దత్తోపంత్ ఠేంగ్డీజీ: ఒక సామాన్యుడి అసామాన్య జీవనయానం - Dattopant Tengdi ji

Vishwa Bhaarath
దత్తోపంత్ ఠేంగ్డీజీ: ఒక సామాన్యుడి అసామాన్య జీవనయానం - Dattopant Tengdi ji
దత్తోపంత్ ఠేంగ్డీజీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యం దైవకార్యం స్వయంసేవకుల విశ్వాసం ఇదే. అలాంటి స్వయంసేవకులలో ఆణిముత్యం - దత్తోపంత్. దార్శనికత, సంఘటనా చాతుర్యం రెండూ కలిగినవారు అరుదు. ఈ రెండు గుణాల మేళవింపు దత్తోపంత్ ఠేంగ్డీ.         
సవంబర్ 10, 1920, దీపావళి పండుగ రోజున మహారాష్ట్రలోని, వార్థా జిల్లా, ఆర్వీ గ్రామంలో ఠేంగ్డీ జన్మించారు. తల్లిదండ్రులు బావూరావ్ రేంగ్డీ, జానకీదేవి. బాపూరావు న్యాయవాది. సామాన్య స్థితి నుండి స్వయంకృషితో ప్రతిభా పాటవాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బాపూరావ్ స్వభావరీత్యా మొండివారు, జానకీదేవి అణకువ కలిగివారు. దత్తోపంత్ కంటే ముందు పుట్టిన అందరూ చనిపోయారు. జానకీదేవి దత్తాత్రేయుని భక్తురాలు. కర్ణాటక, గుల్బర్గాలోని గానుగాపూర్ లో ప్రసిద్ధ దత్తక్షేత్రం ఉంది. సంతానం కోసం జానకీదేవి ఈ క్షేత్రంలో వ్రతం చేసింది. ఫలితంగా కొడుకు పుట్టాడు. ఆ కారణంగానే దత్తాత్రేయ అని పేరు పెట్టారు. దత్తోపంత్ పూర్తి పేరు దత్తాత్రేయ బాపూరావ్ ఠేంగ్డీ.

    దత్తోపంత్ ప్రాథమిక విద్యాభ్యాసం ఆర్వీ మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. అది 1935-36 సంవత్సరం. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా సత్యాగ్రహాలు జరిగేవి. ఆర్వీలోని చౌరస్తాలో జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు జరిపే సత్యాగ్రహాలు దత్తోపంత్ని బాగా ఆకర్షించాయి. తెల్లటోపి ధరించి మండు టెండలో సైకిల్ మీద ఆ చౌరస్తాలో చక్కర్లు కొడుతుండేవాడు. ఇది తండ్రి దృష్టికి వచ్చింది. దత్తోపంత్ ని కోప్పడ్డారు. దత్తు వినలేదు. ఒకరోజు తండ్రి చూస్తుండగా చౌరస్తాలో తిరుగుతూ 'భారత్ మాతాకీ జయ్', వందేమాతరం' అంటూ నినాదాలు ఇచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చి భార్యతో 'ఈరోజు దత్తుకి భోజనం పెట్టవద్దు' అని ఆదేశించాడు. దత్తు ఇంటికి రాగానే 'నీవు ఇకముందు సత్యాగ్రహాలలో పాల్గొనకు అని అరిచాడు. దత్తు నేను వెళ్లతాను అని సమాధానమిచ్చాడు. తండ్రి దత్తు మీదకు చేతికందిన వస్తువును విసిరేశాడు. దత్తు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. శాంతస్వభావం, ధార్మికత మెండుగా ఉన్న ఆ తల్లి ఒక ఉపాయం కనిపెట్టింది. సత్యాగ్రహానికి ముందు దత్తుని పూజాగృహంలో కూర్చోపెట్టి జ్ఞానేశ్వరి, దాసబోధ దత్త చరిత్ర వినిపించడం ప్రారంభించింది. నెమ్మదిగా కొడుకుకి ఈ పూజా పాఠాలు అలవాటు చేసింది. ఒకరోజు దత్తు తల్లితో 'ఇక సత్యాగ్రహంలో పాల్గొనను, చదువుకుంటాను' అని మాట ఇచ్చాడు. 
           మంచి నంస్కారాలు అందాలని దత్తుని ఆర్ ఎస్ఎస్ శాఖకు పంపించిందామె. తండ్రి బాపూరావ్ కూడా స్వయంసేవక్. దత్తు 10-11 సంవత్సరాల వయసు నుండి ఆర్వీ శాఖకు క్రమతప్పక వెళుతుండేవాడు. చదువు, శాఖను కొడుకు నిర్లక్ష్యం చేయకుండా జానకీదేవి అత్యంత శ్రద్ధ కనబరచింది. చిన్నతనం నుండే దత్తులో నాయకత్వ లక్షణాలు ఉండేవి. కొత్తవారిని పరిచయం చేసుకోవడం మిత్రులుగా మలుచుకోవడం, శాఖకు తీసుకురావడం సహజంగా చేసేవాడు. మిత్రులను చేసుకోవడంలో ధనిక-పేద, ఉచ్ఛ-నీచ వంటి భేదాలు చూపేవాడు కాదు. సమరసత, సమదృష్టి పుట్టుకతోనే దత్తోపంత్లో ఉన్నాయని చెప్పవచ్చు. 1934 డిసెంబర్ లో వార్ధా జిల్లాలో జరిగిన హేమంత శిబిరంలో దత్తు మొదటిసారి పరమపూజ్య డాక్టర్టీని చూశాడు, ఉపన్యాసం విన్నాడు. 
      కుటుంబ వాతావరణం వలన దత్తు చిన్ననాటి నుంచి అన్ని పనులు క్రమం తప్పకుండా చేసేవాడు. ఉదయం వ్యాయామశాలలో కుస్తీ సాధన. నిత్యం ఈత కొట్టడం ఒకటి. 10వ తరగతిలో ఉండగా రోజూ ఒక మైలు పరుగెత్తేవాడు. సాయంకాలం శాఖకు వెళ్లి అన్ని కార్యక్రమాలలో పాల్గొనేవాడు.
     సంఘటనా చాతుర్యం, నాయకత్వ లక్షణాల కారణంగానే 15వ ఏట భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ సంస్థ వానరసేన ఆర్వీ తాలూకా ప్రముఖ్ గా ఎన్నికయ్యాడు. ఆర్వీ మున్సిపల్ స్కూల్ విద్యార్థి సంఘానికి ఎన్నిక ద్వారా భారీ మెజారిటీతో అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఒకసారి సాయం శాఖ నుండి వస్తున్న దత్తోపంత్ మిత్రులను ఆ ఎన్నికలలో ఓడినవారు తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో దత్తోపంత్ లేరు. కానీ దీనికి ప్రతీకారం రెండేళ్ల తర్వాత తీర్చుకున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని వీరు కూడా తీవ్రంగా కొట్టారు కేసు నమోదయింది. దీనిలో దత్తోపంత్ పేరు ఉంది, పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారు. తండ్రి అడ్వకేట్ కాబట్టి సర్దిచెప్పి పంపించేశారు. దత్తుని పిలిచి 3 నెలల పాటు ఎవరికీ కన్పించకుండా వెళ్లి పొమ్మన్నారు. ఇది దత్తోపంత్ మొదటి అజ్ఞాతవాసం. గ్రామం నుండి గ్రామానికి చేరుతూ, ఎక్కడో భోజనం చేస్తూ, పోలీసులకు దొరకకుండా తిరిగాడు. చేసేదిలేక పోలీసులు కేసు ఉపసంహరించుకున్నారు. దత్తోపంత్ తిరిగి ఊరు చేరుకుని విద్యాభ్యాసం కొనసాగించాడు. ఈ అజ్ఞాతవాస అనుభవం 1948లో సంఘంపై మొదటి నిషేధం విధించినపుడు ఉపయోగపడిందని దత్తోపంత్ చెపుతూ ఉండేవారు.

     దత్తోపంత్ 12వ తరగతి వరకు ఆర్వీలోనే చదువుకున్నారు. గ్రామంలోని విక్టోరియా లైబ్రరీ (ప్రస్తుతం తిలక్ గ్రంథాలయం) మహారాష్ట్రలో 3వ పెద్ద గ్రంథాలయం. సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, నవలలు, కవితలకు సంబంధించి పదివేలకు పైగా పుస్తకాలు ఉండేవి. హైస్కూల్లో ఉండగానే దత్తోపంత్ అనేక పుస్తకాలను చదివేశాడు. మరాఠీ, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషలలో పట్టు సాధించగలిగాడు. తండ్రి కారణంగా ఇంట్లో సంఘ ప్రభావం ఉండేవి. ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ పూజ్య గురూజీతో వీరికి సన్నిహిత సంబంధం ఉండేది. తల్లి జానకీదేవికి గురూజీ అంటే పూజ్యభావన ఉండేది. ఆ కారణం చేతనే ఉన్నత విద్య కోసం దత్తోపంత్ నాగ్పూర్ వెళ్లినప్పుడు గురూజీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ విధంగా గురూజీ తల్లి తాయిజీ వాత్సల్యం దత్తోపంత్కి లభించింది. ఆయన నాగ్ పూర్ లోని మోరిస్ కళాశాలలో బిఎ, ఎల్ఎల్బి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. అదే సమయంలో 1936-38 వరకు 'హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్' అనే విప్లవ సంస్థలో క్రియాశీలంగా ఉన్నారు. కళాశాల విద్యార్థిగా కార్యపద్ధతిని దగ్గరగా చూసి అధ్యయనం చేశారు. అప్పుడే మోరోపంత్ పింగళేతో స్నేహం ఏర్పడింది దీనితో డాక్టర్జీని అనేకసార్లు కలిసే అవకాశం లభించింది. నాగ్పూర్లో చదువుతున్నప్పుడే సంఘ శిక్షావర్గలన్నీ పూర్తి చేశారు.

    నాగ్ పూర్ లో ఉండగా సంఘ ఉత్సవాలు లేదా కార్యక్రమాలలో దత్తోపంత్జీ ఉపన్యాసాలు తరచు ఉండేవి. ఇది ఒకరకంగా అహంకారానికి చోటు కల్పిస్తుంది. ఆ గుణదోషాలను గురూజీ ఎలా తొలగించారో స్వయంగా దత్తోపంత్ చెప్పారు. గురూజీ ఇంట్లో రోజూ నిద్ర లేచి పక్కబట్టలు సర్దకుండా కాలకృత్యాలు తీర్చుకుని టీ తాగి వెళ్లిపోయే వాడు దత్తోపంత్, తిరిగి వచ్చేసరికి పక్కబట్టలు శుభ్రంగా సర్ది ఉండేవి. పక్క మిత్రుడు రోజూ ఆ పని చేస్తున్నాడని భావించాడు దత్తోపంత్. ఒకరోజు ఆ మిత్రునికి క్షమాపణ చెప్పారు. ఆ మిత్రుడు నేను చేయడం లేదన్నాడు. మరుసటి రోజు వెనకగది నుండి గమనిస్తే గురూజీ ఆ పక్కబట్టలు సర్ది వెళ్లడం కనిపించింది. దత్తోపంత్ సిగ్గుపడ్డాడు. 'స్వీయ అనుశాసనం గురించి చాలా చక్కగా నేర్పించారు గురూజీ' అన్నారు దత్తోపంత్.
     సిద్దాంతం మీద అనేకసార్లు ఉపన్యాసం ఇవ్వడం వలన సంఘమంతా అర్థమైంది అనే భావన దత్తోపంత్లో ఏర్పడింది. అయితే ఒకసారి శిక్షావర్గలో సాక్షాత్తూ గురూజీ తన ఉపన్యాసంలో సంఘాన్ని నేను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. ఆ మాటలతో దత్తోపంత్ లోని  అహంకారం పటాపంచలు అయింది. గురూజీ ప్రేరణతో సంఘకార్యాన్ని జీవిత లక్ష్యంగా నిశ్చయించుకుని 1941లో సంఘ ప్రచారక్గా వచ్చారు దత్తోపంత్, వారిని కేరళ ప్రాంతానికి ప్రచారక్గా వెళ్లమని గురూజీ ఆదేశించారు.  హిందూ సంఘటన అసాధ్యమని దత్తోపంత్ ని నిరాశపరిచారు. ఈ వాతావరణంలో వీరు తన ప్రతిభ, సంఘటనా కౌశలంతో శాఖలను విస్తరించారు. సామాన్య కుటుంబాల నుంచి అనేకమంది కార్యకర్తలను తయారుచేశారు. ప్రముఖులను విద్యావంతులను సంఘానికి దగ్గర చేశారు. ఈ పునాది కారణంగా కేరళలో సంఘం తర్వాతి కాలంలో బలపడి దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. దత్తోపంత్జీ రెండు సంవత్సరాలు కేరళలో పనిచేశారు. 1945 నుండి అస్సాిం సహిత బెంగాల్ ప్రాంతానికి ప్రాంత ప్రచారక్. కలకత్తా లోనూ శాఖల విస్తరణకు విశేష కృషి చేశారు.

      1948లో గాంధీజీ హత్యని సంఘం మీద రుద్ది నెహ్రూ సంఘాన్ని నిషేధించారు. గురూజీని, అనేకమంది ఇతర సంఘపెద్దలను అరెస్టు చేశారు. స్వయంసేవకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ సమయంలో దత్తోపంత్ అజ్ఞాత వాసంలో ఉంటూ బెంగాల్ లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు. సంఘంపై నిషేధం తొలగిన తర్వాత దేశంలో అనేక సామాజిక క్షేత్రాలలో సంఘ ప్రభావం ఉండవలసిన ఆవశ్యకతను గురూజీ గుర్తించారు తదనుగుణంగా పని చేయడానికి దత్తోపంత్ని నాగ్ పూర్ తిరిగి పిలిపించారు.
భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)
భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)

భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ప్రారంభం:
      జూలై 9, 1949న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ప్రారంభమైంది. దత్తోపంత్జీకి ఎబివిపి సంస్థాపక సదస్యులు, నాగపూర్, విదర్భ ప్రాంత అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చారు. దత్తోపంత్జీ నేతృత్వంలో విదర్భ - నాగపూర్ విద్యార్థి పరిషత్ ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులను తమ ఉత్సవాలకు ఆహ్వానించి ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. సేంద్రియ ఎరువుల వాడకం, తయారీ గురించి సఫల ప్రయత్నాలు ఎబివిపి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రభుత్వం కూడా ఎబివివి యోగదానాన్ని డాక్యువెంటరీగా చిత్రీకరించింది. విద్యార్థులలో యోగ్యమైన కార్యకర్తల నిర్మాణానికి ప్రముఖ వ్యక్తులతో ఉపన్యాసాలు ఇప్పించే ప్రయత్నం చేశారు దత్తోపంత్, దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ కార్మిక ఉద్యమ చరిత్ర మీద మాట్లాడటానికి ఐఎన్టీయుసి (INTUC) ఆ రాష్ట్ర అధ్యక్షులు పి.వై. దేశపాండేని ఆహ్వానించారు. ఆ విధంగా వారితో మిత్రత్వం పెంచుకున్నారు. 
     ఒకరోజు దేశ్పాండే దత్తోపంత్తో ప్రస్తుతం దేశంలో కార్మిక సంస్థలలో కమ్యూనిస్టు ప్రభావం చాలా వేగంగా పెరుగుతోంది. దీనిని అరికట్టడానికి నీవు వెంటనే మా కార్మిక సంస్థ ఐఎన్టియుసిలో చేరు. బాధ్యత తీసుకుని పనిచేయి. ఇది దేశానికి అవసరం' అని గంభీరంగా చెప్పారు. దత్తోపంత్ ఈ విషయాన్ని పూజనీయ గురూజీకి తెలిపారు. తరువాత 'నాకు స్వయంగా ఐఎన్టియుసిలో చేరటం ఇష్టం లేదు. అందులో చాలామంది సంఘాన్ని గాంధీ హంతకులుగా, మతతత్వ వాదులుగా చూస్తారు' అని అన్నారు. కానీ గురూజీ 'దేశపాండే నిన్ను స్వయంగా ఆహ్వానించడం మన అదృష్టం. ఈ మంచి అవకాశాన్ని మనం కోల్పోకూడదు. వెంటనే నీవు ఐఎన్టియుసిలో చేరు' అని ఆదేశించారు. ఈ విధంగా ఎబివిపి బాధ్యత నిర్వహిస్తూనే దత్తోపంత్ 1949లో కార్మికక్షేత్రం ఐఎన్టియుసిలో చేరారు. ఇది దత్తోపంత్ జీవితంలో నూతన అధ్యాయం. 

      దత్తోపంత్ జీ కొద్దికాలంలోనే ఐఎన్టియుసి సంబంధిత 9 యూనియన్లకు పదాధికారిగా నియమితులయ్యారు. 1950లో ఐఎన్టియుసి రాష్ట్రీయ పరిషత్ సభ్యులయ్యారు. మధ్యప్రదేశ్ ఐఎన్టియుసి పదాధికారిగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఐఎన్టియుసి కార్యపద్దతిని అధ్యయనం చేశారు.
    గురూజీ ఆజ్ఞ ప్రకారం కమ్యూనిస్టు యూనియన్లు సోషలిన్టు యాజమాన్య కార్యపద్దతి, వాటి సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేశారు. ఈ విషయాలన్నీ గురూజీతో విస్తృతంగా చర్చించారు. కాలేజి రోజుల్లో సామ్యవాద సంస్థలతో పనిచేయడం కూడా కమ్యూనిస్టు కార్య పద్దతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఈ విధమైన విస్తృత అధ్యయనం, అనుభవం సంపాదించి మనదేశంలోని జాతీయ సాంస్కృతిక సమాజ జీవన రచనకు అనుకూలమైన కార్మిక సంస్థ ఆవశ్యకతను గుర్తించి భారతీయ మజ్జూర్ సంఘ్ (బిఎమ్ ఎస్) ను స్థాపించారు. దీనిని థర్డ్ఆ ల్టర్నేటివ్ (మూడవ ప్రత్యామ్నాయం) అని చెప్పారు. లోకమాన్య తిలక్  99వ జయంతి రోజు, జూలై 25, 1955న దేశం నలుమూలల నుండి వచ్చిన 35 మంది ప్రతినిధుల సమక్షంలో భోపాల్ లో బిఎమ్ఎస్ ఆవిర్భవించింది. 
      సనాతన ధర్మం పట్ల అనురక్తి, కఠిన పరిశ్రమ, ధ్యేయనిష్ఠ, నిరంతర పర్యటన, గురూజీ మార్గదర్శనం ఆధారంగా దత్తోపంత్ బిఎమ్ఎస్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. 30 సంవత్సరాల వ్యవధిలో ఐఎన్టియుసి కంటే పెద్ద కార్మిక సంస్థగా బిఎమ్ఎస్ అవతరించింది. 1992 నుండి ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద కార్మిక సంస్థగా ఉన్నది. ప్రస్తుత సభ్యత్వం సుమారు 2 కోట్లు. 1972 ఠాణేలో గురూజీ ప్రసంగిస్తూ 'భారతీయ ఆలోచన ఆధారంగా కార్మిక సంస్థని ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించి దత్తోపంత్ని ఆ పనికి నియమించింది. ప్రతికూల పరిస్థితులలో, పరిమితమైన కార్యకర్తలతో దత్తోపంత్ ఒకరకంగా ఒంటరిగా బిఎమ్ఎస్ కు ప్రథమ స్థానాన్ని సంపాదించారు. ఆంగ్లంలో దీనిని 'సింగిల్ హ్యాండెడ్ అంటారు' అని దత్తోపంత్ని ప్రశంసించారు.

     1965లో బిఎమ్ఎస్ సమావేశాలు బెంగాల్ లో నిర్వహించాలని యోజన జరిగింది. బెంగాల్లో అప్పుడు కమ్యూనిస్టు ప్రభావం బాగా ఉండేది. సంఘ బిఎమ్ఎస్ కార్యకర్తలపై దాడులు, చంపడం జరిగేవి. బిఎమ్ఎస్ సమావేశాలు జరగనీయకూడదని బెదిరించారు, కొట్టారు. ఆ రోజు బహిరంగసభలో ఠేంగ్డీజీ తీవ్ర స్వరంతో 'మీరు బెంగాల్లో మాత్రమే మాపై దాడులు చేయగలరు. కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో దీనికి మీపై ప్రతిదాడులు చేస్తాం' అని హెచ్చరించారు. ఫలితంగా బిఎమ్ఎస్ సమావేశాలు ఏ విధమైన ఆటంకం లేకుండా జరిగాయి. ఇది ఠేంగ్డీజీ నిర్భీకత, ఆత్మవిశ్వాసాన్ని, పోరాట పటిమను తెలుపుతుంది. బిఎమ్ఎస్ లో పనిచేస్తూనే ఎబివిపి హిందుస్థాన్ సమాచార్, భారతీయ జనసంఘ్ వంటి అనేక క్షేత్రాలలో నమాంతర బాధ్యతలు
నిర్వహించారు. కేరళ ప్రాంత జ్యేష్ఠ కార్యకర్త పరమేశ్వరన్ ఇలా అంటారు 'గురూజీ మనసు
గ్రహించగలిగిన అతి తక్కువ మందిలో దతోపంత్ ఒకరు'. గురూజీ ఆలోచనలకి అనుగుణంగానే భారతీయ ఆలోచన ఆధారంగా పనిచేయగల్గిన అనేక సామాజిక సంఘటనలను నిర్మించారు దత్తోపంత్జీ. 

           1964 నుండి 1976 వరకు దత్తోపంత్ రెండు సార్లు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారికి వ్యక్తిగతంగా అది ఇష్టం లేదు. అదే గురూజీకి చెపితే గురూజీ హాస్యంగా అన్నారు 'వెళ్లు, ఉపన్యాసం ఇవ్వు. విశ్రాంతి తీసుకో. ఇప్పటికే చాలా శ్రమించావు'. తరువాత గంభీరంగా 'రాజ్యసభలో అనేక పార్టీలు, సిద్దాంతాలకు సంబంధించిన వారు వస్తారు. వారితో వ్యక్తిగత స్నేహం చేయాల్సిన అవసరం ఉంది. సిద్దాంత చర్చ కూడా చేయాలి ఇదే సదవకాశం' అన్నారు. గురూజీ దూరదృష్టి అలా ఉండేది. దత్తోపంత్జీ ఈ సమయంలో అనేకమంది రాజకీయ నాయకులను మిత్రులుగా చేసుకున్నారు. ఈ పరిచయాలు 1975 అత్యవసర పరిస్థితి(ఎమర్జన్సీ) సమయంలో దేశవ్యాప్తంగా ప్రచండ ఉద్యమం నిర్వహించడానికి ఉపయోగపడ్డాయి.

ఎమర్జన్సీ సమయంలో దత్తోపంత్జీ అజ్ఞాతంలో ఉంటూనే దేశవ్యాప్త సత్యాగ్రహ ఉద్యమం యోజన నిర్వహణ సమర్థరంగా చేశారు.  ఈ సమయంలో ఒక సంఘటన ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది. పూణే నగరంలో ఠేంగ్డీజీకి ఒక కార్యకర్త ఇంటి నుండి కొన్ని రహస్య పత్రాలు బొంబాయి చేర్చాలి. మీసా కింద వారిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. స్థానిక కార్యకర్త భయం భయంగా వారికి భోజనం పెట్టి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఠేంగ్డీజీ నిశ్చింతగా ఉన్నారు. ఆ కార్యకర్త 'మీకు సంఘం ఏమవుతుందోననే భయం కూడా లేదా?” అన్నాడు. ఠేంగ్డీజీ నవ్వుతూ మనం ప్రార్థనలో 'భగవంతుడా నీ కార్యానికి మేము కటి బద్దులమై ఉన్నాం' అంటాం కదా! ఇది భగవత్ కార్యం అని మీకనిపించడం లేదా! దైవకార్యానికి అపజయం ఉండదు. నాకు సంఘం ఏమౌతుందోననే చింత లేదు. పోలీసులకి దొరకకుండా బొంబాయి చేరి ఈ పత్రాలను ఎలా చేర్చగలను అనే నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి మీరు ఏమీ ఆలోచించకుండా ఈ రోజు చేయాల్సిన పనిని శ్రద్ధగా చేయండి' అంటూ పాంటు, షర్ట్ టక్ చేసి కళ్లద్దాలు సర్దుకుంటూ మారువేషంలో విశ్వాసంగా బొంబాయి బయలుదేరారు. 
       1979 మార్చి 4న రాజస్థాన్ లోని కోటాలో రైతుల అభిల భారతీయ సమ్మేళనం ఏర్పాటు చేసి భారతీయ కిసాన్ సంఘ్ ను స్థాపించారు. 'రష్యా పతనమవుతుంది' అని చెప్పారు. 1990లో రష్యా పతనం తర్వాత కమ్యూనిజం కుప్పకూలిపోయింది. బిఎమ్ఎస్ సంఘ్ స్థాపకులుగా, రాజ్యసభ సభ్యులుగా దత్తోపంత్ అనేక దేశాలు పర్యటించారు. అమెరికా, రష్యా, హంగరీ, చైనా మొదలైన దేశాలలో కార్మిక ఉద్యమాలను, శ్రామికీకరణ ప్రయోగాలను అధ్యయనం చేశారు. 

గురూజీ ప్రేరణతో సంఘ ప్రచారక్గా అనేక సామాజిక సంస్థల నిర్మాణ శిల్పిగా శూన్యం నుంచి బ్రహ్మాండాన్ని సృష్టించిన రుషితుల్యులు దత్తోపంత్. నిష్కామకర్మయోగి, సంఘటనా దురంధరుడు, దార్శనికుడు, అంతకంటే ఆదర్శ స్వయంసేవక్ దత్తోపంజ్ 2004 అక్టోబర్ 14న అనారోగ్యంతో పుణేలో తుది శ్వాస విడిచారు.

రచన: కుర్ర దుర్గారెడ్డి
__జాగృతి 
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top