ఛత్తీస్ గఢ్ లోని ధమ్తారి జిల్లాయంత్రాంగం, ప్రజలు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే దీపావళి పండగ పూర్తి స్వదేశీ భావజాలంతో జరుపుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూడా మట్టి దీపాలతోనే జరుపుకోవాలని, కేవలం మట్టి దీపాల అమ్మకమే జరిగేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకు జిల్లా కలెక్టర్ అభినాష్ మిశ్రా కూడా తోడ్పాటునందించారు.
అయితే.. ఇంత పెద్ద మొత్తంలో మట్టి దీపాలను తయారు చేసే వ్యక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కూడా అధికార యంత్రాంగం ఆదేశించింది. అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా సంప్రదాయ మట్టి దీపెంతలను తయారు చేసే వ్యక్తులపై ఎలాంటి పన్నులు, రుసుములు కూడా విధించరాదని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ సంప్రదాయ దీపెంతలను తయారు చేసే వ్యక్తులు సాంస్కృతిక వారసత్వాన్ని మోసేవారని, మన సంప్రదాయాలకు, జానపద కళలకు వారు వారసులని, పరిరక్షకులని అభివర్ణించారు. వీరందరిని ప్రోత్సహించడం, వారిలో మనో ధైర్యాన్ని నింపడం సమాజం బాధ్యత అని, అలాగే స్వదేశీ భావన కూడా నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే మట్టి ప్రమిదలు తయారు చేసి, అమ్మేవారికి మార్కెట్లలో ప్రత్యేక సౌకర్యాలు, స్థలాలు కూడా కేటాయించనున్నారు.
దీపావళి పండుగే కాకుండా మాములు సమయాల్లో కూడా మట్టి దీపెంతలనే ఉపయోగించమని ప్రోత్సహించాలని, అలాగే మార్కెట్లలో కూడా స్వదేశీ ఉత్పత్తులు, మట్టి ప్రమిదలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని కూడా అందరూ నిర్ణయించారు.
"దీపావళి కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు, స్వావలంబన మరియు ఆత్మగౌరవానికి కూడా ప్రతీక. మనం స్థానిక ఉత్పత్తులను స్వీకరించినప్పుడు, మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ కళాకారులకు జీవనోపాధి అవకాశాలను కూడా అందిస్తాము" అని యంత్రాంగం ప్రకటించింది.
ప్లాస్టిక్‌తో తయారు చేసిన కృత్రిమ లైటింగ్ ఉత్పత్తులకు బదులుగా మట్టి దీపాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని యంత్రాంగం, స్వదేశీ అభిమానులు పిలుపునిచ్చారు. మరోవైపు స్థానికంగా వుండే కుమ్మరులకు ఆర్థిక సహాయం కూడా అందించిన వారమవుతామని, పర్యావరణ పరిరక్ష కూడా జరుగుతుందని వివరించారు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా రాబోయే పండుగ రోజుల్లో స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని, అలాగే ‘‘వోకల్ ఫర్ లోకల్’’, స్వదేశీ భావనను కూడా మరింత బలోపేతం చేసినట్లు అవుతుంది.
అంతకుముందు ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాబోయే పండుగ సీజన్‌ను స్వదేశీ స్ఫూర్తితో జరుపుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ దార్శనికత వైపు ఒక అడుగుగా ఆత్మనిర్భర్ భారత్ మార్గంలో నడవాలని ప్రజలను ప్రోత్సహిస్తూ, వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని స్వీకరించాలని కోరారు.

.gif)