తిల‌కా మాంఝి .. తొలి వ‌న‌వాసి స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు | Tilaka Manjhi .. First Forest Dweller Freedom Fighter

Vishwa Bhaarath
0
తిల‌కా మాంఝి .. తొలి వ‌న‌వాసి స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు | Tilaka Manjhi .. First Forest Dweller Freedom Fighter
తిల‌కా మాంఝి 

— ఉషా

నేటి జార్ఖండ్ ప్రాంతం అనాదిగా వీరోచిత పోరాటాల వేదికగా నిలిచింది. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. సాహసికులైన గిరిపుత్రులు తమ హక్కుల కోసం, ఈ భూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. సిద్ధూ కాను, భూమిజ్ సర్దార్ పోరాటం, వీర బుద్ధూ భగత్ పోరాటం, తానా భగత్ ఉద్యమం, బిర్సా భగవాన్ స్వాతంత్య్రోద్యమం మొదలైనవి తమ పవిత్ర భూమిపైన పరాయి పాలకులు అడుగుపెట్టకుండా నివారించాయి. ఈ మహాయోధులు చేసిన త్యాగాలు, కృషికి చరిత్ర పుటల్లో సముచిత స్థానం లభించలేదనే చెప్పాలి. బ్రిటీష్ వారు కూడా కుట్ర పన్ని ఈ ప్రాంతాలను తమ రికార్డుల్లో నమోదు చేయకుండా వాటిని సాధారణ చట్టం పరిధి వెలుపల ప్రపంచానికి తెలియకుండా ఉంచారు.

అటువంటి ప్రాంతంలో విరోచిత పోరాటం చేసిన వాళ్ల‌లో తిల‌కా మాఝి ప్ర‌థ‌ముడు, ప్ర‌ముఖుడు. ఝార్ఖండ్ లో సంతాల్ ఉద్యమంగా పేరొందిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఈ గిరిపుత్రుడిని తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తిస్తారు. వలసపాలకుల అరాచకాలకు స్పందించి తిరుగుబాటు చేసి తన ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు తిలకా మాఝి.

1750 ఫిబ్రవరి 11న బీహార్ రాష్ట్రం సుల్తాన్ గంజ్ ప్రాంతంలోని తిలక్ పూర్ అనే చిన్న గ్రామంలో ఒక సంతాల్ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ కుటుంబంలో తిలకా మాఝి జన్మించాడు. ఆయన తండ్రి పేరు సుందరా ముర్ము. అడవుల్లో స్వేచ్చాజీవిగా, ఆటవిక నాగరికత నియమాల ప్రకారం, చెట్లు పుట్టల వెంబడి తిరుగుతూ, లోయల్లో నదుల్లో ఆడుకుంటూ, వేటాడుతూ ల‌భించిన తిండి తింటూ త‌న బాల్యాన్ని గ‌డిపాడు. అడవుల్లో గడిపిన జీవనం అతడిని నిర్భయుడిగా చేసింది. అతని ధైర్యసాహసాలు చూసి అబ్బురపడిన తోటివారు తిలకా మాఝికి “జబ్రా పహాడియా” అని బిరుదు కూడా ఇచ్చారు.

అయితే అంతటి బాల్యంలోనే అతనికి బ్రిటిష్ వారి అరాచకాలు గోచరమయ్యాయి. తన కుటుంబాన్ని, తన తెగవారిని బ్రిటిష్ పాలకులు దోచుకుంటున్న విషయాన్ని అతను గ్రహించాడు. గిరిజన బాలలు, వృద్ధులు, మహిళలు బ్రిటిష్ వారి చేతిలో చిత్రవధలకు గుర‌వుతున్నారని.. పాల‌కులు తమ భూములను, తమ పంటలను, ఉత్పత్తిని తమకి మిగల్చకుండా ఆకలి చావులకు సమీపంగా తమని తోసేస్తున్నారనీ గమనించాడు. అదే సమయంలో భూమిజ్ సర్దార్ తమ భూముల కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా తిలకా మాఝి చూశాడు. భూస్వాములు బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేస్తూ తమ సొంత ప్రజలను బలి పెడుతున్నారు.

తిలకా మాఝి యువహృదయంలో ఈ అన్యాయం పట్ల ఆగ్రహం రగిలింది. శనాచార్ (బనాచారి జోర్) అనే ప్రదేశంలో మొదటిసారి తిలకా మాఝి బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. భాగల్పూర్, సుల్తాన్ గంజ్ అడవుల వైపు తిలకా నేతృత్వంలో గిరిజన యోధులు ముందుకి కదిలారు. అది 1767 సంవత్సరం, అప్పుడు తిలకా మాఝి వయసు 17 ఏండ్లు. రాజ్ మహల్ ప్రాంతంలో వారు బ్రిటిష్ సైనికులతో తలపడ్డారు.

తమపై జరుగుతున్న పోరాటం తీవ్రత చూసి ఆందోళన చెందిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్లీవ్లాండ్ అనే అధికారిని నియమించింది. క్లీవ్లాండ్ తన సైన్యం, పోలీసులతో కలిసి రాజ్ మహల్ చేరుకున్నాడు. తిలకా మాఝి పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా, స్థానికంగా తయారు చేసిన ఆయుధాలతో, తన తోటివారైన ఆదివాసీ సైనికులతో కలిసి తిలకా మాఝి ముంగేర్, భాగల్పూర్, సంతాల్, పర్గణా ప్రాంతంలో చాకచక్యంగా, అడవులు, లోయలు, నదుల మధ్య శత్రువుపై పోరాటం కొనసాగించాడు.

క్లీవ్లాండ్, సర్ అయిర్ ఈ శౌర్యమంతులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1784 లో జనవరి 13 వ తేదీన గుర్రంపై అడవిలోకి వచ్చిన అధికారి క్లీవ్లాండ్ ని, ఒక తాటిచెట్టుపై దాగి ఉన్నతిలకా మాఝి బాణంతో హతమార్చాడు. ఇది విన్న బ్రిటిష్ ప్రభుత్వం కంపించిపోయింది. సైనికులు, అధికారులు భయంతో వణికిపోయారు.

తిలకా మాఝి నిర్భయ పోరాటానికి అలజడి చెందిన బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైనా అతడిని పట్టుకుని హతమార్చాలని నిర్ణయించింది. యుద్ధంలో విజయాల పట్ల ఆనందంతో సంగీతం, నృత్యాలతో వేడుక చేసుకుంటున్న తిలకా సంతాల్ బృందంపై దేశద్రోహి అయిన ఒక గిరిజన భూస్వామి సహాయంతో దాడి చేసి, అనేకమంది సైనికులను హతమార్చారు. కొంతమందిని బందీలుగా పట్టుకున్నారు.

తిలకా మాఝి తప్పించుకుని సుల్తాన్ గంజ్ కొండల్లో దాక్కున్నాడు. అయితే బ్రిటిష్ సైన్యం తన అన్వేషణ కొనసాగించింది. అజ్ఞాతంలో జీవిస్తున్న సంతాల్ సైన్యం కష్టాల పాలైంది. తిండి నీరు లేక నీరసించింది. సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా సంతాల్ సైన్యం గెరిల్లా యుద్ధం కొనసాగించింది. కానీ తిలకా మాఝి చివరకి పట్టుబడ్డాడు. అత్యంత అమానుషమైన రీతిలో నాలుగు గుర్రాలకు కట్టి, నేలపై ఈడుస్తూ భాగల్పూర్ కి అతనిని తరలించింది బ్రిటిష్ సైన్యం. 1785 లో ఒక మర్రి చెట్టుకి ఉరివేసి ఆ వీరుడిని హతమార్చారు.

తిలకా మాఝి బ్రిటిష్ వలస పాలన, దోపిడీపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయ వీరుడు. ఈ తిరుగుబాటు అనంతరం 90 ఏళ్లకు 1857లో స్వాతంత్ర్య సంగ్రామంగా తిరిగి ప్రారంభమైంది. భాగల్పూర్ కోర్టులో తిలకా మాఝి విగ్రహం ఏర్పాటు చేశారు, అతని గౌరవార్థం ఒక విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టారు.

కేవలం 35 సంవత్సరాలకే అత్యున్నత త్యాగం చేసిన తిలకా మాఝి చరిత్రలో చేతులెత్తి మొక్కదగిన మహనీయుల్లో ఒకరు. “ఈ భూమి నా తల్లి. నా మాతృభూమి. ఈ భూమి కోసం నేను ఎవరికో శిస్తు చెల్లించడం ఏమిటి?’ అని అతి లేతవయసులోనే గంభీరంగా ప్రశ్నించి, వీరోచితంగా, విశ్రాంతిలేకుండా పరాయిపాలనపైనా, అన్యాయమైన దోపిడీ పైనా పోరాటం చేసి, తన జీవితాన్నే కాదు, ప్రాణాన్నే త్యాగం చేసిన తిలకా మాఝి ఈనాటికి భారతీయులకు స్ఫూర్తి కావాలి.

This article was first published in 2021 - By vskteam

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top