దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇటీవలె ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించగా.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రస్తుతం అమలు కావడంతో దేశంలో యూసీసీ ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారింది. ఉత్తరాఖండ్ కంటే ముందు గోవా రాష్ట్రంలో బ్రిటీష్ పాలకుల కాలంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుకు సభ ఆమోదం కల్పించింది. ఉత్తరాఖండ్‌కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ బిల్లును ఉత్తరాఖండ్ ఆమోదించిందని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని.. ఉత్తరాఖండ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నట్లు పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రావడానికి.. ఈ యూసీసీ బిల్లును ఆమోదించడానికి తమకు అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని.. ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుందని పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా వివాహం, వారసత్వం, విడాకులు వంటి విషయాల్లో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు చట్టంగా మారనుంది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా యూసీసీ బిల్లును తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతిని ఆయా రాష్ట్రాల్లో తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
పెళ్లికి కనీస వయసును మహిళలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు చేశారు. పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. భార్యా భర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే సమాన కారణాల మీదే విడాకులు ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో చేర్చారు. ఇక మొదటి భార్య బతికి ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అంటే బహు భార్యత్వాన్ని నిషేధించింది. మగవాళ్ల లాగే మహిళలకు కూడా వారసత్వంలో సమాన హక్కులు ఉంటాయని ఈ బిల్లులో పొందుపర్చారు. ఇక సహ జీవనం చేస్తున్న వారు తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే ఈ యూనిఫాం సివిల్ కోడ్ నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపును ఇచ్చారు. వారికి ప్రస్తుత చట్టాలే అమలవుతాయని పేర్కొన్నారు.
Courtesy of vskteam