How Dr. Ambedkar played a vital role in the formation of modern Hindu society | ఆధునిక హిందూ సమాజ నిర్మాణంలో డా ఆంబేడ్కర్‌ కీలక పాత్ర

0
How Dr. Ambedkar played a vital role in the formation of modern Hindu society | ఆధునిక హిందూ సమాజ నిర్మాణంలో డా ఆంబేడ్కర్‌ కీలక పాత్ర
Dr. Ambedkar 

సామాజిక సమానత కోసం డా. ఆంబేడ్కర్‌ చేసిన కృషిని సమాజం గుర్తించవలసి ఉంది. అలంటి వారిని నేడు కులాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కాని ఆ మహాపురుషులు ఏనాడు తాము ఒక కులనాయకుడిగా వ్యవహరించలేదు. జాతీయ నాయకుడిగానే వ్యవహరించారు. వారు జీవించిన కాలం, ఆనాటి దేశ పరిస్థితులు భిన్నమైనవి. హిందూ సమాజంలో నెలకొన్న కుల అసమానతలు, అంటరానితనాన్ని దూరం చేసి ఆరోగ్యవంతమైన, దురాచారాలు లేని ఆధునిక హిందూ సమాజ నిర్మాణానికి కృషిచేశారు.

డా|| ఆంబేడ్కర్‌

భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ 14 ఏప్రిల్‌ 1891లో జన్మించారు. 6 డిసెంబర్‌ 1956లో తనువు చాలించారు. తండ్రి రామ్‌జీ సక్పాల్‌ మిలటరీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. జ్యోతిబాఫులే, కబీర్‌దాస్‌ల ప్రభావం తండ్రి నుండి భీమ్‌రావ్‌కు సంక్రమించింది. తండ్రి ప్రోత్సాహంతో బరోడా మహరాజు ఆర్ధిక సహకారంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు భీమ్‌రావ్‌. ఆర్ధిక శాస్త్రవేత్త కావాలన్నది ఆయన కోరిక.

సామాజిక శాస్త్రం, చరిత్ర, ఆర్ధిక శాస్త్రం, న్యాయ శాస్త్రం ఇలా ఎన్నో అంశాలలో ఉన్నత చదువులను పూర్తి చేశారు. బరోడా సంస్థానంలో పొందిన కులవివక్ష, అంటరానితనపు అవమానాలతో నిమ్నవర్గాల ఉన్నతికి, సామాజిక సమానతకు జీవితాన్ని సమర్పించుకున్నారు.
  మహద్‌లో మంచినీటి చెఱువు పోరాటం, నాసిక్‌లో కాలారామ్‌ మందిర సత్యాగ్రహం వంటి సామాజిక సమానత ఉద్యమాలను నిర్వహించారు. ప్రజలను మేల్కొల్పటం కోసం ‘మూక నాయక్‌’ వంటి పత్రికలను నిర్వహించారు. ఆశించిన మేరకు హిందూ సమాజం నుండి సహకారం లభించలేదు. నిరాశ, నిస్పృహలతో ‘నేను హిందువుగా పుట్టాను, కాని హిందువుగా మరణించను, అసమానతలు లేని మతాన్ని స్వీకరిస్తాను’ అని 1933లో ప్రకటించారు. వారి ప్రకటన హిందూ సమాజంలో ఒక పెద్ద దుమారమే లేపింది.

వైస్రాయ్‌ మంత్రిమండలిలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసి అనేక చారిత్రిక నిర్ణయాలను తీసుకున్నారు అంబేడ్కర్‌. మేధావిగా, విద్యా వంతునిగా, ఉద్యమ కారునిగా, పేద కార్మికుల ఉన్నతికోసం పనిచేసిన పరిపాలనా దక్షునిగా పేరు తెచ్చుకున్నారు. ‘విద్యావంతులు కండి, సమైక్య మవండి, ఉద్యమించండి’ అని నిమ్నవర్గాలకు పిలుపు నిచ్చారు. అనేక విద్యా సంస్థలను నెలకొల్పి నడిపించారు.

స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ సభలో తను ఊహించని విధంగా డ్రాఫ్టింగ్‌ కమిటి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయటంలో తన అపారమైన ప్రతిభా పాటవాలను వినియోగించారు. బలమైన కేంద్ర ప్రభుత్వం, అమెరికా, ఇంగ్లండు నుండి సమ్మిళితంగా స్వీకరించిన పార్లమెంటరీ ప్రజాసంస్థ, ప్రజలందరికి రాజకీయంగా, సామాజికంగా సమానత్వం, శతాబ్దాలుగా సామాజిక దురాచారాలకు గురైన షెడ్యూలు కులాల, తెగల, ప్రజల సమగ్రాభివృద్ధి కోసం విద్య, ప్రభుత్వోద్యోగాలు, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఒకే రాజ్యం నుండి ఒకే రాష్ట్రం (నేషన్‌) వైపు, భారత్‌ను తీసుకువెళ్ళటంలో.. ఇలా అనేక అంశాలు రాజ్యాంగంలో పొందుపరచారు. రాజ్యాంగ సభలో ఉన్న ఆనాటి జాతీయ నాయకత్వం, భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సమ సమాజంతో కూడిన బలమైన భారత్‌ను నిర్మించడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించటం డా|| ఆంబేడ్కర్‌ జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం.

‘నా స్వభావం దృష్ట్యా నేను రాజకీయ నాయకుడ్ని కాదు, ఉద్యమకారుణ్ణి కాదు, సమాజ అవసరాల కోసం నేను ఉద్యమించాల్సి వచ్చింది. కుటుంబ పరంగా నాకు లభించింది ధార్మిక ప్రవృత్తి. కొందరు పెద్దలకు ఇచ్చిన మాట మేరకు హిందూ సమాజానికి తక్కువ హాని కలిగించే రీతిలో నేను హిందుమతాన్ని వదిలి బౌద్ధధర్మాన్ని స్వీకరిస్తున్నాను. విదేశీ క్త్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరించదలచుకోలేదు’ అని 1956లో బౌద్ధ ధర్మ స్వీకరణ సందర్భంగా అంబేడ్కర్‌ పేర్కొన్నారు. 1956లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ను రద్దుచేసి రిపబ్లికన్‌ పార్టీని ప్రారంభిం చారు. మార్క్సిజం కంటే బౌద్ధధర్మ జీవన విధానం సమగ్రమైనదని 1956లో ప్రపంచ బౌద్ధ ధర్మ సమ్మేళనంలో ప్రసంగించారు. దేశ విభజనతో వేర్పాటుభావం కలిగిన ముస్లిములను వదులు కోవటం భారతదేశానికి, ముస్లిం సమాజానికి మంచిదని సలహా ఇచ్చారు. డా||అంబేడ్కర్‌ ప్రపంచంలోనే ఉన్నత స్థాయి మేధావి, పండితుడు. అనేక గ్రంథాల రచయిత, ఉద్యమకారుడు, భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప జాతీయ నాయకుడు.

– కె.శ్యాంప్రసాద్‌, జాతీయ కన్వీనర్‌, సామాజిక సమరసత - (జాగృతి సౌజన్యం తో)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top