నైతికమైన అనిశ్చితితో పోరాడుతున్న ప్రపంచంలో సమతౌల్యతను పునరుద్ధరించడానికి భారత దేశానికి సంబంధించిన పురాతన నీతి అత్యంత కీలకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. అండమాన్ నికోబార్ వేదికగా జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశం, యావత్ హిందూ సమాజం బాధ్యతను నొక్కి చెబుతూ కీలక ప్రసంగం చేశారు. సనాతన విలువల పునాదుల్లో నిబిడీకృతమైన కొత్త మార్గం కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు.
మానవులు ఆనందంగా వుండడానికి 200 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రయోగాలు జరిగాయని, కానీ వాటికీ కొన్ని పరిమితులు వున్నాయని, శాశ్వత ఆనందాన్ని ఇవ్వడంలో ఏ ప్రయోగమూ విజయం సాధించలేకపోయిందన్నారు. కానీ భారత్ లో అనాదిగా వస్తున్న సాంస్కృతికత నుంచి, ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి ఉద్భవించి, సమతౌల్య, సామరస్యపూర్వక జీవనానికి సజీవ ఉదాహరణగా నిలిచిన భారత్ వైపే ప్రపంచం చూస్తోందన్నారు.ఇలా భారత్ నిలబడుతుందన్న అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ప్రకటించారు.
భారత్ ఎప్పటికీ సత్యం, నైతిక స్పష్టత అన్న లక్షణాలను జీర్ణం చేసుకుందని, అయినా.. ప్రపంచం ఎప్పటికీ బలానికే ప్రతిస్పందిస్తుందని పునరుద్ఘాటించారు. సంఘటనాత్మక సమష్టి శక్తి కావాలని సూచించారు. వ్యక్తులు సామూహికంగా లేకపోతే శక్తి ఉద్భవించదని, ఐక్యత, సంస్థాగతంగా సంఘటనాత్మక శక్తిగా నిలబడే సామర్థ్యం వల్ల శక్తి వస్తుందని నొక్కి చెప్పారు. సమస్యలపై అధిక దృష్టి నిలపకుండా, పరిష్కార మార్గాలపై చురుగ్గా పని చేయాలని సమాజానికి పిలుపునిచ్చారు.
‘‘సంక్షోభాలు ప్రతి సారీ అవకాశాలను కూడా దాస్తాయి. అలాంటి అవకాశాలను మనం గుర్తించగలగాలి. వాటిపై దృష్టిసారిస్తే.. సమాజానికి ప్రయోజనం. హిందూ సమాజం ముఖ్యంగా చురుకైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి’’ అని కోరారు.
ఇక భారత దేశ నాగరికత లక్ష్యాన్ని కూడా మోహన్ భాగవత్ సోదాహరణంగా వివరించారు. ప్రపంచానికి ధర్మాన్ని అందించే బాధ్యత మన భారత్ కే అప్పగించబడిందన్నారు. ప్రపంచం సమతౌల్యతను తిరిగి పునరుద్ధరిస్తుందన్నారు. భారత్ వున్నంత వరకూ ధర్మం నిలిచే వుంటుందని, అందుకే భారత జాతి అమర జాతి అని అభివర్ణించారు. ధర్మం లేకుంటే ప్రపంచ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
ఇక.. చరిత్రను కూడా మోహన్ భాగవత్ ఆయన ప్రసంగంలో స్పృశించారు. భారత్ అనేక దండయాత్రలను, హింసలను, బలవంతపు మత మార్పిళ్లను చూసిందని గుర్తు చేసుకున్నారు. అపారమైన బాధలు వున్నా.. హిందూ సమాజం దాని ఆధ్యాత్మిక మూలాలను కంటికి రెప్పలా కాపాడుకుందని పేర్కొన్నారు. ఈ శక్తి వల్లే సనాతన ధర్మం నిరంతరం అభివృద్ధి చెందుతోందని వివరించారు.భారత్, హిందూ సమాజం, సనాతన ధర్మం అనేవి తుడిచేయలేని శాశ్వత వాస్తవాలు అని అభివర్ణించారు.
భారతీయ నాగరికతలో ఐక్యతకు వైవిధ్యం అనేది నిజమైన ఆభరణమని పేర్కొన్నారు. అనేక సమాజాలు
ఐక్యతకు సమానత్వం అవసరమని నమ్ముతాయని,హిందూ ఆలోచన ధార మాత్రం బహుళత్వాన్ని పూర్తిగా అంగీకరిస్తుందని, దానిని జరుపుకుంటుందని కూడా తెలిపారు.
ఇక... పంచ పరివర్తన గురించి కూడా నొక్కి చెప్పారు.,సామాజిక ప్రవర్తనకు, జాతీయ జీవనానికి పంచ పరివర్తన్ మార్గనిర్దేశనం అని అభివర్ణించారు. వివక్షతను తొలగించి, అందరికీ దేవాలయాలలో ప్రవేశం కల్పించడం ద్వారా సమాజిక సరమసత సాధ్యమవుతుందన్నారు. ఇక.. కుటుంబ ప్రబోధన్ లో భాగంగా వారికి ఒకసారి కుటుంబం కలిసి మెలిసి భోజనం చేయాలని, ఈ సమయంలో పూర్వీకుల సంస్కృతి, దేశం, సమాజం పట్ల వ్యక్తిగత బాధ్యత గురించి చర్చించుకోవాలన్నారు.

