ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు - Khilafat Movement: Hundreds of years ago

Vishwa Bhaarath
ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు - Khilafat Movement: Hundreds of years ago
ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు - Khilafat Movement: Hundreds of years ago

– డా. శ్రీరంగ గోడ్బోలే
మొదటి ఇస్లాం దురాక్రమణదారుడు భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి సాగిన చరిత్రను పరిశీలిస్తే ఖిలాఫత్ ఉద్యమం (1919-11924) అనివార్యమైనదని మనకు అర్ధమవుతుంది. ఆధునిక కాలంలో సూఫీలు, ఉలామా, మధ్యతరగతి ముస్లిం మేధావులు, ముస్లిం పత్రికలు, సాధారణ ముస్లింలలో టర్కీ ఒట్టమాన్ ఖలీఫా పట్ల వ్యామోహం, నిష్ట 1830 నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చును. ఖిలాఫత్ ఉద్యమానికి బీజాలు వందఏళ్ల ముందే పడ్డాయి. 1857 తిరుగుబాటు ఇస్లాం ఉద్యమానికి ప్రారంభమైనా 18వ శతాబ్దంలోనే దానికి సైద్ధాంతికమైన పునాది పడింది. 1857 పోరాటాన్ని ప్రధమ స్వాతంతంత్ర్య సంగ్రామం అన్నప్పటికీ ఆ పోరాటం విజయవంతమై బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వదిలిపోతే అప్పుడు పాలకులు ఎవరవుతారన్న ప్రశ్నకు ముస్లింల దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. బ్రిటిష్ పాలన దార్ – ఉల్ – హర్బ్ (యుద్ధానికి మూలం; ఇస్లాం ప్రధాన మతంకాని భూమి). అది దార్ – ఉల్ – ఇస్లాం (ఇస్లాం మూలస్థానం; ఇస్లాం ప్రధాన మతమైన భూమి)కు పెద్ద అడ్డంకి. ముస్లిం రాజ్యాన్ని, పాలనను పునరుద్ధరించడమే ముస్లింలందరి అంతిమ లక్ష్యం.
    1857 తిరుగుబాటు వెనుక ఉన్న జిహాదీ లక్షణం, దానికి ఖిలాఫత్ ఉద్యమంతో ఉన్న సంబంధాన్ని డా.అంబేడ్కర్ ఇలా వివరించారు – “1857 తిరుగుబాటును అధ్యయనం చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగించిన జిహాద్. భారత్ లో బ్రిటిష్ పాలన మూలంగా ఏర్పడిన దార్ – ఉల్ – హర్బ్ కు వ్యతిరేకంగా ముస్లింలు తిరుగుబాటు చేయాలంటూ సయ్యద్ అహ్మద్ వంటివారు కొన్ని దశాబ్దాలుగా ఇచ్చిన పిలుపుకు అది పర్యవసానమని అర్ధమవుతుంది. భారత్ ను తిరిగి దార్ – ఉల్ – ఇస్లాంగా మార్చడానికి ముస్లింలు చేసిన ప్రయత్నమే ఆ తిరుగుబాటు. ఆ ప్రయత్నపు తాజా ఉదాహరణ 1919లో భారత్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడి. ఖిలాఫత్ ను సమర్ధించిన ముస్లింలు భారత్ లో బ్రిటిష్ పాలనను తొలగించేందుకు ఆఫ్ఘనిస్తాన్ సహాయాన్ని కోరారు. దాని కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది.’’(Pakistan or partition of India, B.R. Ambedkar, Thacker and company Limited, 1945, PP. 288)

1857కు ముందు ప్రపంచ ఇస్లాం ఉద్యమం (pan Islam Movement)
భారత్ లో ముస్లింపాలన అంతమయిన తరువాత మళ్ళీ ప్రపంచ ఇస్లాం అనే వాదాన్ని వినిపించినవాడు షా వలీయుల్లా(1703-62). ఖిలాఫత్ ను స్థాపించడం, జిహాద్ లేదా అవిశ్వాసులపై పవిత్ర యుద్ధాన్ని చేయడం  అనే కర్తవ్యం ఎంత ముఖ్యమో మళ్ళీ ముస్లింలకు గుర్తుచేశాడు. భారత్ లో భౌతికమైన అధికారాన్ని, ప్రబల్యాన్ని ముస్లింలు కోల్పోయిన తరుణంలో ఇస్లాంను పరిరక్షించేందుకు 19వ శతాబ్దంలో అనేకమంది ముస్లిం పండితులను తయారుచేశాడు వలీయుల్లా. ముస్లిమేతరులతో ఎంత తక్కువగా కలిస్తే అప్పుడు భారతీయ ముస్లింలు అంత ఎక్కువగా భగవంతుని సేవకులు అవుతారని బోధించాడు.(The Muslims of British India, P. Hardy, Cambridge University Press, 1972, PP. 29, 30). 1857 తిరుగుబాటులోగానీ, ఖిలాఫత్ ఉద్యమంలోగానీ హిందువుల సహాయం తీసుకోవడానికి కారణం వారంటే స్నేహం, అభిమానం కాదు. కేవలం అవసరం మాత్రమే.
    ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మరొక ముఖ్యుడు సయ్యద్ అహ్మద్ బరేల్వీ(1786-1831). ఇతడు ఒకప్పటి పిండారీ (దారిదోపిడిదారుడు). ఇతనికి సూఫీల మద్దతు బాగా ఉంది. ఇతను మహారాజా రంజిత్ సింగ్ కు వ్యతిరేకంగా 1826లో జిహాద్ ప్రారంభించాడు. జనవరి, 1827లో ఇతను ఇమామ్ అయ్యాడు. అలాగే ఇతని పట్ల `బైయ’(విధేయత ప్రకటించడం; ఈ పద్దతి ప్రవక్త మహ్మద్ ప్రారంభించాడు) ప్రకటించారు. హిందువుల పవిత్ర స్థలాలకు వెళ్ళడం, హిందువుల పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులను సంప్రదించడం వంటివాటికి దూరంగా ఉండాలని ముస్లింలను ఆదేశించాడు. ఇతని అనుచరులు ఎప్పటికైనా బ్రిటిష్ పాలనను అంతంచేయడానికి ప్రయత్నిస్తారని బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఊహించారు (Hardy, The Muslims of British India, PP. 53-54).
    ప్రపంచ ఇస్లాం సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం ముస్లిమేతరులను పక్కన పెట్టడం లేదా ముస్లింలపై వారి ప్రభావాన్ని పూర్తిగా తొలగించడం. సయ్యద్ అహ్మద్ బరేల్వికి సమకాలికుడైన హాజీ షరియత్ – అల్లా (1781-1840) బెంగాల్ లో ఫరైజీ ఉద్యమాన్ని (1821) ప్రారంభించాడు. ఖురాన్ లో చెప్పిన ముస్లింల మత కర్తవ్యాల (ఫరైజ్) నుంచి ఈ ఉద్యమానికి ఆ పేరు వచ్చింది. కుఫ్ర్ (అవిశ్వాసం), బిద్దా(సృజనాత్మకత)ను నిరాకరించడం ఆ పవిత్ర మత కర్తవ్యాల్లో ప్రధానమైనవి. హాజీ కుమారుడు దూదూ మియాన్(1819-1862) ఈ ఫరైజీల సైన్యాన్ని తయారుచేశాడు. బెంగాల్ లో టీటూ మీర్ (1782 – 1831)మరొక హింసాత్మక ఇస్లాం పునరుద్ధరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాని ప్రకారం ముస్లింలు గడ్డాలు పెంచడమేకాక, విలక్షణంగా ధోతి కట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. కానీ బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పంపి ఆ ఉద్యమాన్ని అణచివేశారు. (Hardy, The Muslims of British India, PP. 55-59). ఈ ప్రపంచ ఇస్లాం ఉద్యమాలు లేదా మతమౌఢ్య ఉద్యమాలన్నీ భారతీయ ముస్లింలను వారు ఇస్లాం స్వీకరించకముందు అనుసరించిన హిందూ ఆచారాలు, పద్దతుల నుంచి బలవంతంగా దూరం చేయడానికి ప్రయత్నించాయి. అప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో మతం మారినప్పటికీ భారతీయ ముస్లింలు తమ పాత హిందూ ఆచారాలనే అనుసరిస్తూ ఉన్నారు.
    ముస్లింలు మతమౌఢ్యం కలిగిన, ఇతరులతో ఏమాత్రం కలవని వర్గమని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్ ల మధ్య 1838లో జరిగిన మొదటి ఆఫ్ఘన్ యుద్ధంతో బ్రిటిష్ వారికి, వహాబీ ముస్లింలకు మధ్య ఘర్షణ మొదలైంది. వాయువ్య ప్రాంతంలో ఉన్న వహాబీలు ఆఫ్ఘన్ ల వైపు పోరాడటమేకాక అక్కడ ఉన్న బ్రిటిష్ సైన్యంలోని సిపాయిలను కూడా ఆఫ్ఘన్ ల వైపుకు మార్చారని ఆరోపణలు వచ్చాయి (The Wahabis in the 1857 Revolt: A Brief Re – appraisal of their role, Iqtibar Alam Khan, Social Scientist, Vol. 41, May-June 2013, P. 17).

1857 జిహాద్
1857 తిరుగుబాటు గురించి హిందువులు, ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళ అభిప్రాయాలు, ధోరణుల గురించి చరిత్రకారుడు థామస్ మెట్ కాఫ్ ఇలా వ్రాశాడు – “తమ కుల(మత) ఆచారాలపై దాడి జరుగుతుందనే భయంతో హిందువులలో మొదటగా బ్రిటిష్ వారిపట్ల అసంతృప్తి వెళ్లడయింది. కానీ ఆ తరువాత ఆ అసంతృప్తి సెగలను మరింత పెంచి,  వ్యాపింపచేయడంలో ముస్లింలు ముందున్నారు. ఈ మతపరమైన అసంతృప్తి ద్వారా తాము కోల్పోయిన రాజకీయాధికారం తిరిగి పొందవచ్చని వారికి అనిపించింది. మరోవైపు బ్రిటిష్ వాళ్ళు ఈ సిపాయి తిరుగుబాటును రాజకీయ కుట్రగా మలచినది ముస్లిం నాయకత్వమేనని, తద్వారా బ్రిటిష్ పాలనను అంతంచేయాలని ముస్లింలు భావించారని అనుకున్నారు’’(The Aftermath of Revolt: India 1857 – 1870, Princeton, 1965, P. 298).
     ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీల్లో ఉన్న బెంగాల్ సైనిక దళాలు 1857 మే, జూన్ లలో తిరుగుబాటు చేసినప్పుడు స్థానిక ముస్లింలలోని జిహాదీలు కూడా ఆయుధాలతో వారిని కలిశారు. గ్వాలియర్ వంటి చోట్ల ముస్లిము సిపాయిలే నాయకత్వం వహించారు. అలహాబాద్, లక్నో, గ్వాలియర్ లలో పాల్గొన్న సాయుధ జిహాదీలు వహాబీ ఉద్యమానికి చెందినవారు కారు. వాళ్ళు సూఫీలు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులతో కలిసి సాయుధ పోరాటం చేయడం పట్ల వహాబీ నేతలకు అనేక సందేహాలు ఉన్న కారణంగా వాళ్ళు మొదట్లో అంతగా చొరవ చూపించలేదు. (Iqtidar Alam Khan, The Wahabis in the 1857 Revolt: A Brief Re – appraisal of their role, pp. 18,19)
       11 మే, 1857 ఢిల్లీ తిరుగుబాటుదారుల వశం అయిన తరువాత నామమాత్రపు మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తిరుగుబాటు దళాలకు ప్రధాన సైనికాధికారిగా బఖ్త్ ఖాన్ (మరణం 1859)ను నియమించాడు. 100మంది జిహాదీలతో బఖ్త్ ఖాన్ ఢిల్లీకి వచ్చాడు. ఈ బఖ్త్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రుహేల ఆఫ్ఘన్ ల మద్దతుదారుడు. వీళ్ళు అమీర్-ఉల్-ముజాహిదీన్ మౌలానా సర్ఫ్రాజ్ అలీ నేతృత్వంలో పనిచేసేవారు. వీళ్ళు హాన్సీ, హిస్సార్, భోపాల్, టోంక్ ల గుండా ఢిల్లీకి వచ్చారు. (Bakht Khan : A leading sepoy General of 1857, Iqbal Hussain, హిస్టరీ కాంగ్రెస్ పత్రాలు, సం. 46, 1985, పుట. 376). హిందూ, ముస్లిం ఐకమత్యం గురించి ముస్లిం నాయకుల్లో ఎలాంటి భ్రమలు లేవని మౌల్వీ మహమ్మద్ సైద్ మొగలు చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు వ్రాసిన పత్రంలో స్పష్టమవుతుంది. 20 మే, 1857 వ్రాసిన ఆ పత్రంలో “హిందువులకు వ్యతిరేకంగా సాధారణ ముస్లింల మనస్సుల్లో సంసిద్ధతను కలిగించేందుకు పవిత్ర యుద్ధం ప్రారంభమయింది’’అని స్పష్టం చేశాడు. 1857 జూన్ 14న పంజాబ్ ప్రధాన కమిషనర్ లారెన్స్ కు వ్రాసిన లేఖలో మేజర్ జనరల్ టి. రీడ్ “వాళ్ళు ఆకుపచ్చ జెండాలను నగరంలో ఎగురవేసి హిందువులను రెచ్చగొడుతున్నారు’’అని తెలిపాడు. వారణాసిలో 1857 జూన్, 4న వెలువడిన అధికారిక రిపోర్ట్ “కొందరు ముస్లింలు విశ్వేశ్వర మందిరంలో ఆకుపచ్చ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి’’అని పేర్కొంది. (The sepoy Mutiny and the Revolt of 1857, R. C. Mujumdar, Firma KLM, 1957, p. 230)
        1857 తిరుగుబాటులో పాల్గొన్న ముస్లిం జిహాదీవాదులకు ప్రపంచ ఇస్లాం సిద్ధాంతంతో సంబంధాలను ఇక్కడ పరిశీలించాలి. 1857 జిహాద్ లో ప్రముఖ పాత్ర పోషించిన సయ్యద్ ఫద్ల్ ఆలావి, రహమతుల్లా కైరాన్వి, హాజీ ఇమ్దాదుల్లా మక్కీ, నవాబ్ సిద్దిక్ హాసన్ ఖాన్, మౌలానా జాఫర్ తనెశ్రీ వంటివారు విచారణను తప్పించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు. వాళ్ళు ప్రపంచ ఇస్లాం ప్రచారానికి అన్ని రవాణా, సమాచార వ్యవస్థలను, మార్గాలను ఉపయోగించుకున్నారు. వాళ్ళు మక్కా, కైరో, కాన్ స్టాంటిన్ నోపుల్ కు తరచూ వెళ్లివచ్చేవారు. (Fugitive Mullahs and Outlawed Fanatics ; Indian Muslims in Nineteenth Century trans – Asiatic Imperial Rivalries, Seema Alavi, Modern Asian Studies, vol. 45, November 2011, PP. 1337-1382;)(Muslim Cosmopolitanism in the age of Empire, Harvard University Press, 2015).

రౌలత్ కమిటీ నివేదిక
తమ పాలనను తొలగించి ముస్లింలు అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం బ్రిటిష్ వారికి మింగుడు పడలేదు. రౌలత్ కమిటీ నివేదికగా పేరుపడిన కుట్ర విచారణ కమిటీ నివేదిక (1918) `భారత్ లో తిరుగుబాటు ఉద్యమంతో సంబంధం కలిగిన నేరపూరిత కుట్రల స్వరూపం’ ఏమిటన్నదానిపై దృష్టి సారించింది. 226 పేజీల నివేదికలో `మహమ్మదీయ ధోరణి’అనే భాగం కూడా ఉంది. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు కొన్ని చూద్దాం –
క్రిమియా యుద్ధం నాటి నుంచి భారతీయ ముస్లింలలో టర్కీ పట్ల సానుభూతి, ఆదరణ పెరిగాయి.
మతమౌఢ్యులైన ముస్లింలతో కూడిన చిన్న సమూహం బ్రిటిష్ పాలనను తొలగించి ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలని భావిస్తోంది.

 `సిల్క్ లేఖలు’ అనే ఒక ఉద్యమ ప్రణాళిక బయటపడింది.  వాయువ్య ప్రాంతంపై దాడి చేసి, అదే సమయంలో దేశంలో ముస్లిం తిరుగుబాటు తేవాలన్నది ఆ ఉద్యమ లక్ష్యం.
 సిక్కు మతం నుంచి ఇస్లాం మతానికి మారిన మౌల్వీ ఒబేదుల్లా 1915లో అబ్దుల్లా, ఫతే మహమ్మద్, మహమ్మద్ అలీ అనే తన ముగ్గురు సహచరులతో కలిసి వాయువ్య సరిహద్దును దాటి ముందుకు వెళ్ళాడు. దేవబందీ మౌల్వీల ద్వారా ఇస్లాం అనుకూల, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాలన్నది అతని ఆలోచన.
 ఒబేదుల్లా టర్క్-జర్మనీ ఉద్యమకారులను కలిశాడు. మౌల్వీ మహమ్మద్ మియాన్ అన్సారీ 1916లో భారత్ కు తిరిగివచ్చాడు. హెద్జాజ్ టర్కీ సైనిక గవర్నర్ అయిన గాలిబ్ పాషా ద్వారా జిహాద్ ప్రకటన చేయించాడు.
భారత్ నుంచి దేవుని సైనికులను తయారుచేసి ఇస్లాం రాజ్యాల మధ్య సమన్వయాన్ని తేవాలన్నది ప్రణాళిక. ఈ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం మదీనా అయితే కాన్ స్టాంటిన్ నోపుల్, టెహరాన్, కాబూల్ లలో స్థానిక కేంద్రాలు ఉంటాయి.

విదేశాల్లో ఉన్న భారతీయ ముస్లింల పాత్ర
విదేశాల్లో, ముఖ్యంగా లండన్ లో, నివశిస్తున్న భారతీయ ముస్లింలు ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని, భావాన్ని వ్యాప్తిచేయడంలో ముఖ్యమైన పాత్రే పోషించారు. 1886లో లండన్ లో అంజుమన్ – ఈ – ఇస్లాం అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ శాఖలు భారత్ లో కూడా ఏర్పాటుచేశారు. అయితే ఆ తరువాత ఎలాంటి కార్యకలాపాలు లేకుండా మిగిలిపోయిన ఈ సంస్థను 1903లో అబ్దుల్లా అల్- మామూన్ సుహ్రావర్దీ(1875 – 1935) అనే బారిస్టర్ `పాన్ ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ లండన్’ పేరుతో పునరుద్ధరించాడు. ఈ సంస్థ టర్కీతో నేరుగా సంబంధాలను ఏర్పరచుకోవడమేకాక `పాన్ ఇస్లాం’ అనే పత్రిక ద్వారా ఇస్లాం, టర్కీ లను ప్రభావితం చేసే అంశాలపై ముస్లింలలో అవగాహన కలిగించింది.
      సెప్టెంబర్ 1911లో బ్రిటిష్, ఫ్రెంచ్ సేనలతో కలిసి ఇటలీ ఒట్టమన్ ట్రిపోలి పై దాడి చేసినప్పుడు భారతీయ ముస్లింలలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. టర్కీకి సహాయంగా స్వచ్ఛంద కార్యకర్తలను పంపుతామంటూ లండన్ ముస్లిం లీగ్ హెచ్చరించింది కూడా. ట్రిపోలి వాసులకు వైద్య సహాయం అందించడానికి రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రారంభమైంది. లాహోర్ నుంచి మద్రాస్ వరకు షియాలు, సున్నీలు అనే తేడా లేకుండా అంతా సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. సున్నీలకు కృతజ్ఞతాపూర్వకంగా ఉత్తర పర్షియాలో రష్యా ఆక్రమణ, ఇరాన్ లోని మెషెడ్ లో ఇమామ్ అలీ రజా మందిరపు కూల్చివేతలను షియాలు వ్యతిరేకించారు. (The Khilafat movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to university of London, 1973, P. 19-23).

అలజడి మొదలైంది
1912 లో బాల్కన్ రాజ్యాలన్నీ మూకుమ్మడిగా టర్కీ పై దాడి చేసినప్పుడు భారతీయ ముస్లింలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉలేమాలంతా తమ విభేదాలను పక్కన పెట్టి ఏకమయ్యారు. మతగురువు, కవి అయిన శిబ్లీ నుమాని `ఇస్లాం ప్రమాదంలో ఉంది’ అంటూ నినదించాడు. అతని యువ శిష్యుడైన అబుల్ కలాం ఆజాద్ జిహాద్ కు సమయం ఆసన్నమయిందంటూ పిలుపునిచ్చాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ షౌకత్ అలీ (1875-1958) స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించుకోవాలని `కామ్రేడ్’ అనే పత్రికలో వ్రాశాడు. అతని అన్నగారు, కామ్రేడ్ పత్రిక సంపాదకుడు అయిన మహమ్మద్ అలీ (1878-1951) అలీఘర్ విశ్వవిద్యాలయం కోసం సేకరించిన నిధులు టర్కీకి అందించాలని సలహా ఇచ్చాడు. డా. ముఖ్తార్ అహ్మద్ అన్సారీ(1880-11956) నేతృత్వంలో ఒక అఖిల భారత వైద్య బృందం డిసెంబర్ 1912లో  కాన్ స్టాంటిన్ నోపుల్ చేరుకుంది. ఆ బృందం యువ టర్కీ నాయకులనేకాక ఈజిప్ట్ జాతీయవాదులను కూడా కలుసుకుంది. మసడోనియా ముస్లిం శరణార్ధుల కోసం అనటోలియాలో ఒక పునరావాస కాలనీ, మదీనాలో ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇస్లాం బ్యాంక్, సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికను కామ్రేడ్ పత్రిక గట్టిగా సమర్ధించడమేకాక టర్కీ సెక్యూరిటీ బాండ్ లను కొనడం ద్వారా నిధులు అందించాలని భారతీయ ముస్లింలను ప్రోత్సహించింది.
భారత్ లో ప్రపంచ ఇస్లాం ఉద్యమపు ప్రధానమైన  పరిణామం 1913 మే లో అంజుమన్ – ఈ – ఖుద్దమ్ – ఈ – కాబా (కాబా సేవకుల సంఘం) ఏర్పాటు. ఈ సంఘానికి లక్నో ఫిరంగి మహల్ మతకేంద్ర అలీమ్ అయిన మౌలానా అబ్దుల్ బారి (1879-111926) అధ్యక్షుడు కాగా, ఎం. హెచ్. హుస్సేన్ కిద్వాయి, అలీ సోదరులు ట్రస్టీలు. వీళ్ళు రెండు దశల ప్రణాళికను రూపొందించారు. మొదటిది, ముస్లిమేతర దాడి ఏదైనా, దానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రదర్శనలు నిర్వహించడం. రెండవది, ముస్లిం పవిత్ర స్థలాలను పరిరక్షించే విధంగా టర్కీ ఒక స్వతంత్ర, సార్వభౌమ ముస్లిం రాజ్యంగా పటిష్టవంతమయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించడం.
        అలాగే భారతీయ ముస్లింలలో అలజడి రేపేందుకు టర్కీ నుంచి సంపన్నులైన కొందరు ఇక్కడకు వచ్చారన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. భారతీయ ముస్లింలకు అందజేయడం కోసం టర్కీ ప్రభుత్వం తుపాకులు కొనుగోలు చేయాలని కూడా అనుకుందని, అందుకు హాంబర్గ్ లోని ఒక జర్మన్ కంపెనీతో చర్చలు కూడా జరిపిందని వార్త. (Qureshi, The Khilafat movement in India, 1919-1924, p. 22-29).   సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే 1914 జులైలో సెర్బియా, ఆస్ట్రియాల మధ్య ఘర్షణ మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది.

సశేషం.. 
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)
{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top