అరవింద్‌ మార్గం - ఆధ్యాత్మిక భారతం - Sri Aurobindo

Vishwa Bhaarath
0
అరవింద్‌ మార్గం
అరవింద్‌ మార్గం
15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు..
  'ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, ముస్లింల పేరుతో రెండు ముక్కలైంది. శరీరంలో ఒక భాగం కోల్పోయి నట్లే దేశం అంగవైకల్యంతో బలహీన పడుతుంది. భవిష్యత్తు నిరాశాజనకంగా ఉండకూడదనుకుంటే విభజన రద్దయి తిరిగి భరతభూమి అఖండం కావాలి’ అన్నారు.
  ఆ యోగి ఎవరో కాదు.. ఏ వ్యక్తి తన రాతలు, ఉపన్యాసాలతో లక్షలాది జనాలను కదిలించారో.. ఏ పేరు వింటే బ్రిటిష్‌ ప్రభుత్వం నిలువునా వణికిపోయేదో.. వారు ఏ వ్యక్తిని బంధించి ద్వీపాంతర వాసానికి పంపాలని ప్రయత్నించి విఫలమయ్యారో.. ఆ విప్లవకారుడే ఆధ్యాత్మిక వెలుగులు అందించే మహర్షిగా మారారు.. ఆయనే అరవింద్‌ ఘోష్‌.
   అరవింద్‌ అంతకు నాలుగు దశాబ్దాల క్రితం స్వరాజ్యమంటే ఏమిటి? అన్న అంశం మీద తన పత్రికలో ఒక సంపాదకీయం రాశారు. అందులో ‘ఈ దేశ ప్రజలకు భగవత్‌ సాక్షాత్కారమే స్వరాజ్యం. ఇది కేవలం రాజకీయ స్వాతంత్య్రం కాదు, విస్కృతమైనది. వ్యక్తి, సామూహిక, సాంఘిక, జాతి, ఆధ్యాత్మిక స్వాతంత్య్రం. భగవంతుడు భారతదేశాన్ని పవిత్ర, ఆధ్యాత్మిక అగ్రగామిగా ఉండాలని నిర్దేశించాడు. దేశ ప్రజలు భగవత్సాన్నిహిత్యాన్ని పొందాలి. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం మన దేశానికి ఆదర్శం కాదు. అది హక్కులు, విధుల పేరుతో భారతీయ ఆత్మను గుర్తించలేదు. మన ప్రజాస్వామ్యం ధర్మం ఆధారంగా ఉండాలి’ అన్నారు అరవింద్‌.

ఐసిఎస్‌ వదులుకుని..
1872 ఆగస్టు 15న బెంగాల్‌లో స్వర్ణలతా దేవి, డా.కృష్ణధన్‌ ఘోష్‌ దంపతులకు జన్మించారు అరవింద్‌. డార్జిలింగ్‌లోని ఓ కాన్వెంటులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తన కుమారుడు ఇంగ్లిష్‌ వారిలాగే పెద్ద అధికారిగా కనిపించాలనే కోరికతో ఇంగ్లాండ్‌ పంపారు కృష్ణధన్‌. తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఇంగ్లిష్‌తో పాటు లాటిన్‌, ఫ్రెంచ్‌, గ్రీక్‌ భాషలతో ఎన్నో విజ్ఞాన శాస్త్రాలను అరవింద్‌ అభ్యసించాడు. అయితే భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావంతో తండ్రి కె.డి.ఘోష్‌ దృక్ఫథంలో మార్పు వచ్చింది. బ్రిటిష్‌ వారు స్వదేశంలో చేస్తున్న అన్యాయాలు, అమానుష విధానాలను ఎప్పటికప్పుడు కుమారుడు అరవింద్‌కు లేఖలో రాసేవారు.
   భారతదేశంలో ఆంగ్లేయుల పాలనపై అరవింద్‌లో ఏవగింపు మొదలైంది. 1889లో ఐసిఎస్‌ (నేడు ఐఏఎస్‌) పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. కానీ బ్రిటిష్‌ వారికింద పనిచేయడం ఇష్టంలేక సర్వీసులో చేరలేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఇండియన్‌ మజ్లిస్‌, కమల్‌-ఖడ్గ అనే రహస్య విప్లవ సంస్థల్లో అరవింద్‌ చురుగ్గా పని చేశారు.

స్వదేశాగమనం
బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చినప్పుడు అరవింద్‌ ఘోష్‌ ప్రతిభను గుర్తించారు. తన సంస్థానంలో పని చేయడానికి ఆహ్వానించారు. మహారాజు ఆహ్వానం మేరకు 1893 ఫిబ్రవరిలో స్వదేశానికి బయలు దేరారు. దురదృష్టవశాత్తు అరవింద్‌ పయనిస్తున్న ఓడ సముద్రంలో మునిగిందనే వార్త విని తండ్రి కృష్ణధన్‌ గుండెపోటుతో మరణించారు. అయితే ప్రమాదానికి గురైన ఓడలో అరవింద్‌ లేరు.
   బరోడా సంస్థానంలో రాజోద్యోగిగా చేరిన అరవింద్‌ కొంతకాలానికి అక్కడే కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 1901లో మృణాళినితో వివాహమైంది. బెంగాలీ, సంస్తృతం, గుజరాతి, మరాఠీ భాషలపై పట్టు సాధించిన అరవింద్‌ రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నిరంతర పుస్తక పఠనం భవిష్యత్తులో ఆధ్యాత్మిక భావనలకు పునాది వేసింది. అరవింద్‌ గొప్ప సాహితీవేత్త కూడా. భర్తృహరి నీతి శతక అనువాదంతో పాటు సావిత్రి, రాధావిరహం, విక్రమోర్వశీయం, ఊర్వశి తదితర కావ్యాలు రాశారు.

రాజకీయ రంగం, విప్లవోద్యమం
స్వరాజ్యం కోసం రగిలిపోయే అరవింద్‌ ఘోష్‌ ‘ఇందు ప్రకాష్‌’ అనే పత్రికలో బ్రిటిష్‌ పాలనను ఎండగడుతూ వ్యాసాలు రాశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లోని లోపాలను కూడా ఎత్తి చూపేవారు. ఈ రచనలు సంచలనం సృష్టించాయి. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విప్లవ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు అరవింద్‌. తన తమ్ముడు బరీంద్రను కూడా ఇందులో చేర్చారు.
  దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరుకున్న అరవింద్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ మహాసభలకు కూడా హాజరయ్యారు. ఒకపక్క రాజకీయాలతో పాటు మరోపక్క ఆధ్మాత్మిక చింతనను కూడా పెంపొందించుకున్నారు. విష్ణుభాస్కర్‌ లేలే అనే యోగి దగ్గర యోగసాధన చేసి మూడు రోజుల్లోనే నిర్వాణ స్థితిని సాధించారు.
   అరవింద్‌ దృష్టిలో స్వాత్రంత్యం అంటే కేవలం రాజకీయ క్రీడ కాదు, భూమిపై భగవంతుని రాజ్యాన్ని తీసుకొచ్చే ముందడుగు. అలాగే మాతృభూమి అనేది కేవలం భూఖండం కాదనేవారు అరవింద్‌.

వందేమాతర ఉద్యమంలో..
బ్రిటిష్‌ వారు బెంగాల్‌ను విభజించడంతో దేశవ్యాప్తంగా వందేమాతర ఉద్యమం రగులుకుంది. ఇంతకాలం స్వరాష్ట్రానికి దూరంగా ఉన్న అరవింద్‌ ఘోష్‌ కలకత్తాకు మకాం మార్చారు. అక్కడి నేషనల్‌ కాలేజీకి తొలి ప్రిన్సిపల్‌గా జాయిన్‌ అయ్యారు. బిపిన్‌ చంద్రపాల్‌ ప్రారంభించిన వందేమాతరం పత్రికకు తెరవెనుక సంపాదకుడిగా వ్యవహరిస్తూ అరవింద్‌ రాసిన వ్యాసాలు సంచలనం రేపాయి. ఆయనకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ కాగా కాలేజీ ప్రిన్సిపల్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అరవింద్‌ పేరు దేశమంతా మార్మోగినా, వందేమాతరం పత్రికకు ఆయనే సంపాదకుడు అని బ్రిటిష్‌ వారు నిరూపించలేకపోవడంతో కేసు నీరుగారిపోయింది.

అలీపూర్‌ బాంబు కేసులో జైలు
1908లో వందేమాతర ఉద్యమకారులకు కఠిన శిక్షలు విధించిన ముజఫర్‌పూర్‌ జిల్లా జడ్జి కింగ్స్‌ ఫర్డ్‌ను హతమార్చేందుకు ఖుదీరాంబోస్‌, ప్రపుల్ల చాకీ ఓ బండిపై బాంబు విసిరారు. ఆ బండిలో కింగ్స్‌ఫర్డ్‌ లేడు. ఇద్దరు స్త్రీలు చనిపోయారు. ఆలీపూర్‌ కుట్రగా ప్రసిద్ధికెక్కిన ఈ కేసులో అరవింద్‌ ఘోష్‌, ఆయన తమ్ముడు బరీంద్రనాథ్‌ ఘోష్‌, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్‌ సహా పలువురిపై కుట్రదారులుగా అభియోగాలు నమోదయ్యాయి.
   అరవింద్‌ను అరెస్టు చేసి ఆలీపూర్‌ జైలుకు పంపారు. కారాగారవాసంలో ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. యోగసాధనతో భగవత్సాక్షాత్కారం కోసం తహతహలాడారు. ఆ సమయంలో ఆయనకు అంతా కృష్ణభగవానుడే కనిపించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ కేసులో అరవింద్‌ను ఎలాగైనా నేరస్థునిగా రుజువుచేసి కఠిన శిక్ష పడేలా పథకం వేసింది. అప్పటికే దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన అరవింద్‌ దగ్గర కేసును ఎదుర్కోవడానికి కావలసిన ధనం లేదు. అభిమానులంతా చందాలు వేసుకుందా మనుకున్నారు. ఈ దశలో చిత్తరంజన్‌ దాస్‌ ముందుకు వచ్చి కేసును ఉచితంగా వాదించారు.
   న్యాయస్థానంలో అరవింద్‌ తన వాదన ఇలా వినిపించారు ‘దేశ స్వాతంత్య్రం కోసం పని చేయడం చట్ట వ్యతిరేకమని భావిస్తే నేను నేరం చేసినట్లే.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుకోవడం, ప్రచారం చేయడం నేరమైతే దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. దానిప్రకారం నన్ను శిక్షించండి.. అంతేకానీ నా స్వభావానికి, ఆదర్శాలకు విరుద్ధమైన పనులు చేసినట్లు ఆరోపించకండి’.
   చిత్తరంజన్‌ దాస్‌ న్యాయమూర్తి ముందు వాదిస్తూ ‘మీరు అన్యాయంగా అభియోగం మోపిన అరవింద్‌ అకళంక దేశభక్తునిగా, జాతీయ కవిగా, జాతీయవాద ప్రవక్తగా, మానవతావాదిగా చరిత్రలో నిలిచిపోతారు’ అని పేర్కొన్నారు. 126 రోజుల విచారణ తర్వాత అరవింద్‌ నిర్దోషిగా విడుదల య్యారు.

జాతీయవాదం అంటే..
జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్‌ ఘోష్‌ దేశ ప్రజల్లో స్వాభిమానం, దేశభక్తి పెంపొందించు కునేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు. ‘జాతీయవాదం అంటే ఒక ధోరణి, మతం, నమ్మకం కాదు.. అది మన సనాతన ధర్మం, అదే మనకు జాతీయవాదం.. వందేమాతరంలో మనకు మాత అనే పదం మాతృభూమిని గుర్తుకు తెస్తుంది. ఇప్పుడు ఇది నూతన ధోరణి..’ అని ఉద్బోధించారు అరవింద్‌.
   ‘జాతీయవాదమంటే కేవలం రాజకీయాలు కాదు. హిందూజాతి సనాతన ధర్మంలో పుట్టింది. దానితో కదులుతుంది, దానితోనే పెరుగుతుంది. సనాతన ధర్మం క్షీణిస్తే, జాతి క్షీణిస్తుంది. ధర్మం నశిస్తే జాతీ నశిస్తుంది. సనాతన ధర్మమే జాతీయ వాదం’ అంటూ ఉత్తరపరాలో జరిగిన సభలో అరవింద్‌ ప్రసంగించారు. కర్మయోగిన్‌, ధర్మ పత్రికల ద్వారా తన భావాలను ప్రచారం చేశారు.

పాండిచ్చేరి పయనం
అరవింద్‌ ఘోష్‌ కార్యకలాపాలపై బ్రిటిష్‌ ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. ఆయనను ఎలాగైనా ద్వీపాంతరవాసం పంపాలని కుట్ర పన్నింది. ఈ విషయాన్ని పసిగట్టిన అరవింద్‌, సోదరి నివేదిత సూచనతో ‘బ్రిటిష్‌ ఇండియా’ను వదిలిపెట్టి ఫ్రెంచ్‌ వారి పాలనలోని చంద్రనాగూరు బయలు దేరారు. ఎవరికీ తెలియకుండా పలుమార్లు బస మార్చారు. ఈ కాలంలో పూర్తిగా యోగసాధనలోనే గడిపారు అరవింద్‌. ఆ తర్వాత పాండిచ్చేరి వెళ్లమని అరవింద్‌ను అంతర్వాణి ప్రబోధించింది.
   1910 ఏప్రిల్‌ మాసంలో ఓ బోటులో ఫ్రెంచ్‌ వారి ఆధీనంలోని పాండిచ్చేరి చేరుకున్నారు అరవింద్‌. ఇదే ఆయన శాశ్వత నివాసమైపోయింది. జీవిత చరమాంకాన్ని పూర్తిగా ఆధ్మాత్మిక మార్గానికే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అరవింద్‌ను పాండిచ్చేరి నుంచి వెనక్కి రప్పించి అరెస్టు చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
  భారతదేశం ఆధ్మాత్మిక మార్గంలో ప్రపంచంలోనే విశిష్ట స్థానాన్ని పొందాలని ఆకాంక్షించారు అరవింద్‌. స్వామి వివేకానంద బోధనలు ఆయన్ని ప్రభావితం చేశాయి. విశ్వమత సమ్మేళనంలో స్వామీజీ సూచించినట్లు వసుధైక కుటుంబం అనే ఉపనిషద్‌ వాణి ప్రపంచమంతా మార్మోగాలి అని అరవింద్‌ అనే వారు. ఆధ్మాత్మికతకు పుట్టినిల్లు అయిన భారతదేశం పాశ్యాత్య దేశాలకు ఈ విజ్ఞానాన్ని అందించాలి, ఆదర్శ సమాజాన్ని నిర్మించాలి అని చాటి చెప్పారు.
   పాండిచ్చేరిలో నాలుగేళ్లపాటు ఏకాగ్రతతో యోగదీక్ష చేసి 1914లో ‘ఆర్య’ అనే పత్రికను ప్రారంభించారు. దీనిద్వారా దివ్యజీవితం, వేద రహస్యం, గీతా వ్యాసాలు, ఉపనిషత్‌ వ్యాఖ్యలను ధారావాహికగా అందించారు. అరవింద్‌ను కలుసుకునేందుకు ఎంతోమంది ప్రముఖులు పాండిచ్చేరి వచ్చారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, లాలాలజపతి రాయ్‌, పురుషోత్తమదాస్‌ టాండన్‌, డాక్టర్‌ మూంజే, డాక్టర్‌ హెడ్గేవార్‌ వీరిలో ఉన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పలు అంశాలపై విస్తృతమైన చర్చలు సాగేవి. అరవింద్‌ను తిరిగి రాజకీయాల్లోకి రావాలని పలువురు సూచించారు. అయితే తాను ఆధ్యాత్మికానికే శేష జీవితాన్ని అంకితం చేశానని వారికి స్పష్టంగా చెప్పారు.
  1914లో ఫ్రాన్స్‌కు చెందిన పాల్‌ రిచర్డ్‌, మీరా రిచర్డ్‌ దంపతులు ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా పాండిచ్చేరి వచ్చారు. అరవింద్‌ భావాల ప్రచారానికి తోడ్పాటును అందించారు. కొంతకాలం తర్వాత వెళ్లిపోయారు. అయితే మీరా రిచర్డ్‌ తిరిగి వచ్చేశారు. భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించిన అమె అరవిందుని ప్రవచనాలను ప్రపంచానికి అందించడంలో కీలకపాత్ర పోషించారు. మీరా రిచర్డ్‌ క్రమంగా శ్రీమాతగా ప్రసిద్ధికెక్కారు.

మహా సమాధి
అరవింద్‌ ఆశ్రమం క్రమంగా ప్రపంచ దృష్టిని ఆకర్శించడం మొదలైంది. ఏకాంతంగా రోజుల తరబడి ధ్యానంలో గడిపే అరవింద్‌, కలవడానికి వచ్చే ప్రముఖులతో పాటు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా వారితో సంబంధాలు కొనసాగించారు. ప్రతి ఏటా నవంబర్‌ 24న సిద్ధి దినోత్సవం జరిపేవారు. సమకాలీన దేశ రాజకీయాలు, ముఖ్య ఘట్టాలపై స్పందించేవారు. తన జన్మదినమైన ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినా, దేశ విభజన జరగడం అరవింద్‌ను బాధించింది.
  1949 నుంచి అరవింద్‌ ఘోష్‌ అరోగ్యం క్షీణించడం మొదలైది. చివరకు 1950 డిసెంబర్‌ 5న మహా సమాధి పొందారు. అరవింద్‌ భౌతికకాయ దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
  స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ రాజకీయ నాయకునిగా, ఆధ్యాత్మిక వేత్తగా, జాతీయవాద ప్రవచకునిగా జీవితాంతం భారతమాత సేవలో శ్రమించారు అరవింద్‌ ఘోష్‌. ఆధ్యాత్మిక భారత నిర్మాణం కోసం తపించారు. ఎంతోమందికి స్పూర్తిగా మార్గదర్శిగా నిలిచారు.

రచన: క్రాంతిదేవ్‌ మిత్ర - (జాగృతి సౌజన్యం తో)  {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top