కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? - Kartika Masam

Vishwa Bhaarath
కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? -  Kartika Masam
కార్తీక మాసం
యా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

కృత్తికా నక్షత్రం
ఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక సోమవారాలు
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఏ మనుష్యూడైనను తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి, నదీస్నాన మొనరించి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను జేసినచో గొప్ప ఫలంబు సంప్రాప్తించునని యుందురు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయవలయును.అట్లు ప్రారంభించు సమయ మున ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ జరు గునట్లు చేయుము అని పిమ్మట స్నానము చేయవలెను.

కార్తీకమాసం…ఆకాశ దీపం……
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు … ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించినవారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడు…..
  సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్ధంతో నిరంతరం తన నామస్మరణ చేసే భక్తులను మృత్యువు బారిన పడకుండా రక్షిస్తుంటాడు. ఈ విషయంలో యమధర్మరాజును సైతం అయన ఎదిరించిన ఘట్టం మార్కండేయుడి జీవిత చరిత్రలో స్పష్టమవుతుంది.
    మార్కండేయుడు పరమ శివభక్తుడు. తన ఆయువుతీరనున్న సమయంలో ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పిల్లవాడిపైకి యమధర్మరాజు విసిరిన పాశం …శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. అది గమనించని యముడు అలాగే పాశాన్ని లాగాడు. ఆగ్రహావేశాలకు లోనైన శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుని సంహరించాడు. ఆ తరువాత సమస్త దేవతల ప్రార్ధనమేరకు ఆయన్ని బతికించాడు. తన భక్తుల విషయంలో ఆచి తూచి వ్యవహరించమని సున్నితంగా మందలించాడు. పురాణంలో అత్యద్భుతమైన ఘట్టంగా కనిపించే ఈ సంఘటన తమిళనాడులోని ‘తిరుకడవూరు’లో జరిగిందని చెబుతుంటారు.
  ఈ కారణంగానే ఇక్కడి శివుడిని ‘కాలసంహార మూర్తి’ పేరుతో పూజిస్తూ వుంటారు. ఇక్కడ శివుడి కాళ్ల క్రింద నలుగుతున్నట్టుగా యమధర్మరాజు … ఆ పక్కనే శివుడికి వినయంగా నమస్కరిస్తూ మార్కండేయుడు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రానికి ‘కార్తీక సోమవారం’ రోజున వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ రోజున ఇక్కడ ఒకవెయ్యి ఎనిమిది శంఖాలతో స్వామివారికి జరిగే అభిషేకం చూసితీరవలసిందే. ఇక అమ్మవారు ‘అభిరామి’ పేరుతో విశేష పూజలు అందుకుంటూ వుంటుంది. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించినవారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడనీ, విధివశాత్తు ఆపదలు ఎదురైనా మృత్యుంజయులుగా బయటపడతారని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందువలన ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు … స్వామి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.

శివాభిషేక ఫలములు :
➲ గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
➲ నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
➲ ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
➲ పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
➲ ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
➲ చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
➲ మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
➲ మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
➲ తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
➲ పుష్పోదకము చేత అభిషేకించిన భూవ్లా భము కలుగును.
➲ కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
➲ రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
➲ భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
➲ గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
➲ బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
➲ నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
➲ అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.  ➲ శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
➲ ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
➲ ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
➲ నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
➲ కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
➲ నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
➲ మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
➲ పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top