విశ్వ గురువుగా భారత్‌ – స్వయంసేవకుల పాత్ర - India as a Universal Guru - The Role of RSS Volunteers

విశ్వ గురువుగా భారత్‌ – స్వయంసేవకుల పాత్ర - India as a Universal Guru - The Role of RSS Volunteers
స్వయంసేవకులు
క శిల శిల్పంగా మారడానికి శిల్పి చేతిలో అనేక విధాల మార్పులు చేర్పులకు గురి అవుతుంది. సుత్తిదెబ్బలు, ఉలి చెక్కుడులను సహిస్తుంది. చివరికి ఆకర్షణీయమైన శిల్పంగా మారి అందరి మన్ననలు అందుకొంటుంది. పూజార్హమవుతుంది. అదేవిధంగా సంఘం చేస్తున్న భగవత్కార్యంలో తమ పాత్రను, అర్హతను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి. మంచిమార్పు కావాలని అందరూ కోరుకొంటారు. కానీ ‘ఆ మార్పు నా దగ్గర ప్రారంభం కావాలి’ అనుకోవాలి.

భారతదేశం అనాదిగా సకల విశ్వానికి గురువుగా మార్గదర్శనం చేస్తోంది. భారతీయ జీవనవిధానం మానవాళిని సుఖశాంతులతో చిరకాలం జీవించేట్లు చేసింది. ఆధునిక కాలంలో తలెత్తిన అనేక పాశ్చాత్య సిద్ధాంతాలైన కమ్యూనిజం, సోషలిజం, కాపిటలిజం, సెక్యులరిజం మొదలైన వాటి ఉక్కుపిడికిళ్ళ నుండి ప్రపంచాన్ని కాపాడి మానవాళికి మార్గదర్శనం చేయగల దేశం భారతదేశమేనని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. భారతదేశానికి అస్తిత్వం హిందుత్వమేనని మన ప్రగాఢ విశ్వాసం.
   ఆధునికంగా పుట్టుకొస్తున్న అనేక తత్వాలు ఆర్థిక, రాజకీయ, మతవాద, హింసావాద ధోరణులపై ఆధారపడి ఉంటున్నాయి. సెమిటిక్‌ మతాలవారు భగవంతునిపై తమకు గల విశ్వాసాన్ని మానవులందరిపై బలవంతంగా రుద్దుతూ మానవుల ఆధ్యాత్మిక జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. ఫలితంగా మత మార్పిడులు, తీవ్రవాద, ఉగ్రవాద ధోరణులు పెచ్చుమీరుతున్నాయి. తద్వారా అందరం సోదరులమనే భావన నశిస్తోంది. రాజ్యాధికార కాంక్షను, ధన వ్యామోహాన్ని, హింసా ప్రవృత్తిని విడిచి భగవంతుడిని ఏ రూపంలోనైనా సేవించి ఆరాధించ వచ్చని ప్రపంచం అంగీకరించినప్పుడు దారుణ మానవ వినాశనం ఆగి, అందరం సోదరులమనే భావన చిగురిస్తుంది.

స్వామి వివేకానంద విశ్వమత సభలో చెప్పిన అంశాలు కొన్ని గమనిద్దాం. ‘ప్రపంచ మతాలన్నీ సత్యం అనే ధర్మం నుండి వెలువడుతున్నాయని నమ్మే హిందూదేశం నుండి నేను వస్తున్నాను. కనుక ప్రపంచ మతాలకు మూలమైన సత్‌ శక్తి ఒక్కటే. ఒక విత్తనం మట్టి నుండి, నీటి నుండి తనకు కావలసిన సారాన్ని తీసుకుంటుంది కానీ తన స్వభావాన్ని మార్చుకోదు. కనుక మానవుడు భగవత్‌ సృష్టి నుండి అవసరమైన సారాన్ని గ్రహించాలే గాని తన అస్తిత్వాన్ని, మతాన్ని మార్చుకోరాదు. బావిలో కప్ప దీనికి ఉదాహరణ. ఒక కప్ప తాను నివసిస్తున్న బావే సర్వ ప్రపంచమని భావించి గర్విస్తుంది. అది అజ్ఞానం. బయటకు తొంగిచూడలేని మూర్ఖత్వం. విశాల విశ్వాన్ని దర్శిస్తే భగవత్‌ సృష్టి అర్థమౌతుంది’. ఈ విధంగా సత్యం, ధర్మముల ఆధారంగా వికసించిన శీలం; చిన్న విత్తనమైనా ప్రయోజనకరమైన మహా వృక్షమయే విశిష్ట లక్షణం, తనను ఆవరించి ఉన్న భగవత్‌ సృష్టిని అర్థం చేసికొని ఆరాధించే ప్రయత్నమూ చేయాలనీ మనకు అర్థం కావాలి.
   భౌతిక సంపదల కోసం, సుఖాల కోసం పరుగులు పెడుతూ అశాంతికి గురై అలసిపోయిన పాశ్చాత్య సమాజంలో గడచిన కొన్ని దశాబ్దాలుగా భారతీయ జీవన విధానంలోని విశిష్టతను అర్థం చేసికొని అనుసరించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి ఆరాధనా పూర్వకమైన భౌతిక జీవితానికి ప్రాముఖ్యమిస్తున్నారు. భారతీయ జీవన సంస్కతులను అక్షరాలా పాటిస్తున్న హిందూ బంధువులందరూ దీనికి ప్రేరణ దాతలు. దీనికి శతాధిక నైతిక, ఆధ్యాత్మిక సేవా సంస్థలు తోడ్పడుతున్నాయి. సుమారు శతాబ్ది కాలంగా హిందూ సమాజ ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకులు త్రికరణశుద్ధిగా కషి చేస్తున్నారు. దేశ విదేశాలలో కూడా ఈ పని చేస్తున్నారు.
   ప్రపంచ మానవుల వ్యక్తిగత, సామాజిక వికాసానికి తోడ్పడే అంశాలు భారతీయ జీవన వ్యవస్థలో అనేకం ఉన్నాయి. వాటిలో యోగసాధన, కుటుంబ వ్యవస్థ, సంస్కృతం, ఆయుర్వేదం, వేదగణితం, గోసేవ, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలను ప్రపంచమంతటా అనుసరిస్తున్నారు.

యోగ ప్రాధాన్యం :
యోగసాధనలోని వైశిష్ట్యాన్ని గుర్తించిన 177 దేశాలు భారతదేశం ప్రతిపాదించినట్లు ప్రతి సంవత్సరం జూన్‌ నెల 21 వ తేదిని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి వారి భవనంపై కాంతి కిరణాలతో యోగాసన ఆకృతుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వివిధ యోగసాధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యోగ చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. యోగాభ్యాసం తప్పనిసరి అని ప్రకటిస్తున్నాయి. భారతీయ పద్ధతిలో నమస్కారం చేయడం వలన కలిగే సత్ఫలితాలను మాజీ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ఒబామా తన రష్యా పర్యటనలో రష్యన్‌ ప్రజలకు తెలియ జెప్పారంటే భారతీయ సంప్రదాయాల సర్వజన ఆమోద యోగ్యత అర్థమౌతుంది. శారీరిక, మానసిక ఆరోగ్యం కొరకు యోగసాధన అత్యంత ప్రయోజనకరమైనదని అందరూ అంగీకరించి అనుసరిస్తున్నారు.

సంస్కృత భాష ప్రాధాన్యం :
భారతీయ సంస్కృతి పరిరక్షణలో సంస్కృత భాష ప్రధాన పాత్ర వహిస్తుందని పాశ్చాత్యులు శతాబ్దాల క్రితమే గ్రహించారు. ఈనాడు సుమారు 17 దేశాలలో సంస్కృత భాష బోధన, అధ్యయనం, పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికాలోని 42 రాష్ట్రాలలో శని, ఆది వారాలలో 6 నుండి 8 గంటల పాటు అభ్యాస తరగతులు జరుగుతున్నాయి. ఏడాదికొకసారి 2 రోజుల శిబిరాలు సంస్కృత అభ్యాసం కోసం జరుగుతున్నాయి. ఈ తరగతులలో భారతీయులు, విదేశీయులు కూడా పాల్గొంటున్నారు. ఐరోపాలోని అనేక దేశాలలో సంస్కృతం తప్పనిసరిగా నేర్చుకోవాలనే నియమం ఉంది. పాఠశాలలు, కళాశాలలలో శ్లోకాలు వల్లె వేయిస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో సంస్కృత అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సంస్కృతంలో రాసి ఉన్న శాస్త్ర గ్రంథాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలలో సంవత్సరానికి 80 సంస్కృత తరగతులు నిర్వహిస్తున్నారు. 6 వ తరం కంప్యూటర్‌ను రూపొందించే ప్రయత్నంలో సుమారు 60 వేల తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేస్తున్నారు. మోడరన్‌ సైన్స్‌, సంస్కృత శాస్త్ర పరిజ్ఞానం రెండింటినీ సమన్వయం చేసి చెప్పగలిగినవారి అవసరం నేడు పెరుగు తున్నది. ఇన్ని అవసరాలను తీర్చగలిగిన శక్తిని నేటి విద్యావంతులు అలవరచుకోవలసి ఉంది. అన్ని రంగాలలో విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించే ఉపాధ్యాయులు, ఆచార్యుల అవసరం నేడు ఉంది. వైజ్ఞానిక నిపుణులు అందిస్తున్న విజ్ఞానం భారతీయ విలువలకు అనుగుణంగా ఉండాలి. అందుకు విద్యావేత్తలు కృషి చేయాలి.

కుటుంబ జీవనం :
భారతీయ కుటుంబ వ్యవస్థలో మానవులకు అవసరమయ్యే అన్ని మంచి లక్షణాలు పెంపొందించే శక్తి ఉంది. పాశ్చాత్య కుటుంబ జీవనంలో మనిషి మనస్సును, ఆత్మను తట్టిలేపే లక్షణం చాలా తక్కువ. అందుకే మనశ్శాంతి కోసం పాశ్చాత్యులు భారతదేశం వైపు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోది తన అమెరికా పర్యటనలో ఫేస్‌బుక్‌ సృష్టికర్త మార్క్‌ జుకర్‌ బర్గ్‌ను కలిశారు. మాటల మధ్య ప్రధాని మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తల్లి యోగక్షేమాల గురించి అడగడం అమెరికన్‌లకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పాశ్చాత్యులతో పోలిస్తే విదేశాలలో నివసించే భారతీయులలో నేర ప్రవృత్తి చాలా తక్కువ. అందుకు కారణం కుటుంబంలో వారు పెరిగిన తీరు. పాశ్చాత్యులు తమ సుఖశాంతుల కోసం భారతీయ కుటుంబ జీవన వ్యవస్థలను అనుసరిస్తున్నారు. వారికి మనం ఆదర్శంగా నిలవాలి. మన కుటుంబ సంబంధాలు మరింత మెరుగు పరచుకోవాలి.

ఆయుర్వేదం :
ఆయుర్వేద వైద్యం అధ్యయనం, చికిత్సా విధానం దేశ విదేశాలలో ప్రాచుర్యం పొందుతోంది. కుటుంబంలో ఆహారవిహారాల పట్ల సాధారణంగా తీసుకొనే శ్రద్ధ వలన ఆరోగ్యం వర్ధిల్లుతుందని పాశ్చాత్యులు గ్రహిస్తున్నారు. ఆయుర్వేదం ఈనాటిది కాదు. వేల సంవత్సరాల నాటిది. ఆయుర్వేద గ్రంథాలపై నేడు మరింత అధ్యయనం జరుగుతోంది. నిరపాయకరమైన, ఆరోగ్యదాయకమైన, ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్సా విధానం, ఔషధ ప్రక్రియను అభివద్ధి చేసే ప్రయత్నాలు విజయవంత మవుతున్నాయి.

గోవు :
మానవ సంపదలలో సర్వశ్రేష్ఠ సంపద గో సంపద. గోవుల వలన సర్వజీవులకు అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. గోవు ఆరోగ్య ప్రదాయిని. గోవు వలన లభించే అనేక ఉత్పత్తులకు నేడు ఆదరణ పెరుగుతోంది. కోట్లరూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆవు పిడకలను ఆన్‌ లైన్‌లో అమ్ముతున్నాయంటే గోఉత్పత్తుల వలన కలిగే ఫలితాన్ని, వ్యాపారాన్ని అంచనా వేయవచ్చు. ఆవు పిడకలతో భోగి మంటలు వేసే సంప్రదాయానికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతున్నది. కొన్ని ప్రదేశాలలో లక్షల పిడకలతో భోగి మంటలు వేసిన సందర్భాలున్నాయి. పాడిపంటల అభివృద్ధిలో గోసంపద కీలక పాత్ర వహిస్తుంది. కనుక గోవుల అభివద్ధికి మనం తప్పక కృషి చేయాలి.

సేంద్రియ వ్యవసాయం :
సేంద్రియ వ్యవసాయమే చేయాలి. పాశ్చాత్య వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్న కారణంగా గత 70, 80 సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రపంచ వ్యవసాయ వేత్తలు అనేకమంది రసాయన సాగును మానేసి సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. భూసారాన్ని కాపాడడానికి, ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి సేంద్రియ వ్యవసాయమే సరియైనదని భావిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయానికి చక్కని ఉదాహరణ భారతీయ వ్యవసాయ పద్ధతులే. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది తమ ఖరీదైన ఉద్యోగం మానేసి మనదేశంలో సేంద్రియ వ్యవసాయం చేయడానికి వస్తున్నారు. వివిధ పంటలు పండించ డానికి ఉత్సాహపడుతున్నారు. ఇటువంటి వారు చిన్న పిలుపునిస్తే 50, 60 మంది సేంద్రియ వ్యవసాయ సమావేశాలకు హాజరవుతున్నారు. త్వరలో ఇంటిపెరడు నుండి పెద్ద పొలాల వరకు సేంద్రియ వ్యవసాయం విస్తరిస్తుందని ఆశిద్దాం.

సమాజంలో ఐక్యత కావాలి :
మన సమాజంలో ఐక్యత నిర్మాణమయితే పైన చెప్పుకున్న అన్ని ఆశయాలు నెరవేరుతాయి. మనలో ఉండే దోషాలను దూరం చేసుకొంటూ; తోటి వ్యక్తులను, సమాజాన్ని కలుపుకొని; మనదేశాన్ని సైనిక, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలలో ముందుండే విధంగా తయారుచేయాలి. అటువంటి దిశలో సమాజాన్ని నడిపించే నాయకత్వ శక్తి కలిగిన వ్యక్తుల నిర్మాణానికి కృషి చేద్దాం. అందుకు మార్గం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ. సంఘ శాఖల ద్వారా మనం చేస్తున్న, చేయవలసిన పని సమాజాన్ని శక్తివంతంగాను, సంఘటితం (ఐక్యం) గానూ చేయడమే. అందుకోసం రోజుకు ఒక గంట సేపు జరిగే శాఖా కార్యక్రమంలో పాల్గొందాం.
   లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యాన్ని చేరే దిశలో వ్యక్తి సక్రమంగా ప్రయాణించడం కూడా అంతే ముఖ్యం. వ్యక్తి తన లక్ష్యసాధనకు అనుగుణంగా తనని తాను మలచుకోవాలి. అవసరమైన గుణసంపద పెంచుకోవాలి. ఒక శిల శిల్పంగా మారడానికి శిల్పి చేతిలో అనేక విధాల మార్పులు చేర్పులకు గురి అవుతుంది. సుత్తిదెబ్బలు, ఉలి చెక్కుడులను సహిస్తుంది. చివరికి ఆకర్షణీయమైన శిల్పంగా మారి అందరి మన్ననలు అందుకొంటుంది. పూజార్హమవుతుంది. అదేవిధంగా సంఘం చేస్తున్న ఈ భగవత్కార్యంలో తమ పాత్రను, అర్హతను పెంచు కోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి. మంచి మార్పు కావాలని అందరూ కోరుకొంటారు. కానీ ‘ఆ మార్పు నా దగ్గర ప్రారంభం కావాలి’ అనుకోవాలి.
   ఉదయిస్తున్న సూర్యుడు సృష్టి మొత్తాన్ని సమానంగా చూస్తాడు. భగవంతుని అంశతో ఉన్న మనం ఆ భగవంతుడు సృష్టించిన సమాజాన్ని భక్తిభావంతో చూడాలి. భగవత్‌ ప్రసాదమైన ప్రకృతిని ఆరాధించాలి. కాపాడాలి. విచక్షణారహితంగా కొల్లగొట్ట కూడదు. సమాజాన్ని కూడా భగవత్‌ స్వరూపంగానే ఆరాధించాలి. తోటి ప్రజలందరిని కుల, మత, భాషా, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా సమానంగా చూడాలి.

వేయి సంవత్సరాలకు పూర్వం రామానుజా చార్యులవారు ప్రారంభించిన హరిదాస వ్యవస్థ సర్వ మానవ సమానత్వ భావనను పెంపొందింపజేసే అత్యంత శ్రేష్ఠ వ్యవస్థ. సంక్రాంతి మాసంలో హరినామ కీర్తన చేస్తూ ఇంటిముందుకు వచ్చే హరిదాసును సాక్షాత్‌ దైవంగానే భావిస్తాము. హరిదాసు తలపై ఉండే అక్షయపాత్రలో డబ్బులు, బియ్యం వేస్తాం. బిచ్చం వేస్తున్నాం అనే దృష్టితో కాకుండా పరమ పవిత్ర భావంతో భగవంతునకు అర్పిస్తున్నామన్న భావం మనలో ఉంటుంది. హరిదాసు ఆగమనం కొరకు ఎదురుచూస్తూ గుమ్మం ముందు నిలబడతాం. నిత్యజీవితంలో సమరసభావాన్ని చాటిచెప్పే పండుగలు కలిగిన ఏకైక సంస్కతి మనది.
   సకల చరాచర సృష్టికి కారణభూతుడైన సూర్య నారాయణ మూర్తిని మనం ప్రత్యక్షదైవంగా భావిస్తాం. సూర్యుని మకరరాశి ప్రవేశాన్ని ఉత్త రాయణ పుణ్యకాలంగా పేర్కొన్నారు మన పెద్దలు. మకర సంక్రాంతిని సకల లోకాలకు ఉత్తమమైన మార్పును కలుగజేసే పండుగగా నిర్ణయించారు. ఉత్తరాయణంలో జ్ఞానానికి ప్రతిరూపమైన కాంతి విస్తరిస్తుంది. ఇది శుభప్రదమైన మార్పు. ఈ మార్పును స్వాగతిద్దాం. వసుధైక కుటుంబంగా జీవిద్దాం.

– భరత్‌ కుమార్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత ప్రచారక్‌ - జాగృతి సౌజన్యం తో {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top