పథ సంచలన్ |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్) కి అనుమతి కావాలంటూ ఆరెస్సెస్ కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరింది. సంఘ్ స్థాపన విజయ దశమి రోజే జరిగింది కాబట్టి, పథ సంచలన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఈ దసరా నాటికి 100 సంవత్సరంలోకి సంఘ్ అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో తమ పథ సంచలన్ కి అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను ఆదేశించాలని కోరుతూ ఆరెస్సెస్ కోర్టుకెక్కింది.
గతంలో హైకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కార్యక్రమం వుంటుందన పిటీషనర్లు వాదించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము దరఖాస్తులు సమర్పించినా, పోలీసులు అనుమతి ఇవ్వలేదని పిటిషనర్ కోర్టు ముందు వాదించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని సన్నాహాలు తాము చేసుకున్నామని, అనుమతి సకాలంలో ఇవ్వాలని కోర్టును కోరారు. అక్టోబర్ 6 వ తేదీన ఆరెస్సెస్ పథ సంచలన్ నిర్వహించనుంది. చెన్నైలోని 58 ప్రాంతాల గుండా ఈ పథ సంచలన్ సాగుతుంది.
మరోవైపు ఈ కేసుకి సంబంధించిన పిటిషన్ జస్టిస్ జయచంద్రన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. దీంతో పిటిషనర్లు సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మంగళవారం రోజున మరోసారి ఈ అంశం కోర్టులో విచారణకు రానుంది. పథ సంచలన్ కి అనుమతి మంజూరుపై ఆలస్యం కావడంపై స్థానిక హిందూ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఫాసిస్టు డీఎంకే సర్కార్ కావాలనే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ప్రతి విజయదశమికి సంఘ్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడం లేదన్నారు.ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తున్నా.. స్టాలిన్ ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరిస్తోందన్నారు.1940 నుంచి సంఘ్ ఇక్కడ పథ సంచలన్ నిర్వహించుకుంటూ వస్తోందని గుర్తు చేశారు.
Courtesy: vskts