ప్రధానమంత్రి సోలార్ 'సూర్య ఘర్' ఉచిత విద్యుత్తు పధకం యొక్క పూర్తి సమాచారం, మీకోసం | PM – Surya Ghar: Muft Bijli Yojana

The Hindu Portal
0
ప్రధానమంత్రి సోలార్ 'సూర్య ఘర్' ఉచిత విద్యుత్తు పధకం యొక్క పూర్తి సమాచారం, మీకోసం | PM – Surya Ghar: Muft Bijli Yojana
ప్రధానమంత్రి సోలార్ 'సూర్య ఘర్'
మధ్య మోదీ గారు సూర్యా ఘర్, ఫ్రీ బిజిలి అని కోటి ఇండ్ల మీద సోలార్ పెడతాం అని ప్రకటించడంతో ఈ పథకం పట్ల చాలామంది ప్రజలలో ఆసక్తి మొదలయింది , కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనే ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడంతో, పైగా మార్కెట్లో ఇదే అవకాశంగా ఎంతోమంది మోసగాళ్లు బయలుదేరడంతో చాలామంది మోసపోతున్నారు. అందుకే ఇదే ఫీల్డ్ లో గత 25 సంవత్సరాలుగా వున్న అనుభవంతో అందరికి సరైన సమాచారం ఇవ్వడానికి ఈ పోస్టు పెడుతున్నాను.

అసలు ఈ సోలార్ ప్యానెల్ బిగించడం ఎందుకు అనే ప్రశ్న వస్తే , నా కరెంటు నేనే ఉత్పత్తి చేసి నేనే వాడుకుంటాను అనడం సమాధానం  . ఒకప్పుడు సోలార్ అంటే పైకప్పు మీద ప్యానెళ్లు బిగించి వాటిద్వారా వచ్చే DC కరెంటుని  బ్యాటరీలలో నింపుకుని ఆ తరువాత మన అవసరానికి కావలసినట్టు AC కరెంటుగా మార్చి వాడుకోవడమే .ఈ పద్దతిలో ఒక్కసారి మన బ్యాటరీలు నిండిపోతే ఆ సమయంలో మనం వాడుకోలేకపొతే  ఆ సోలార్ కరెంటు అంతా వృధా అయిపోయేది. పైగా ఈ బ్యాటరీలు ప్రతి నాలుగేళ్లకు ఒకేసారి మార్చాల్సి రావడంతో అసలు ఆదా చేసిన కరెంటు కన్నా ఎక్కువ ఖర్చు ఈ బ్యాటరీలకే అయ్యేది. దానితో ఈ విధానం అనేది అందరికీ ఉపయోగ పడేది కాదు. ఈ పద్దతిని ఆఫ్ గ్రిడ్ పద్దతి అనేవారు అంటే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే కరెంటు తో సంభందం లేకుండా సొంతగా  ఏర్పాటు చేసుకునే సోలార్ పద్దతి  (కింద మ్యాప్ ఇచ్చాను )  .
 చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!
ఈ సమస్యలకు విరుగుడు గా ఆన్ గ్రిడ్ పద్దతి అనేది తెచ్చారు . ఇందులో మన సోలార్ నుండి వచ్చే కరెంటు ని బ్యాటరీలలో నింపుకోవడం కాకుండా , ఎప్పటికప్పుడు మన అవసరానికి తగినట్టు AC గా మార్చి వాడుకుని, ఒకవేళ మనకు ఆ సమయానికి కరెంటు అవసరం లేకుంటే ఆ ఎక్స్ట్రా కరెంటుని , కరెంటు డిపార్టుమెంటుకు ఇచ్చేయడం . అంటే బ్యాటరీలలో నింపుకునే పద్దతి కాకుండా కరెంటు డిపార్ట్మెంట్ వారే మనకు బ్యాటరీలా ( లేదా బ్యాంకు లా ) పనిచేయడం . అంటే మన ఇంట్లో మనం సోలార్ పెట్టుకుని కరెంటు ఉత్పత్తి చేస్తూ ఒకవేళ పగటివేళలో మనకు అవసరం లేకుంటే కరెంటు డిపార్టుమెంటు కు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా ఇచ్చేసి , రాత్రి వేళలో లేదా మనకు అవసరం వున్నప్పుడు మనము డిపాజిట్ చేసిన కరెంటుని మనం మళ్ళీ వాడేసుకోవడం . ఈ పద్దతిలో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంట్లో ఇప్పుడు వుండే మీటర్ ( ఇది కేవలం మనం డిపార్ట్మెంట్ నుండి ఎంత వాడుతున్నామో మాత్రమే నమోదు  చేస్తుంది ) ని మార్చేసి నెట్ మీటర్ ( అంటే మనం కరెంటు డిపార్టుమెట్ నుండి ఎంత వాడుతున్నామో , సోలార్ నుండి ఎంత వారికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో రెండు వివరాలు నమోదు చేస్తుంది) ను బిగించడం జరుగుతుంది  . అంటే నెలాఖరులో మీటర్ రీడింగ్ తీసుకునేటప్పుడు మనం వారికి ఇచ్చింది ఎంత వారినుండి వాడుకుంది ఎంత అనే రెండు వివరాలు సరి చూసి , మనం వారికి ఇచ్చిన దానికన్నా ఎక్కువవాడితే కేవలం ఆలా ఎక్కువ వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు వేస్తారు. ఉదాహరణకు మనం ఒక 3  kw సోలార్ ప్లాంటు పెడితే దానితో నెలకు 300 యూనిట్లు తయారైతే మనము అందులో పగటిపూట ఒక వంద యూనిట్లు వాడుకుని మిగతా 200 యూనిట్లు పగటిపూట కరెంటు వాళ్లకు ఇచ్చేసి , రాత్రి పూట ఒక 300 యూనిట్లు వాడేసామంటే 300 -100 = 200 యూనిట్లు వారికి ఇచ్చి , వారి దగ్గరనుండి 300 యూనిట్లు వాడినట్టు. అంటే 200  - 300 = -100 అంటే మనమే వారిదగ్గర నుండి వంద యూనిట్లు ఎక్కువగా వాడినట్టు కదా . అప్పుడు కేవలం ఆ వంద యూనిట్లకు మాత్రమే బిల్లు వేస్తారు . ఇది నెట్ మీటరింగ్ అంటే . అంటే మీ మొత్తం వాడకం 400 యూనిట్లలో మీరు తయారుచేసుకున్న 300 యూనిట్లు తగ్గి కేవలం 100 యూనిట్లకు మాత్రమే బిల్లు వస్తుందన్నట్టు. 

అలాకాకుండా మీరు రాత్రి పూట 300  యూనిట్లకు బదులుగా కేవలం 100 యూనిట్లే వాడితే అప్పుడు 200  -100 =+100 యూనిట్లు మీరు కరెంటు వారి ఖాతాలో మిగులు ఉన్నట్టు . ఆ యూనిట్లను అలాగే మీ ఖాతాలో జమచేసి ఒకవేళ ముందు ముందు మీరు చేసిన ఎక్సపోర్టు కన్నా ఎక్కువ వాడితే అందులో అడ్జస్ట్ చేస్తారు, అలాకాకుండా ప్రతి నెలా మీరు వాడుతున్న యూనిట్లకన్నా మీరు కరెంటు వారికి ఇస్తున్న యూనిట్లే ఎక్కువగా ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి లెక్క ప్రకారం మీ ఖాతాలోకి డబ్బులు జమచేస్తారు.( మీరు వాడే కరెంటుకు బిల్లు ఒకవేళ 7  రూపాయలు చొప్పున వేస్తారేమో కానీ మీరు ఇచ్చే కరెంటు కు మాత్రం అంత డబ్బులు ఇవ్వరు సుమీ . వారి కరెంట్ కొనుగోలు ధర అంటే మిగతా పవర్ ప్లాంట్ల నుండి ఎంత ధరకు కొంటారో అంతమాత్రమే మీకు ఇస్తారు, అంటే మీరు డిపార్ట్మెంట్ కు ఇచ్చేదానికి దాదాపు 3 రూపాయలకు ఒక యూనిట్ చొప్పున లెక్క కట్టి ఇస్తారనుకోండి ) . లేదా మిగతా నెలలలో మీ వాడకం తక్కువగా ఉండి ఎండాకాలంలో ఏసీలు కూలర్లు నడిపి ఎక్కువగా బిల్లు వస్తుంది అని అనుకుంటే మొదట్లో జమ చేసిన యూనిట్లన్నీ ఈ సమయంలో వాడుకోవొచ్చు ( చాలామటుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వున్న మిగులు యూనిట్లను డబ్బులుగా మార్చేస్తారు కరెంటు వాళ్ళు , అది మీ బిల్లులో కనబడుతుంది.). ఇది ఈ సోలార్ నెట్ మీటరింగ్ పద్దతి పనిచేసే విధానం ( కింద నా కరెంట్ బిల్లు ఇచ్చాను చూడండి)                  
కరెంట్ బిల్లు
కరెంట్ బిల్లు - చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!
ఆ తరువాత , అసలు ఈ సోలార్ స్కీం ఎవరికీ ఉపయోగం అనే ప్రశ్న వస్తే , ఎవరికైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండి, సంవత్సరానికి కనీసం 3600 యూనిట్ల కరెంటు బిల్లు వస్తుంటే  ( సాధారణంగా ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఫ్రిజ్ టీవీ ఉండి ,  కనీసం ఒక్క AC ఉండి సంవత్సరం లో నాలుగు నెలలు AC ని వాడితే ఈమాత్రం బిల్లు వస్తుంది, రెండు AC లు వున్నాయంటే ఇంకో 600 - 700  యూనిట్లు సంవత్సరానికి ఎక్కువ అవుతాయి  )  ఆలా ఒక్క AC వున్నవారు దాదాపు 90% బిల్లు  తగ్గించుకోవడానికి కనీసం 3  KW సోలార్ సిస్టం బిగించుకోవడం ఉత్తమమం . అంతకంటే తక్కువ బిల్లు వచ్చేవారు మేము సోలార్ పెట్టకూడదా అని ప్రశ్నిస్తే , తప్పక పెటుకోవొచ్చు కానీ మనము పెట్టిన పెట్టుబడికి సరైన గిట్టుబాటు గురించి మాట్లాడితే మాత్రం 3  KW కన్నా ఎక్కువ సోలార్ సిస్టం పెడితేనే  అది ఆర్థికంగా సరైన నిర్ణయం అని నా అభిప్రాయం. అలాగని చిన్న సోలార్ సిస్టం పెట్టకూడదా అంటే తప్పకుండా అమర్చుకోవొచ్చు , అది గిట్టుబాటుతో సంభందం లేకుండా మీ ఇష్టం .

ఇవన్నీ సరే కానీ,  అసలు సోలార్ సిస్టం బిగించాలంటే ఏం కావాలి .

  1. మొదట కావలసింది సొంత ఇల్లు మరియు మన పేరుమీద కరెంటు కనెక్షన్ మరియు కరెంటు బిల్లు 
  2. ఆ తరువాత కావలసింది సోలార్ ప్యానెల్లు బిగించడానికి కావలసిన పైకప్పు . ఇది RCC కావొచ్చు రేకుల షెడ్డు లాంటివైనా కావొచ్చు.
  3. ఆ సోలార్ ప్యానెళ్లకు రోజంతా పడేలా ఎండ కావాలి . ఈ రోజుల్లో నగరాల్లోని చాలా ఇళ్లల్లో పక్కనే పెద్ద పెద్ద అపార్టుమెంట్లు రావడం తో ఒక ఫ్లోర్ లేదా రెండు ఫ్లోర్ ల ఇండ్ల మీద అసలు ఎండనే పడడంలేదు . అంటే మీ ఇంటిమీదకు రావలసిన సూర్యుడిని పక్క అపార్ట్మెంట్ వాళ్ళు మింగేస్తున్నారన్నమాట ( భవిష్యత్తులో ఈ విషయం మీద కోర్టు కేసులు కూడా అవొచ్చేమో ). పైగా మీ ఇంటి పైకప్పు మీద వుండే నీళ్ల ట్యాంకులు లేదా మీ పెంట్ హౌస్ కూడా మీ సోలార్ ప్యానెల్ మీద ఎండ పడకుండా అడ్డుకోవొచ్చు.
  4.  ఇవన్నీ పోగా ఎక్కడైతే రోజంతా ఎండ పడే ప్రదేశం మిగిలి ఉందొ అంత ప్రదేశంలోనే మీరు సోలార్ అమర్చుకోవొచ్చు. అంటే మీకు వేయి చదరపు అడుగుల పైకప్పు ఉన్నా రోజంతా ఎండ పడే ప్రదేశం 400  చదరపు అడుగులు కూడా వుండకపోవొచ్చు అన్నమాట . ఇక ఎంత సోలార్ కెపాసిటీ అమర్చుకోవాలంటే, ఎంత ఇలా క్లియర్ గా వుండే  పైకప్పు అవసరమో చూద్దాం . సుమారుగా ఒక కిలోవాట్ కి దాదాపు 100 చదరపు అడుగుల రోజంతా ఎండ పడే పైకప్పు కావాలి . పైగా సూర్యుడు గారు తూర్పు నుండి పడమరకు వెళతారు కాబట్టి , మనం భూమధ్య రేఖకు ఉత్తరాన వున్నాము కాబట్టి మన సోలార్ ప్యానళ్లు దక్షిణాన్ని  చూసేలాగా మన హైదరాబాద్ అక్షంశం  17 డిగ్రీలు కాబట్టి అంత యాంగిల్ లో అమర్చుకోవాలి ( ఈ యాంగిల్ లో పెడితేనే సూర్యుడి కిరణాలూ సరిగ్గా పడి ఎక్కువ కరెంటు ఉత్పత్తి అవుతుంది ). అంటే మనము 3.KW సోలార్ అమర్చాలంటే కనీసం 300 చదరపు అడుగుల క్లియర్ పైకప్పు కావాలి. ఇక సోలార్ ప్యానెళ్లు అమర్చుకోవడంలో ముఖ్యమైన పరికరాలు ఏమిటో చూద్దాం . 
  1. సోలార్ ప్యానెల్ ( ఇది ఎండను DC కరెంటు గా మారుస్తుంది ) , ఇది తప్పకుండ BIS అప్రూవల్ ఉండి తప్పనిసరిగా ప్రభుత్వం వారిచే ఆమోదించబడిన వాటినే ఎన్నుకోండి.
  2. సోలార్ ఇన్వెర్టర్ ( ఇది DC కరెంటుని AC  కరెంటుగా మారుస్తుంది మరియు దీనిలో అన్ని రకాలైన కంట్రోలు చేసే వ్యవస్థలు ఉంటాయి )
  3. ప్యానెళ్లు అమర్చడానికి గాల్వనైజ్ చేసిన స్ట్రక్చర్ ( అంటే స్టీల్ స్ట్రక్చర్ తయారు చేసి దానికి తుప్పుపట్టకుండా జింకు కోటింగ్ వేస్తారు) అలా గాల్వనైజ్ చేసిన స్ట్రక్చర్ పాతిక సంవత్సరాలు అయినా కూడా తుప్పుపట్టకుండా ఉంటుంది . చాల మంది పెయింటు వేసిన స్ట్రక్చర్ అంటగడతారు జాగ్రత్త.    
  4. ఇక మిగిలింది జాగ్రత్తగా వాటిని మీ పైకప్పు మీద బిగించడం ( ఎందుకంటే పెద్ద గాలి వీస్తే ఆ ప్యానెళ్లు ఎగిరిపోకుండా ) అనేది ఒక పెద్ద పని. దానికి సరైన డిజైన్ మరియు సరైన మెటీరియల్ వాడడం , సరైన సిమెంటు దిమ్మెలు తయారు చేసి బిగించడం. ఈ పని సరైన తెలివిడి మరియు మంచి అనుభవం గల వారే సరిగ్గా చేయగలరు. ఇది కాకుండా ప్యానెళ్లను కలిపే కేబుళ్లు ( వైర్లు ) సరైన మందము ఉండేవి ఎన్నుకోవడం సరైన కంపెనీవి ఎన్నుకోవడం కూడా చాల ముఖ్యం , లేకపోతె కాలిపోతాయి. ఆపై సరైన ఎర్తింగ్ చేయడం కూడా చాల ముఖ్యం.  ఇది మన సోలార్ కి వాడే మెటీరియల్ గురించి. ఇది కాకుండా కనీసం ఐదు సంవత్సరాల పాటు వారంటీ ఇస్తూ మనకు సర్వీసు ఇచ్చే వారిని ఎనుకోవడం ముఖ్యం.
చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!
 చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!


 చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!

అందుకే కేవలం ప్రభుత్వం ద్వారా ఆమోదించబడిన సప్లైయర్లనే మీ సోలార్ సిస్టం బిగించడానికి ఎన్నుకోండి ( కుదిరితే ప్యానెల్లో లేక ఇన్వెర్టర్లో తయారు చేసే వారిని ఎంచుకోండి, అంట తొందరగా మూసేయలేరు  ) . ఎందుకంటే మన కరెంటు సంస్థలు వీరి దగ్గర మనకు ఐదు సంవత్సరాలు సర్వీసు ఇస్తామని అగ్రీమెంటు చేసుకుని వారిదగ్గర అందుకు సరిపడా బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారు కాబట్టి ఎపుడైనా మనకు సప్ప్లై చేసిన వారు ఇబ్బంది పెడితే కరెంటు వారికీ లేదా కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంటు కు కంప్లెయింట్ చేసి అయినా సర్వీసు తీసుకోవొచ్చు.     
       

ఇవన్నీ సరే కానీ సప్లయర్ని  ఎలా ఎంచుకోవడం ?.

సాధారణంగా ఈ సోలార్ సప్లైయర్లని మనకు తెలిసిన వారు ఎవరైనా బిగించి ఉంటే వారి రెఫెరెన్సు ద్వారా నే ఎంచుకుంటాము , ఆలా కాకుండా సూర్య ఘర్ నేషనల్ పోర్టల్ లో (https://pmsuryaghar.gov.in/) మనరాష్ట్రంలో ఎంతమంది అధీకృత సప్లైయర్లు వున్నారో చూసుకుని వారితో సంప్రదించి వారిలో ఎవరు మనకు సరైనవారు అని అనిపిస్తారో వారిద్వారా ఈ సోలార్ సిస్టం అమర్చుకోవొచ్చు.

దీంతో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఎలా మొదలు పెట్టాలి , ఎప్పుడు సబ్సిడీ వస్తుంది .?
మొదట మనము మనకు నచ్చిన సప్లయర్ ని ఎన్నుకుంటే వారు ఎన్నో సోలార్ రూఫ్ టాప్ లు బిగించి వుంటారు కాబట్టి , మొదట మీ ఇంటి పైకప్పుని సర్వే చేసి, మీ కరెంటు బిల్లుని పరిశీలించి అసలు మీకు ఎంత సైజు సోలార్ పవర్ ప్లాంటు అవసరమో , మీ పైకప్పు మీద ఎంతవరకు బిగించగలమో తెలియజేస్తారు.

ఆ తరువాత నేషనల్ పోర్టల్ లో లాగ్ ఇన్ అయ్యి మన వివరాలు అన్నీ ఎంటర్ చేసి శాంక్షన్ తెచుకోవొచ్చు ( సాధారణంగా ఈ విషయంలో మనము ఎన్నుకున్న సప్లయర్ సహాయం చేస్తారు ). ఆ తరువాత కరెంటు ఆఫీస్ వారికీ అప్లై చేసి నెట్ మీటర్ కు సంభందించి శాంక్షన్ తెచ్చుకోవాలి . ఈ రెండు అయ్యాక మీరు సోలార్ సిస్టం బిగించుకుని కరెంటు ఆఫీస్ వారికీ తెలియజేస్తే వారు వచ్చి మీ సోలార్ సిస్టం సరిగ్గా వుందా లేదా చూసి నెట్ మీటర్ అమరుస్తారు ( ఇవన్నీ కూడా కాస్త సమయం వెచ్చించి వారి వెనక తిరిగి మరీ చేయాల్సిన పనులు కాబట్టి మీరు ఎన్నుకున్న సప్లయర్ మీ విషయంలో సహాయం చేస్తారు ). నెట్ మీటర్ అమర్చిన తరువాత మీ సోలార్ సిస్టం పని చేయడం ప్రారంభిస్తుంది . ఆ తరువాత మనము నేషనల్ పోర్టల్ లో ఆ ఫోటోలు కరెంటువారు ఇచ్చిన సర్టిఫికెట్ లాంటివి అన్నీ అప్లోడ్ చేస్తే , సాధ్యమైనంత తొందరలో వారు ఎవరినైనా ఇన్స్పెక్షన్ కు పంపిస్తారు . ఆ వచ్చినవారు అన్నీ చూసి సరిగ్గా ఉన్నాయని నిర్ధారిస్తే అప్పుడు సబ్సిడీ డబ్బులు మీ ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో పడతాయి . ఈ మొత్తం ప్రక్రియ లో మీరు ఎన్నుకునే మీ సప్లయర్ చాల ముఖ్యం ఎందుకంటే దాదాపు అన్ని పనులు మీ తరఫున వాళ్ళే చేయాల్సి వస్తుంది.
 తెలంగాణ ప్రభుత్వంవారి సప్లయ్ మ్యాప్ - చిత్రాన్ని పెద్దదిచేసేందుకు చిత్రంపై నొక్కండి!

ఇక మీ తరఫున సప్లయర్ కి మొత్తం డబ్బులు పేమెంట్ చేయాలి ( ఎందుకంటే ప్రభుత్వం వారు ఇచ్చే సబ్సిడీ నేరుగా మీ ఖాతాలోకే వస్తుంది  కాబట్టి) , ఎప్పుడెప్పుడు ఏ ఏ స్టేజి లో ఎంత పేమెంట్ చేయాలి అనేది మీరు మీ సప్లయర్ కలిసి మాట్లాడుకోవాలి. సాధారణంగా చాలామంది 50 %  అడ్వాన్సు , 40% సిస్టం సప్లై చేసినప్పుడు , మిగతా 10 % నెట్ మీటర్ బిగించే సమయంలో కానీ లేదా ఆ తరువాత నేషనల్ పోర్టల్ లో అన్ని డాక్యూమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు కానీ ఇవ్వమని అడుగుతారు. కొన్ని కొన్ని కంపెనీలు మొత్తం 100 % పేమెంట్ ఇస్తేగాని పని మొదలు పెట్టము అని కూడా అంటారు. 

ఇక సోలార్ సిస్టం కి, నెట్ మీటర్ తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది , మనకు సబ్సిడీ ఎంత వస్తుంది అంటే అది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది . కానీ సాధారణంగా ౩ KW  సోలార్ సిస్టం కి దాదాపు 1 ,90 ,000 రూపాయలు నుండి 2 ,06 ,000 వరకు మనము ఎన్నుకునే సోలార్ ప్యానెల్ బ్రాండ్ ను బట్టి మరియు ఇన్వెర్టర్ బ్రాండు ని బట్టి   ఖర్చు, కరెంటు డిపార్ట్మెంట్ వారి అప్లికేషన్ చార్జీలు మరియు నెట్ మీటరింగ్ కోసం దాదాపు 10 , 000 రూపాయలు, సబ్సిడీ పోర్టల్ లో ప్రాసెసింగ్ చార్జీలు ఒక 1 ,700 రూపాయల వరకు అవుతాయి . అంటే ఒక 3  KW సిస్టం బిగించడానికి 2 ,20 ,000 ఖర్చు అని అనుకుంటే అందులో 78 ,000 మనకు సబ్సిడీ గా తిరిగొస్తాయి . అంటే మన చేతి నుండి ఖర్చు అనేది దాదాపు 1 ,25 ,000  నుండి 1 ,40 ,000  వరకు ఉండొచ్చు . ఇది కాకుండా సోలార్ ప్యానెల్లు మన పైకప్పు మొత్తం ఆక్రమించుకుంటే ఎలా మాకు ఆ ప్లేస్ కూడా కావలి అని అనుకుంటే ఆ సోలార్ ప్యానెళ్లను పైకి ఎత్తి నిలబెట్టడానికి అయ్యే ఖర్చు అదనంగా ఉంటుంది ( తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆమోదిత రేట్లు కింద పెట్టాను చూడండి ).
చివరగా ఒక్కవిషయం ఏమిటంటే ఈ సోలార్ సిస్టం అనేది కనీసం పాతిక ఏళ్ళ పాటు మనకు విద్యుత్తు తయారు చేసి మనకు ఆదాయాన్ని ఇచ్చేది కాబట్టి రైతు ఎంత జాగ్రత్తగా విత్తనాన్ని ఎంచుకుంటాడో అంత జాగ్రత్తగా ఈ పాతిక సంవత్సరాల కరెంటు పంట ఇచ్చే సోలార్ సిస్టం ని ఎన్నుకోవాలి. ఒక్కసారి పొరపాటు చేస్తే పాతిక సంవత్సరాలు ఇబ్బంది పడాలి .

కాబట్టి ఇవన్నీ చూసుకుని సరైన సోలార్ సిస్టం ఎన్నుకుని హ్యాపీగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటూ కరెంటు బిల్లు అనేదే లేకుండా ఎంజాయ్ చేయండి . 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top