రోహింగ్యాల పేరుతో హిందువుల భూములు రిజిస్ట్రేషన్: సివిల్ అధికారిణి నూపుర్ బోరా అరెస్ట్
అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భూ కుంభకోణానికి సంబంధించి ఆమెపై ఆరోపణలు రావడంతో నుపుర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా ఆమె ఇంట్లో రూ.90లక్షల నగదు.. రూ.కోటికి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి ఇంకా విచారణ కొనసాగుతోంది. కేవలం 6 ఏళ్ల సర్వీసులో ఇంత విలాసవంతమైన ఆస్తులు కూడగట్టడం అనుమానాస్పదంగా మారింది.
నూపుర్ బోరా గతంలో DIETలో లెక్చరర్‌గా పనిచేసి, 2019లో ACSలో చేరారు. బర్పేటా జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా (2019–2023) పనిచేసిన సమయంలోనే భూమి లావాదేవీలపై అనుమానాస్పద ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆమెపై ఆరు నెలలపాటు రహస్య నిఘా పెట్టారు. తాజాగా గోరోయిమారి రెవెన్యూ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు విజిలెన్స్ అధికారులు దాడి చేసి కీలక ఆధారాలను సేకరించారు.
హిందూ యాజమాన్యానికి చెందిన, అలాగే వైష్ణవ సత్రాల భూములను “మియా” అని పిలువబడే బెంగాలీ మూలం ముస్లింలకు (రోహింగ్యాలకు) రిజిస్టర్ చేసినట్లు తేలింది. దీని ఫలితంగా బర్పేటా వంటి సున్నిత ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ మార్పులు, భూమి హక్కుల లోపం, స్థానికులలో ఆందోళనలకు దారితీసింది.
కృషక్ ముక్తి సంగ్రామ సమితి (KMSS) నేత అఖిల్ గోగోయ్ ఆమెపై మరిన్ని ఆరోపణలు చేశారు. భూమి సేవల కోసం లంచం తీసుకున్నట్లు, పట్టా కోసం ₹1,500 నుండి రికార్డు మార్పు కోసం ₹2 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. బర్పేటాలో బహుళ ఆస్తులను కూడా అక్రమంగా సురజిత్ దేకాతో కలసి కొనుగోలు చేసినట్లు బయటపడింది. అతడి నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశంపై సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నూపుర్ పై చాలా అవినీతి ఆరోపణలున్నాయని, దర్యాప్తులో మరిన్ని బయటపడనున్నాయని అన్నారు. ఈ పరిణామాలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా, “నూపుర్ బోరా పై పూర్తి సాక్ష్యాలతోనే అరెస్ట్ జరిగింది. రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది” అని స్పందించారు.

