సామాజిక సమానతకు ఉద్యమించిన మహాత్మా జ్యోతిబా ఫులే - Mahatma Jyotiba Phule, who fought for social equality

Vishwa Bhaarath
సామాజిక సమానతకు ఉద్యమించిన మహాత్మా జ్యోతిబా ఫులే - Mahatma Jyotiba Phule, who fought for social equality
మహాత్మా జ్యోతిబా ఫులే - Mahatma Jyotiba Phule
సామాజిక సమానత కోసం  ఎందరో మహాపురుషులు చేసిన కృషిని సమాజం గుర్తించవలసి ఉంది. మహాపురుషులను పోల్చటం మన ఉద్దేశ్యం కాదు. కాని మహాపురుషులను నేడు కులాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కాని ఈ మహాపురుషులు ఏనాడు తాము ఒక కులనాయకుడిగా వ్యవహరించలేదు. జాతీయ నాయకుడిగానే వ్యవహరించారు. వారు జీవించిన కాలం, ఆనాటి దేశ పరిస్థితులు భిన్నమైనవి. హిందూ సమాజంలో నెలకొన్న కుల అసమానతలు, అంటరానితనాన్ని దూరం చేసి ఆరోగ్యవంతమైన, దురాచారాలు లేని ఆధునిక హిందూ సమాజ నిర్మాణానికి కృషిచేశారు. కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారిలో జ్యోతిరావు ఫులే ఒకరు.

మహాత్మా జ్యోతిబా ఫులే
మహాత్మా జ్యోతిబా ఫులే 11 ఏప్రిల్‌ 1827లో మహారాష్ట్రలోని కట్గుణ్‌లో జన్మించారు. 28 నవంబర్‌ 1890లో తనువు చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి విప్లవకారులు బలిదానాలు చేసినా, సాధారణ ప్రజలలో స్వాతంత్య్ర ఇచ్ఛ బైటపడని కాలం అది. ఆంగ్లేయుల పాలనే చాలా బాగుందని భారతీయ విద్యావంతులు శ్లాఘిస్తున్న కాలం. మహరాష్ట్ర అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు.
   శూద్రులుగా భావింపబడే పువ్వులు అమ్ముకునే కులంలో జ్యోతిబా జన్మించారు. ఆయనకు 13వ ఏటనే వివాహం అయింది. తండ్రి సహకారంతో వివాహానంతరం చదువు కొనసాగించారు. జాన్‌ స్టువర్ట్‌మిల్‌ రాసిన ‘ఆన్‌ లిబర్టీ, థామస్‌ పెయిన్‌ రాసిన ‘ది డిగ్నిటి ఆఫ్‌ మాన్‌’ అనే గ్రంథాలు, జార్జి వాషింగ్‌టన్‌, శివాజీల జీవితచరిత్రలు జ్యోతిబా జీవనంపై చెరగని ముద్ర వేశాయి. ఆనాడు హిందూ సమాజంపై బ్రాహ్మణ (పురోహిత) వర్గ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శూద్ర, అతి శూద్ర (అస్పృశ్య) వర్గాల సమానత కోసం ఉన్నతి కోసం కృషిచేశారు జ్యోతిబా. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తించి శూద్ర, అతి శూద్ర వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించటం కోసం కృషి చేశారు. స్వయంగా తన భార్య సావిత్రిబాయి చేత అతిశూద్ర మహిళల కోసం పాఠశాలను ప్రారంభింపచేశారు. తన ఇంటిలోని బావిలో అతి శూద్రులు నీటిని తోడుకోవటం కోసం అవకాశం కల్పించిన మహాపురుషుడు. హంటర్‌ కమీషన్‌కు నివేదిక సమర్పిస్తూ ‘శూద్ర, అతిశూద్ర మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించాలనీ, ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ, విద్యలో ఉపాధికల్పన, నైతిక విలువలు, ఆరోగ్య అంశాలు ఉండాలని, రైతు వర్గాల నుండి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని’ ఆనాడే వారు పేర్కొన్నారు.
  బాల్య వివాహాలను, వితంతు స్త్రీలకు శిరోముండనం చేయటాన్ని వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బ్రాహ్మణ పూజారి వర్గ ఆధిపత్యానికి నిరసనగా 24 డిసెంబర్‌ 1873లో సత్యశోధక సమాజాన్ని ప్రారంభించారు. మనందరం దేవుని సంతానం. దేవుని దృష్టిలో మనందరం సమానం. ఈ భేదాలు మనం సృష్టించుకున్నవే. దేవునికి, మనిషికి మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదు. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తు వినియోగం ఆచరించాలి. మూఢాచారాలను వ్యతిరేకించాలి. మతపరమైన శుభ, అశుభ కార్యాలు, వివాహం తక్కువ ఖర్చుతో చేయాలి’. ఇవి ఆయన ప్రారంభించిన సత్యశోధక సమాజపు ముఖ్యలక్ష్యాలు. బ్రాహ్మణ పూజారి లేకుండానే వివాహాలు చేయించారు. మరాఠి భాషలో వివాహం చేయించే విధానాన్ని రూపొందించారు.
సావిత్రిబాయి ఫులే మరియు జోతిరావ్ ఫులే
సావిత్రిబాయి ఫులే మరియు జోతిరావ్ ఫులే
5 సెప్టెంబర్‌ 1875న ఆర్యసమాజ ప్రచార కార్యక్రమ భాగంలో స్వామి దయానంద సరస్వతి పూనాకు వచ్చినపుడు వారి కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా విజయవంతం చేసిన విశాల హృదయుడు జ్యోతిబా. నిమ్న వర్గాలకు సైతం తన పాలనలో సముచిత స్థానం కల్పించిన శివాజి జీవితాన్ని కొనియాడుతూ శివాజి చరిత్రపై కవితలతో పుస్తకం రాశారు. గుర్తింపు లేకుండా ఉన్న శివాజీ సమాధిని బైటకు తీసి తన సొంత ఖర్చుతో దర్శనీయ స్థలంగా మార్చారు. ‘మీ ఆంగ్లేయ పరిపాలనా కాలంలో మా సామాజిక పరిస్థితుల్లో రైతుల పరిస్థితుల్లో ఏ మంచిమార్పు రాలేదు’ అంటూ నిర్భయంగా 1888లో బ్రిటీషు యువరాజు ముందు ప్రసంగించిన ధీరోదాత్తుడు జ్యోతిబా. అందరూ ఆడంబరంగా సూటు-బూటు ధరించి వచ్చిన బ్రిటీషు యువరాజు గౌరవార్ధపు విందుకు ఒక పల్లెటూరి పేదరైతుగా ధోవతి, అంగీ, తలపాగా, గొంగళి ధరించి వచ్చిన సాహసి.
  సంతానం లేదు కనుక మరో వివాహం చేసుకోమని తండ్రి, కుటుంబ సభ్యులు ఎంత వత్తిడి చేసినా మరో వివాహానికి అంగీకరించలేదు. పిల్లలు లేకపోవడానికి భార్యే కారణం ఎందుకు కావాలి ? భర్తలో కూడా లోపం ఉండచ్చు కదా ! అని ఎదురు ప్రశ్న వేశారు. కాశీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తను కోల్పోయి గర్భవతిగా ఉండటం తటస్థించింది. ఆమెను జ్యోతిబా చేరదీసి రక్షణ కల్పించాడు. ఒక పిల్లవాడిని కని ఆమె చనిపోయింది. ఆ బాలుడికి యశ్వంత్‌ అని నామకరణం చేసి ఆ బాలుడినే దత్తపుత్రుడుగా స్వీకరించిన విశాల హృదయుడు మహాత్మా జ్యోతిబా ఫులే. జ్యోతిబా మంచి కవి, రచయిత, వక్త. అనేకమంది అనుయాయులను నిర్మాణం చేసుకుని తన తరవాత కూడా తను ప్రారంభించిన సామాజిక ఉద్యమం కొనసాగేట్లు కృషిచేసిన ఉద్యమకారుడు జ్యోతిబా ఫులే.
   తాను నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఒక అతిశూద్ర ఉపాధ్యాయుడు పేదరికం కారణంగా క్త్రైస్తవమతం స్వీకరిస్తున్నాడని తెలిసి, ఆ ఉపాధ్యా యుని జీతం పెంచి క్త్రైస్తవ మతమార్పిడి సరికాదని నచ్చచెప్పాడు. హిందూమతంలోని దురాచారాలు, లోపాలకు వ్యతిరేకంగా జీవితాంతం ఉద్యమించిన జ్యోతిబా సమస్యకు పరిష్కారం మతం మారడం కాదని అన్నారు. వారి రచనలలో ఏకమయ (ఏకాత్మత), ఏకమయ లోక (ఏకాత్మ రాష్ట్ర), శబ్ద ప్రయోగాలు ఎక్కువగా చేశారు. తాను వ్రాసే ఉత్తరాలపైన ‘సత్యమేవ జయతే’ అని వ్రాసేవారు. అందుకే ప్రజలు ఆయనను ఒక మహాత్ముడిలా చూశారు. జ్యోతిబా తన జీవిత చరమాంకంలో అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు.

సామాజిక సమానత ఉద్యమానికి మహాత్మా జ్యోతిబా ఫులేను సమకాలీన యుగంలో మొదటివ్యక్తిగా పేర్కొనాలి.

-కె.శ్యాంప్రసాద్‌, జాతీయ కన్వీనర్‌, సామాజిక సమరసత - జాగృతి సౌజన్యం తో {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top