3 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు సంఘటనలు - 3 August 1947: Incident's 15 days before partition

Vishwa Bhaarath
దేశ విభజన
దేశ విభజన

– ప్రశాంత్ పోల్
రోజు కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్  తో సమావేశం జరగాల్సి ఉంది. గాంధీజీ శ్రీనగర్ లో అడుగుపెట్టిన రోజునే, కాశ్మీరు రాజ్యానికి దివాన్ శ్రీ రామచంద్ర కాక్ నుంచి ఈ విషయమై ఆయనకు లేఖ అందింది. ఆ రోజు ఆగస్ట్ 3 ఉదయం, గాంధీ గారికి మిగతా అన్ని రోజుల్లాగే ఉంది.  ఆగస్ట్ నెల అయినా ఇంకా చలి తీవ్రత ఉంది, ఆయన శ్రీ కిశోరిలాల్ శేథీ ఇంట్లో బస చేసారు. రొజూ లాగానే గాంధీ గారు తెల్లవారకముందే లేచారు, ఆయన మనమరాలు `మను’ నీడలాగ ఆయనతోనే ఉంది.
   అంతకుముందు ఒక సంవత్సరం నుంచి మను కూడా గాంధీ గారితో ఒకే మంచం మీద పడుకునేది, ఇది కూడా ఆయన `సత్యాన్వేషణ’ ప్రయోగాల్లో ఒకటి. స్వచ్చమైన మనసున్న వ్యక్తిగా, ఇందులో ఆయనకు తప్పేమీ కనిపించలేదు. కాని ఈ వార్త అందరినీ ఆకర్షించడంతో, కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది ఎదురైంది. ప్రజాభిప్రాయం గాంధీ గారికి వ్యతిరేకం కావడంతో, బెంగాల్ యాత్ర తరువాత బీహార్ ప్రయాణం ముందు మను, గాంధీగారు వేరుగా ఉండేవారు. ఇక్కడ శ్రీనగర్ లో ఈ విషయమై అంత ఆసక్తి లేదు, కాబట్టి గాంధీ గారు ఆయన మనమరాలు ఒకేచోట ఉండడం ఎవరూ పట్టించుకోలేదు.  సూర్యోదయానికి ముందే గాంధీ గారి ప్రార్థన పూర్తి అవడంతో, ఆయన తన నివాస స్థలాన్ని శుభ్రం చేసుకున్నారు. 
   ఉదయం 11గంటల సమయంలో గాంధీ  గారు, కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్ గారి రాజమహల్ `గులాబ్ భవన్’ కి వెళ్ళారు. గాంధీ గారిని కలవడo మహారాజుగారికి ఇష్టంలేకపోయినా, ఆయన స్వాగత సత్కారాలకి ఎటువంటి లోపం చేయలేదు. గాంధీ గారిని  స్వాగతించడానికి మహారాజు, మహారాణి తారాదేవి, యువరాజు కరణ్ సింగ్ తో సహా ఉన్నారు; మహారాణి  స్వయంగా రాజతిలకం, హారతితో గాంధీ గారికి స్వాగతం పలికారు. 
(రాజమహల్ `గులాబ్ భవన్’ లో గాంధీ గారు మహారాజుని కలిసిన చెట్టుకింద ఒక రాగి ఫలకం ఉంచబడింది, అయితే దాని మీద ఆగస్ట్ బదులుగా జూన్ 1947 అని తప్పుగా వ్రాయబడింది) 
   అయితే రాజమహల్లో, గాంధీ గారి మీద ఎటువంటి ఒత్తిడి ఉన్నట్లు కనిపించలేదు, ఆయన మామూలుగానే ఉన్నారు. గాంధీ గారు, మహారాజుగారు హృదయపూర్వకoగా మాట్లాడుకున్నారు. అయితే గాంధిగారు మహారాజుగారిని భారత దేశంలో చేరమని కోరలేదు, అలా చేయడం సబబు కాదని ఆయన భావన. గాంధీ గారి ప్రతిష్టకు కూడా భంగం కలగవచ్చు. గాంధీ గారి ప్రకారం, ఆయన భారత, పాకిస్తాన్ దేశాలు రెండింటికీ పిత్రుసమానుడే.  అయితే పాకిస్తాన్ కోరుకున్న ముస్లిం నాయకులు ఆయనను కేవలం హిందువుగానే చూసి ద్వేషిoచారని, పాకిస్తాన్లో ఆయనకు స్థానం లేదని దురదృష్టవసాత్తు ఆయనకు తెలియదు. 
  బ్రిటీషు వారు భారత్ నుండి నిష్క్రమించిన తరువాత, కాశ్మీరు ఏ రకమైన వైఖరి అవలంబించాలి అనే విషయం మీద గాంధీగారు ఎమీ స్పందించకపోవడంచేత, రాజకీయ చర్చలు పెద్దగా ఏమి జరుగలేదు. అయితే గాంధీ గారి `తటస్థ’ కాశ్మీరు సందర్శన వలన, నెహ్రుగారి `కాశ్మీరు ఎజెండా/ప్రణాళిక’ కొనసాగింది. గాంధీ గారి సమావేశం ఆగస్ట్ 3న జరిగితే, పది రోజుల తరువాత, ఆగస్ట్10వ తేదిన, అంతకుముందు నెహ్రూని జైల్లో పెట్టిన,  తన విశ్వాసపాత్రుడైన ముఖ్యమంత్రి  శ్రీ రామచంద్ర కక్ ను,  మహారాజు ఆ పదవి నుంచి తొలగించారు. వేరొక పరిణామం, సెప్టెంబర్ 29 తేదిన, నెహ్రు సన్నిహిత మిత్రుడు శ్రీ షేక్ అబ్డుల్లాను జైల్లోనుంచి విడుదల చేసారు.
   గాంధీగారి కాశ్మీర్ పర్యటన ఫలితం ఇంతవరకే పరిమితమైనదిగా కనిపిస్తుంది. అయితే ఈ రెండు కోరికల బదులుగా, లేక వాటితో పాటు, మహారాజును భారత్ లో చేరమని గాంధీ గారు కోరి ఉంటే, అక్టోబర్ 1947 దాకా ఆగకుండా, ఆగస్ట్ 1947 లోనే కాశ్మీరు భారత్ లో విలీనం అయిఉండేది, తరువాతి  పరిణామాలు జరుగకుండా, ఈ రోజున్న కాశ్మీరు సమస్య తలెత్తకుండా ఉండేది….  అయితే అలా జరుగలేదు ….!

మండి
దిగువ హిమాలయ శ్రేణులలోని ఒక చిన్న పట్టణం. రుషి మను పేరు పెట్టబడింది. 1947లో ఇది వ్యాసనదీ  (బీయాస్) తీరంలో ప్రాకృతిక సౌందర్యంతో నిండి ఉన్న చిన్న రాజ్యం. కాని ఈ రాజ్యం రాజు, బ్రిటిషు వారు నిష్క్రమించాక తమ రాజ్యం స్వతంత్రంగా ఉండవచ్చా అని యోచిస్తున్నాడు. అదే సమయంలో, ప్రక్కనే ఉన్న సిర్మాయుర్ రాజ్యం రాజు కూడా భారత్ లో కలవకుండా, స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ రాజ్యాలు, అప్పటి రాజాస్థానాల వేదిక `నరేంద్ర మండలి’ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. అయితే ఇంత చిన్న చిన్న రాజ్యాలు, స్వతంత్రంగా నిలవలేవు అని వారికి అర్ధమైంది. అదే సమయంలో, కాశ్మీరు మహారాజు కూడా తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలని యోచిస్తున్నట్లు వారికి తెలిసింది.     
   ఈ ఇద్దరు రాజులు కలిసి, పర్వత రాజ్యాలు అనదగ్గ జమ్ము- కాశ్మీరు, పంజాబ్, సిమ్లాలో ఉన్న రాజ్యాలన్నీ కలిపి ఒక  `బృహత్ సంస్థానం’ గా ఉండాలనే ప్రణాళిక ముందుకు తీసుకువచ్చారు. ఒక వారం ముందు, లార్డ్ మౌoట్ బాటెన్ ను వారు కలిసారు.  ఈ ప్రణాళిక గురించి ఆలోచించడానికి తమకు మరి కొంత సమయం కావాలని అడిగారు. కాబట్టి, ఈ రాజులు, భారత్ లో తమ రాజ్యాలను విలీనం చేసే సంధి పత్రాలమీద  (లెటర్ అఫ్ ఏక్సెషన్) సంతకం చేయడానికి మరింత  సమయం కోరారు.  
   ఢిల్లీలో తన ఘనమైన భారీ వైస్రాయ్ కార్యాలయంలో ఉన్న లార్డ్ లూయిస్  మౌoట్ బాటెన్, ఈ రాజులు వ్రాసిన లేఖలను మళ్ళీ మళ్ళీ చదివాడు. ఇంత మంది రాజులు తాము స్వతంత్రంగా ఉంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తే, తర్వాత బ్రిటిషువారు  భారతదేశం విడిచి వెళ్ళే సమయంలో, పరిస్థితి అంత క్లిష్టంగా మారుతుంది. కాబట్టి మౌoట్ బాటెన్ కి చిన్న రాజ్యాలు స్వతంత్రంగా ఉండడం ఇష్టంలేదు. అయితే, ప్రజాస్వామ్య స్ఫూర్తి, తన పదవి దృష్ట్యా, ఈ విషయమై  మౌoట్ బాటెన్, సర్దార్ పటేల్ కు లేఖ వ్రాసేందుకు పూనుకున్నాడు. దీనిపైన సానుకూల నిర్ణయం ఉండదని తెలిసీ, 3 ఆగస్ట్  మధ్యాహ్నం మౌoట్ బాటెన్ సర్దార్ పటేల్ కు వ్రాసిన లేఖలో, విలీనం (లెటర్ అఫ్ ఏక్సెషన్) విషయమై సిర్మాయుర్, మండి  రాజులకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.     
——–
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఢిల్లీ లోనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారి షెడ్యూల్డ్ కులాల సమాఖ్య కార్యకర్తలు మొత్తం దేశంనుంచి, వివిధ పనులమీద వారిని కలవడానికి వస్తున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాల పని బాకీ ఉంది. ఆయనకి చాలా ఇష్టమైన పని – పఠనానికి – సమయం లేదు. అయితే అన్ని పనుల్లో లోతుగా నిమగ్నమవడం ఆయనకి  ఇష్టం, అదొక పండుగ లాగా అయన భావిస్తారు.   
   కాబట్టే, ఆయనని తన మంత్రివర్గంలో చేరమని నెహ్రూగారు ఆహ్వానించగా, బాబాసాహెబ్ అంగీకరిస్తూ `న్యాయశాఖలో అంతగా పనిలేదు. చాలా పని ఉండే బాధ్యత ఇవ్వండి’ అని కోరారు. నెహ్రూగారు చిరునవ్వుతో `తప్పకుండా. చాలా పెద్ద బాధ్యతాయుతమైన పని మీకు అప్పగించబోతున్నాను’ అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం, ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు నుంచి స్వంతంత్ర భారతదేశానికి ఆయనను ప్రధమ న్యాయశాఖా మంత్రిగా నియమిస్తూ వచ్చిన లేఖను బాబాసాహెబ్ అందుకున్నారు. ఇది బాబాసాహెబ్ గారికి, షెడ్యూల్డ్ కులాల సమాఖ్యకు అత్యంత ముఖ్యమైన మరియు ఆనందకరమైన సందర్భం…!
——–
ఢిల్లీలో ఆగస్ట్ నెలలో కూడా ఉన్న ఎండ తీవ్రతతో  సర్ రాడ్ క్లిఫ్  చాలా కష్టపడుతున్నారు. నిర్భీతి, నిష్పక్షపాతానికి మారుపేరైన బ్రిటిష్ న్యాయమూర్తి  రాడ్ క్లిఫ్ గారి  న్యాయస్ఫూర్తి, మేధస్సుని గౌరవిస్తూ, దేశవిభజన ప్రణాళిక పనికి ఆయనే సముచిత వ్యక్తి అని పట్టుబట్టి, బ్రిటిష్ ప్రధాని అట్లీ ఆయనను భారత్ కి పంపించారు.  ఇక్కడ కీలక విషయమేమిటంటే, భారత్ గురించి ఎక్కువ పరిచయం లేని వ్యక్తే భారతభూమిపై  విభజనరేఖ గీయాలని మౌoట్ బాట్టెన్ కోరుకున్నారు, న్యాయమూర్తి  రాడ్ క్లిఫ్ గారికి భారత్ గురించి ఎమీ తెలియదు.      
   అయితే `ఎమీ తెలియకపోవడం’ ఎంత పెద్ద సమస్యో రాడ్క్లిఫ్ఫ్ గారికి త్వరలోనే తెలిసివచ్చింది. పర్వతాలు, నదులు, సెలయేళ్ళ విస్తృత వ్యవస్థ ఉన్న అత్యంత విశాల భారతభూమి మీదుగా విభజనరేఖ గీయడమంటే, లక్షలాది మంది జనం తమ నివాసాలనుంచి వెళ్ళగొట్టబడతారు, తరతరాలుగా సాగుచేస్తున్న భూమి పరాయిదేశం అవుతుంది. కోట్లాది ప్రజల జీవితాలు నాశనమౌతాయి, ఇది చాలా క్లిష్టమైన పని.      
   ఇది జటిల సమస్య అని బాగా అర్ధమైన  రాడ్ క్లిఫ్ గారు, న్యాయసమ్మతంగా దేశవిభజన జరిపించాలని ప్రయత్నం చేసారు.  ఆయన నివాసంలోని ౩ గదులు పూర్తిగా పత్రాలు, దస్తావేజులు, భారతదేశo మ్యాపులు మొదలైన వాటితో నిండిపోయాయి.  ఆగస్ట్ 3 వ తేది నాటికి, చాలా వరకు పని పూర్తి అయింది, పంజాబ్ లో కొన్ని వివాదాస్పద ప్రాంతాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా ముగించాలని ఆయన చూస్తున్నారు. ఆ పనిలో ఉండగా, సైన్యం నుంచి బ్రిటిష్ మేజర్ షార్ట్ నుంచి ఆయనకు ఒక లేఖ అందింది. ప్రజల మనోభావాలు  రాడ్ క్లిఫ్  గారికి తెలియజేయాలని ఆయన ఇలా  వ్రాసారు, `మౌoట్ బాటెన్ ఎలా చెప్తే, ఎంత మాత్రం విభేదించకుండా  రాడ్ క్లిఫ్ అలానే నిర్ణయిస్తారని ప్రజలు భావిస్తున్నారు’. రాడ్ క్లిఫ్ ఈ సంగతి ఆలోచిస్తూ ఉండిపోయారు, ఆ లేఖలో కొంత భాగం వాస్తవమే, మౌoట్ బాటెన్ ప్రభావం రాడ్ క్లిఫ్ పై తప్పకుండా ఉంది.
——–
ఆగస్ట్ 3. మధ్యాహ్నం 4 గంటలకు  జవహర్ లాల్ నెహ్రూ నివాసం 17, యార్క్ హౌస్ నుంచి ఒక పత్రికా ప్రకటన జారీ అయింది. అప్పటి అస్థిమిత, అల్లకల్లోల వాతావరణంలో రొజూ పత్రికా సమావేశాలు జరుగుతూ ఉండేవి లేక ప్రకటనలు జారి అయేవి. అయితే ఈ నాటి ప్రకటన ప్రత్యేకమైనది, అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఆనాటి ప్రకటనలో, నెహ్రూ గారు తన మంత్రివర్గ సభ్యుల పేర్లు ప్రకటించారు. స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి మంత్రివర్గం. అందుకే ఆ ప్రకటనకి ఆ ప్రాముఖ్యత. ఈ క్రింది వరుసలో పేర్లు ఇవ్వబడ్డాయి-
  1. ·    సర్దార్ వల్లభ్.భాయి పటేల్
  2. ·   మౌలానా అబుల్ కలం ఆజాద్
  3. ·   డా. రాజేంద్ర ప్రసాద్
  4. ·   డా. జాన్ మథాయ్
  5. ·   బాబు జగ్జీవన్ రాం
  6. ·   సర్దార్ బలదేవ్ సింగ్
  7. ·   సి. హెచ్. భాబా
  8. ·   రాజకుమారి  అమ్రిత్ కౌర్
  9. ·   డా. బి. ఆర్. అంబేద్కర్
  10. ·   డా. శ్యామప్రసాద్ ముఖర్జీ
  11. ·   షణ్ముఖమ్ చెట్టి
  12. ·   నరహర్ విష్ణు గాడ్గిల్
ఈ 12మంది సభ్యులలో, రాజకుమారి  అమ్రిత్ కౌర్ ఒకరే మహిళ. షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ప్రతినిధిగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ నియుక్తి కాగా, హిందూ మహాసభ నుంచి డా. శ్యామప్రసాద్ ముఖర్జీ, పంతిక్ పార్టీ నుంచి సర్దార్ బలదేవ్ సింగ్ మంత్రివర్గంలో చేరారు.
   వేరొకచోట, గోవా ప్రజలను ఎంతో నిరాశకు గురిచేసిన పత్రికా ప్రకటన శ్రీ రామ్ మనోహర్ లోహియా నుంచి పత్రికా కార్యాలయాలకు చేరింది. లోహియాగారు `భారత స్వాతంత్ర్యంతో పాటుగా గోవా స్వేఛ్చ సాధ్యపడదని, కాబట్టి గోవా ప్రజలు తమ స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగించాలని’ గోవా ప్రజలకు తెలియచేసారు.
                                                               ——–
   త్వరితగతిన జరుగుతున్న ఈ పరిణామాలు, దేశంలో చెలరేగిన విభజన జ్వాలల మధ్య, మహారాష్ట్ర అలాండి, దేవాచిలో  కాంగ్రెస్ పార్టీలోని కమ్యూనిస్టు కార్యకర్తల సమావేశం ఆ రోజే ముగిసింది. వారందరూ ఆ క్రితం రోజు నుంచి తీవ్రమైన చర్చల్లో ఉన్నారు. 
   రైతులు, కార్మికుల ప్రయోజనాలకోసం కమ్యూనిస్టు/సామ్యవాద  సిద్ధాంతాలతో పనిచేసే ఒక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో ఏర్పరచుకోవాలని  వారు చివరలో తీర్మానించుకున్నారు. శంకరరావు మోరె, కేశవరావు జేదే, భావుసాహేబ్ రవుత్, తులసిదాస్ జాధవ్ మొ.వారు ఈ వర్గానికి నాయకత్వం వహించాలని నిర్ణయం జరిగింది. మహారాష్ట్రలో ఒక కొత్త కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవిస్తోంది…
——–
   ఆ రోజు శ్రీనగర్లో గాంధీగారి యాత్ర చివరి రోజు. ఆ మరుసటి రోజు ఆయన జమ్మూ ప్రయాణమౌతున్నారు. కాబట్టి బేగం అక్బర్ జహాన్ నివాసంలో ఆ రాత్రి విందుకి  ఆయన గౌరవ అతిధి. ఆవిడ గాంధీ గారిని విందుకి ఆహ్వానించారు. గాంధీ గారికి షేక్ అబ్డుల్లాతో గాఢమైన మైత్రి ఉంది కనుక, ఆయన ఎటూ కాదనరు. షేక్ అబ్డుల్లాగారు అపుడు జైల్లో ఉన్నారు, ఆయన లేకపోయినా బేగం సాహిబా గారు ఉత్సాహంగా విందు ఏర్పాటు చేసారు, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. బేగం సాహిబా, వారి కుమార్తె  ఖాలిదా ద్వారం వద్ద నిలబడి గాంధీ గారికి స్వాగతం పలికారు. ఈ ఆడంబరం, రాజ వైభోగాలన్నీ చూసి గాంధీగారు విస్తుపోయారు, కొంత అసౌకర్యానికి గురి అయ్యారు, బేగం సాహిబా గారితో ఆ మాట చెప్పినా కూడా, విందు చివరిదాకా ఉన్నారు.
   ఈ సందిగ్ధ సందర్భంలో, కొంత అశాoతoగా ఆగస్ట్ 3 రాత్రి మెల్లిగా సాగుతోంది. లక్షలాది సంపన్న కుటుంబాలు లాహోర్, పఠాన్ కోట్, బెంగాల్ నుంచి విభజిత భారతానికి శరణార్థులుగా తరలి వస్తున్నారు. తాము కష్టపడి ఆర్జించుకున్న స్థిర చరాస్తులు తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో విడిచిపెట్టేసి, ప్రాణభయంతో, ఆకలి దప్పులతో శరీరాలు అలసిపోయి, భార్యాబిడ్డల కష్టాలు చూడలేని  అశక్తతతో, శరణార్థులుగా రావలసిన దుస్థితికి మనసులు వికలమై తరలి వస్తున్నారు.  
➣ అయితే ఢిల్లీ లో రాజకీయాలు మాత్రం యధాప్రకారం కొనసాగుతున్నాయి.
➣ భారతదేశ విభజనకి కేవలం పన్నెండు రాత్రులు మాత్రమే మిగిలాయి…

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top