సర్వమత సమభావం లోపించిన కాలగణన నేటి - ‘క్రీస్తుశకం’ 'క్రీస్తు పూర్వం'? - Kristu Sakam, Kalam - ‘’ ‘BC’?

Vishwa Bhaarath
‘క్రీస్తుశకం’ 'క్రీస్తు పూర్వం
‘క్రీస్తుశకం’ 'క్రీస్తు పూర్వం
క్రీస్తుశకాన్ని ‘సాధారణ’ శకమని, ‘సామాన్యశక’మని, ‘వ్యవహార’ శకమని భావించాలన్న ప్రచారం జరుగుతోంది! ఈ ప్రచారం చారిత్రక ‘అనభిజ్ఞత’కు నిదర్శనం. ఈ ‘తెలియనితనం’ – అనభిజ్ఞత- మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లుతోంది! మొత్తం ప్రపంచానికి మాత్రమేకాక విశ్వ వ్యవస్థకు వర్తించే ‘కాలగణన’ మాత్రమే ‘సాధారణ’- జనరల్ – లేదా ‘సామాన్య’- కామన్- కాలగణ కాగలదు! రెండువేల సంవత్సరాల క్రితం పుట్టిన ‘క్రైస్తవశకం’ ప్రకారం ‘కాలగణన’ ఆరంభం కావడానికి ముందు కోట్ల ఏళ్లుగా ‘విశ్వవ్యవస్థ’ ఉంది, భూమి ఉంది, ప్రజలున్నారు! మరి క్రీస్తుశకం పుట్టకపూర్వం కాలాన్ని ఎలా లెక్కించారు?? క్రీస్తుశకం ఒక మతానికి చెందిన మహాపురుషుని జన్మతోను జీవితంతోను ముడివడిన మతశకం.. ఆ మతం వారు పాటించాలి! కాని మిగిలిన మతాలు కూడా ఎందుకు పాటించాలి?? ఒక మతానికి చెందిన ‘కాలగణన’ సంప్రదాయం లేదా ‘శకం’ ఇతర మతాలవారికి ‘సామాన్యం’ కాని ‘సాధారణం’కాని జీవన ‘వ్యవహారం’ కాని ఎలా కాగలదు?? బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశానికి రాకపూర్వం నుంచి మన దేశంలో మొత్తం ‘విశ్వవ్యవస్థ’కు వర్తించే ‘కాలగణన’ అమలులో ఉంది! ఇది ఏదో ఒక మతానికి చెందిన ‘శకం’ కాదు, మత ప్రవక్తల పేరుతో మొదలైన ‘శకం’ కాదు. అన్ని మతాలకు వర్తించే సర్వమత సమభావ శకం ఇది! ఇలా అన్ని మతాలకు వర్తించగల, విశ్వవ్యవస్థలో సహజంగా నిహితమై ఉన్న ‘కాలగణన’ సాధారణ శకం రావడం న్యాయం, సామాన్య శకం కావడం తర్కం, వ్యవహార శకం కావడం జీవన వాస్తవం! దీని పేరు ‘యుగం’! నాలుగు యుగాలుగా విశ్వం వ్యవస్థీకృతమై ఉంది. దీన్ని భారతీయులు తయారు చేయలేదు, విశ్వవ్యవస్థ ఇలా ఉందని గ్రహించారు!

ప్రస్తుతం అంటే ఈ ‘హేమలంబి’- చంద్రమాన సంవత్సరం. కలియుగంలోని ఐదువేల నూట పంతొమ్మిదవది. మరి కలియుగం పుట్టక పూర్వం కాలాన్ని ఏ ప్రాతిపదికగా లెక్కపెట్టేవారు?? ‘ద్వాపర యుగం’ ప్రాతిపదికగా లెక్కపెట్టేవారు. ‘ద్వాపరం’ పుట్టక పూర్వం ‘త్రేతాయుగం’ ప్రాతిపదికగాను, ‘త్రేత’కు ముందు ‘కృతయుగం’ ప్రాతిపదికగాను కాలగణన జరిగింది! ఆ కృతయుగానికి పూర్వం కలియుగం ఉండేది.. వసంత ఋతువునకు పూర్వం శిశిర ఋతువు, పగటికి పూర్వం రాత్రి ఉన్నట్టు! అందువల్ల ‘నాలుగు యుగాలు’ నిరంతరం పునరావృత్తం అవుతుండడం చరిత్ర.. నాలుగు యుగాలు కలసి ‘మహాయుగం’, డెబ్భై ఒకటి లేదా డెబ్భై రెండు మహాయుగాలు కలసి ఒక మన్వంతరం. పదునాలుగు మన్వంతరాలు కలిసి ఒక ‘కల్పం’ ఏర్పడుతున్నాయి. ఒక ఉదయ ‘కల్పం’ పూర్తి అయ్యేసరికి 432 కోట్ల సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పుడు ‘ఉదయకల్పం’ లయమైపోయి, క్షయకల్పం మొదలు అవుతోంది! ఈ క్షయకల్పంలో ‘శూన్యం’ ఏర్పడి ఉంటుంది! ఉదయ కల్పం లేదా సృష్టికల్పం విశ్వవ్యవస్థకు పగలు, సృష్టి కనిపిస్తోంది. క్షయకల్పం లేదా ప్రలయకల్పం విశ్వవ్యవస్థలో రాత్రి వంటిది! ఈ రాత్రి – క్షయకల్పం- కూడా 432 కోట్ల సంవత్సరాలు కొనసాగుతోంది! రాత్రి పగలు ‘ప్రలయ’ కల్పం, ‘ఉదయ’ కల్పం నిరంతరం ‘పునరావృత్తం’ అవుతున్నాయి. అందువల్లనే విశ్వవ్యవస్థకు తుది, మొదలు లేవు. విశ్వవ్యవస్థ నిరంతర పునరావృత్తి మాత్రమే! అందువల్ల ‘కలియుగ’ కాలగణన సర్వమత సమ్మతమైంది! ఇదీ సాధారణ శకం, సామాన్య శకం.. వ్యవహారశకం!

మన దేశాన్ని దురాక్రమించిన డేరియస్ సైరస్ అన్న ‘శక’రాజు కలియుగం 2552వ సంవత్సరంలో తన పేరుతో ‘సైరస్’ శకాన్ని ప్రారంభించాడు. ఈ సైరస్ శకం దాదాపు ఐదు వందల ఏళ్ల పాటు మన నెత్తికెక్కింది. ఈ విదేశీయ ‘శకాన్ని’ భావదాస్యాన్ని తొలగించడం కోసం సమ్రాట్ విక్రముడు కలియుగం 3044వ సంవత్సరంలో ‘సంవత్’ అన్న కొత్త ‘కాలగణన’ పద్ధతిని ఆరంభించాడు! బ్రిటన్ దురాక్రమణదారులు ఈ విక్రమ ‘సంవత్’ను మరో జాతీయ వ్యవహార శకమైన ‘శాలివాహన శకాన్ని’ తొలగించారు. పరిపాలనకు తమ మత శకమైన క్రీస్తు శకాన్ని ప్రవేశపెట్టారు! ఇది ‘సర్వమత’ శకం కాదు..
   అందువల్ల క్రీస్తుశకాన్ని ‘క్రీస్తుశకం’ అని పిలవడం న్యాయం! మన దేశంలోను అనేక ఇతర దేశాలలోను ఇది ‘ఆంగ్ల’కాలమానంగా రూఢ్యమై ఉంది. ఇందుకు కారణం ఆంగ్ల భాషను మాట్లాడిన ‘ఇంగ్లాండు’ వారు వివిధ దేశాలను శతాబ్దుల పాటు దురాక్రమించడం! ఇలా దురాక్రమించడం మొదలైన సమయానికి ‘ఇంగ్లండు’లో మాత్రమేకాక మొత్తం ఐరోపాలో ‘క్రైస్తవశకం’ వ్యాపించి ఉంది. అందువల్ల ఇంగ్లాండు ప్రజలు క్రైస్తవులయ్యారు! ఇంగ్లాండు వేల్స్, స్కాట్‌లాండ్ దేశాలు పరస్పరం కలహించాయి! ఆ తరువాత బలవంతంగా కొన్నాళ్లు, స్వచ్ఛందంగా కొన్నాళ్లు కలిసిపోయాయి. ఇలా కలిసిన మూడు దేశాలు ‘బ్రిటన్’గా మారాయి. ఈ ‘బ్రిటన్’తో ‘ఐర్లాండు’లోని ఉత్తర ప్రాంతం విలీనమైంది. ఈ ‘విలీనం’ తరువాత బ్రిటన్- ఐక్యరాజ్యం- యునైటెడ్ కింగ్‌డమ్- యు.కెగా మారింది! కానీ మన దేశాన్ని దురాక్రమించిన సమయంలో ‘ఇవన్నీ’ కలిసిన ఇప్పటి దేశం ఇంగ్లాండుగానే ప్రసిద్ధి! ‘ఇంగ్లాండు’ తాను దురాక్రమించిన దేశాలన్నింటిలోను ఆయా దేశాల సంప్రదాయాలను, భాషలను, మతాలను, వేషభాషలను, సంస్కృతిని ధ్వంసం చేసింది. 
   తన భాషను, సంప్రదాయాలను, మతాన్ని, వేషభాషలను ‘నాగరికత’ను ఆయా దేశాల ప్రజలపై రుద్దింది! అమెరికాలోను, ఆఫ్రికాలోను ‘ఇంగ్లాండు’ మాత్రమే కాక ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ వంటి ఇతర ఐరోపా దేశాలు కూడా ఈ పనిచేశాయి! ఫలితంగా ఆయా దేశాల పూర్వపు మతాలు ధ్వంసమైపోయి ‘క్రైస్తవమతం’ వ్యాపించింది! క్రైస్తవ మతంతోపాటు క్రైస్తవ మత‘శకం’ కూడా ఈ దేశాలకు విస్తరించింది. ఈ ‘వ్యాప్తి’ ఈ ‘విస్తరణ’ ఐరోపావారు తమ రాజకీయ బీభత్సకాండ ద్వారా బలవంతంగా జరిపించారు! ఆ దేశాలవారు స్వచ్ఛందంగా స్వీకరించలేదు. మతంలోని ‘మంచి’ని ఇతర మతాలవారు స్వచ్ఛందంగా పాటించడం సర్వమత సమభావ లక్షణం! ఈ సర్వమత సమభావం అనాదిగా భారతీయుల స్వభావం! ‘‘ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః’’- ‘‘విశ్వంలోని అన్ని మంగళకర భావాలు వచ్చుగాక’’- అన్నది భారత జాతీయతత్త్వం! కానీ క్రైస్తవ శకాన్ని విదేశీయులు, బ్రిటన్‌వారు, స్వజాతీయులపై బలవంతంగా రుద్దిపోయారు! ఇలా రుద్దుడుకు గురైనవారు క్రీస్తుశకాన్ని వ్యవహార శకం గాని, సామాన్య శకంగాని అంగీకరించజాలరు! అందువల్లనే అరవై ఏళ్లకు పూర్వం, బ్రిటన్ విముక్త భారతదేశం ‘శాలివాహన శకాన్ని’ జాతీయ శకంగా ప్రకటించుకొంది. 1938 ఏళ్ల క్రితం సమ్రాట్ శాలివాహనుడు- విక్రముని మనుమడు- శాలివాహన శకాన్ని ఆరంభించాడు. ప్రస్తుతం 1939వ సంవత్సరం!!

మానవ జీవన ప్రస్థానక్రమానికి ప్రాతిపదిక కాలాన్ని లెక్కపెట్టడం! ఇది సృష్టి నిహితమైన వాస్తవం! మన దేశంలో అనాదిగా కాలాన్ని లెక్కపెట్టడం సర్వ సమగ్రంగా వ్యవస్థీకృతమై ఉంది! ‘ఉదయాత్ ఉదయాత్ వారమ్’- ఒక సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం వరకు దినము- అన్నది భారత జాతీయులు అనాదిగా పాటించిన ప్రాతిపదిక! వెలుగుతో ప్రారంభమైన దినం చీకటి అంతమై మళ్లీ సూర్యుడు కన్పించడంతో ముగుస్తోంది! వెలుగునుంచి వెలుగు వరకు- అన్నది విశ్వవ్యవస్థలో నిబిడీకృతమై ఉన్న సత్యం! భూమి తన చుట్టు తాను తిరగడం ఒక ఉదాహరణ మాత్రమే! వెలుగునుంచి బయలుదేరిన భ్రమణం మళ్లీ వెలుగును చేరి ఒక ‘ఆవృత్తి’ని పూర్తిచేస్తోంది! నిరంతరం ఇది పునరావృత్తి! అందువల్ల భూగోళంలోని ప్రతి బిందువువద్ద సూర్యుడు కన్పించినపుడు కొత్తదినం ఆరంభమైందన్నది మానవ జీవన సత్యం. ఇది ప్రత్యక్ష ప్రమాణం.
   తొలి మానవుడు, తొలి మానవీయ సంస్కారం పుట్టిన భారతదేశంలో ఇది – ఈ కాలగణన పద్ధతి ఆరంభమైంది! ప్రపంచమంతటా వ్యాపించింది! కానీ యుగాలు, తరాలు, సహస్రాబ్దులు, శతాబ్దులు జరిగిన తరువాత ప్రస్తుత భారతదేశం వెలుపల ఉన్న ప్రాంతంలోని మానవులు భారతీయతకు క్రమంగా దూరం కావడం చరిత్ర. ఇలా దూరమైనవారు ‘్భరతీయత’కు దూరమయ్యారు, భూమితల్లిగా, ఆకాశం తండ్రిగా, మానవులు, జీవజాలం బిడ్డలుగా రూపొందిన ‘జాతీయత’కు దూరమయ్యారు! మానవీయ సంస్కృతికి దూరమైపోయి, పశువులవలె జీవించారు. 
    చారిత్రక పునరావృత్తిలో భాగంగా మరోసారి భారతీయ సంస్కార స్పర్శతో ఆ ప్రాంతాలవారు మళ్లీ మానవులయ్యారు! మళ్లీ మానవులైన పాశ్చాత్య దేశాలవారు తమకు తెలిసింది సర్వస్వమని, తమకు తెలియడం ఆరంభమైనప్పటినుంచి మాత్రమే మానవ చరిత్ర మొదలైందని ‘భావించారు’, భ్రమించారు… బావిలోని కప్పలు! కానీ కలియుగంలో దాదాపు రెండువేల సంవత్సరాలు గడిచేవరకు ఈ పాశ్చాత్య దేశాలవారికి వ్యవస్థీకృత జీవనం లేదు.. అందువల్ల జాతీయ, సంస్కృతి వంటివి వారికి తెలియదు. కలియుగం ఇరవై ఆరవ శతాబ్ది తరువాత అంటే క్రీస్తుశకం పూర్వం ఆరవ శతాబ్ది నుండి ఈ పాశ్చాత్య ‘జన సముదాయాలు’ తమ జీవన వ్యవస్థలకు ‘నాగరికత’లు అని పేరు పెట్టుకున్నారు! ‘సహిష్ణుత’ అన్నది ఈ ‘నాగరికత’కు తెలియని అంశం! అందువల్ల గ్రీకు ‘నాగరికత’ ఐరోపాలో ప్రబలిన సమయంలో ఈ ‘గ్రీకు నాగరికత’ తన పరిధికి సమీపంలోని సరిహద్దులలోని భూభాగాలపై పరిఢవిల్లిన హిబ్రూ ‘నాగరికత’ను ధ్వంసం చేయ యత్నించింది. ఆ తరువాత ‘రోము’ నాగరికత గ్రీసు నాగరికతను ధ్వంసం చేసింది, వ్యాపించి దురాక్రమించి ‘హిబ్రూ’ ముందు నాగరికతను ధ్వంసం చేసింది! ఆ తరువాత విలసిల్లిన ‘క్రైస్తవం’ రోము ‘నాగరికత’ను ధ్వంసం చేసింది! ‘క్రైస్తవం’, ‘ఇస్లాం’ తలపడినచోటల్లా ఏదో ‘ఒకటి’ మాత్రమే మిగలడం, రెండవది ధ్వంసం కావడం చరిత్ర! మతం మాత్రమే పరమావధి అయింది! ఏకమత వ్యవస్థలున్న దేశాలు ఏర్పడినాయి.

జూలియన్ కాలండర్‌ను ఆరంభించిన జూలియస్ సీజర్ కాని గ్రెగేరియన్ కాలండర్‌ను ఆరంభించిన పదమూడవ గ్రెగరీ కాని ఇలాంటి ‘వివిధత్వాన్ని సహించలేని’ అన్యత్వ విధ్వంసక ఏకమత ‘నాగరికత’కు వారసులు! జూలియన్ కాలండర్ కాని గ్రెగెరియన్ కాలండర్‌కు కాని శాస్ర్తియ ప్రాతిపదిక లేదు. జూలియన్ కాలెండర్ క్రీస్తుశకానికి మొదటి అనుసంధానం. కాని పదిహేను వందల ఏళ్లలో ఈ ‘జూలియన్’ కాలగణంలో ‘పదకొండు రోజుల’ లెక్క తప్పింది. ఖగోళ వాస్తవాలను సరిగా గ్రహించలేకపోవడం ఇందుకు కారణం! పది రోజులు మాత్రమే తగ్గాయని భావించిన ‘పదమూడవ గ్రెగరీ’ క్రీస్తుశకం 1582 అక్టోబర్ ఐదవ తేదీని 1582 అక్టోబర్ పదహైదవ తేదీగా గుర్తించాలని నిర్థారించాడు. ఈ నిర్థారణ ప్రాతిపదికగా ‘గ్రెగేరియన్’ కాలండర్ ఆరంభమైంది. దీనిలో కూడా బోలెడన్ని తప్పులు వచ్చాయి! ఈ ‘తప్పుల తడక’ను ఒప్పుల కుప్పగా భావిస్తున్నవారు, నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై అయిదువేల నూట పంతొమ్మిది ఏళ్లుగా నిర్దిష్టంగా అమలు జరుగుతున్న భారతీయ పంచాంగాన్ని వెక్కిరిస్తున్నారు! ఇదీ వైచిత్రి..
    మన దేశంలో సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, బృహస్పతి మానం వంటి కాలగణన పద్ధతులున్నాయి! ఇవి పరస్పరం ధ్వంసం చేసుకోలేదు, వీటి మధ్య సమన్వయం ఏర్పడి ఉంది! సమన్వయ కాలగణన భారత జాతీయ జీవన వాస్తవం..

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352 - ఆంధ్రభూమి సౌజన్యం తో
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top