భారత రాజ్యాంగం - Constitution of India

Vishwa Bhaarath
భారత రాజ్యాంగం - Constitution of India
Constitution of India
భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగం (Constitution of India) ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
రాజ్యాంగ సభ
భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది:
  • రాష్ట్ర శాసనసభల ద్వార ఎన్నికైన సభ్యులు: 292
  • భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93
  • ఛీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు: 4
భారత రాజ్యాంగం - Constitution of India
Constitution of India
ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది. అయితే, మౌంట్‌బాటెన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 207 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. డా.సచ్చిదానంద సిన్‌హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు.

1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు.

రాజ్యాంగ సభ విశేషాలు
  • స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు
  • రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాతప్రతిపై వెచ్చించింది.
  • రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
  • భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
  • రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతూ ఉంది. దీన్ని శుభశకునంగా భావించారు.
  • 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
రాజ్యాంగ విశేషాలు
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక , 395 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంధం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది:
  • ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
  • బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ
  • పౌరులకు ప్రాధమిక హక్కులు
  • ఆదేశ సూత్రాలు
  • ద్విసభా విధానం
  • భాషలు
  • వెనుకబడిన సామాజిక వర్గాలు
అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.

అవతారిక
రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షను ప్రకటించుకున్నారు. అవతారిక ఇంగ్లీషు మూలం ఇలా ఉంది.

WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:
  • JUSTICE, social, economic and political;
  • LIBERTY of thought, expression, belief, faith and worship;
  • EQUALITY of status and of opportunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;

IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.

తెలుగు అనువాదం:
భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:
  • సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం;
  • ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
  • హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
  • వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము;
1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.

మొదట్లో అవతారికలో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది.

ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. 

వాటిలో ముఖ్యమైనవి:
  1. ఏక పౌరసత్వం--బ్రిటన్
  2. పార్లమెంటరీ విధానం--బ్రిటన్
  3. స్పీకర్ పదవి--బ్రిటన్
  4. భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా
  5. సుప్రీం కోర్టు--అమెరికా
  6. న్యాయ సమీక్షాధికారం--అమెరికా
  7. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్
  8. రాష్ట్రపతి ఎన్నిక పద్దతి--ఐర్లాండ్
  9. రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్
  10. భారతదేశంలో ప్రాధమిక విధులు--రష్యా
  11. కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా
  12. అత్యవసర పరిస్థితి--వైమర్(జర్మనీ)
భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు
భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు కలవు. 1951 లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985 లో 52 వ రాజ్యాంగ సవరన ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చినారు. ఆ తర్వాత 1992 లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11 మరియు 12 వ షెడ్యూళ్ళను చేర్చబడినది.
  • 1 వ షెడ్యూల్ .......భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
  • 2 వ షెడ్యూల్ ......జీత భత్యాలు
  • 3 వ షెడ్యూల్ ......ప్రమాణ స్వీకారాలు
  • 4 వ షెడ్యూల్ ......రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన
  • 5 వ షెడ్యూల్ ......షేడ్యూల్ ప్రాంతాల పరిపాలన
  • 6 వ షెడ్యూల్ ......ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
  • 7 వ షెడ్యూల్ ......కేంద్ర, రాష్ట్రాల మద్య అధికార విభజన
  • 8 వ షెడ్యూల్ ......రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
  • 9 వ షెడ్యూల్ ......కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు
  • 10 వ షెడ్యూల్ ......పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
  • 11 వ షెడ్యూల్ ......గ్రామ పంచాయతిల అధికారాలు
  • 12 వ షెడ్యూల్ ......నగర పంచాయతి, మునిసిపాలిటిల అధికారాలు
సవరణలు
రాజ్యాంగంలో మార్పులకు, చేర్పులకు, తొలగింపులకు సంబంధించి పార్లమెంటుకు రాజ్యాంగం అపరిమితమైన అధికారాలిచ్చింది. రాజ్యాంగం నిర్దేశించినదాని ప్రకారం సవరణలను కింది విధంగా చెయ్యాలి:
  • పార్లమెంటు ఉభయసభల్లోను సవరణ బిల్లు ఆమోదం పొందాలి.
  • సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యత, మరియు మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యత తో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది.
  • అయితే ప్రత్యేకించిన కొన్ని అధికరణాలు, షెడ్యూళ్ళకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా ఆమోదించాలి.
  • పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తరువాత, సంతకం అయిన తేదీ నుండి సవరణ అమలు లోకి వస్తుంది.
2005 అక్టోబర్ వరకు రాజ్యాంగానికి 92 సవరణలు జరిగాయి. అవతారికలోను, సవరణ విధానంలోను కూడా సవరణలు జరిగాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top