దేశభక్తికి మాతృభావన ముఖ్యం - Desa Bhakti, Mathru Bhoomi

భారత మాత
భారతమాత
మానవ జీవితంలో ఎన్ని రకాల పరిస్థితులుంటాయో అన్ని రకాల భావాలుంటాయి. వాటిలో ఒకటి మాతృ భావన. ఈ మాతృ భావమే జాతీయ వాదానికి మూలం. ‘నమస్తే సదావత్సలే మాతృభూమే’ అంటూ ప్రతినిత్యం శాఖలో చేసే ప్రార్థన ప్రతి స్వయంసేవకునిలో మాతృభావాన్ని తట్టి లేపుతుంది. మాతృభూమి పట్ల శ్రద్ధను కలిగిస్తుంది. సంఘ సిద్ధాంతానికి ఆకర్షితులైన వారిలో మాతృభావన అధికంగా ఉంటుంది.
భారతమాత కు పూజ చేస్తున్న డా. భగవత్ జీ 
మాతృభావనకు చెందిన గుణాలలో మాతృప్రేమ, జాలి, స్త్రీ సహజమైన తెలివి, ఉన్నత ఆధ్యాత్మిక భావాలు ప్రధానమైనవి. తల్లిలా ఆదుకొని, ఆశ్రయమిచ్చి, జీవితానికి ఆధారమవుతున్న వాటన్నింటిని మానవుడు తల్లికి ప్రతిరూపంగా, దేవతగా భావిస్తుంటాడు. భూమిని, పంటలను, దేశాన్ని, నదులను, స్త్రీ దేవతలుగా, తల్లిగా భావించి పూజిస్తున్నాడు. సత్వ, రజ, స్తమో గుణాలు కలిగిన ప్రకృతి దేవత మాతృరూపమే.
   మానవుల కష్టాలను తీర్చేది, వరాలను ఇచ్చేది తల్లే. అనాదిగా వివిధ కాలాలలో మానవులు పూజిస్తున్న స్త్రీ దేవతలందరూ మాతృరూపానికి ప్రతీకలే. ఆనాటి వేదమాత నుండి నేటి గ్రామ దేవతల వరకు అందరూ మాతృ రూపానికి ప్రతీకలే.

ఈ తల్లి భావన వ్యక్తిగత సంబంధాలకతీతంగా తన పరిధిని విస్తరించుకొని దేశాన్ని, విశ్వాన్ని, తన సంతానంగా భావించినపుడు విశాల మాతృభావం రూపుదిద్దుకుంటుంది.
”అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల
నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యీవుత మహత్త్వ
కవిత్వ పటుత్వ సంపదల్‌’
పోతన భావించిన మాతృ లక్షణాలు ఈ విశాల మాతృభావనకు సంబంధించినవే.

భారతమాతకు జేజేలు
ప్రపంచ వ్యాప్తంగా పంటలకు స్త్రీ మూర్తులను అధిదేవతలుగా ఆరాధిస్తున్నారు. మెక్సికో, గ్రీకు, రోమన్‌, ఈజిప్ట్‌ దేశాల్లోని ధాన్య దేవతలందరూ స్త్రీమూర్తులే. ఋగ్వేదంలో ఇళాదేవి అన్నాన్ని ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో దేవి తాను శాకాంబరినని చెప్పుకుంది. భారతదేశం గ్రామమయం. పంటలకు మూలం గ్రామాలే కాబట్టి పంటల దేవతలే గ్రామదేవత లయ్యారు. ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మలు పంటల దేవతలే గాకుండా గ్రామదేవతలు కూడా. ఈ దేవతల ఆగ్రహ, అనుగ్రహాలను ఆధారం చేసుకొని విస్తృత జానపద సాహిత్యం ఆవిర్భవించింది.
   బంకించంద్రుని ‘వందేమాతరం’ మాతృరూపమే. బంకించంద్ర భారతమాతను తల్లిగా భావించడంలో మాతృభావన దాగి ఉంది కనుకనే ‘త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణీం’ అని కీర్తించగలిగాడు. విదేశీయుల పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్య్రాన్ని కోరుతూ రచించిన ‘మాతృదాస్య విమోచనం’లో కూడా మాతృభావమే కనిపిస్తుంది.

‘నలుబది కోట్లకు మించిన సంతానాన్ని కన్న ఓ తల్లీ ! నీ చల్లని దీవెనలలో పురోగమిస్తానమ్మా!’ అని ఆశించిన సోమసుందర్‌ కవితా ఖండికలో కూడా మాతృభావమే కనిపిస్తుంది.
నీ యొడిలోన పెంచితివి
నిండుగ కోటి తెలుంగు కుర్రలన్‌!
ప్రాయము వచ్చినంతనె
కృపానములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయభుజా బలమ్ము దరిసింప
జగమ్ము, నవాబుతో సవాల్‌
చేయమటంటి; వీ తెలుగు
రేగడిలో జిగి మెండు మాతరో!
భారతమాతను మాతృరూపంగానే భావించాలి. ‘భారతి నా కన్న తల్లి, భాగ్యోదయ కల్పవల్లి, విశ్వశాంతి విరియించిన, చిరుపూవుల శిరస్సు మల్లి’ అని అనేక మంది దేశభక్తులు పాటలు పాడినా; ‘మా తెలుగు తల్లికీ మల్లె పూదండా, మాకన్న తల్లికీ మంగళారతులు’ అని శంకరంబాడి సుందరాచారి పాడినా; ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం’ అని అందెశ్రీ పాడినా వారిలోని మాతృభావమే కారణం. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన తరువాత తెలంగాణ ప్రజల సంతోషాన్ని వెలిబుచ్చడానికి, వారిలో జాతీయ భావాలను నింపడానికి దాశరథి కృష్ణమాచార్యులు రాసిన రుద్రవీణలోని పద్యాల్లో మాతృభావం కనిపిస్తుంది.
   కన్నతల్లితో సమానంగా మాతృభూమిని గౌరవించాలని భారతీయ సంస్కృతి చెబుతుంది. కన్నతల్లి ఏవిధంగా తన పిల్లల పోషణ, రక్షణ చూసుకుంటుందో అలా ప్రజల పోషణ, రక్షణ చేసే ప్రతీదానిని తల్లిలా భావించాలని ధర్మం చెబుతుంది.

భూమాత రక్షణ బాధ్యత చూస్తుంది. నదీమాత, గోమాతలు పోషణ బాధ్యతలు స్వీకరించాయి. తులసీమాత ఆరోగ్యప్రదాతగా నిలిచింది. వీటన్నిటి పట్ల మాతృభావన కలిగి ఉండాలి. అయితే ఇది కేవలం నేడు మనం చెబుతున్నదే కాదు. ఈ పవిత్ర భావన భారతదేశంలో తరతరాలనుండి గంగా ప్రవాహంలా నిరంతరం కొనసాగుతోంది. ప్రతి మనిషిలో ఆ విధంగా ఈ భారత భూమిమీద జన్మించిన మానవులు ధన్యులు. మానవులలో ఉండే భావమే దేశభక్తికి కారణం. దానిని మేల్కొల్పడమే జాతీయ వాదుల పని.

– వారె దస్తగిరి, - జాగృతి సౌజన్యం తో - విశ్వ సంవాద కేంద్రము
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top