Vivek Ramaswamy |
అమెరికాకు ఓ హిందువు అధ్యక్షుడు అవ్వకూడదన్న ఓటర్.. వివేక్ రామస్వామి సమాధానం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి గురువారం ఐయోవా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓటర్ల నుంచి పలు కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. హిందువైన వివేక్ అమెరికాకు అధ్యక్షుడు కాజాలడంటూ ఓ ఓటర్ వ్యాఖ్యకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. ఆ అభిప్రాయం తప్పని తేల్చి చెప్పారు. హిందుత్వలోని మూల సూత్రాలు నా జీవితంలో భాగంగా ఉన్నా క్రైస్తవ విలువలకు అత్యంత గౌరవమిస్తానని రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. అయితే క్రైస్తవ మతాన్ని విస్తరించే విషయంలో తాను అత్యుత్తమ అధ్యక్షుడు కాబోనని పేర్కొన్నారు.
‘‘ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నా. ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే నయమని నేను అనుకుంటున్నా. నేను హిందువుని. చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూళ్లల్లో చదువుకున్నా. రెండు మతాల్లోనూ ఒకే తరహా విలువలు ఉన్నాయని నేను నమ్మకంగా చెబుతున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని ఓ కారణంతో ఈ భూమ్మీదకు పంపించాడని నా మతం చెబుతోంది. ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైనా ఉంది. దేవుడు మనందరిలో ఉన్నాడు కాబట్టి మనుషులందరూ సమానమే. భగవంతుడు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు. దైవసంకల్పం మనం పాటించాల్సిందే. కాబట్టి, దేవుడు నాకూ ఓ లక్ష్యం ఇచ్చాడని నమ్ముతున్నాను. ఆ నమ్మకమే నన్ను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేలా చేసింది’’ అని వివేక్ చెప్పుకొచ్చారు.
.....Vsk Telangana