జలియన్‌వాలాబాగ్ నరసంహారం - Jallianwala Bagh Massacre

0
జలియన్‌వాలాబాగ్ నరసంహారం - Jallianwala Bagh Massacre
జలియన్‌వాలాబాగ్ నరసంహారం
– ప్రశాంత్ పోలే
కొంతమంది ఎంపిక చేసిన ఆంగ్లేయులకు మినహాయింపు ఇద్దాం. ఎందుకంటే భారత్‌పై పెత్తనం చేద్దామని వచ్చిన ప్రతి ఒక్క ఆంగ్లేయుడు అధికారం మత్తులో ఊగిపోతూ ఉంటాడు. భారతీయులను కుక్క, పిల్లి అని పిలుస్తారు. భారతీయుల నుంచి తమకు తోచినది వసూలు చేయడమనేది ఒక అధికారంగా భావిస్తారు.

ఇలాంటి మనస్తత్వపు పరిణామంతో 1919 సంవత్సరంలో అమృత్‌సర్‌లో ఒక దారుణం జరిగింది. జనరల్ డయ్యర్ అనే ఆంగ్లేయుడు తన చేతికి మట్టి అంటకుండా భారతీయులను చీమలు, నల్లులను నలిపివేసినట్టుగా హతమార్చాడు. అక్కడ జరిగిన ఒక భయానకమైన, పాశవికమైన నరమేధం బ్రిటీష్ పాలన తీరుతెన్నులకు అద్దం పట్టింది.

1919 సంవత్సరం.. ఏప్రిల్ 13.. ఆదివారం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న కాలమది. అలాంటి పరిస్థితుల్లో అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో ఒక సభ జరపడానికి నిర్ణయమైపోయింది. అదే రోజు ఆదివారానికి తోడు సిక్కులకు పెద్ద పండుగ అయిన బైశాఖి కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు జలియన్‌వాలాబాగ్‌కు చేరుకోసాగారు. కాసేపటికి సమావేశానికి వచ్చిన సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. మైదానంలో వక్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వక్తల ప్రసంగాలను ఏకాగ్రత చిత్తంతో వింటున్న శ్రోతల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. ఎలాంటి భావోద్వేగాలకు చోటు లేని విధంగా అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. హఠాత్తుగా బ్రిటీష్ సైన్యానికి చెందిన ఒకానొక అధికారి బ్రిగేడియర్ జనరల్ ఎడ్వర్డ్ డయ్యర్ (వాస్తవానికి అతడు ఒక కల్నల్. కానీ తాత్కాలికంగా అతడిని బ్రిగేడియర్ పదవిలో నియమించారు) సాయుధ సైనికులతో మైదానంలోకి చొరబడ్డాడు. అతడు కూడా రెండు ఫిరంగులను కూడా తీసుకొని వచ్చాడు. కానీ జలియాన్‌వాలాబాగ్‌కు దారి తీసే వీధులు అంత పెద్దవి కాకపోవడంతో ఆ రెండు ఫిరంగులను బ్రిటీష్ సైనికులు మైదానానికి చేర్చలేకపోయారు

మైదానంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఎలాంటి హెచ్చరిక చేయకుండానే ప్రశాంతంగా ప్రసంగాలు వింటున్న నిరాయుధులైన ప్రజలపైకి కాల్పులు జరపాలని సైనికులను ఆదేశించాడు జనరల్ డయ్యర్. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తూటాల పేలుళ్ళతో, అమాయక ప్రజల ఆర్తనాదాలతో ప్రతిధ్వనించింది.

ఇది చరిత్రలో అత్యంత పెద్దదైన, పాశవికమైన, బీభత్సమైన హత్యాకాండగా నిలిచిపోయింది. బ్రిటీష్ సైనికులు ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా నిరాయుధులై తమ ఎదుట కనిపిస్తున్న అమాయక ప్రజలను దోమలు, నల్లులుగా భావించి వారిపై తూటాల వర్షం కురిపించారు. కేవలం 450 అడుగుల దూరంలో ఉన్న ప్రజల పైకి తూటాలు అయిపోయేంతవరకు కాల్పులు జరిపారు. ప్రపంచంలో కనీవినీ ఎరుగని క్రూరత్వం, పాశవికత్వం జలియాన్‌వాలాబాగ్‌లో మరణ మృదంగం మ్రోగించాయి.

శశి థరూర్ తాను రాసిన ‘An Era of Darkness: The British Empire in India’ అనే పుస్తకంలో ఇలా చెప్పుకొచ్చారు.. “ఈ కాల్పులకు సంబంధించి ఎలాంటి ముందుస్తు హెచ్చరిక చేయలేదు. గుమిగూడిన ప్రజల పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ప్రశాంతంగా మైదానం ఖాళీ చేయండి అని ప్రజలకు కనీసం ఒక విజ్ఞప్తి కూడా చేయలేదు. జనరల్ డయ్యర్ తన సైనికులకు గాలిలోకి కాల్పులు జరపాలని కానీ ప్రజల పాదాలపై కాల్పులు జరపాలని కానీ ఆదేశించలేదు. సైనికులు వారికి అందిన ఆదేశాలకు లోబడి నిరాయుధులైన ప్రజల ఛాతీపైన, ముఖాలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు”.

గాయాలతో విలవిలలాడిపోతున్న ప్రజలకు ఎలాంటి సహాయం అందలేదు. అమృత్‌సర్‌లో 24 గంటల కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ కఠినంగా అమలవుతున్న కారణంగా క్షతగాత్రులకు సాయం చేయడానికి సామాన్యులెవరూ ముందుకు రాలేని పరిస్థితి దాపురించింది. రక్తపుటేరులో పడి ఉన్న ప్రజలను కాపాడాలనే ఆలోచన ఆంగ్లేయులకు లేకుండాపోయింది.

దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం కాల్పుల్లో 379 మంది మరణించారు. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో 484 మంది అమరులయ్యారనే సూచన ఉంది. కానీ అనధికార గణాంకాల ప్రకారం 1,000 మందికి పైగా ఈ హత్యాకాండకు బలయ్యారు. 2,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి దారుణమైన హత్యకాండను ఆంగ్లేయ పాలకులు సమర్థించుకున్నారు. రాత్రికి రాత్రే జనరల్ డయ్యర్ ఇంగ్లండ్‌లో హీరోగా మారిపోయాడు.

జనరల్ డయ్యర్ పాల్పడిన ఈ అకృత్యంపై ఇంగ్లండ్ ఉభయ సభల్లోనూ చర్చ జరిగింది. హౌస్ ఆఫ్ లార్డ్స్ అతడిని సంపూర్ణంగా దోష విముక్తున్ని గావించింది. జనరల్ డయ్యర్‌‌కు చిన్న హెచ్చరిక చేయడం ద్వారా చర్చకు హౌస్ ఆఫ్ కామన్స్ ముగింపు పలికింది. జనరల్ డయ్యర్‌కు పెద్ద మొత్తంలో పింఛను మంజూరయ్యింది. జలియాన్‌వాలాబాగ్ హత్యాకాండకు మూల కారకుడైన నోబెల్ పురస్కార గ్రహీత ఎడ్వర్డ్ కిప్లింగ్‌ను మనం నెత్తిన పెట్టుకున్నాము. అంతటి ఘనత వహించిన కిప్లింగ్.. జనరల్ డయ్యర్‌ను భారత్ పాలిట రక్షకుడు అని కీర్తించారు.
జలియన్‌వాలాబాగ్ నరసంహారం - Jallianwala Bagh Massacre
Jallianwala Bagh Massacre

వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు

జనరల్ డయ్యర్‌కు లభిస్తున్న గౌరవ మర్యాదలు, పురస్కారాలు భారత్‌లో ఉంటున్న ఆంగ్లేయ అధికారుల కంటికి ఆనలేదు. జనరల్ డయ్యర్ క్రూరత్వానికి సన్మానం చేయడం కోసం నిధుల సేకరణ మొదలుపెట్టారు. వారంతా కలిసి 26,317 పౌండ్లు, ఒక షిల్లింగ్, 10 పెన్నీల మొత్తాన్ని సేకరించారు. నేటి కాలానికి లెక్కించినప్పుడు సేకరించిన మొత్తం విలువ రెండున్నర లక్షల పౌండ్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయలు. ఇలా సేకరించిన మొత్తంతో పాటుగా వజ్రాలు పొదిగిన ఒక ఖడ్గంతో జనరల్ డయ్యర్‌ను ఘనంగా సన్మానించారు.

జలియన్‌వాలాబాగ్ హత్యాకాండపై బాధితులు నెలల తరబడి న్యాయ పోరాటం చేశారు. బాధితులపై దయతలచిన బ్రిటీష్ ప్రభుత్వం మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి చెరి 37 పౌండ్లు చెల్లించింది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top