మార్క్సిజం ఓ ముతక వ్యవహారం - Marxism is a coarse affair

Vishwa Bhaarath
మార్క్సిజం ఓ ముతక వ్యవహారం - Marxism is a coarse affair
మార్క్సిజం ఓ ముతక వ్యవహారం
నూట యాభై ఏళ్ల క్రితం నాటి మార్క్సిజాన్ని ఇప్పటికీ కొందరు ఆరాధించడం, ప్రచారం చేయడం, నేటి సమాజానికది ప్రాసంగికమని వాదించడం చూస్తుంటే జాలేస్తుంది. ఆ సిద్ధాంతం గూర్చి గొంతు చించుకుంటుంటే వింతగా తోస్తుంది. గత శతాబ్దంన్నర కాలంలో మానవ శాస్త్రం, సామాజిక, సాంకేతిక రంగాలు ఎంతో ఎదిగాయి. ఎన్నో కొత్త కోణాలను దర్శించి వాటిని ప్రజాపరం చేసారు. వాటి ఆధారంగా ఆధునిక మానవ జీవితం ఓ కొత్త కక్ష్యలో తిరుగుతోంది.

మార్క్సిజాన్ని ఓ శాస్త్రంగా, సైన్స్‌గా పరిగణిస్తూ ఊహాలోకాల్లో విహరించే ఆ ‘ఇజం’ అభిమానులు, వీరాభిమానులు మాత్రం- ‘మార్క్స్ గీసిన గీతకు తిరుగులేదు.. మార్క్స్ ‘వాక్యం’ దేవుని వాక్యం కన్నా మిన్న’ అని తలచి ‘దాస్ కాపిటల్’ను తలకెత్తుకుని ఊరేగడం చూస్తే.. మార్క్సిజానికి ఓ మతానికున్న లక్షణాలన్నీ వున్నాయని అన్పిస్తుంది. దాని ప్రవక్త కారల్‌మార్క్స్, వారి పవిత్రగ్రంథం ‘దాస్ కాపిటల్’, మత ప్రచారకులు లెనిన్, స్టాలిన్, మావో తదితరులు. ఆ మతాన్ని అనుసరించేవారు అంతటా కనిపిస్తారు. అందులో మూఢత్వం దండిగా ఉందన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలు వాస్తవమే అనిపిస్తుంది. తమది శాస్ర్తియమైన సిద్ధాంతం, ‘డాగ్మా’ (మూఢనమ్మకం, విశ్వాసం) కాదని తరతరాలుగా చెబుతున్నా, ఆచరణలో మాత్రం వారిది ‘సంపూర్ణ మూఢ విశ్వాసం’ తప్ప సత్యం కాదు, సైన్స్ అసలే కాదు. అయినా దబాయించి శతాబ్దానికి పైగా వారు కాలం నెట్టుకొచ్చారు. ‘ఇంకానా.. ఇకపై మీ దబాయింపు పప్పులుడకవ’ని సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల ఆధారంగా వెల్లువెత్తిన సైన్స్, హేతుబద్ధ ఆలోచన, తార్కిక సంవాదం, ప్రజాస్వామిక భావజాలం, సాధికారత ఆయుధం చెప్పకనే చెబుతున్నాయి. హేతువును, తర్కాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సాధికారతను గేలిచేసి, వెటకారంతో తమ పబ్బం గడుపుకోవాలని చూసేవారి ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు.

మార్క్స్ మౌలిక విశ్లేషణ ఎంత అజ్ఞానంతో కూడుకుందో నేటి సమాజం తేటతెల్లం చేస్తున్నది. మార్క్స్ ఆలోచనల ప్రకారం పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యాల వల్ల సోషలిస్టు వ్యవస్థ పురుడు పోసుకుంటుంది. ఇది తొలిదశ అయితే మలిదశ సొంత ఆస్తి లేని, వర్గాలు లేని, దోపిడీ ఊసు ఎరుగని, మనుషుల్లో వైషమ్యాలు, ఘర్షణలు లేని కమ్యూనిస్టు వ్యవస్థ అవతరిస్తుంది. నేరాలు, హింస ఆనవాలు లేని సమాజంలో సుఖశాంతులు వెల్లివిరిసి, సమాజం శోభిల్లుతుంది. మానవాళి ఓ నూతన ప్రపంచంలోకి అడుగిడిన అనంతరం ‘రాజ్యం (ప్రభుత్వం) దానంతట అదే చెట్టుపై మగ్గిన పండులా రాలిపోతుంది. ఇదీ టూకీగా మార్క్స్ ‘విజన్’.
    భారత్‌కు స్వాతంత్య్రం రాకపూర్వం ఈ అభిప్రాయాలు, విశ్లేషణతో  కొంతమంది ఆకర్షితులయ్యారంటే ఎంతోకొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆనాటి ప్రపంచ పరిస్థితులపై అధ్యయనం, అవగాహన తక్కువ. పాశ్చాత్య దేశాల్లోని పరిణామాలు పరిపూర్ణంగా అర్థం చేసుకునే అవకాశాలు అప్పట్లో లేవు. శతాబ్దాల భారతీయుల జీవనానికి, ఈ బోధకు ఎక్కడా పొంతన లేదు. రష్యాలో అప్పటికే ఆ వెలుగులో విప్లవం విజయవంతం కావడం కారణంగా ఆకర్షితులు కావడం సహజం. ఉడుకు రక్తం వారు అటువైపు కదలడం స్వాభావికం. కానీ, 2018 సంవత్సరంలోనూ- ‘మార్క్స్ భావజాలానికి తిరుగులేదు, కష్టజీవులకది సంజీవని, ఎల్లకాలాలకూ అన్వయమయ్యే శాస్తమ్రది’ అని దబాయించడం అసమంజసం. ఏ రష్యాలో అయితే విప్లవ విజయాన్ని చూసి ఆవేశం తెచ్చుకున్నవారు, వారి వారసులు- ఆ విప్లవం విఫలమై, మార్క్స్ కలలు సమాధి అయ్యాక సైతం మార్క్సిజం ‘మత’ ప్రధాన ప్రచారకుడు లెనిన్ విగ్రహాలను ఆ దేశంలో ధ్వంసం చేశాక సైతం అదే ఆవేశంతో ఊగిపోతే లోపం మనలో ఉందన్న ఇంగితం తెలిసుండాలి.

రష్యాలో సోషలిస్టు వ్యవస్థ పునాదులు ఏర్పడినా కోట్లాదిమంది సంహారం జరిగింది. ఇందులో మేధావులన్నవారు మొదలుకుని, విప్లవ సారధులు, సామాన్యులు ఎందరో వున్నారు. వాస్తవానికి రష్యాలో సోషలిస్టు వ్యవస్థ పేర అరాచక వ్యవస్థను నెలకొల్పారన్న విమర్శ అక్కడి రచయితలు, కవులు, మేధావులు, కళాకారుల నుంచి బలంగా వినిపించింది. సోల్జనిత్సిన్ రచనలు చదివితే ‘గులగ్’ల తీరుతెన్నులు పరిశీలిస్తే- ‘ఇదా సోషలిస్టు వ్యవస్థకు ద్వారం?’ అని ప్రజలు ఆనాడే విస్తుపోయారు.
   విచిత్రమేమిటంటే మనిషిలోని అరిషడ్వర్గాలను పూర్తిగా విస్మరించి మార్క్స్ ఊహాగానంతో మార్క్సిజాన్ని రచించారు. ప్రాథమికమైన ఈ లోపం పసిగట్టకుండానే నూట యాభై ఏళ్లుగా సమసమాజం నిర్మిస్తామని ఆయన వీరాభిమానులు ప్రపంచవ్యాప్తంగా పదికోట్లకుపైగా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. మనిషి నుంచి అరిషడ్వర్గాలను వేరు చేయడం సాధ్యమా? మనిషంటేనే అరిషడ్వర్గాలు- వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఓ ఊహా ప్రపంచంలో మనిషిని నిలిపి ‘గొప్ప సిద్ధాంతాన్ని సృష్టించాను.. వినండి’ అని మార్క్స్ ‘మాయ’ చేశాడు. ఆ మాయలో ఆయన అభిమానులు, వీరాభిమానులు పడిపోవడం జరిగింది. ఆ దృశ్యం ఇంకా అలాగే కొనసాగడం వింతల్లోకెల్ల వింత.

రష్యా విప్లవ విఫలం మార్క్సిజంలో లేదు, దాన్ని అమలు చేసిన నాయకుల్లో ఉందని ఓ గొప్ప పరిశోధనాంశం ప్రకటించినట్టు గత పాతిక సంవత్సరాలుగా చర్విత చరణంగా చాలామంది పాతపాట పాడుతూ వున్నారు. అంతేగాని మనిషి చుట్టూ పరచుకున్న తెలివిడి, జ్ఞానం, శాస్త్రాల పరిమళం, వాటిని అందిపుచ్చుకోవాలన్న ఉత్సుకత, అరిషడ్వార్గాల ప్రేరణకు వశపడిపోయి వాటితో కలిసి నడిచేందుకు తమకు తెలియకుండానే ప్రజలు ఉద్యుక్తులవడం వారు గమనించడం లేదు. రష్యా విప్లవ ఫలితం చేదెక్కడం వెనుక- రివిజనిస్టులు, పెట్టుబడిదారుల తొత్తులు, శ్రామికవర్గ ద్రోహులున్నారని గగ్గోలు పెట్టడం ఎంతటి అమాయకత్వం? మనిషి తత్వం తెలియకుండానే, అరిషడ్వర్గాల అవగాహన లేకుండానే, అవి మానవ జీవితంపై వేసే బలమైన ప్రభావాన్ని గణనలోకి తీసుకోకుండానే ఉద్రేకం, ఆవేశంతో ఊగిపోవడంతో ఒరిగింది ఏమిటి? అన్న ప్రశ్న వేసుకునేంత ఓపిక మార్క్స్ అభిమానులకు లేకపోవడం విషాదం. హేతువు, తర్కం, బుద్ధి, వివేచన, విచక్షణ అన్నీ సమాధి చేసి వారు ఊరేగడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది? మార్క్స్ వీరాభిమానులు ఎలాగూ ఈ ప్రశ్న వేసుకోరు. కనీసం నిష్పాక్షిక దృష్టితో, సత్యం ఆధారంగా వాస్తవికతను ప్రేమించేవారైనా ఈ ప్రశ్న తప్పకు వేసుకుని తమ బుద్ధిబలంతో సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉంది.
   ఇంత డొల్లతనం ఉన్న మార్క్సిజాన్ని ఆధారం చేసుకుని మన దేశంలో మావోయిస్టులు రక్తకాసారాలు సృష్టించే పనిలో పడ్డారు. మార్క్సిజంలోని డొల్లతనం- రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాల అనుభవాలు, లాటిన్ అమెరికా దేశాల చేదు జ్ఞాపకాలు, నేపాల్, కొలంబియా దేశాల్లో మావోయిస్టు గెరిల్లాల తాజా స్థితిగతులు అవగాహన కొచ్చాక కూడా మార్క్సిస్టులు మారడం లేదు. ఈ 21వ శతాబ్దంలో, ప్రపంచమంతా భారతదేశ యువత నైపణ్యాలు, శక్తి సామర్ధ్యాలవైపు చూస్తున్న తరుణంలో తుపాకి గొట్టంద్వారా దీర్ఘకాల సాయుధ పోరాటంద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేస్తామనడం, అందుకోసం అమాయకులైన ఆదివాసీలను పావులుగా ఉపయోగించడం దారుణం. అడవిబిడ్డల అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని మాయ చేయడం మానవాళికి మాయని మచ్చగా మిగిలిపోతుంది తప్ప ప్రజాసంక్షేమ భావన అందులో ఇసుమంత కూడా కనిపించదు.

మార్క్స్ విశ్లేషణ, వింగడింపు, సిద్ధాంతీకరణ ఓ ముతక వ్యవహారం. అది శాస్ర్తియం కాదు. పక్కా మూఢ విశ్వసం, రక్తం రుచి మరిగిన వ్యాఘ్రం అన్న విషయం స్పష్టాతిస్పష్టంగా 150 ఏళ్ల చరిత్ర తెలియజేస్తోంది, భారతదేశంలో 50 ఏళ్ల నక్సల్‌బరి సాయుధ పోరాటం మరింత నగ్నంగా చెబుతోంది. ప్రపంచం ఓ కొత్త కక్ష్యలో తిరుగుతూ, సాంకేతిక పరిజ్ఞానం, మరమనుషుల (రోబోల) సహాయంతో కొత్త వాతావరణంలో జీవనం కొనసాగిస్తుండగా, ఈ విధానం లుప్తమై మరే కొత్త కోణం, విధానం ఎప్పుడు అనుసంధాన మవుతుందో.. చెప్పలేని సంధి కాలంలో జీవితం వెల్లదీస్తున్న పౌరుల ముందుకు ఏమాత్రం ప్రాసంగికత లేని ఏవిధంగా చూసినా ప్రయోజనకారి కాని కాలం చెల్లిన, ముతక వ్యవహారమైన మార్క్సిజాన్ని ముందుకు తీసుకురావడం మూర్ఖత్వమే తప్ప మానవత్వం మాత్రం కాదు. మానవత్వం పేర మార్క్సిజాన్ని ముందుకు తెచ్చి అజ్ఞానాన్ని పంచడం మానవాళిని వంచించడమే.

__విశ్వ సంవాద కేంద్రము - (ఆంధ్రభూమి సౌజన్యం తో)  {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top