హైదరాబాద్ : హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకార్ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది హిందుత్వ భావాలతో, జాతీయ భావజాలంతో పోరాటాలు చేశారు. తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి, వాటిని ఎదుర్కొన్నారు, మరి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. 15 ఆగస్ట్, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది.
ఈ సుదీర్ఘమైన పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటాలు కూడా చేశారు. కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు నిజాం పాలనకు మద్దతుగా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నించారు. గ్రామాలపై దాడులు, బలవంతపు వసూళ్లు, హింసతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. ముఖ్యంగా హిందువులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు.
తెలంగాణలోని వందలాది పల్లెలపై రజాకార్లు దాడులకు పాల్పడినట్లు చారిత్రక వర్ణనలు పేర్కొంటాయి. గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను తగలబెట్టడం, ప్రజల ఆస్తులు, పశువులు, ధాన్యాన్ని బలవంతంగా దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిని హతమార్చడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వీటికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది పోరాటాలు చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, ఇందూరు జిల్లాల్లోనూ పోరాటాలు జరిగాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అనేకమంది హిందుత్వ భావజాలంతో, జాతీయభావజాలంతో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడి అమరులయ్యారు. మాతృభూమి అన్న భావనతో వీరంతా పోరాటాలు చేశారు.
రాంజీ గోండు:
నిర్మల్ ప్రాంతానికి చెందిన రాంజీ గోండు 1857లో సుమారు వెయ్యి మంది అనుచరులతో నాటి నిజాం సేనలను ఎదిరించి పోరాడి అమరుడయ్యారు. ఆయన పోరాటానికి గుర్తుగా ‘వెయ్యి ఊరులమర్రి’ అనే పేరు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
కొమురం భీమ్:
‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన కొమురం భీమ్ జోడేఘాట్ కొండల్లో నిజాం సేనలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించారు.13 రోజుల పాటు నిజాం సేనలను ఎదుర్కొంటూ పోరాడి, రాత్రి సమయంలో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో రజాకార్ల మూకలు దొంగచాటుగా జరిపిన కాల్పుల్లో అమరుడయ్యారు.
దేవరావు సూర్య, లింగారెడ్డి, యాళ్లరెడ్డి, నామాజీ అనే ఉద్యమకారులు సోనాల ప్రాంతం నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే.. సోనాల కేంద్రంగా దేవరావు సూర్య అనే ఉద్యమకారుడు 1947 ఆగస్టు 15 న సోనాలలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఆ తర్వాత సొనాలాలో మొట్ట మొదటి జనసంఘ్ అభిమానిగా మారారు.
హైదరాబాద్ సంస్థానంలో ఎక్కడా జాతీయ జెండా ఆవిష్కరించకూడదని నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ సోనాల మండలానికి చెందిన దేవ్రావ్ సూర్య, లింగారెడ్డి, యల్లారెడ్డి, నామాజీ రేడియో ద్వారా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వార్తలు తెలుసుకుని, నిజాం సర్కార్ ఆంక్షలను లెక్కచేయకుండా సోనాల మండల నడిబొడ్డున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం నిజాం ప్రభుత్వం వారిని అరెస్టు చేసి వరంగల్ జైలుకు తరలించింది. మూడు నెలల జైలు శిక్ష అనంతరం విడుదలైన వారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. దేవ్రావ్ సూర్య తమ్ముడు లక్ష్మణరావ్ సూర్య సైతం అజ్ఞాతంలో ఉంటూ రజాకార్లపై పోరాటం చేశారు. ఈ చారిత్రక ఘటనకు గుర్తుగా నేటికీ ఆనవాయితీగా సోనాల మండల కేంద్రంలోని కచేరీ ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది.
దేవ్రావ్ సూర్య కుమారుడు సుభాష్ పటేల్ సూర్య మాట్లాడుతూ.. “నిజాం వ్యతిరేక పోరాటంలో మా గృహం ఒక కేంద్రంగా ఉండేది. మా నాన్న నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం మా కుటుంబానికి గర్వకారణం. వారు చూపిన బాటలోనే దేశ హితం కోసం మేము ఆరెస్సెస్, బీజేపీలో చేరి, ఆ బాటలోనే ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు.
అలాగే బోథ్ ప్రాంతంలో కూడా బోందిడి వెంకట్రావ్ అనే ఉద్యమకారుడు కూడా నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అలాగే గుడిహత్నూర్ ప్రాంతంలోని మన్నూర్ నుంచి లక్ష్మణ్ రావు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ ప్రాంతాలన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ (ఎదులాపురం) కి చెందిన ప్రాంతాలే.
ఇక ఇందూరు ప్రాంతం నుంచి రాధాకృష్ణ మోదాని, హనుమయ్య వస్తాదు,లక్క కిష్టయ్య, త్రయంబకరావు పాటిల్ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు.
హనుమయ్య వస్తాదు
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పూణేలో జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన అనంతరం ఇందూరు యువకులకు కర్రసాము, కత్తిసాము నేర్పించారు. రజాకార్లను ఎదుర్కొనేందుకు చిన్న సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అనేకమంది హిందువులకు రక్షణ కల్పించబడింది.
రాధాకృష్ణ మోదని
ఆర్య సమాజాన్ని స్థాపించి యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు గోరక్షణకు ప్రాధాన్యతను వివరించారు. 1939 సెప్టెంబర్ 2న నాటి అరబ్బులు, నిజాం అనుచరులు కత్తులతో దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు చారిత్రక వర్ణనలు పేర్కొంటాయి. ఈ ఘటనకు నిరసనగా మూడు రోజుల పాటు నిజామాబాద్ బంద్ జరిగింది.ఇప్పటికీ ఇందూరులోని రైల్వే బ్రిడ్జి దగ్గర విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.
లక్క కిష్టయ్య
బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య సుమారు వెయ్యి మంది యువకులతో ఆయుధాలు చేతబట్టి నిజాం దాష్టీకాలకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శన నిర్వహించారు.
త్రయంబకరావు పాటిల్
భార్య చేతిలోని గాజులు అమ్మి ఇందూరు నుంచి భాగ్యనగరానికి బయలుదేరి దత్తోపంత్ సైన్యంలో చేరారు.
బాంబులు తయారు చేసి నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి 1947 డిసెంబర్ 14న జైలు పాలయ్యారు. వీరి తల్లిదండ్రులను వేధించిన తీరు వర్ణనాతీతమైనా.. పోరుబాట వీడలేదు.
ఇక కామారెడ్డి ప్రాంతం నుంచి బాలకృష్ణ మహారాజ్, కిష్టయ్య, భిక్కనూర్ ప్రాంతం నుంచి రంగాచారి రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇలా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది వీరులు హిందుత్వ భావజాలంతో, జాతీయ భాజాలంతో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. వారి త్యాగాలు తెలంగాణ విమోచన పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.



