 1843లో థామస్‌ ‌బాబింగ్టన్‌ ‌మెకాలే విగ్రహారాధన చేసే జనాభా ఎక్కువగా ఉండే భారతీయులు ప్రాణాంతకమైన పాత గ్రంథాలను గుడ్డిగా నమ్ముతారు అని ప్రకటించాడు. ఈ ప్రకటనను ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు.

విన్‌స్టన్‌ ‌చర్చిల్‌కు హిందువుల పట్ల అవమాన కరమైన అభిప్రాయం ఉండేది. అది ఆయన దాచుకో లేదు కూడా. కానీ అక్కడినుంచే వచ్చిన అనిబిసెంట్‌ ‌భారత్‌కూ, హిందూధర్మానికీ సాగిలపడ్డారు. మరొక పాశ్చాత్య వనిత సోదరి నివేదిత కూడా అంతే. ఇక హిందూ ప్రార్థనామందిరాలను అపవిత్రం చేయడం భారత్‌ ‌సహా చాలాచోట్ల జరుగుతోంది. ఇటీవల అమెరికాలో హిందువుల మీద శత్రుభావం పెరుగు తోంది. కానీ 1893లో వివేకానంద స్వామి షికాగో సర్వమత సభలో ప్రసంగించినప్పుడు హిందూధర్మం ఏమిటో బోధపడిన కొందరికైనా  కనువిప్పు కలిగిన వాస్తవాన్ని సౌకర్యంగా విస్మరిస్తున్నారు.

అంతర్జాతీయ అంధత్వం

అంతర్జాతీయ అంధత్వం

అంతర్జాతీయ ఉగ్రవాదం మీద గ్లోబల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన గోష్టిలో తిరుమూర్తి హిందూ ఫోబియా గురించి మాట్లాడారు. గడచిన రెండు సంవత్సరాలుగా ఐరాస సభ్య దేశాలు ఉగ్రవాద భావన మీద తెచ్చిన విభజన గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆ దేశాలు వాటి రాజకీయ, మత, ఇతర ప్రయోజనాలే ధ్యేయంగా ఉగ్రవాదం మీద సైతం పక్షపాతంతో సూత్రీకరణలు చేస్తున్నాయని ఆయన నిష్కర్షగా చెప్పడం ఇవాళ్టి అవసరమే. జాతిపరమైన ఉగ్రవాదం, రాడికల్‌ ఉ‌గ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, హింసాత్మక జాతీయవాదం, మితవాద పక్ష తీవ్రవాదం అంటూ ముద్రలు వేసి, ఆ దేశాలకు అనుకూలమైన స్థానంలో ఉగ్రవాదాన్ని చిత్రించి నిలబెట్టడం అలవాటుగా మారింది. ఉగ్రవాదాన్ని ఎవరికి కావలసినట్టు వాళ్లు ముద్రలు వేయడం గ్లోబల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం స్ట్రేటజీ పేరుతో ఐరాస సభ్య దేశాలు తీసుకున్న సమష్టి  నిర్ణయానికి ఎంత విరుద్ధమో విడమర్చిన తిరుమూర్తి ఆ దేశాల చెంప చెళ్లుమనిపించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించవలసిందే, ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదం కింద చూడవలసిందేనన్న గ్లోబల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం స్ట్రేటజీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సభ్య దేశాలే ఏ విధంగా భంగపరుస్తు న్నాయో తిరుమూర్తి గుర్తు చేయవలసి వచ్చింది. ఇలాంటి పంథా ప్రపంచాన్ని సెప్టెంబర్‌ 11 ‌దాడులకు ముందున్న పరిస్థితికి తీసుకుపోతుందని అన్నారాయన. అప్పుడు మీ ఉగ్రవాదులు, మా ఉగ్రవాదులు అన్న రీతిలో కొన్ని దేశాలు ఉగ్రవాదుల పట్ల ఆత్మహత్యా సదృశమైన వైఖరితో వ్యవహ రించాయి. దీనితో జరిగేదేమిటి? గడచిన రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదం మీద అంతర్జాతీయ పోరు పేరుతో సాగించిన కృషి యావత్తు బూడిదలో పోసిన పన్నీరు కాదా?

కొన్ని దశాబ్దాలుగా ఐక్య రాజ్యసమితి అబ్రహామిక్‌ ‌మతాలు ఇస్లాం, క్రైస్తవం, యూదు వ్యతిరేకత గురించే చెబుతోంది. కానీ మిగిలిన మతాల పట్ల ఏర్పడిన ఫోబియాను కూడా పరిగణన లోనికి తీసుకోవాలన్నదే తిరుమూర్తి వాదన. ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం మీద భారత్‌ ‌వాదనను చాలా కాలం అగ్రరాజ్యాలు పెడచెవిన  పెట్టిన మాట వాస్తవం. తరువాత ఉగ్రవాదం మీద అంతర్జాతీయ యుద్ధం మొదలు పెట్టవలసి వచ్చిన మాట కూడా అంతే నిజం. ఇప్పుడు కూడా అంతే, హిందూ ఫోబియా గురించి భారత్‌ ‌తన వాదనను అంతర్జాతీయ వేదిక మీదకు తేవడం మొదలుపెట్టింది. కానీ అనుభ వాలను బట్టి ముస్లిం ఉగ్రవాదంలోని వాస్తవాలను గ్రహించడంలో నాడు జరిగిన జాప్యం హిందూ ఫోబియా విషయంలో జరగకూడదని కోరుకోవాలి. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల పట్ల ఫోబియా ఒక వాస్తవం. దీనిని, దీనిలో పొంచి ఉన్న ప్రమాదాన్ని సభ్యదేశాలు గుర్తించి తీరవలసిందేనని తిరుమూర్తి స్పష్టం చేయవలసి వచ్చింది. ఈ కొత్త ఫోబియాలను కూడా గుర్తించినప్పుడే ఇలాంటి అంశం మీద చర్చలో సమతౌల్యం సాధ్యమని కూడా అన్నారు. సమితి ప్రయోగించే పదజాలం విషయంలో, ఇచ్చే ప్రాథామ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం సభ్య దేశాల దృష్టే పలచబడిపోతుందని తిరుమూర్తి గట్టిగానే హెచ్చరించారు. ఉగ్రవాదులంటే ఉగ్రవాదులే. మంచి ఉగ్రవాదులు, దుష్ట ఉగ్రవాదులు అనేవాళ్లు ఉండరన్న స్పృహ అత్యవసరమని చెప్పారు. ఐక్య రాజ్యసమితి కౌంటర్‌ ‌టెర్రరిజం కమిటీ అధ్యక్షుడు తిరుమూర్తి. కానీ సమితిలో భారత శాశ్వత ప్రతినిధి హోదాలోనే ఈ విషయం ప్రస్తావిస్తున్నానని చెప్పడం విశేషం. గ్లోబల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం కౌన్సిల్‌ ‌ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది.

రెండేళ్ల నుంచి పోరాటం

2021, అక్టోబర్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో విదేశి వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్‌ ‌హిందూ ఫోబియా గురించి ఎలుగెత్తి చాటిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.యూదు వ్యతిరేకత, ఇస్లామో ఫోబియా, క్రిస్టియనో ఫోబియాలను సభ్య దేశాల ఖండించే సందర్భంలో హిందూ, బౌద్ధ, సిక్కు ఫోబియాలను ఖండించడం దగ్గర విఫలమైన సంగతి వాస్తవమని మురళీధరన్‌ ‌నాడే విస్పష్టంగా చాటారు. ఐక్య రాజ్యసమితిలో భారత శాశ్వత సమితి తొలి కార్యదర్శి ఆశిష్‌ ‌శర్మ కూడా 2020 డిసెంబర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హిందూధర్మం, బౌద్ధం, సిక్కుమతాల పట్ల పెరుగుతున్న ద్వేషాన్ని గుర్తించ డంలో ఈ అత్యున్నత వేదిక (ఐరాస) విఫలమవు తున్నదని గట్టిగానే చెప్పారు.

మతోన్మాదులు బమియాన్‌ ‌బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు, అఫ్ఘానిస్తాన్‌లో సిక్కుల గురుద్వారాలో బాంబు పెట్టి ఉగ్రవాదులు 25 మందిని బలిగొన్నప్పుడు, హిందు, బౌద్ధ ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఈ మతాల వారిని ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని చూసినప్పుడు ఆ చర్యలను సభ్య దేశాలు ఖండించ వలసింది. కానీ అబ్రహామిక్‌ ‌మతాల (ఇస్లాం, క్రైస్తవం, యూదు)పై దాడులను ఖండించి నప్పుడు చూపిన శ్రద్ధ కానరాలేదని భారత్‌ ‌ప్రతినిధి విమర్శించారు. టిబెట్‌లో కమ్యూనిస్టు చైనా బౌద్ధుల మీద సాగిస్తున్న ఊచకోతను ప్రపంచం ఇప్పటికీ గుర్తించడం లేదు.

‘సెలెక్టివ్‌’ ‌నిరసన

హిందూ ఫోబియా - హిందూ ధర్మాన్ని నాశనం చేసేపనిలో దుష్టుల కుట్ర - Definition of Hinduphobia
నిజానికి భారతీయ ఉదారవాదులు, స్వయం ప్రకటిత మేధావులు అనుసరిస్తున్న ధోరణి వంటిదే ఐక్య రాజ్యసమితి ధోరణి కూడా. హిందువులు, బౌద్ధులు, సిక్కుల పట్ల జరిగే అకృత్యాల విషయంలో ఉదారవాదులు, మేధావులు సెలెక్టివ్‌గా ఉంటారన్న ఆరోపణ నిజం. అంటే పక్షపాత వైఖరితో ఉంటారు. ముస్లింల మీదనో, క్రైస్తవుల మీదనో దాడి జరిగిన ప్పుడు దానిని ఖండించడానికి చూపించే ఉత్సాహం, హిందువులో, బౌద్ధులో, సిక్కులో నష్టపోయినప్పుడు కానరాదు.కొన్ని సూత్రీకరణలు చేసి వాటి ప్రకారం హిందువులపై దాడుల ఆరోపణలన్నీ అవాస్తవమని, దానిలో మతోన్మాదాన్ని చూడరాదని మేధావులు, ఉదారవాదులు కొట్టి పారేస్తూ ఉంటారు. నిజానికి ముస్లింల మీద భారతదేశంలో జరిగే దాడుల విషయం కూడా అలాంటిదే. మొత్తం ముస్లింలనే హిందువులు లక్ష్యంగా చేసుకుంటే అది ఏనాడో అంతర్యుద్ధం అయ్యేది. కేవలం కొన్నిచోట్ల, కొన్ని చెదురుమదురు ఘటనలతోనే మొత్తం ముస్లిం సమాజం మెజారిటీ హిందువుల చేతిలో హింసకు గురి అవుతున్నదని గ్లోబల్‌ ‌డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌హిందుత్వ వంటి వేదికలు ఆరోపిస్తున్నాయి. ముస్లిం ఫోబియా అన్న భావన ఐరాస నమ్ముతున్నది కాబట్టి, ముస్లింలు చేసే అరాచకాల గురించి ఎవరూ నోరెత్త రాదన్న పరోక్ష ఆదేశం కూడా కనిపిస్తూ ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, విద్య పరిశోధన రంగాలలో స్వేచ్ఛ, మానవహక్కుల పేరుతో ముస్లిం ఉగ్రవాదు లకు, వామపక్ష ఉగ్రవాదులకు రక్షణ ఒక వాస్తవం.

నిజానికి ముస్లిం మతోన్మాదులు, వామపక్ష ఉగ్రవాదుల లక్ష్యం హిందువులేనన్నది ఎప్పుడో రుజువైన సంగతి. భారతదేశంలో కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ వంటి పార్టీలన్నీ ముస్లిం మతోన్మాదాన్ని బాహాటం గానే సమర్ధిస్తున్నాయి. ఇక్కడి నెహ్రూ మార్కు సెక్యులరిజం, ఉదారవాదం అందుకు దోహద పడుతున్నాయి. హిందువుల ప్రార్థనా స్థలాల మీదకు వచ్చినంత దూకుడుగా మైనారిటీల ఆస్తుల మీదకు ఈ పార్టీలు, వాటి ప్రభుత్వాలు వెళ్లవు. ఈ దేశంలో పనిచేసే కేథలిక్‌ ‌మతగురువు భరతమాతను తూలనాడాడు. అతడి మీద ఎఫ్‌ఐఆర్‌ ‌సబబేనని మద్రాస్‌ ‌హైకోర్టు తేల్చి చెప్పింది. స్టాండప్‌ ‌కమేడియన్‌ల పేరుతో కొందరు చౌకబారు మనుషులు హిందూధర్మమే లక్ష్యంగా కువ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఎంఎఫ్‌ ‌హుసేన్‌ అనే మానసికరోగి సరస్వతి, లక్ష్మి అమ్మవార్లను నగ్నంగా చిత్రించాడు. దీనికే కళ, భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేర్లు పెట్టారు. హుసేన్‌ ‌సమర్థకులలో మహిళా సంఘాలు కూడా ఉండడం విశేషం. అంటే హిందూ దేవతకీ, హిందూ మహిళకీ అవమానం జరగవచ్చు. అదే మైనారిటీల విషయంలో అయితే గగ్గోలు మొదలవుతూ ఉంటుంది. సినిమాలలో జరిగే హిందూ వ్యతిరేక ప్రచారం సరేసరి.

 ఇస్లాం ఉగ్రవాదం ఇవాళ్టి ప్రపంచంలో ఒక తిరుగులేని వాస్తవం. ముంబై పేలుళ్లు, 9/11 అమెరికా ట్విన్‌ ‌టవర్ల కూల్చివేత ఇందుకు కొన్ని ఉదాహరణలు. అయినా ముస్లిం ఫోబియాయే ఈ ప్రపంచానికి ముఖ్యమని చెబుతున్నారు. హిందువు లను తాలిబన్‌, ‌బోకోహరాం ఉగ్రవాదులతో పోల్చే ముస్లిం మతోన్మాదులు ఉన్నారు. అయోధ్య రామమందిరం తీర్పుతో వెలుగు చూసిన చారిత్రక వాస్తవాలు, మధుర, కాశీ ఆలయాల మీద మసీదుల ఆనవాళ్లు అంత స్పష్టంగా కనిపిస్తున్నా, మతోన్మాదం హిందువులదేనని, బాధితులు ముస్లింలని చెప్పడం ఎలాంటి చారిత్రక దృష్టి? షాహిన్‌బాగ్‌ ఉదంతం, ఢిల్లీ హింసాకాండ, బెంగళూరు హింసాకాండ, భైంసా అల్లర్లు ఇవన్నీ కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, కొందరు వ్యక్తులు మాత్రమే చేసిన ఘటనలుగా చెప్పడం వాస్తవిక దృష్టేనా? ఈ అన్ని ఘటనలలోను నష్టపోయినది హిందువులే. ఈ కనీస వాస్తవాలను గుర్తించేటట్టు చేయవలసిన అవసరం వచ్చింది. హిందువులది గాయపడిన చరిత్ర. దాని నుంచి కోలుకునేటట్టు చేయగలిగే ప్రతి చర్య, ప్రతి మాట స్వాగతించదగినదే.

ఆక్స్‌ఫర్డ్‌లో ఏం జరిగింది?

ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం పేరు చెబితే ప్రపంచం మొత్తం పులకిస్తుంది. అక్కడి విద్యా ప్రమాణాలు, ఆ విద్యా సంస్థ ప్రపంచానికి అందించిన మేధో సంపద విలువైనవే కూడా. కానీ అక్కడ హిందూ ఫోబియా ఒక భయానక వాస్తవం. ఒక భారతీయ విద్యార్థిని పట్ల ఆ విశ్వవిద్యాలయంలో ఒక వర్గం వ్యవహరించిన తీరు అనాగరికమే. మాయని మచ్చే.

2021 ఫిబ్రవరిలో ఆ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికలలో రష్మీ సామంత్‌ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. అంత ఘనత వహించిన విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి రష్మీ తొలి అధ్యక్షురాలు కావడం అద్భుతమే. ఒక వింత కూడా. కానీ బ్రిటిష్‌ ‌వలసవాదానికి ఆమె వ్యతిరేకం కాబట్టి రెండు మూడు రోజులలోనే ఆమె చేత పదవికి రాజీనామా చేయించారు. అంతేకాదు, కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఈమె హిందువు కావడం చాలామందికి నచ్చలేదు. తన పోస్టులలో కృష్ణుడి బొమ్మలు పెట్టుకోవడమే ఆమె పాలిట శాపమైంది. అక్కడే పనిచేస్తున్న అభిజిత్‌ ‌సర్కార్‌ అనేవాడే ఈ నాటకం అంతా ఆడించాడు.  ఆఖరికి ఆమె ఎన్నికల వ్యయం నరేంద్ర మోదీ ద్వారా అందిందని కూడా ఆరోపించారు. 22 సంవత్సరాల రష్మీ మీద జాతి వివక్ష మద్దతుదారు అని ముద్ర వేయడం ఎంత విచిత్రం? అయితే రష్మీ మీద సామాజిక మాధ్యమాల ద్వారా దాడి జరిగిందని దర్యాప్తులో తేలింది.

ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో పనిచేసే ఈ అభిజిత్‌ ‌సర్కార్‌ ఒక నీచ మనస్తత్వం కలిగినవాడు. ఇతడు సోషల్‌ ‌మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితం మీద, ఆఖరికి ప్రాంతం మీద, కుటుంబం మీద కూడా కువ్యాఖ్యలు చేశాడు. తల్లిదండ్రుల ఫొటోలు కూడా పెట్టాడు. రష్మీ సామంత్‌ ‌వెబ్‌సైట్‌లో మోదీ ఫొటో ఏమిటి? అంటాడీ మూర్ఖుడు. ఈ మాటలోనే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఉదారవాదుల బాధ ఏమిటి? వామపక్షవాదులకు దురద ఎందుకు? మోదీని అడ్డం పెట్టుకుని తమ హిందూ వ్యతిరేక అజెండాను అమలు చేయడమేనని అభిజిత్‌ ‌సర్కార్‌ ‌మాటను బట్టి తెలియడం లేదా? రష్మీ కర్ణాటక తీర ప్రాంతం నుంచి వచ్చింది. అదంతా ముస్లిం వ్యతిరేకత కలిగి ఉన్నదే కాదు, మితవాద శక్తులకు ఆలవాలం అని కూడా రాశాడు అభిజిత్‌. ‌వాళ్లంతా పాత భావాలతో ఉంటారు. శ్వేతజాతీయులను ద్వేషిస్తారు. ఆధునిక పాశ్చాత్య ధోరణులనూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టించాలని వాళ్లంతా కోరుకుంటు న్నారు అని అతి హేయమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, హిందూత్వను వ్యతిరేకించడం ఒక అర్హతగా ఇతడు తన గొప్పను తానే చెప్పుకున్నాడు. ఒక పోస్టులో ఇతడు రాసిన మాటలు, ‘నేను చిన్న పిల్లవాడిగా ఉండగానే అనేక సరస్వతీ ప్రతిమలు పగులకొట్టాను.’ ఇప్పుడు రష్మీ మీద వేధింపు నిజమని నిజ నిర్ధారణ సంఘం తేల్చి ఉండవచ్చు. కానీ ఆమె ఆ విశ్వ విద్యాలయం వీడి అవమాన భారంతో స్వస్థలానికి వెళ్లిపోయింది. ఆమె నష్ణపోయిన తీరుకు ఈ ఆధునిక ప్రపంచం, ‘నాగరిక’ మేధోవర్గం సమాధానం ఏమిటి?

నవ నాగరికతకు, భావాలకు ఆలవాలమని చెప్పుకునే అమెరికా విశ్వవిద్యాలయాలలో కూడా హిందూ వ్యతిరేకత ఘోరంగా ఉంది. ఇందుకు ఖ్యాతి గాంచినదే న్యూయార్క్‌లోని రట్జర్స్ ‌విశ్వవిద్యాలయం. ఇక్కడ పనిచేసే ఆడ్రే ట్రస్‌చెక్‌ ‌హిందుత్వను దుమ్మెత్తి పోయడంలో, ద్వేషించడంలో పేరు మోశారు. ఈమె హిందూస్‌ అగెనెస్ట్ ‌హిందుత్వ అనే సంస్థలో సభ్యురాలు కూడా. కశ్మీరీ పండిట్‌ల దుస్థితి గురించి చర్చించడానికి ఈ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని నిలువరించడానికి ప్రయత్నిం చింది. కానీ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను సమర్థించింది. ఈమె కారణంగా అక్కడ హిందూ విద్యార్థులకు రక్షణ లేదన్న ఆరోపణ ఉంది. చిత్రం ఏమిటంటే విద్యా, పరిశోధన స్వాతంత్య్రం పేరుతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ఈమెనే సమర్థిస్తున్నది.

మార్క్సిజం, ఉదారవాదం పేరిట హిందూత్వం మీద జరుగుతున్న దాడి చాలా విశ్వవిద్యాలయాలలో కనిపిస్తుంది. స్వీడన్‌లోని ఉపాసాల్‌ ‌విశ్వవిద్యాల యానికి చెందిన అశోక్‌ ‌స్వాయిన్‌ ‌గోమూత్రం గురించి తన ట్వీట్‌లో నీచమైన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి గోమూత్రాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల మీద దాడికి దిగడం జిహాదీల వ్యవహారం. హిందూ గ్రంథాలే హిందువులను రోగులుగా మారుస్తున్నాయి. వాళ్లు రోగులే అంటాడు హార్వార్డ్ ‌కెనడీ స్కూలుకు చెందిన సురాజ్‌ ఎం‌గ్డే.

దుర్గామాతను సెక్స్ ‌వర్కర్‌గా చిత్రించిన దుర్ఘటన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ విశ్వ విద్యాలయంలో జరిగింది. జేఎన్‌యూలో భారత దేశమంటే హిందువులదే అన్న భావం కనిపిస్తూ ఉంటుంది. పార్లమెంటు మీద దాడి చేసిన వారిని శిక్షిస్తే వీరికి నచ్చదు. భారత్‌ ‌మీద దాడి చేసిన ఉగ్రవాదులు వీళ్లకి ఆరాధ్యదైవాలు.

జాగృతి సౌజ‌న్యంతో… (full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top