హర్యానా : ఫరీదాబాద్ జిల్లా యంత్రాంగం అక్రమ నిర్మాణాలపై కఠినమైన చర్యలను ప్రారంభించింది. ఎలాంటి అనుమతులు, ప్రణాళికలు, ఆమోదం లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఫరీదాబాద్ లోని పల్లా ప్రాంతంలోని గణపతి కాలనీలో నిర్మాణ దశలో వున్న ఓ మసీదును మున్సిపల్ యంత్రాంగం బుల్డోజర్ తో కూల్చేసింది.
ఈ కూల్చివేత సమయంలో స్థానికంగా వున్న ముస్లిం మహిళలు కూల్చివేతను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం మహిళా పోలీసులను కూడా అక్కడ మోహరించింది. మహిళా పోలీసులతో కూడా స్థానిక మహిళలు వాగ్వాదానికి, తోపులాటకు దిగారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
అయితే.. స్థానికులు, మీడియా కథనం ప్రకారం ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి, గతంలోనే తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. అయినా.. నిబంధనలను బేఖాతర్ చేస్తూ మసీదు యాజమాన్యం రహస్యంగా పనులను వేగిరం చేసింది. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు కూడా లేవు.
"నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆ మసీదు నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ అప్పటికే సంబంధిత వర్గాలకు నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ, ఆ నోటీసును బేఖాతరు చేస్తూ పనులు కొనసాగడంతో, కూల్చివేశాం’’ అని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.
ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో అధిక భాగం అప్పటికే పూర్తయ్యాయని, కేవలం పైకప్పు స్లాబ్ (roof slab) వేసే పని మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. యంత్రాంగం సకాలంలో మరియు కఠినంగా వ్యవహరించడం వల్ల, ఒక భారీ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోగలిగామని తెలిపారు.

