మార్క్సిజం బహిష్కరణలోనే దేశహితం - Boycott Marxism

Vishwa Bhaarath
మార్క్సిజం
మార్క్సిజం
ద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలో తూటాపేలింది. తొమ్మిదిమంది చండ్ర పుల్లారెడ్డి బాట నక్సలైట్లు హతమయ్యారు. వీరిని సైతం మావోయిస్టులుగా మీడియా పేర్కొంటున్నది. ఎవరు మావోలు? ఎవరు నక్సలైట్లు? మీ మరణం వృధా కాదు, మీ నెత్తురు వృధా పోదు.. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు.. అన్న అందమైన మాటల గారడీని కొందరు వినిపించారు. మార్క్సిజమంతా దగాపూరిత మాటలు తప్ప వాస్తవం మాత్రం కాదు.
  గత నాలుగు దశాబ్దాలకుపైగా ఈ రకమైన నినాదాలు, పాటలు పల్లవిస్తూనే ఉన్నాయి. వాటి డొల్లదనం బహిర్గతమవుతూనే ఉంది. తాజాగా టేకులపల్లి అడవుల్లో మార్క్సిజానికి తొమ్మిదిమంది తెలంగాణ బిడ్డలు బలయ్యారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న నక్సలైట్ గ్రూపులవల్ల సమాజానికి కలుగుతున్న ప్రయోజనమేమిటి? కన్నతల్లుల కడుపుకోత తప్ప!

కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం, మర్రిగూడెంకు చెందిన ఎట్టికుమార్ దళ నాయకుడిగా ఈ కొత్త గ్రూపు పురుడుపోసుకుంది. గతంలో జనశక్తి, ప్రతిఘటన, న్యూడెమొక్రసీ ఇట్లా వివిధ గ్రూపుల్లో పనిచేసిన వ్యక్తులను ఒకచోట చేర్చి చండ్ర పుల్లారెడ్డి బాట పేర వివిధ కాంట్రాక్టర్ల దగ్గర, ప్రజల దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బుతో కొన్ని ఆయుధాలను సమకూర్చుకున్నారని, ఆ ఆయుధాలను మరిన్నిచోట్ల మరింత డబ్బు అక్రమంగా, బలవంతంగా వసూలు కార్యక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ, వివిధ నక్సలైట్ గ్రూపుల కార్యక్రమమంతా ఇలాగే కొనసాగుతోంది. ఆ అడుగుజాడల్లో కొత్తకొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. అమాయక తెలంగాణ బిడ్డలు ఇలా కన్నుమూస్తున్నారు. మార్క్సిజం పేర, వివిధ నాయకుల పేర దళాలు ఏర్పాటు చేసి సమాజానికే భారమవుతున్నారు. ఆయా కుటుంబాలకు క్లేశం మిగులుస్తున్నారు.
 మావోయిస్టులు, వివిధ నక్సలైట్ గ్రూపులకు సమాజగమనం గూర్చిన అవగాహన ఇసుమంత కూడా కనిపించదు. అవగాహన ఉన్నట్టయితే పదిమందితో దళం ఏర్పాటు చేసి ఆయుధాలతో అడవుల్లో తిరగడం వల్ల, కొంతమందిని బెదిరించడం వల్ల సమాజ చలన గతుల్లో మార్పు కలుగుతుందా? అన్న పరిశీలన చేసేవారు. అడవుల్లో వేటగాళ్ల మాదిరి ఆయుధాలతో తిరిగినంత మాత్రాన ఉత్పత్తి సంబంధాల్లో, సమాజ చలన గతిలో మార్పు జరగదని గత నాలుగు దశాబ్దాల అనుభవం చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఇప్పటికీ ‘త్రి నాట్ త్రీ’ తుపాకి ఉంటే చాలు సమాజాన్ని సమూలంగా మార్చేస్తాం అన్న ముతక ఆలోచనకే దాసోహం అనడం ఆశ్చర్యంగా కలిగిస్తోంది.

తెలంగాణలో దొరలు, దేశ్‌ముఖ్‌లు, ముక్తేదారుల, భూస్వాముల అరాచకాల కాలం నాటి భావజాలం ఇంకా సజీవంగా ఉందనుకోవడం, ఆ రకమైన ‘‘అర్ధవలస, అర్ధ భూస్వామ్య..’ వ్యవస్థ కొనసాగుతోందని విశే్లషించుకుని, ఒట్టిపోయిన మార్క్సిజం సూత్రాలు ముందరేసుకుని ఆ వెలుగులో గొప్ప విప్లవం తెస్తామని ముతక ఆయుధాలతో అడవుల్లో మకాం చేస్తే మనం ముందుకెళుతున్నామా?.. వెనక్కి నడుస్తున్నామా?.. అన్న ఆలోచన చేసేంత తీరిక సైతం మావోయిస్టులకు, నక్సలైట్ గ్రూపులకు లేకుండా పోవడం విచిత్రం.
  ఎవరి ప్రాణాలను పణంగాపెట్టి, ఎవరి జీవితాలను తాకట్టు పెట్టి, ఎవరి భవిష్యత్‌ను జూదంలో పెట్టి మార్క్సిజం, మావోయిజం నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు? ప్రజలు, పేదలు ముఖ్యమా?.. మార్క్సిజం, మావోయిజం ముఖ్యమా? అన్న ఇంగితం పూర్తిగా విస్మరించినందువల్లనే తొమ్మిదిమంది తెలంగాణ అమాయకులు అసువులు బాశారు. ఈ నేరం ముమ్మాటికీ మార్క్సిజానికిది, మావోయిజానిది, దానిని గుడ్డిగా అనుసరించేలా, రెచ్చగొడుతున్న కుహనా సిద్ధాంతవేత్తలది, నాయకులది.

మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానం వెలుగులో సమసమాజం (సోషలిజం) నిర్మిద్దాం రండి, రారండోయ్ అని కొందరు అదే పనిగా ఇల్లెక్కి పిలుపునిస్తూ ఉన్నారు. అందమైన పదబంధాలతో, కాలం చెల్లిన సిద్ధాంత కొటేషన్లతో పాతకాలపు పలుకులకు నగిషీలు చెక్కి నవీనతరం ముందుకు తెచ్చి వారిని ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఫలితం టేకులపల్లి సంఘటన. దీనికితోడు ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్రోని గడ్చిరోలి సరిహద్దుల్లో, అటు ఒడిశా సరిహద్దులోని ఏఓబీలో అమాయక జనం ఆహుతి ఇంకా, ఇంకా కొనసాగాలా?
  ఒక దశాబ్ద కాలంలోనే మానవ జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న ఈ 21వ శతాబ్దంలో, కృత్రిమ మేధ ఆధారంగా సమాజ చలన గతులు సంపూర్ణంగా మారినవేళ ఉత్పత్తి సంబంధాలు అనూహ్యంగా మారిపోయి, రోబోలు రాజ్యమేలుతున్న సందర్భంలో ఇలా అడవుల్లో తుపాకులతో సంచరించడం వల్ల, వెచ్చటి నెత్తురు చిందించడం వల్ల ఆ ‘దిశ’ను మార్చి, మార్క్సిజం దారిని రహదారిగా మారుస్తామనుకోవడం, అందుకు అమాయకులను, ఆకర్షించడం, ప్రోత్సహించడం, రకరకాల ఎత్తుగడలతో వారి జీవితాలతో ఆడుకోవడం అమానుషం.

మీ త్యాగం వృధాపోదు, మీ రక్తం వృధా కాదు, మీ ఆశయాల్ని నెరవేరుస్తాం, మీ స్వప్నం సాకారమయ్యేలా చూస్తాంలాంటి మాటలు ఎంత మోసపూరితమో ఇట్టే తెలుస్తోంది. గత 50 సంవత్సరాలుగా అటు శ్రీకాకుళం నుంచి, ఉత్తర తెలంగాణ వరకు ఎంతమంది త్యాగాలు చేశారు? ఎంతమంది రక్తం నేలపాలయింది? వారి కలలు, ఆశయాలు ఏవైనా నెరవేరాయా? లేదు, లేనేలేదు. పైగా ఆ మార్క్సిజం మత్తుమందుకు అలవాటుపడి వర్తమానంలో జీవించడం మరచిపోయి గతంలో జీవించడం నేర్చుకున్నారు. దరిమిలా వెనుకబాటుదనం తప్ప ఆగామి గూర్చిన అవగాహన లేకుండా పోయింది. వెరశి జీవితం వెలవెలబోవడం తప్ప మరొకటి సాకారం కాలేదు. ఇదే తాము చరిత్రకిచ్చిన కానుకగా గొప్పలు పోవడం భావదారిద్య్రం తప్ప మరొకటి కాదు.
  దార్శనికులు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేవారు చేపట్టే కార్యక్రమాలకు ఎప్పుడూ మాన్యత ఉంటుంది. అవి నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. వెలుగుచూసిన అనేక ఆవిష్కరణలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. వెలుగుచూసిన అనేక ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేసేవారు చేస్తున్నారు. వాటిని అందుకుని జీవితాల్ని పండించుకునేవారు పండించుకుంటున్నారు. ఈ ప్రధాన జనజీవన స్రవంతిని కాదని, ప్రత్యామ్నాయం పేర, మార్క్సిజం పేర, ఆవిరి యంత్రాల కాలం నాటి ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు అన్ని మర్యాదలను తుంగలోతొక్కి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అరాచకం. ప్రజాకవులు, రచయితల పేర ఇలాంటి అమాను,త్వానికి కొందరు మద్దతు ప్రకటించడం, సంఘీభావం తెలపడం తప్పుడు సంకేతాలివ్వడం తప్ప మరొకటి కాదు!

కాలం కలకాలం ఒక రీతిన సాగదు. ఈ వౌలిక సత్యాన్ని పట్టించుకోకుండా వంద సంవత్సరాల క్రితం రష్యాలో జరిగిన విప్లవం ఇప్పుడు తెలంగాణ సమాజంలో చోటు చేసుకుంటుందనుకోవడం, చోటు చేసుకోవాలని దళాలు నిర్మించడం చదివేస్తే ఉన్నమతి పోవడం తప్ప మరొకటి కాదు. రష్యాలో రాచరికానికి వ్యతిరేకంగా విప్లవం వెల్లువెత్తింది. ఇప్పుడు భారతదేశంలో, తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విప్లవం రావాలా? అప్పుడు అధికారం ప్రజల చేతిలోగాక ఎవరి చేతిలోకి వెళుతుంది? ఈ విషయాలపై స్పష్టత లేదు. ప్రజల నుంచి దూరమై కేవలం రాజ్యాధికారం యావ తలకెక్కడంతో రకరకాలైన ఆలోచనలు ముందుకొస్తాయి తప్ప అందులో ఏది వాస్తవిక ప్రతిపాదన? ఏదికాదు అన్న వివేచన కొరవడటం కారణంగా మావోయిస్టులు, నక్సలైట్లు కాలాన్ని గేలి చేస్తున్నారు. అమాయకుల్ని ఆహుతి తీసుకుంటున్నారు. ఈ అధికారం వారికి ఎవరిచ్చారు? అని ప్రశ్నించాల్సిన మేధావులు కొందరు వారికి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉంది. వారి డొల్లతనం ఇలా బయటపడుతోంది.

కొసమెరుపు: ప్రపంచ తెలుగు మహాసభలను కొందరు విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యులు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. గూడ అంజయ్య, బోయ జంగయ్యలాంటి దళిత కవుల, రచయితల పేర స్వాగత తోరణాలు కట్టినందుకు బహిష్కరించాలా? మారుమూల గ్రామాల నుంచి తెలుగు పండితులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలివచ్చి రాగయుక్తంగా పద్యాలు ఆలపించి మాతృభాషపై మక్కువ ప్రదర్శించినందుకు బహిష్కరించాలా? ఎందుకు బహిష్కరించాలి? వారిదో పెద్ద అయోమయం! వారు మార్క్సిజాన్ని బహిష్కరిస్తే ఎంత బాగుంటుంది!

-- వుప్పల నరసింహం 9985781799 - ఆంధ్రభూమి సౌజన్యం తో
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top