‘ఆర్య’ సిద్ధాంతం అవాస్తవమని ఇంకా గుర్తించని స్వయం ప్రకటిత మేధావులు - Self-proclaimed intellectuals who have not yet realized that the ‘Arya’ theory is FAKE THEORY

‘ఆర్య’ సిద్ధాంతం అవాస్తవమని ఇంకా గుర్తించని స్వయం ప్రకటిత మేధావులు - Self-proclaimed intellectuals who have not yet realized that the ‘Arya’ theory is untrue
‘ఆర్య’ సిద్ధాంతం
రావణాసురుడు, నరకాసురుడు ఆదివాసీలని, వారిని ఆర్యులైన రాముడు, కృష్ణుడు అన్యాయంగా వధించారని, ఇక్కడి నిజమైన భూమిపుత్రులను పురాణ పురుషులని చెప్పబడే ఆర్య జాతివారు తమ జాత్యున్మద, అహంకారాలతో అతి కిరాతకంగా నాశనం చేశారని, ద్రావిడులైన రావణాది వీరులను ఎందరినో చంపిన పాపాత్మక విదేశీ శక్తులని – ఇలా ఇంకా చాలాచాలా ఈ మధ్య కొందరు రాస్తూ పోతున్నారు కొన్ని కొన్ని పత్రికలలో.

‘ఆర్య – ద్రావిడ’ సిద్ధాంతం పూర్తిగా కృతకం. స్తర శాస్త్ర (stratigraphy), వేత్త, జి.ఎఫ్.డేల్స్ ‘ఆర్య – ద్రావిడ’ ద్విజాతి సిద్ధాంతం అవాస్తవం అని మొహంజొదారోలో తాను చేసిన త్రవ్వకాల సాక్ష్యాధారాలతో నిరూపించాడు.(Foreword to The Aryan Invasion Theory; A Reappraisal by S.G. Talageri) అయినా కూఢా ఇన్నాళ్లుగా డా. ఫ్లీట్ , వి.ఎ.స్మిత్, ఆర్.సి.మజుందార్, ఎల్లాన్, రాయ్‌చౌదరి, తారాచంద్, ఇటీవలి డా.హంసరాజ్‌ల తప్పుడు అంచనాల, లెక్కల వివరాలు, అసలు ఏనాడూ భారతదేశంలో అడుగు పెట్టి ఎఱుగని మాక్స్‌ముల్లర్ తీరి కూర్చుని చెప్పిన పొంతన కుదరని ‘వేదాలు – ఇండియా – చారిత్రక కాలము – ఆర్యులు – ద్రావిడులు’ అనే వివాదాస్పద చరిత్రలు పాడిందే పాటగా, ఆడిందే ఆటగా మన విశ్వవిద్యాలయాలు చెప్తూనే ఉన్నాయి. ‘ఈ మాతృభూమిలో ఏదీ నీది కాదు, అసలు నీవు నీవే కాదు’ అనే ఒక ‘మహా’ చారిత్రక వేదాంతాన్ని ‘పడమటి వాళ్లు’, ఆ ‘పడమటి చదువుల’ చిలక పలుకుల, వెఱ్ఱిగాలుల మన విశ్వవిద్యాలయ ఆచార్యులు ఏనాడు మన మీద రుద్దబూనుకున్నారో గాని ఆ రోజు మాత్రం భారతీయ స్వకీయ సాంస్కృతిక వారసత్వ సత్యాల సమగ్రత అనే సూర్యబింబానికి గ్రహణం పట్టింది.
  కనీసం పదివేల ఏండ్ల క్రిందటి వేదాలు, ఐదు వేల ఏండ్ల నాటి భారతేతిహాసం మొదలుకొని ఇటీవలి కాలపు ప్రొఫెసర్లు దానా, లూరుూ జెకోలియట్, మెడ్లికోట్, బ్లాన్‌ఫర్డ్, ఓల్డ్ హ్యామ్, క్లాస్ కోస్టర్ మెయిర్ మొదలైన చరిత్ర పరిశోధకులు, పి.ఎన్.వోక్ వంటివారు, కోట వెంకటాచలం, అచ్యుతుని వెంకటా చలపతిరావు, డాక్టర్ రఘువీర మున్నగు భారతీయ చారిత్రక వాఙ్మయ పరిశోధకుల వఱకు ఎందరెందరో మేధావులు, అధ్యయనపరులు భారతీయ సాంస్కృతిక ఏకత, పుట్టుకలు కేవలం సంపూర్ణ భారతీయములే గాని ఏ మాత్రమూ దిగుమతులు కావు అని సోపపత్తికంగా రుజువు చేయటం జరిగింది. అయినా సరే ఈ సత్యాన్ని కొందరు పనిగట్టుకొని ఎన్ని విధాలుగా హత్య చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు.

అమెరికన్ యూనివర్సిటీ లన్నిటికీ ఒకటిగా భారతీయ సంస్కృతి – చరిత్రకు ప్రధాన పాఠ్యగ్రంథం రాసిన క్లాస్ క్లోస్టర్ మెయిర్ అనే ప్రొఫెసర్ ‘ఇటీవలి కాలంలో వెల్లడైన శాస్ర్తియ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతపు పునాదులే కదిలిపోయాయి. (The dating of the Vedic age as well as the theory of Aryan invasion has been shaken – State University of Newyork Press, 1994 p.34) అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు ఆ పాఠ్యగ్రంథంలో.
  ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతలు అని చెప్పబడే ఈజిప్టు, సుమేరియన్ నాగరికతల కంటే సింధు నాగరికతే ప్రాచీనమైనదని కూడా ఈ మధ్యలో వెల్లడవుతున్న ‘నాసా’ పరిశోధనల ద్వారా తెలుస్తోంది. సింధు నాగరికత అంటే అది ఆదిమూల భారతీయ నాగరికతే అని తేల్చి చెప్పారు ప్రఖ్యాత చరిత్రకారులు కె.ఎన్.దీక్షిత్. సింధు ప్రాంతం అంటే సప్త సింధు, సప్త సింధు అంటే సింధు, జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, సరస్వతీ నదుల పరీవాహక ప్రాంతం. అదంతా మన భారతదేశమే. భారతీయ వేద, ఐతిహాసిక వాఙ్మయంలో ప్రధాన పాత్ర సప్త సింధువే భౌగోళికంగాను, సాంస్కృతికంగాను.
   ఆ నాగరికతే ఆనాడు యావద్భారతం నిండి ఉండేది. ఆ నాగరికత – సంస్కృతులలో ఒక భాగమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద మొదలైన నదులే యావద్భారత జాతికీ పవిత్ర నదులుగా సంభావింపబడ్డాయి. సనాతన కాలం నుంచీ. చరిత్ర ఎఱుగని కాలం నుంచి నేటి వరక్కూడా ఆసేతు శీతాచల పర్యంతం ప్రతి భారతీయుడు తాను ఎక్కడ స్నానం చేస్తున్నా ‘గంగేచ యమునేచైవ గోదావరి సింధు సరస్వతీ నర్మదే కృష్ణ కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు’ అని పఠిస్తాడు. స్మరిస్తాడు. మరి ఇక్కడ ఈ ‘ఆర్యజాతి’ అనే ప్రస్తావన, ప్రసక్తి ఎలా వస్తాయి? అసలు ఆ మాటకు చోటెక్కడ?

ఆర్య’ సిద్ధాంతం అవాస్తవం
ఆర్య’ సిద్ధాంతం అవాస్తవం
భారతీయ వాఙ్మయంలో ఆర్యులు అనే ఒక జాతి ఉండేదని ఎక్కడా రాసి లేదు. ఎవరి పుట్టిల్లు వారి తాతలు చెప్పాలి గానీ బయటి వాళ్లు ఏదో ఊహించి ఏదేదో చెప్తే అదే సత్యం ఎలా అవుతుంది?
  రామాయణంలో సీతాదేవి శ్రీరాముడిని, మండోదరి రావణబ్రహ్మను ‘ఆర్యా’ అనే సంబోధిస్తారు. ఇక్కడ ‘ఆర్యా!’ అంటే నేను మనం సంబోధించే ‘సర్’ అనే పదం లాంటిది గౌరవార్థక సూచకంగా. ఈ ‘ఆర్య-ద్రావిడ’ అనే నడమంత్రపు ద్విజాతి సిద్ధాంతం ఒకటుందని సీతా రాములకూ తెలియదు; రావణ మండోదరులకూ తెలియదు.
   మొదట్లో ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మాక్స్‌ముల్లర్‌కే తరువాత తరువాత తన థియరీ తప్పని అర్థమైపోయింది. వేదార్థాలు తెలిసిన పండితుడిగా తనను తాను ప్రకటించుకొన్న మాక్స్‌ముల్లర్ మొదటి ఇరవై ఏళ్ల కాలమూ ఆర్యులది ప్రత్యేక జాతి అని ఢంకా బజాయించి చెప్పాడు. ఆ తరువాత వాస్తవం గ్రహించి తరువాతి ముప్పయ్యేళ్లూ ఆర్యులది ప్రత్యేక జాతి కాదు అని అంతే గట్టిగా ప్రకటించాడు. 1871లో ఆర్యులది ప్రత్యేక భాషా కుటుంబమే తప్ప ప్రత్యేక జాతి కానే కాదు అని నాలుక మడత వేశాడు. “I have declared again and again that if I say Aryan, I mean neither blood nor bones, nor skull, nor hair; I mean simply those who speak the Aryan language’ (నేను ‘ఆర్యులు’ అన్నధి రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు అనే అర్థంలో కాదని, ఆర్య భాషను మాట్లాడే వారని మాత్రమే నా ఉద్దేశమని పదేపదే చెప్పాను) అని వివరణ ఇచ్చుకున్నాడు.

ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంచాలకులుగాను, సీనియర్ ఫెలోగాను పని చేసిన డాక్టర్ హంసరాజ్ కూడా ఆర్యులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు అనే వాదన ఇప్పటికీ ఇతమిత్థం కాదు అన్నారు ఒకపక్క ఆర్యులు విదేశీయులు అని మరోచోట రాస్తూనే. హైదరాబాద్ సిసిఎంబి శాస్తవ్రేత్తలు అమెరికా హార్వర్డ్ మెడికల్ స్కూల్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి 13 ప్రాంతాల్లో చేసిన పరిశోధనల ఫలితాలను 2009 సెప్టెంబర్ ‘నేచర్’ పత్రిక ప్రకటించింది. అగ్రకులాలు అని చెప్పబడే వారల జీవజన్యు వారసత్వం, దళిత- వనవాసీల జన్యు వారసత్వం ఒకటే అని తేల్చింది. ‘ఆర్యులు – భారతదేశంపై దాడి చేసి జయించారన్నది అభూత కల్పన’ అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారు. (డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు – సంపుటం 7. పు.73)
ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. మాక్స్ ముల్లర్ తన మాట మార్చి ఆర్యులు అంటే ‘ఆర్యభాష’ (సంస్కృతం) మాట్లాడేవారు అని అర్థం మాత్రమే. శారీరకంగా వేరే జాతి వారు కాదు’ అని అన్నాడని చెప్పుకున్నాం.
   క్రీ.పూ.750-1200 మధ్యకాలంలో సెల్టులు అనే ఒక ప్రాచీన ఆటవిక జాతి మధ్య ఉత్తర ఐరోపాలో సంచరిస్తూ ఉండేది. వాళ్లు సంచార జాతులుగా క్రమంగా పశ్చిమానికి జరిగి ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్‌లకు విస్తరించారు. పాశ్చాత్య దేశాల పౌర సమూహాలన్నీ దాదాపు సంచార జాతులే. అలాంటి చరిత్ర కలిగిన సంచార జాతుల జన్యువులతో పుట్టిన, నిండిన పాశ్చాత్య దేశాల విద్యావంతులకు, చరిత్ర పరిశోధకులకు ప్రపంచమంతా ఇంతే అనే ఒక తప్పుడు ఊహ, దురభిప్రాయము నరనరాన జీర్ణించుకున్నాయి. ఆ కమిటెడ్, ప్రిజుడిస్ట్ లోచనాలతోనే, ఆలోచనలతోనే భారతదేశ చరిత్రను రెండు జాతుల దాడుల సంఘర్షణల చరిత్రగా వాళ్లు రాసి పారేశారు. కామెర్ల రోగికి లోకమంతా పసుపు పచ్చగా కనిపించినట్టు. పోనీ ఆ కామెర్ల వ్యాధి రూపక చరిత్ర వాఙ్మయ రచనలు చేసిన పాశ్చాత్యుల అవాస్తవిక, అభూత కల్పనలే నిజాలనుకుందాం. మరి వాటిని పరాస్తం చేస్తూ వచ్చిన, వస్తున్న కోట వెంకటాచలం, పి.ఎన్.వోక్, అంబేద్కర్, కె.ఎన్.దీక్షిత్ మొదలైన వాళ్ల వాదనలను, వాదాలను కూడా విశ్వవిద్యాలయాల్లో బోధిస్తే అప్పుడు ఇంకా లోతుగా పరిశోధనలు జరిగి వాస్తవాలు బయటకొస్తాయిగా. అలా ఎందుకు చేయరు?

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం - ఆంధ్రభూమి సౌజన్యం తో
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top