సామాజిక సమరసతే మళయాళ స్వామి జీవితాశయం - Malayalam Swami

Vishwa Bhaarath
సామాజిక సమరసతే మళయాళ స్వామి జీవితాశయం - Malayalam Swami
Malayalam Swami
మళయాళ స్వామి
ఒకనాడు కులం పేరుతో సామాజిక అసమానతలకు బీజం పడింది. ఈ అసమానత బీజాలను ఎవరో ఒక మహాపురుషుడు వచ్చి రూపుమాపేవారు. అలా అస్పృశ్యత బలంగా ఉన్న నేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేష కృషి చేసినవారు నారాయణ గురు శిష్యులైన ‘సద్గురు మళయాళ స్వామి’.

పక్షులను కొని ఎగరేశాడు
సద్గురు మళయాళ స్వామి కేరళలోని గురువాయూరు దగ్గర ఎన్గండ్యూరు గ్రామంలో 27 మార్చి 1885న కరియప్ప, నొట్టియమ్మలకు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వేలప్ప. చిన్ననాటినుండే భగవత్‌పూజ, భజన, ధ్యానం వేలప్ప నిత్యకృత్యాలు. చదువులో ముందుండేవాడు. ఏకసంతాగ్రాహి. ఒకసారి ఒక బోయవాడు రెండు పక్షులను అమ్ముతున్నాడు. అది గమనించిన వేలప్ప వెంటనే వాటిని కొని ఎగరవేసి స్వేచ్ఛ కల్పించాడు. బుద్ధుని వలె జీవకారుణ్య గుణం వేలప్పకు చిన్ననాటే లభించింది.
   వేలప్ప శ్రీ నారాయణగురు శిష్యుడైన శ్రీ శివ లింగస్వామి పెరింగోట్కర గ్రామంలో ప్రారంభించిన శ్రీ నారాయణ ఆశ్రమంలో విద్యార్జన కోసం చేరాడు. అనేక ఆధ్యాత్మిక విద్యలను పొంది శివలింగ గురుస్వామి వద్ద మంత్రోపదేశం పొందారు. శ్రీ నారాయణగురుదేవుని సందర్శించి వారి ఆశీర్వాదా లను పొందారు.

ఎవరికీ చెప్పకుండా..
అప్పటికి వేలప్పకు 18 ఏళ్ళు వచ్చాయి. ఆ వయసులోనే కాలినడకన దేశమంతా పర్యటించారు. దేశం నలుమూలలలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిం చారు. బ్రహ్మకపాలతీర్ధం చేరి వారి ఆశయాలకు అనుగుణంగా ‘లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మ గోత్రం నుండే ఉద్భవించాయి. నేను వదిలే తర్పణం అన్ని ప్రాణులకు చెందాలి’ అంటూ తర్పణం వదిలారు. దేశ పర్యటనానంతరం తిరిగి కేరళ వచ్చి శ్రీ నారాయణగురు, శివలింగస్వాములను దర్శించి వారి ఆశీస్సులను పొందారు. అప్పటికే తండ్రి మరణించారు. కొద్దిరోజులు తల్లికి సేవచేసి ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి బయలుదేరి 1913 డిసెంబరులో తిరుమల చేరారు వేలప్ప.

విజ్ఞానం అందరిది
దేశవ్యాప్త పర్యటనలో వారు గమనించిన అంశాలు, ‘విద్యా విజ్ఞానాలు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని కారణంగా ప్రజలు ఎక్కువ మంది పశుప్రాయులుగా జీవిస్తున్నారు. గుణ కర్మలపై ఆధారపడిన వర్ణ వ్యవస్థ జన్మతో ముడివడిన కులవ్యవస్థగా మారిపోయింది. గుణవంతుడయినా తక్కువ కులం వారికి సమాజంలో గౌరవస్థానం లేదు. స్వరాజ్య ఉద్యమం కొనసాగుతున్నా ప్రజలు స్వరాజ్యం ప్రాముఖ్యాన్ని గుర్తించలేదు. ఆధ్యాత్మికత ఆధారంగానే స్వరాజ్యం సిద్ధిస్తుంది. మన ప్రాచీనులు అందించిన వేదవిజ్ఞానం ప్రజలందరికి లౌకిక విద్యతోపాటు అందించాలి. అప్పుడే స్వరాజ్యం సిద్ధిస్తుంది’ అనే స్పష్టమైన నిర్ణయానికి వేలప్ప వచ్చారు.
మళయాళ స్వామి
మళయాళ స్వామి

ఎందుకు చేస్తున్నారు ?
తిరుమలలో ఏకాకిగా కట్టుబట్టలతో 12 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేశారు. ఒక జిజ్ఞాసువు ‘మీరు తపస్సు దేనికోసం చేస్తున్నారు ?’ అని అడగ్గా, ‘నేను ఈశ్వర దర్శనం కోసం తపస్సు చేయటం లేదు, ముక్తిపట్ల నాకు కోరిక లేదు, భగవంతుని పట్ల అవిచ్ఛిన్నమైన భక్తి ప్రజలందరకు కలగాలని, తద్వారా ప్రజలందరిలో అజ్ఞానం తొలగాలని, వారికి సుఖం లభించాలని నేను తపస్సు చేస్తున్నాను. ఈ పని సాధించటానికి నాకు పునర్జన్మ కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఇదే నా జీవితాశయం’ అన్నారు.

బానిసత్వానికి అదే కారణం
తిరుమలలో తపస్సులో ఉండగానే స్త్రీలకు, శూద్రులకు, అశ్పృస్య వర్గాల ప్రజలకు అందరికి బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ అందుకు ప్రమాణంగా ఉండే విధంగా 1919 డిసెంబరులో ‘శుష్క వేదాంతమో భాస్కరం’ అనే గ్రంథాన్ని రాశారు. హిందూ సమాజంలో చాలా కాలంగా ఆచరణలో ఉన్న మూఢవిశ్వాసాలను, దురాచారాలను ఖండిచారు. అందరి ప్రజలకు మన ప్రాచీన విద్యను అందిచక పొవటమే మన దేశ బానిసత్వానికి, పతనానికి కారణం అని స్పష్టంగా వారు ఆనాడే పేర్కొన్నారు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తరువాత సామాజిక మార్పును సాధించ టానికి తిరుమల నుండి శిష్యులతో తిరుపతి – శ్రీకాళహస్తి మధ్యగల ఏర్పేడు-కాశీబుగ్గకు 3 జూన్‌ 1926న చేరారు.

ఆ పని ఆనాడే చేశారు
అక్కడే వ్యాసాశ్రమం ప్రారంభమైంది. అక్కడ జంతుబలి ఇచ్చే ఆచారాలను ప్రజలకు నచ్చచెప్పి మానిపించారు. అనేకమంది రోగపీడితులకు వారు తీర్థం, విభూతి ఇస్తూ రోగవిముక్తులను చేసేవారు. అక్కడ వారిని అందరూ మళయాళ స్వామి అని పిలిచేవారు. ఆ పేరుతోనే వారు ప్రసిద్ధులయ్యారు.
   మళయాళ స్వామి 1927లో ‘యదార్ధ భారతి’ అనే పత్రికను ప్రారంభించారు. తన ఆశయాల ప్రచారం కోసం భక్తులతో 1926లో ‘సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం’ అనే సంస్థను ప్రారంభిం చారు. ప్రతి సంవత్సరం వేదాంత సభలను పెద్ద సంఖ్యలో అరవపాలెం, కృష్ణాజిల్లా పామూరు, పోడేరు వంటి అనేక చోట్ల నిర్వహించేవారు. వారి వేదాంత సభలకు వేలసంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. మహిళలు, ఎస్‌.సి.ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే వారు. వారందరికి అర్ధమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలను చెప్పేవారు. భగవత్‌గీత, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు… ఇలా సనాతన ధర్మ సందేశాన్ని కుల భేదాలకు తావులేకుండా అందరికి ఆనాడే అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మళయాళ స్వామి. 10 సంవత్సరాల తరువాత ‘సనాతన వేదాంత జ్ఞాన సభలు’ గా ఈ సభలు రూపొందాయి. ఈ సభలలో ఒకపూట మహిళలే సభ నిర్వహించే నూతన పద్ధతిని వారు ప్రారంభించారు.

ప్రతిఘటించారు, శిష్యులయ్యారు
1936-40లలో ప్రత్యేకంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఒకపక్క గోరా నాయకత్వంలో నాస్తిక ఉద్యమం, మరొకపక్క ‘కవిరాజు’ నాయకత్వంలో సనాతన ధర్మ వ్యతిరేక ఉద్యమం, ఇంకోపక్క కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో హిందూధర్మ వ్యతిరేక ఉద్యమం బలంగా జరుగుతుండేవి. వీరందరు మళయాళ స్వామి కార్యక్రమాలను, సభలను ప్రతిఘటించటానికి అనేక విఫల ప్రయత్నాలు చేశారు. అనేకమంది చివరకు వీరి శిష్యులయ్యారు.

ఆ భాష అందరిది
సంస్కృతం కేవలం బ్రాహ్మణుల భాషకాదు. ఈ భాష అందరికి అందాలి అన్న సదుద్దేశంతో సంస్కృత భాష వ్యాప్తి కోసం 1928లోనే వ్యాసాశ్రమంలో సంస్కృత విద్యాలయాన్ని ప్రారంభించారు. మన ప్రాచీన ఋషులు అందించిన గొప్ప జ్ఞానాన్ని, గీత, ఉపనిషత్తులు, పాతంజల యోగదర్శనము మొదలగు గ్రంథాలను పాఠ్యాంశాలుగా అందరికి అందించడానికి 1940 నవంబరులో బ్రహ్మవిద్యా పాఠశాలను ప్రారంభించారు. 1 డిసెంబరు 1958లో కన్యా గురుకులాన్ని ప్రారంభించారు. అందరికి ఓంకారాన్ని నేర్పించారు. 2 ఫిబ్రవరి 1936న సన్యాస దీక్షను స్వీకరించి శ్రీ అసంగానందగిరిగా పేరు పొందారు. అయితే ప్రజలలో మళయాళ స్వామిగానే సుపరిచితు లయ్యారు.
   మళయాళ స్వామి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమనాడు సనాతన సభలను ప్రారంభించి, మూడురోజులపాటు నిర్వహించేవారు. మిగిలిన కాలంలో అనేక కేంద్రాలను పర్యటిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలను చేసేవారు. నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకచోట్ల వ్యాసాశ్రమాల అనుబంధంగా ఎన్నో ఆశ్రమాలు స్థాపితమయ్యాయి. ఈ ఆశ్రమాల ద్వారా మళయాళ స్వామి శిష్యులు అనేకమంది సనాతన ధర్మ ప్రచారాన్ని అన్ని కులాలవారికి అందించారు.

సరైనదే. కాని..
1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్రం లభించిన సందర్భంగా సందేశమిస్తూ, ‘స్వరాజ్యం లభించినందుకు అందరం ఆనందించటం, ఉత్సవాలు చేసుకోవటం, సరైనదే. వర్ణాశ్రమ ధర్మాల పేరుతో కొన్ని కులాల వారికే శాస్త్ర పఠనము, అస్త్రశస్త్రాలు ధరించే అధికారం కల్పించటం వంటి కొన్ని చెడు నియమాల వల్లనే మన భారతదేశం స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. శస్త్రం, శాస్త్రంలను హిందువులలోని అన్ని కులాలవారికి అందుబాటులో ఉంచాలి. ఇది నేటి బాధ్యత’ అని సందేశమిచ్చారు.
   స్వామి 1945లో గీతపై విపుల వ్యాఖ్యానం రాశారు. ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయించారు. స్వామి శిష్యులయిన కొందరు జీవకారుణ్య సంఘం పేరుతో 1951లో రాయల సీమలో కరువు సంభవించినపుడు అంబలి కేంద్రాలను నిర్వహించారు.

అవి చెయ్యొద్దు
1959లో అస్పృశ్యతా నివారణ సంఘానికి చెందిన కొందరు షెడ్యూల్డు కులాలవారు స్వామిని కలిసారు. వారితో అస్పృశ్యత నిర్మూలన విషయం వివరిస్తూ, ‘సవర్ణ హిందువులు కులానికి కాక గుణానికి ప్రాధాన్యమివ్వాలి. నేడు నిమ్న కులస్తులుగా భావిస్తున్న వారిపట్ల ఆత్మీయతతో వ్యవహరించాలి. అస్పృశ్యత ఒక రోగం. ఆచరింపకూడనిది. నిమ్న కులస్తులు తమ సంతానాన్ని విద్యావంతులుగా సదాచార పరాయణులుగా తీర్చిదిద్దాలి. గోమాంస భక్షణ చేయడం మహాదోషం. కనుక అస్పృశ్య వర్గాల ప్రజలు మద్యపానంలాంటి దురలవాట్లను, గోమాంస భక్షణను మానాలి’ అని సందేశమిచ్చారు.

వాటిని తొలగించాల్సిందే
మనుస్మృతి గురించి చెపుతూ ‘నేటి మనుస్మృతిలో కుల అసమానతలను సమర్ధించే ధర్మ వ్యతిరేక మయిన శ్లోకాలు కనిపిస్తున్నాయి. అవి పరమ హానికరమైనవి. శ్రీ దయానంద సరస్వతి స్పష్టీకరించి నట్లు ఈ శ్లోకాలు మధ్యకాలంలో కొంతమంది క్రూరస్వభావులు చేర్చినవి. వీటిని తొలగించాలి’ అని మనుస్మృతి సంస్కరణ ఆవశ్యకతను స్పష్టంగా ఆనాడే పేర్కొన్నారు.
   *మహిళల ఘోషా పద్ధతిని మళయాళ స్వామి ఆనాడే వ్యతిరేకించారు. బాల్యవివాహాలను వ్యతిరేకిం చారు. భర్తను కోల్పోయిన స్త్రీలకు పునర్వివాహం చేయటం మంచిదని, ధర్మసమ్మతమేనని పేర్కొన్నారు. వరకట్నం వంటి దురాచారాలను మానుకోవాలని చెప్పారు. ఇలా హిందూ సమాజంలో అనేక సంస్కరణలను చేసిన శ్రీ సద్గురు మళయాళ స్వామి 12 జులై 1962న మహాసమాధిని పొందారు.

అదే నిజమైనది
శ్రీ మళయాళస్వామి, వారి శిష్యబృందం, వారు స్థాపించిన ఆశ్రమాల ద్వారా రెండు తెలుగు ప్రాంతాలలో సామాజిక సమరసత దిశలో అనేక మార్పులు చేశారు. వాటిని నేడు మనం గుర్తించాలి. మనం వాటిని ఆచరించి చూపటమే సద్గురు మళయాళ స్వామికి నిజమైన నివాళి అవుతుంది.

– కె.శ్యామ్‌ప్రసాద్‌,  జాతీయ కన్వీనర్‌, సామాజిక సమరసత, 9440901360 - జాగృతి సౌజన్యం తో
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top