హిందూతనం, హిందూత్వం ఒకటేనా? - Is Hinduism and Hindutva the same? |
– రంగా హరి
ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వస్తున్న అంశం, పదం ఏదైనా ఉందంటే అది హిందూత్వం. హిందూత్వాన్నే హిందూతనం అని కూడా అనుకోవచ్చును. బ్రిటిష్ వారి నుండి ఈ హిందూత్వం అనే మాట వాడుకలోకి వచ్చింది. కనుక హిందూత్వం, హిందూతనం అనే రెండు పదాలు సమానార్ధాకాలు. అయితే వాటి వాడుకలో తేడా ఉంది. వాటిని వేరువేరు సందర్భాలలో వాడుతున్నారు. సరైన అవగాన లేకపోవడంవల్ల వీటి గురించి అనేక సందేహాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని కొంతవరకు తొలగించే ప్రయత్నం చేద్దాం.
హిందూతనం అంటే హిందూస్తాన్ లో నివసించే ప్రజల అస్తిత్వం లేదా గుర్తింపు. రాబర్ట్ క్లైవ్ , వారన్ హేస్టింగ్ లు ఈ దేశానికి వచ్చేవరకు ఈ గుర్తింపు చెక్కుచెదరలేదు. ఇక్కడి ప్రజల సమీకృత జీవన విధానం కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నది. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన సముద్రాల వరకు ఉన్న భూభాగంలో ఈ జీవన విధానం వెల్లివిరిసింది. వేదాలు ఇక్కడి ప్రజల జనజీవితాన్ని, ఆలోచనలను, లోకాన్ని అర్ధంచేసుకునే తీరును రూపుదిద్దాయి. ఇక్కడి ఋషులు తాము దర్శించిన సత్యాలను ప్రజలకు తెలియచెప్పారు. అవి శాశ్వతమైనవి, చిరంతనమైనవి, వైశ్వికమైనవి. అలా శాశ్వత సత్యాల ఆధారంగా రూపొందిన జీవనవిధానం తరతరాలుగా ఇక్కడ విలసిల్లింది. భౌతిక, పారలౌకిక విషయాలన్నిటితో కూడిన ఈ జీవనవిధానానికి ఆ ధర్మం ఆధారమైంది. ఆ ధర్మమే కాలంతో సంబంధంలేని శాశ్వతమైన విలువలను, వ్యవస్థను అందించింది.
ఆ విలువలలో కొన్ని –
- – పవిత్రమైన ఆలోచనలు ఎక్కడ ఉన్నా స్వీకరించడం.
- – సత్యం ఒక్కటే అయినా తమతమ ఆంతరిక (లోపలి) వెలుగును బట్టి వేరువేరుగా గ్రహిస్తూ ఉంటారు.
- – ఆకాశంలో పక్షులు ఎగిరే మార్గాలు, సముద్రంలో చేపలు ఈదే దారులు అపరిమితమైనట్లుగానే బుద్దిమంతుల మార్గాలు కూడా అనంతం.
- – ఈ భూమి అందరిదీ. దీనిపై ఉన్న అందరినీ ఆ భూమి భరిస్తోంది, పోషిస్తోంది.
- – సృష్టి మొత్తంలో శక్తి ఒకటే. దాని స్థాయిలే మారుతాయి.
- – భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలగడమే నిజమైన జ్ఞానం.
- – తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలన్నా, నాశనం చేసుకోవాలన్నా మనిషి చేతిలోనే ఉంది.
ఈ విలువలన్నీ మంత్రాల రూపంలో ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఇవి ఏ మతాన్ని, ఆరాధనాపద్దతిని చెప్పడం లేదు. వీటిలో అంధవిశ్వాసం, మూఢత్వం కూడా లేవు.
ఈ విలువల ద్వారానే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. అది ప్రజల నిత్యజీవన వ్యవహారంలో ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటుంది. అది భగవంతుడు, మానవుడి మధ్య సంబంధాన్ని చెప్పినప్పుడు మతంగా మారింది. ఇవన్నీ కలిపితే జాతీయ జీవనం, అస్తిత్వం అయింది. దీనినే హిందూతనం అంటున్నారు. నిజానికి ఇది మానవ ప్రయత్నంవల్ల ఏర్పడినది కాదు. అప్రయత్నంగా రూపుదిద్దుకున్నది. ఇది భౌతికమైనదానికంటే మానసికమైనదని చెప్పడమే సబబుగా ఉంటుంది. ఇది చాలా సున్నితమైన పద్దతిలో హిందుస్తాన్ లోని ప్రజలందరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. వారి తత్వశాస్త్రమైనా, మతం, సాహిత్యం, కళలు, రాజకీయాలు, ఆర్ధిక విషయాలు, ఆఖరుకు ఆటలైనా సంస్కృతి ప్రభావానికి లోనవుతాయి. ఇది నిరంతరం ప్రవహించే నది లాంటిది. ఎక్కడా ఆగిపోదు. ఒక తరం నుంచి మరో తరానికి వెళుతూనే ఉంటుంది. నిరంతరం మారుతూనే ఉంటుంది, వికసిస్తూనే ఉంటుంది.
హిందూతనం అనేది ఒక ఉద్యమం లాంటిదని, నిరంతరం వృద్ధి చెందే సంప్రదాయం అవిచ్ఛిన్న జాతీయ జీవనాన్ని ప్రతిబింబిస్తుందని చరిత్ర నిరూపిస్తోంది. అదే భారతదేశ గుర్తింపు, ప్రాణం. క్లుప్తంగా చెప్పాలంటే శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న, అభివృద్ధిచెందిన హిందుస్తాన్ అస్తిత్వమే హిందూతనం. ఇది ఈ దేశాన్ని ముందుకు నడిపించే కీలక శక్తి. అది ఎలాంటి వివక్ష లేకుండా ఈ దేశంలోని అందరికీ చెందినది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ప్రతిఒక్కరి వారసత్వం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరినీ ఈ జాతితో ముడివేసే బంధం. మరోలా చెప్పాలంటే, హిందూతనాన్ని సంతరించుకోవడం ద్వారా ఇక్కడ ఒక వ్యక్తి జాతీయతను(Nationality) పొందుతాడు. వ్యక్తి సమిష్టి అవుతాడు.
మరోవైపు హిందూతనాన్నే మతవిశ్వాసాల విషయంలో హిందూత్వంగా చెప్పవచ్చు. ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక అన్వేషణాసక్తి ఉంటుంది. ఆ దిశలో హిందూతనం వెళితే అదే హిందూత్వంగా ప్రకటితమవుతుంది. నిజానికి వేదాలు ఏ ఒక్క నిర్ధారిత పూజా పద్దతిని చెప్పలేదు. మహామంత్రరాజంగా పేరుపొందిన గాయత్రీమంత్రం కూడా సంపూర్ణ జ్ఞానాన్ని పొందే విధంగా బుద్ధిని ప్రేరేపించు అని జీవకోటికి ఆధారమైన పరాశక్తిని కోరుతూ చేసే ప్రార్ధన మాత్రమే. ఇందులో ఏ ప్రత్యేక దేవతను స్తుతించం. ఏ మతానికి చెందినవాడైనా, ఆఖరుకు నాస్తికుడు కూడా ఈ ప్రార్ధన చేయవచ్చును. వేదాల్లో ఇలాంటివి వేలాది మంత్రాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఆచారాలు, పద్దతులు రూపొందాయి. వాటిని సూచించే బ్రాహ్మణాలు వచ్చాయి. హిందూతనం మతవిశ్వాసాల రూపంలో ఆచారాలు, పండుగలుపబ్బలుగా రూపుదిద్దుకుంది. అదే నేడు మనం చూస్తున్న హిందూత్వంగా మారింది.
పాశ్చాత్య సామ్రాజ్యవాదులు ఈ గడ్డపై మొట్టమొదటసారి అడుగుపెట్టినప్పుడు వారికి ఈ హిందుత్వమే ఇక్కడ కనిపించింది. దానితో ఇక్కడి ప్రజానీకం అడవి మనుషులని, వీరికి తమ సెమెటిక్ మతాల మాదిరిగా ఎలాంటి మతం లేదని భావించారు. ఇక్కడున్నది ఏమిటో వారికి అర్ధం కాలేదు. తమ సొంత బుద్ధి ప్రకారం ఇక్కడి విశ్వాసాలు, పద్దతులు, పంథాలను `హిందూ’ అని పిలిచి, ఇక్కడ ఉన్నది `హిందూమతం’ అని పిలవడం ప్రారంభించారు. ఆ హిందూమతం కూడా తమ ప్రమాణాల ప్రకారం `నిజమైన’ మతం కానేకాదని తేల్చేశారు. నిజానికి ఈ దేశంలో అప్పటివరకూ ఎవరు మతపరంగా తాము వైష్ణవులు, శైవులు, శాక్తేయులు మొదలైనవారమనే చెప్పుకునేవారు తప్ప `హిందువులమని’ చెప్పుకోలేదు. దీనినిబట్టి హిందూత్వం అనే పదం సరైనదికాదని తెలుస్తుంది. ఒకవేళ హిందూ అనే పదమే కావాలనుకుంటే అప్పుడు హిందూ మతాలు అని వాడాలి. అంటే `సప్తర్షులు’ అనే కూటమి వంటిదే ఇది. శాస్త్రీయంగా కచ్చితమైన పదమంటే మాత్రం `ధార్మిక సంప్రదాయం’ అనే వాడాలి. ఏదిఏమైనా `హిందూత్వం’ అనే పదం ప్రజల్లో, ముఖ్యంగా పాశ్చాత్యుల నిఘంటువుల్లో స్థిరపడిపోయింది. కాబట్టి తప్పైన, ఒప్పైన అదే ఉపయోగిస్తున్నారు.
హిందూత్వం ఇప్పుడు అనుకుంటున్నట్లుగా హిందూతనం కాదు. హిందూతనం అంటే ఈ దేశం, ప్రజల అస్తిత్వం . హిందూత్వం అంటే వ్యక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలు. హిందూతనం సామూహికమైనది, సమిష్టి అయితే హిందూత్వం వ్యక్తిగతమైనది, వ్యష్టి మాత్రమే. హిందూతనం వారసత్వం, పరంపర అయితే హిందూత్వం ఎంచుకునేది, అనుసరించేది. హిందూతనం సహజంగా, కాలానుగతంగా ఏర్పడిన చరిత్ర, సంప్రదాయం. హిందూత్వం వ్యక్తి, కుటుంబం, సమాజం ఏర్పరచుకున్నవి. వేదకాలం నుంచి హిందూతనం సర్వవ్యాపకమైనది. హిందూత్వాన్ని గురించి కొంతవరకే అలా చెప్పగలం. కొత్తగా పుట్టిన, పుట్టుకువస్తున్న మతాలను తనలో ఇముడ్చుకోగలదు కాబట్టి హిందూత్వాన్ని కూడా కొంతవరకు సర్వవ్యాపకమైనదని అనవచ్చు. కానీ ప్రార్ధనామందిరాలలోకి ప్రవేశించేసరికి హిందూత్వం కూడా, సెమిటిక్ మతాల అంత కాకపోయినా, సంకుచితమవుతుంది. ఎలాగంటే వైష్ణవ ఆలయంలో శివుడికి స్థానం లేదు, తంత్ర మార్గంలో వేదాంతి అవసరం లేదు. ప్రతి హిందూ మతం తన ప్రత్యేకతను చాటుకునేందుకే ప్రయత్నిస్తుంది. అయితే అవన్నీ హిందూతనం అనే శాశ్వత, వైశ్విక విలువలను పాటిస్తాయి, అనుసరిస్తాయి. (సెమెటిక్ మతాలు ఈ విలువలను అనుసరించవు)
ఏ జాతికి చెందిన వాడైన తన మతాన్ని ఎంచుకునే స్వేచ్చ అతనికి ఉంటుంది. కనుక ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా హిందూత్వాన్ని స్వీకరించడం ద్వారా ఎవరైనా హిందువు కావచ్చును. కానీ అతని హిందూత్వంపై అతను ఏ జాతీయుడో ఆ జాతికి సంబందించిన విలువల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక అమెరికన్ హిందూత్వం లేదా ఇండోనేషియా వాసి హిందూత్వం నూటికినూరుశాతం భారతీయ హిందూత్వంలా ఉండకపోవచ్చును. జాతీయ విలువల ప్రకారం అది కొంత వేరుగా, ప్రత్యేకంగా ఉండవచ్చు. అలాగే ఈ దేశంలో బయటనుండి ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవం హిందుత్వ ప్రభావానికి లోనైనంత మేరకు వేరుగానే ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. భారతదేశంలో ఇస్లాం కొంతవరకు విగ్రహారాధనకు అలవాటుపడిందనే చెప్పాలి. చిహ్నాలను పూజించడం, కట్టడాలను నిర్మించుకోవడం దర్గాల్లో బాగా కనిపిస్తుంది. హిందూ దేవాలయాల్లో మాదిరిగా కేరళలో ముస్లిములు అనేక పండుగలు, పబ్బలు జరుపుకుంటారు. వాటికి ఉర్స్, చందనక్కుడమ్ అని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకున్నారు. ఆ ఉత్సవాల్లో చక్కగా అలంకరించిన ఏనుగులు తప్పనిసరి. శబరిమలకు వెళ్ళే దారిలో ఉన్న ఒక మసీదులో భక్తులకు ప్రసాదంగా భస్మం ఇస్తారు.
ఇక క్రైస్తవానికి వస్తే అక్కడ ఎన్ని హిందూ పండుగలు, పద్దతులు కనిపిస్తాయంటే అది హిందూత్వంలో మరొక పంథా అనిపిస్తుంది. చర్చిపై జండా, సంగీతం, మతపరమైన భాష మొదలైనవన్నీ హిందూత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. రెండు సెమెటిక్ మతాలు హిందూస్థాన్ లోని హిందూతనం వల్ల ప్రభావితమయ్యాయి. వివాదాలకు, విమర్శలకు భయపడకుండా భారతీయ క్రైస్తవం, భారతీయ ఇస్లాం పై హిందూతనం ప్రభావం బలంగా ఉందని చెప్పవచ్చును. అంటే దీనర్ధం ఈ మతాలు తమ మౌలిక సిద్ధాంతాలను, తత్వాన్ని మార్చుకున్నాయని కాదు.
క్లుప్తంగా చెప్పాలంటే హిందూతనం, హిందూత్వం ఒక్కటి కావు. చెప్పదలుచుకుంటే అవి కవలలు అని మాత్రం అనవచ్చు. అందువల్లనే జాగ్రత్తగా పరిశీలించనివారు, విశ్లేషించనివారు అవి రెండు ఒకటేనని పొరబడతారు. కానీ నిజమైన సాధకుడు, అన్వేషకుడు అలా పొరబడడు.
(రచయిత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్వ అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ ) – ఆర్గనైజర్ సౌజన్యంతో . అనువాదం: కేశవనాథ్ ఖండవల్లి -- విశ్వ సంవాద కేంద్రము {full_page}